[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
వేద సంస్కృత కళాశాల – నెల్లూరు:
ఈ కళాశాలతో ముడిపడిన నా అష్టావధాన కార్యక్రమం గుర్తుకు వస్తోంది. అది 1973 జూన్ 17వ తేదీ. నెల్లూరు వేద సంస్కృత కళాశాల అతి ప్రాచీనం. నా వయస్సు 26 సంవత్సరాలు. నేను అవధానాలు ఆరంభించి నాలుగేళ్లు. కళాశాల ప్రిన్సిపాల్ ఉడాలి సుబ్బరామశాస్త్రి ఆహ్వానించగా నేను అక్కడ అష్టావధానం అంగీకరించాను. అప్పుడు నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యపకుడిని. 1970లో నెల్లూరు వి.ఆర్.కాలేజిలో అష్టావధానం చేసి వున్నాను. ఆ నోటా, ఈ నోటా అవధానిగా ప్రసిద్ధి వచ్చింది. సంస్కృత కళాశాలలో అవధాన ప్రతిభ కనబరచే అవకాశం లభించినందుకు సంతోషంగా వుంది.
ఉదయం 10 గటలకు అవధానం ప్రారంభమైంది. నేను బి.ఏ చుదువుకొన్న ఊరు (1962-65) అందరూ పరిచితులే. సరస్వతీ స్తుతి చేసి అవధానం ఆరంభించాను. సభ నిండుగా వుంది. కళాశల విద్యార్ధులే గాక పట్టణంలో సాహితీప్రియులు పలువురు నా మీద అభిమానంతో వచ్చారు. ఊరి చివర్లో కళాశాల. టౌన్ హాల్‌లో అయితే యాతావాతా వచ్చే పోయే జనం సభకు విరివిగా వస్తారు.
అవధానం ప్రారంభంలో ప్రేక్షకులను ప్రశంసిస్తూ పద్యం ఆశుధారతో చెప్పాను. ఇంతలో ప్లిమత్ కారు ప్రాంగణంలోకి వచ్చి నిలిచింది. ఆజానుబాహువు, స్ఫురద్రుపి అయిన వ్యక్తి కార్లోంచి దిగారు. వేదిక మీద నా పక్కనే అధ్యక్ష స్థానంలో వున్న మా గురువుగారు కోట సుబ్రమణ్యశాస్త్రి లేచి క్రిందకి వెళ్లారు. కళాశాల ప్రిన్సిపాల్ ఉడాలి సుబ్బరామశాస్త్రి ముందు వరసల్లో ఆ వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టారు. ఆయన నాకు పరిచితులు కాదు. కానీ పేపర్లలో చూసిన వ్యక్తి. ఆయనే ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పని చేసిన డా. బెజవాడ గోపాలరెడ్డి.
ఆశువుగా నేను ఆయన పై పద్యం చెప్పాను.
“సరసుల పాలి కల్పలత, సత్ప్రజ కొంగు పసిండి, సాహితీ
సరణికి మేలుబంతి, వనజాసనురాణికి కొల్పుకూటమన్
వరహిమశైలసానువుల వ్రాలెడి నీడలవంటి చిత్తమున్
అరయగ గోపలార్య విలుధాగ్రణి అగ్రణియౌను ధీమతిన్”
ఆయన శిరః కంపం చేశారు. “ఒక అరగంట సరదాగా కూచొని వెళాతాను. మీ ఆహ్వాన పత్రిక నా టేబుల్ పై ఇప్పుడే చూశాను!” అని గోపాలరెడ్డి ప్రిన్సిపాల్‌తో అన్నారు. ఇంత చిన్న సభకు ఆయనను అతిధిగా పిలవడం ఇష్టం లేక ప్రిన్సిపాల్ ఆహ్వాన పత్రిక వారి కార్యాలయంలో అందించి వచ్చారు.
కలకలం ముగియగానే నేను అవధానం ప్రారంభించాను. నేను రాగయుక్తంగా పద్యం చదవడం గోపాలరెడ్డి ఆకర్షించింది. అప్రస్తుత ప్రసంగానికి సమాధానాలు నచ్చాయి. రెండు గంటలూ కూచొని ఆయన నన్ను శాలువాతో సత్కరించి అభినందించి వెళ్లారు. కాలేజికి అతి సమీపంలోనే వారు నివసించే సుదర్శన మహల్. సాహితీప్రియుడు కావడాన, విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన ఆ ఉదయం అలా వచ్చారు. అది మొదలు ఆమరణాంతం వారు నాపై అభిమానం చూపారు.
