Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-47

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

కొడిగట్టిన సంస్కృత కళాశాలలు:

సంస్కృతం దేవభాష. వ్యాసవాల్మీకాదులు జాతి కందించిన మహాకావ్యాలు మహాభారత రామాయణాలు. 19వ శతాబ్దంలోను, ఆ తర్వాత 20వ శతాబ్ది ప్రథమార్ధం దాకా సంస్కృత పండితులు దేశవ్యాప్తంగా వెల్లివిరిశారు. వేదసభలు పీఠాధిపతులు నిర్వహించి శలాక పరీక్షల ద్వారా పండిత పట్టాలిచ్చేవారు. కాశీ పండితులని గొప్పగా చెప్పుకునేవారు. ద్వివేది (రెండు వేదాలు నేర్పిన పండితుడు) త్రివేది (మూడు వేదాల నేర్పరి) చతుర్వేది (నాలుగు వేదాలు ఔపోశన పట్టిన ఘనుడు), ఘనాపాఠీలు పలువరు. వేదాధ్యయనానికి గురుకులాలలో చేరి పది, పన్నెండు సంవత్సరాలు గురుముఖంగా నేర్చుకొన్నారు. సంతలు వల్లించారు. జీవనాధారం గూర్చి వారు ఆలోచించలేదు. వంశపారంపర్యంగా ముత్తాతలు, తాతలు, తండ్రుల నుండి తనయులు వేదాధ్యయనం చేశారు.

అధ్యయన అధ్యాపనలకే జీవితమంతా వెచ్చించారు. ప్రకాశం జిల్లా వైదనలో వున్న 90 ఏళ్ల వేద పండితుని నేను, గొల్లపూడి మారుతీరావు కలసి 2014లో కలిశాము. వారి కుమారులందరు వేద పండితులు. వారికి రాష్ట్రపతి పురస్కారం లభించింది.

నెల్లూరులో సన్మాన సభలో డా. బెజవాడ గోపాలరెడ్డి గారితో రచయిత

తిరుమల తిరుపతి దేవస్థానంవారు వేద పరిరక్షణ సంస్థను నెలకొల్పి వేద పండితులకు వెలసరి గౌరవభృతిని అందిస్తున్నారు. వారు ఏదో ఒక దేవాలయంలో సాయంకాలాలు వేదం పఠిస్తూ జీవిస్తున్నారు. తిరుమలలో ధర్మగిరిపై వెలసిన దేవస్థానం వారి వేద పాఠశాల ప్రతి ఏటా వేద సదస్సులు నిర్వహిస్తుంది. పరీక్షలు జరిపి బహుమతులు లందిస్తుంది. 12 సంవత్సరాల పాటు వేదాలు, స్మార్తము నేర్పిస్తారు. 12 సంవతస్సరాల తర్వాత పాఠశాల నుండి ఉత్తీర్ణులై బయటకి వెళ్లే వేళ వారి పేర అడ్మిషన్ సమయంలో డిపాజిట్ చేసిన 3 లక్షలు వడ్డీతో కలిపి ఇస్తారు. వేద విజ్ఞాన పీఠంలో తరగతులు గత 140 సంవత్సరాలలో 5వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. 1884లో గురుకుల ఆశ్రమ పద్దతిలో ఇది ప్రారంభమైనది. ఇక్కడ భోజన వసతి, వస్త్రాలు, పుస్తకాలు విద్యార్ధులకు ఉచితం.

వేద పాఠశాలలో చేరడానికి విద్యార్ధికి 20 సంవత్సరాలలోపు వయస్సు వుండాలి. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో ప్రవేశాలు జరుగుతాయి. అందులో వేదం, పౌరోహిత్యం, అర్చక కోర్సులు నడుస్తున్నాయి. కీసరగుట్ట (హైదరాబాదు సమీపం) లోను దేవస్థానం వారి పాఠశాల నడుస్తోంది.

2000 సంవత్సరం ధర్మగిరిపై జిరిగన వేద సదస్సుకు ఆశీస్సులందిస్తూ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి ఇలా అన్నారు “వేద పండితులు కాలక్రమేణ తగ్గు ముఖం పట్టారు. ‘పులుల రక్షణ’కు ‘SAVE TIGER PROJECT’ వలె ‘SAVE VEDIC PANDITS’ ప్రాజెక్టు ఏర్పరచ వలసిన అవసరముంది” అన్నారు స్వామి.

