Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-48

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

ఆలయాలతో మూడిపడిన సంస్కృత కళాశాలలు:

తెలంగాణాలో ఈ రెండు కళాశాలలు గతంలో నడిచాయి.

ఆంధ్రప్రదేశ్ లో

గుంటూరు జిల్లాలోని పొన్నూరులో భావనారాయణ స్వామి ఆలయం ప్రాచీనం. సంస్కృత కళాశాల ఈ ఆలయ పక్షాన ఏర్పడింది (1953).

ఈ కళాశాల అధ్యాపకులలో వేదాల సీతారామాచార్యులు ప్రముఖులు. ప్రిన్సిపాల్‌గా ప్రభాకర శ్రీకృష్ణభగవాన్  కళాశాల అభివృద్ధికి దోహదం చేశారు. క్రమంగా ఈ కళాశాల ఆర్ట్స్ కళాశాలగా మారింది. శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శ్రీమతి లక్ష్మీపార్వతి ఇక్కడి విద్యార్థులు. సంస్కృత కళాశాలల్లో 1979-2010 మధ్య అధ్యాపకులుగా పని చేసిన సూరం శ్రీనివాసులు రెండు కళాశాలలకు ప్రిన్సిపాల్ గా – తాడికొండ, తిమ్మసముద్రాలలో పని చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్  కార్యదర్శిగా కొంత కాలం స్వామి సేవలో వున్నారు.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల – జిల్లెళ్లమూడి, గుంటూరు జిల్లా:

జిల్లెళ్లమూడి అమ్మగా ఆరాధించబడే దైవసమానురాలు 1965లో జిల్లెళ్లమూడిలో ఆగస్టు 6 శుభదినాన సంస్కృత బోధన ప్రారంభించారు. ఆరుగురు విద్యార్ధులతో ఓంకార నది పక్కన సంస్థ మొదలైంది. ప్రస్తుతం 12 మంది అధ్యాపకులు, దాదాపు 200 మంది విద్యార్ధులతో సంస్కృత బోధన జరుగుతోంది. విఠల శ్రీరామచంద్రమూర్తి అధ్యాపకులు, తర్వాత ప్రిన్సిపాల్.

భద్రాద్రి రామ శాస్త్రి తొలి అధ్యాపకులు. కళాశాలగా రూపొందిన తర్వాత డా. పన్నాల రాధాకృష్ణశర్మ తొలి ప్రిన్సిపాల్. అప్పికట్ల హై స్కూలులో టీచర్ గా వున్న పన్నాలను అమ్మ ప్రిన్సిపాల్‌గా ఆహ్వానించడం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. భక్త సోదరుల విరాళాలలో సంస్థ 1971లో కళాశాలగా మారిన రోజున ప్రత్యేక సంచిక ప్రచురించారు. కాంగ్రెసు నాయకులు (పొన్నూరు) అధరాపురపు శేషగిరిరావు ప్రభుత్వ ఎయిడ్ కల్పించారు. ఎయిడ్ ద్వారా అధ్యాపకుల జీతాలు, భవన వసతులు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లభించాయి. తద్వారా మాతృశ్రీ ట్రస్టు విద్యార్ధులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించగలిగింది. మాతృశ్రీ విద్యాపరిషత్ అమ్మ ప్రధాన భక్తులు కొండముది రామకృష్ణ అధ్యక్షులుగా ఏర్పడింది. 1987-90 మధ్య ఆయన  సారథ్యంలో కళాశాల శాశ్వత భవనాలు ఏర్పడ్డాయి.

భారతావరణ రూపకంలో నన్నయగా, జూలై 2022, హైదరాబాదు

1974లో సంస్కృతం, తెలుగు బోధించడానికి నియమితులైన అధ్యాపకులు. ప్రసన్నాంజనేయ శర్మ, ఇ.వి. సత్యనారాయణ మూర్తి, డా. వరలక్ష్మి. విద్యార్థులు వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. ఒక ముస్లిం విద్యార్ధిని కూడా చదివింది. ఆమె స్వర్ణపతకం సాధించి తర్వాత పి.హెచ్.డి సాధించింది. ఇక్కడ విద్యార్ధులు డా. ఝాన్సీ, డా. బి.యల్. సుగుణ రీడర్లుగా ఎదిగారు. సుబ్రమణ్యేశ్వరశర్మ తర్వాత డా. సుగుణ ప్రిన్సిపాల్.

మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ఉపన్యాసకులుగా చేరారు. కళాశాల అభివృద్దికి నిరంతర సహకారి. ఆధ్యాత్మికవేత్త వి.యస్.ఆర్.మూర్తి (హైదరాబాదు)  ఈ సంస్థ పురోగతికి తోడ్పడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందక ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ కళాశాల కమిటీ అధ్యక్షులు బొప్పడి రామబ్రహ్మం.