ఈ నేపథ్యం చెప్పడంలో నేను సంస్కృత కళాశాల పుట్టు పూర్వోత్తరాల విషయం దూరం చేశాను. ఉడాలి సుబ్బరామశాస్త్రి కళాశాల ప్రిన్సిపాల్. సంప్రదాయబద్దమైన వేషధారణ. చక్కని పండితులు. కళాశాల అధ్యాపకులుగా, కె.యస్.రామానుజాచార్యులు, చింతలపాటి పూర్ణానంద శాస్త్రి, పి.రాజేశ్వరశర్మ చిలకపాటి శ్రీనివాసాచార్యులు, ఉడాలి నరసింహశాస్త్రి (సుబ్బరామశాస్త్రి కుమారులు) వి.వి.సుబ్రమణ్యం, జి.వి.నరసింహం, వై.వి.సుబ్రమణ్యం, బత్తిన చంద్రశేఖర రెడ్డి, అరిపిరాల వెంకట్రామ శాస్త్రి ప్రభృతులు పని చేశారు.
సుబ్బరామ శాస్త్రి హయాంలో 1979లో కళాశాల స్వర్ణోత్సవాలు ఘనంగా జరిపారు. ప్రత్యేక సంచిక వెలువరించారు. ప్రొద్దుటూరు సంస్కృత కళాశాల మూత బడటంతో నరాల రామరెడ్డి నెల్లూరు కళాశాలలో కొద్ది సంవత్సరాలు పని చేసి అక్కడే రిటైరయ్యారు.
కళాశాల గత ప్రాభవ చిహ్నంగా తూమటి సంజీవరావు మదరాసులో తెలుగు భాషా సాహిత్య సేవ దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. 2018 మే నెల ఉడాలి సుబ్బరామ శాస్త్రి శతజయితి సభను వారి కుమారులు నరసింహశాస్త్రి నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సంజీవరావు సంపాదకులుగా ప్రత్యేక సంచిక వేశారు. ప్రభుత్వ గ్రాంట్లు లేక 2021లో ప్రభుత్వపరమై కరోనా సమయంలో ఈ కళాశాల మూతబడింది. శతాబ్ది చరిత్రగల ఈ సంస్థ కనుమరుగు కావడం సంస్కృతాభిమానులకు వేదన.
శ్రీ మలయాళస్వామి ఓరియంటల్ కళాశాల – ప్రొద్దుటూరు
నామా ఎరుకలయ్య కరస్పాండెంట్‌గా ఈ కళాశాల అభివృద్ధి చెందింది. ఈ కళాశాలలో 1975 డిసెంబరు 24న సి.వి.సుబ్బన్న శతావధాని సమక్షంలో అష్టావధానం జయప్రదంగా నిర్వహించాను. ప్రముఖ పండితులు యల్లంరాజు శ్రీనివాసరావు సభాధ్యక్షులు. 1972లో వారు కందుకూరు ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖాధిపతిగా వున్నపుడు నేను అధ్యాపకుడను. ఈ అవధానంలో స్వయంగా అవధానులైన నరాల రామరెడ్డి, అవధానం చంద్రశేఖరశర్మ పృచ్ఛకులు కావడం విశేషం.
ఏర్పేడు వ్యాసాశ్రమంలో విద్యాభ్యాసం చేసిన రామచంద్ర ప్రొద్దటూరు కళాశాల ప్రిన్సిపాల్‌గా క్రమశిక్షణలో నడిపారు. ఇక్కడ కోర్సులు – శిరోమణి 5 సంవత్సరాలు, ఏ విద్వాన్ 4 సంవత్సరాలు, బి విద్వాన్ 4 సంవత్సరాలు, ఎంట్రన్స్ 1 సంవత్సరం. నేను అవధానం చేసిన సమయంలో మాడుగుల నాగఫణి శర్మ విద్యార్ధి. ఆయన ఒక సంవత్సరం తిరుపతిలో చదివి 1974-79 మధ్య లేపాక్షి ఓరియంటల్ కళాశాలలో చదివారు.
ప్రొద్దుటూరు కళాశాల అధ్యాపకవర్గంలో బండ్ల వెంకటరమణయ్య, దక్షిణామూర్తి, రామబ్రహ్మం, నరాల రామరెడ్డి, అవధానం చంద్రశేఖర శర్మలున్నారు. అవధానుల పుట్టినిల్లుగా ప్రొద్దుటూరు ప్రసిద్ధి. సుప్రసిద్ధ కవులు అష్టావధానాలు నిర్వహించారు. 1960వ దశకంలో సి.వి.సుబ్బన్న శతావధానిగా ప్రసిద్ధులు. ఈ కళాశాల క్రమంగా మూతబడింది. నరాల రామరెడ్డిని నెల్లూరు వేద సంస్కృత కళాశాలకు బదలీ చేశారు.
