Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-49

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

సంస్కృత విద్యా పీఠాలు:

తిరుమలేశుని పాద పీఠిలో సంస్కృత భాషాభివృద్ధికి ఒక విద్యా పీఠాన్ని నెలకొల్పడానికి 70 ఏళ్ల నాడు బీజం పడింది. కేంద్ర ప్రభుత్వ విద్యశాఖ ఆధ్వర్యంలో 1966లో సంప్రదాయ శాస్త్రాలు, సంస్కృత అధ్యయనం కొనసాగించేందుకు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో స్థాపించారు. సంస్కృత విద్యాసంస్థలు బ్రిటీషు ప్రభుత్వ హయాంలోనే మొదలవడం విశేషం. కార్నవాలిస్ గవర్నర్ జనరల్‌గా వున్న సమయంలో వారణాసిలోని ప్రభుత్వ సంస్కృత కళాశాలను 1791లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంగా మార్చారు. డక్కన్ కాలేజిగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని పూనా కాలేజి 1821 నాటిది. కలకత్తాలోని సంస్కృత కళాశాల, విశ్వవిద్యాలయం 1824 నాటిది. ఈ మూడు బ్రిటీషు ప్రభుత్వం కాలంలో వెలశాయి.

స్వాతంత్రానంతరం వచ్చిన సంస్కృత విశ్వవిద్యాలయాలు:

ఏతావాతా దేశవ్యాప్తంగా 18 సంస్కృత విశ్వవిద్యాలయాలున్నాయి. అందులో ఢిల్లీలోని రెండు, తిరుపతిలోనిది సెంట్రల్ యూనివర్శిటీలు, చిన్మయ విశ్వవిద్యాలయం (కొచ్చిన్) డీమ్డ్ యూనివర్శిటీ.

కంచి పరమాచార్య విజయేంద్ర సరస్వతీస్వాములవారితో, హైదరాబాదులో, 2022

రాష్ట్రీయ సంస్కృత విద్యపీఠం – తిరుపతి:

లోక్‌సభ స్పీకర్‍గా పని చేసిన తిరుపతి వాస్తవ్యులు మాడభూషి అనంతశయనం అయ్యంగార్ దూరదృష్టితో ఈ సంస్థ ఆరంభమైంది. ఆయన పార్లమెంటు సభ్యులుగా, డిప్యూటీ స్పీకర్‌గా, తొలి లోకసభ స్పీకరుగా, బీహార్ గవర్నరుగా వ్యవహరించారు. విద్యాపీఠానికి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ శంఖుస్థాపన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు సమకూర్చి ప్రోత్సహించింది. 1971 నుండి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ పర్యవేక్షణలోకి వచ్చింది. 1987లో డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తింపు లభించింది. 2020లో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా మారింది.

యన్.యన్. రామానుజ తాతాచార్య(1928-2017) ఈ కేంద్రం విశ్వవిద్యాలయంగా రూపొందిన వేళ తొలి వైస్ ఛాన్సలర్ (1989-1994). ఆయనకు పద్మ భూషణ్ (2016) అవార్డు లభించింది. మహోమహోపాద్యాయ, వాచస్పతి పురస్కార గ్రహీత. 2012 ఫ్రెంచి ప్రభుత్వం ‘The Chevalier Degree’ ప్రదానం చేసింది.

అంతకు ముందు విద్యాపీఠం డైరక్టర్ యం.డి. బాలసుబ్రమణ్యం 1977 జూన్‌లో ప్యారిస్‌లో జరిగిన 3వ ప్రపంచ సంస్కృత సమ్మేళనానికి హాజరయ్యారు. వారిని నేను కడప ఆకాశవాణికి పిలిపించి ఇంటర్వ్యూ ప్రసారం చేశాను. యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్లుగా పని చేసిన పలువురితో నాకు ప్రత్యక్ష పరిచయాలు మెండు. అందరూ లబ్ధప్రతిష్ఠులు.

ఆచర్య కె.ఇ. గోవిందన్ – 2004-2006; ఆచార్య హరేకృష్ణ శతపథి 2006-16; శ్రీపాద సత్యనారాయణమూర్తి, యం.యల్.నరసింహమూర్తి, (కొద్ది నెలలు) ఆచార్య వి. మురళీధరశర్మ 2017-22; ప్రస్తుతం 2025 నుండి ఆచార్య జి.యస్.ఆర్ కృష్ణమూర్తి వైస్ ఛాన్సలర్.