ఈ ఉపోధ్ఘాతం ఎందుకంటే సంస్కృతం పట్ల క్రమేణా ఆసక్తి సన్నగిల్లి సంస్కృత మృతభాషగా మారింది. సమర్థులైన అధ్యాపకుల కొరత, సంస్కృత పాఠాశాలలు కళాశాలల్లో చేరే అభ్యర్ధుల ఆసక్తి, ప్రభత్వాదరణ సన్నగిల్లాయి. 12 సంవత్సరాలు నేర్చకొని బయటకు వచ్చిన 25 ఏళ్ల యువకునికి ఉద్యోగావకాశాలు లేవు. వివాహానికి పిల్లనిచ్చేవారు కరువయ్యారు.

నెల్లూరు వేద కళాశాలలో రచయిత అష్టావధానం, 1973

ఆ మూలకంగా సంస్కృత కళాశాలలు కొడిగట్టిన దీపంలా మిణుకు మిణుకు మంటూ కొన్ని వెలుగుతున్నాయి. వాటి పుట్టుపూర్వోత్తరాలు పలువురు అధ్యాపకులను అడిగి వివరంగా సేకరించాను. వారి మానసిక వేదన నాకు అర్థమైంది. అందుకే గత నాలుగు వారాలుగా నా వద్ద సమాచారాన్ని పలువురికి పంచే ప్రయత్నమిది.

శ్రీ గౌతమీ విద్యాపీఠం, రాజమండ్రి:

1931లో ఈ సంస్కృత కళాశాల జమీందారు ఔదార్యంతో ఆరంభమైంది. చతుశ్శాస్త్ర పండితులిక్కడ అధ్యాపకులుగా బోధించారు. ప్రఖ్యాత విద్వాంసులు శ్రీ విశ్వనాథ గోపాల కృష్ణమూర్తి ప్రిన్సిపాల్‌గా ప్రసిద్ధులు. చిర్రావూరి శ్రీరామ శర్మ అధ్యాపకులు. ఆయన అష్టావధానం హైదరాబాదులో 65 ఎళ్ల వయస్సులో చేశారు. నేనొక పృచ్ఛకుడిని. వీరి సోదరులే జ్యోతిష్కులు చిర్రావూరి సుబ్రమణ్యశర్మ, చిర్రావూరి శిరామకృష్ణశ్మలు.

ప్రస్తుతం కళాశాల మూత బడింది. ఆంధ్ర యవతీ సంస్కృత కళాశాల ఇక్కడ నడిచింది.

ఇక్కడ అధ్యయన అధ్యాపనలు కొనసాగించిన బహు శాస్త్ర పండితులలో బోడా శాస్త్రి, రేమిళ్ల సూర్య ప్రకాశశాస్త్రి, కొల్లూరి అనంత పద్మనాభశాస్త్రి, ప్రభల సుబ్రమణ్యశర్మ, కొంపల్లె సత్యనారాయణ శాస్త్రి ప్రముఖులు.

మోడేకొర్రులో సంస్కృత కళాశాల పని చేసింది. కొల్లూరి సోమశేఖర శాస్త్రి ప్రిన్సిపాల్. రాణీ నరసింహశాస్త్రి తర్క శాస్త్ర పండితులు, అధ్యాపకులు. ఏలూరులో చింతలపాటి బాపిరాజు కళాశాలలో ఆకురీతి పున్నారావు,  ABN రాజు, జి.యస్.యన్.ఆచార్య, ఉదయశ్రీ అనంత పద్మనాభశాస్త్రి, వడ్లమాని రామశాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు, మరిగంటి సోదరులు, చిర్రావురి శివరామ కృష్ణశర్మ, అన్నపూర్ణ అధ్యపకులు.

ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం – కొవ్వూరు:

1912లో శ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు దీనిని స్థాపించారు. గౌతమీ నదికి ఇటు వైపు, అటు వైపు రెండు సంస్కృత కశాశాలలు దశాబ్దాలుగా వెలయడం ఆంధ్రుల సంస్కృత భాషా అధ్యాపనలు కొనసాగించారు. ఆ సంస్థ బాగోగులెరిగిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం తమ జ్ఞాపకాలను పంచుకొన్నారు. ఆయన 1971-77 మధ్య అక్కడి విద్యార్థి. ఆయన విజయపరంపర బహుముఖీనం. గుంటూరు కె.వి.కె. సంస్కృత కళాశాలలో బోధించి, ప్రతిభా సంపన్నులై తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి శాఖకు ప్రధానాచార్యులయ్యీరు. విశేష ప్రజ్ఞ గలవారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ డీన్‌గా పదవీ విరమణ చేశారు. రాష్ట్రపతి బహుమతి పురస్కార గ్రహీత విజ్ఞాన సర్వస్వం.