చింతలపాటి బాపిరాజు సంస్కృత కళాశాల, లేపాక్షి (అనంతపురం జిల్లా):

ధార్మిక జీవనులు, గాంధేయవాది ఆయిన చింతలపాటి మూర్తిరాజు 1970 దశకంలో పలు ఓరియంటల్ కాలేజీలు ఏలూరు, లేపాక్షిలో ఆరంభించారు. లేపాక్షిలో వీరభద్ర స్వామి ఆలయం ప్రసిద్ధం. లేపాక్షి శిల్పకళకు జక్కన యశస్వి. 1975-78 మధ్య నేను కడప ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ ఈ కళాశాల వైభవ ప్రాభవాలను రికార్డు చేసి ప్రసారం చేశాము. ప్రిన్సిపాల్‌గా యన్.వి.నారాయణరావు ప్రసిద్ధులు. అవధానులైన మేడవరం మల్లికార్జున శర్మ, పమిడికాల్వ చెంచుసుబ్బయ్యలు అధ్యాపకులు. కళాశాలను ప్రభుత్వం మూసివేయడంతో చెంచుసుబ్బయ్య ధర్మవరం ఆర్ట్స్ కాలేజీ తెలుగు ఉపన్యాసకులుగా బదిలీ అయ్యారు. త్యాగరాజ సాహిత్యంపై ఆయన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య శలాక రఘునాథశర్మ పర్యవేక్షణలో పి.హెచ్.డి పొందారు. ఆ సిద్ధాంత గ్రంథానికి నేను పరీక్షాధికారి. చెంచుసుబ్బయ్య, నేను తిరుమ తిరుపతి దేవస్థానంలో 2005-2010 మధ్య పని చేశాము.

2019 ప్రపంచ తెలుగు రచయితల సమావేశాలలో రచయిత

లాల్ బహదూర్ శాస్త్రి ఓరియంటల్ కాలేజీ, చిన నిండ్రకొలను – (ఫతేపురం), పశ్చిమ గోదావరి జిల్లా:

ఈ కళాశాలలో అధ్యాపకులైన విద్యాప్రవీణ కాండ్ల వెంకటరామ తిరుమలాచార్యులు తరువాత చిట్టి గూడురులోని యస్.యన్.యస్. కళాశాలకు తరలి వెళ్లారు. చిన నిండ్రకొలనులో శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా నడుస్తోంది.

1978 నవంబరు 11న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం  చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థ ఆధ్వర్యంలో నడిచిన 13 కళాశాలలు (5 జూనియర్ కళాశాలలు, 3 ఓరియంటల్ కాలేజీలు, 5 డిగ్రీ కాలేజీలు) ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. ప్రభుత్వ పరమైన 3 ఓరియంటల్ కాలేజీల వివరాలు-

  1. లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత కళాశాల, చిననిండ్రకోలను
  2. చింతలపాటి బాపిరాజు ఓరియంటల్ కాలేజి, ఏలూరు
  3. చింతలపాటి బాపిరాజు ఓరియంటల్ కాలేజి, లేపాక్షి (అనంతపురం జిల్లా)

శ్రీ గోగినేని కనకయ్య ఓరియంటల్ డిగ్రీ కాలేజి, తాడికొండ, గుంటూరు జిల్లా:

ఇది నాగార్జున యూనివర్శిటీకి అనుబంధం. 1968లో స్థాపించారు. క్రమంగా డిగ్రీ కాలేజీగా మారింది. సూరం శ్రీనివాసులు ఇక్కడ అధ్యాపకులుగా పని చేశారు. తరువాత తిమ్మసముద్రం కళాశాల ప్రన్సిపాల్ గా వెళ్లారు.

చిట్టిగూడూరు:

చిట్టిగూడూరు కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసిన కళాప్రపూర్ణ యన్.టి.జి. వరదాచార్యులు గొప్ప సంస్కృత పండితులు. వారి మచిలీపట్నం  ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యారు. అనంతరం చిట్టిగూడురులో సంస్కృత కళాశాల స్థాపించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ మెంబరుగా విద్యారంగ పురోభివృద్ధికి కృషి చేశారు. కె.వి. తిరుమలాచార్యులు చిట్టిగూడూరు కళాశాల అధ్యాపకులు. ఇక్కడ విద్యార్ధి అయిన వెంపటి కుటుంబశాస్త్రి మూడు సంస్కృత విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్. అద్దంకి శ్రీనివాస్ (బహుముఖ ప్రజ్ఞాశాలి) ఇక్కడి విద్యార్థి.

సాహిత్య అకాడమీ శ్రీనివాసరావు గారితో

కీర్తి కిరీటాలు:

సంస్కృత కళాశాలలో చదివి వివిధ విశ్వవిద్యాలయ ఉన్నత పదవు లధిష్ఠించిన ప్రముఖ లెందరో.

వైస్ ఛాన్సలర్లు:

  1. ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి – (1) రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, ఢిల్లీ 2003-08 (2) సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి (3) ఛాన్సలర్ – చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయం, కంచి. (4) పద్మశ్రీ 2026.
  2. ఆచార్య వి. మురళీధరశర్మ – జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం – తిరుపతి 2017-22
  3. ఆచార్య పెన్నా మధుసూదన్ – కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం, నాగపూరు 2022-2026
  4. ఆచార్య వెల్దడ నిత్యానందరావు – తెలుగు యూనివర్శిటీ – హైదరాబాదు, 2023
  5. ఆచార్య రవ్వా శ్రీహరి – ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం.

ప్రొఫసర్లుగా వ్యవహరించిన పలువురు:

ఈ విధంగా సంస్కృత విద్వాంసులు ఉన్నత పీఠాల నలంకరించిన వైభవం గుర్తుకు వస్తే మూతబడిన సంస్కృత కళాశాలల పురావైభవం పురావస్తు శాఖ చరిత్రకెక్కింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version