విజయనగర ఉత్సవాలలో అప్పటి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి గారితో రచయిత
గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల – తిమ్మసముద్రం
వదాన్యులైన గోరంట్ల వెంకన్న తమ 300 ఎకరాలను విద్యాసంస్థకు దానం చేశారు. పి.వి. నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా 32 సంస్కృత కళాశాలలు ఆంద్రప్రదేశ్‌లో ఆరంభం కావడం ఘనచరిత్ర. 1972లో స్థాపించబడిన తిమ్మ సముద్రం కళాశాల పురోభివృద్ది సాధించింది. దాదాపు 500 కోట్ల రూపాయల ఆస్తి గల ట్రస్టుకు దేవాదాయ శాఖ వారు అసిస్టెంట్ కమీషనర్‌ను ఏర్పాటు చేశారు. 2022 లో స్వర్ణోత్సవాలు జరిపారు.
ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి రామచంద్రుని కోటీశ్వరశర్మ వ్యవహరించి విద్యాభివృద్ధికి దోహదం చేశారు. ధారణావధాని వొలుకుల శివశంకరరావు 2010 నుండి 2013 వరకు ప్రిన్సిపాల్. పదవీ విరమణానంతరం వీరు సన్యాసాశ్రమ స్వీకారం చేసి చీరాల సమీపంలోని నీలకంఠాపురంలోని అంతర్జాతీయ శారదా ఫీఠాధిపతిగా విశ్వంభరానందగిరి స్వాముల పేర బోధనలు చేస్తున్నారు. ఈ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా తాడికొండ నుండి సూరం శ్రీనివాసులు బదలీ మీద వచ్చారు. ప్రస్తుతం 70 మంది విద్యార్ధులు 8 మంది పార్ట్ టైమ్ అధ్యాపకులతో కళాశాల నామ మాత్రంగా పని చేస్తోంది. రామచంద్రుని కోటీశ్వరశర్మ (రాష్ట్రపతి అవార్డు గ్రహీత) పని చేసిన కళాశాల ఈనాడు ఈ స్థితికి చేరింది. మూతబడకుండా పని చేయడానికి కారణం గోరంట్ల వెంకన్న ట్రస్టుకు నిధుల కొరత లేకపోవడమే. ప్రస్తుత ప్రిన్సిపాల్ యం. రామచంద్రరావు.
గుంటూరు కళాశాలలు:
గుంటూరు హిందూ కళాశాల సంప్రదాయ కోర్సులకు పేరెన్నికగన్న కళాశాల. సుబ్బరావు వల్లభజోస్యుల ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రసిద్ధులు. కోణిజేటి రోశయ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి – తమిళనాడు గవర్నర్ ఇక్కడ విద్యార్థి నాయకుడు. ప్రసాదరాయ కులపతి ఈ కళాశాల ప్రిన్సిపాల్. ప్రస్తుతం కుర్తాళం పీఠాదిపతి.
ఆ గుంటూరులో రెండు సంస్కృత కళాశాలలు వెలిశాయి. శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాల స్త్రీలకు విద్య బోధిస్తుది.
మరొ సంస్కృత కళాశాల – డా. కొలచల వెంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాల. ఈ కళాశాల అధ్యాపకులు లబ్థప్రతిష్ఠులు. కోగంటి సీతారామాచార్యులు, ఏలూరిపాటి అనంతరామయ్య, బేతవోలు రామబ్రహ్మం ఒక తరం. పాత తరానికి చెందిన జమ్మలమడక మాధవ రామశర్మ, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, చెరువు సత్యనారాయణ శాస్త్రి, సృష్టి సాంబమూర్తి శాస్త్రి, మల్లంపల్లి వీరేశ్వర శర్మ, చతుర్వేదుల నారాయణ శాస్త్రి ప్రభృతులు స్మరణీయులు. ఏలూరిపాటి అనంతరామయ్య వెంకటగిరి విశ్వోదయ కళాశాల అధ్యాపకులుగా వుంటూ ఈ కళాశాలలో చేరి ప్రిన్సిపాల్‌గా పురోభవృద్ధికి తోడ్పడ్డారు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