కొవ్వూరు ఆంధ్రగీర్వాణ పీఠంలో అధ్యాపకుల పేర్లు స్మరిస్తే శరీరం గగుర్పొడుస్తుంది. జటావల్లభుల పురషోత్తం ప్రముఖలు. గాంధేయవాది కె.వి.యన్. అప్పారావు, రావూరి వెంకటేశ్వర్లు, సంస్కత శతావధాని రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు, పేరి వెంకటశాస్త్రి, కర్రి శ్రీరామ మూర్తి శాస్త్రి ప్రాతఃస్మరణీయులు.

కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వాముల వారి అవార్డు స్వీకరిస్తూ గుంటూరు హిందూ కళాశాలలో రచయిత దంపతులు, 2018

అధ్యాపకులేగాక అక్కడ చదివిన విద్యార్థులు కూడా ఆంధ్రదేశం నలుమూలలా పని చేసి ప్రతిభా సంపన్నులు కావడం విశేషం. ఒక్కొక్కరి గూర్చి కనీసం ఒక పేజీ వ్రాయదగిన పండితులు. బేతవోలు రామబ్రహ్మం, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సముద్రాల రంగరామానుచార్యులు, అమరేశం రాజేశ్వరశర్మ (ఉస్మానియా ప్రొఫెసర్), మైలవరపు శ్రీనివాసరావు (ప్రిన్సిపాల్), ఏలూరిపాటి అనంతరామయ్య (ప్రిన్సిపాల్), కర్రి శ్రీరామశాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు ప్రభృతులు.

ఈ కళాశాల విద్యార్ధులు ఆ రోజుల్లో ఆర్థికంగా వెనుకబడినవారు. సంస్కృత భాషాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం కలిగించే  ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ పి.వి. నరసింహరావు ఒక్కొక్క విద్యార్థికి నెలకు 50 రూపాయల స్టైఫండు మంజూరు చేశారు. 1977లో యాభై రూపాయలు అంటే ఇప్పటి ఐదువేలకు సమానం. ఈ విషయంలో విశేష కృషి చేసిన వారిని స్మరిస్తూ రామబ్రహ్మం ఇలా అన్నారు.

“అప్పటి  IAS  ఆఫీసరు పి.యల్. శివరాం చొరవ, అప్పటి ఉపాధ్యాయ నియోజక వర్గ యంమ్.యల్.సి. కుర్మాచార్యులు పట్టుదల ఆ భృతి మంజురుకు దోహదం చేశాయి.”

సంస్కృతం లోనే నిత్యవ్యవహారం జరిపే ఘనులు దోర్బల ప్రభాకరశర్మ ఇక్కడి విద్యార్ధి. 70వ ఏట కూడా ఆయన సంస్కృత ప్రచారానికి నడుం కట్టారు.  ఇక్కడ మూడు సంవత్సరాల బి.ఏ. (ఓరియంటల్), 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులుండేవి. 1912లో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం నామావశిష్టంగా నలుగురు అధ్యాపకులు, 140 మంది విద్యార్ధులున్నారు.

ఇతర కళాశాలలు:

కోగంటి సీతారామాచార్యులు, రంగనాయకమ్మ అధ్యాపకులు. ఇక్కడ స్త్రీలకు మాత్రమే ప్రవేశం. 1922లో ప్రారంభం. గాంధేయవాది ఉన్నవ లక్ష్మీనారాయణ (మాలపల్లి నవలా రచయిత), లక్ష్మీబాయమ్మల సంకల్పబలంతో కళాశాల ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెయ్యి మంది విద్యార్థినుల ఉత్తీర్ణులయ్యారు. జాతీయోద్యమ కాలంలో రాజాజీ, వి.వి.గిరి ఈ సంస్థ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వృత్తి విద్యలు నేర్పిస్తారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ వసంత కుమారి. మరి కొన్ని కళాశాలలు వచ్చే వారం..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version