గ్రంథావిష్కరణ సభలో, సినీనటులు శ్రీ బ్రహ్మానందం గారితో 2018

గతంలో పని చేసిన వైస్ ఛాన్స్‌లర్లు:

వీరందరూ సంస్థ ప్రగతికి కృషి చేశారు.

ప్రిన్సిపాళ్లు – వెంకట రాఘవాచార్యులు, డా. మండనమిశ్రా, ఆర్. కరుణాకరన్, యం.డి. బాలసుబ్రమణ్యం, యన్. యస్. ఆర్. తాతాచార్య.

కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారు ఈ యూనివర్శిటీకి ఛాన్స్‌లర్లను నియమించింది. గతంలో ఆచార్య యన్.యస్. రామానుజ తాతాచార్య ఛాన్స్‌లర్. ఆచార్య వి.ఆర్. పంచముఖ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ఛాన్స్‌లర్.1998- 2008 మధ్య దశాబ్ది కాలం ఛాన్స్‌లర్. పద్మశ్రీ అవార్డు గ్రహీత (2025) పట్టాభిరామశాస్త్రి, రామారంజన్ ముఖర్జీలు ఛాన్స్‌లర్లు.

అస్సాం గవర్నరుగా వున్న జానకీ వల్లభ పట్నాయక్ ఛాన్స్‌లర్‌గా వుంటూ తిరుమల దర్శనం పూర్తి చేసుకొని వచ్చి తిరుపతి విశ్వవిద్యాలయ గెస్ట్ హవుస్‌లో మరణించారు. తర్వాత కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమీషనరు యన్. గోపాల స్వామి 2002 నుండి ఛాన్సలర్. ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత.

అంగలకుదురు వాసుదాసస్వామిగారితో హైదరాబాదులో, రచయిత, 2019

గతంలో ఈ సంస్థ చైర్మన్లు:

శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్, వి. రాఘవన్, పతంజలి శాస్త్రి,

ఈ సంస్థ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఇందులో ఆచార్యులు వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్ లర్లుగా నియమితులు కావడం విశేషం.

  1. ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 1987 జూలైలో ఆధ్యాపకులుగా చేరారు. సాహిత్యం, సంస్కృతి విభాగాధిపతి, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. రెండో దఫా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు (2006-2012).
  2. ఆచార్య కె.వి.రామకృష్ణమాచార్యులు: విద్యాపీఠం, తిరుపతిలో వ్యాకరణ విభాగాధిపతి, జగద్గురు రామానందాచార్య రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం, జైపూరు వైస్ ఛాన్స్‌లర్. 2017లో రాష్ట్రపతి పండిత పురస్కారం అందుకున్నారు.
  3. ఆచార్య యస్.బి.రఘునాధాచార్య: అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసి తర్వాతి కాలంలో వైస ఛాన్స్‌లర్ అయ్యారు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో పబ్లికేషన్స్ విభాగంలో కొన్ని సంసవత్సరాలు పని చేశారు. హాఠాత్తుగా చనిపోయారు.
  4. ఆచార్య రాణి సదాశివమూర్తి: విద్యాపీఠంలో 2018 నుండి 2024 వరకు సాహిత్య విభాగాధిపతి. 2022 నవంబరు నుండి శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్.

వేద విశ్వవిద్యాలయం, తిరుపతి:

ఈ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే వేద విశ్వవిద్యాలయ పురోగతి సమీక్షిద్దాం.

దేవస్థానంలో శ్రీ. ఏ.పి.వి.యన్ శర్మ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‍గా వున్న కాలంలో (2005-2007) వేద విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది.

ఆంద్రప్రదేశ్ గవర్నరుగా వున్న శ్రీ రామేశ్వర ఠాకూరు చొరవతో అసెంబ్లీలో చట్టం తయారైంది. గవర్నరు కార్యదర్శి యం.జి.గోపాల్ ఎంతో తొందరపెట్టి సంస్థ ప్రారంభించారు. తొలి వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ. రెండు దఫాలు వారు ఆ పదవిలో వున్నారు. సంస్థ 2006లో ప్రారంభమై రెండు దశాబ్దాలుగా ముందుకు సాగుతోంది.

వెదురుపాక గాడ్, తిరుమల ప్రధానార్చకులతో రచయిత, 2020

ఇందులో వేదాధ్యయనము, ఆగమ అద్యయనము, పురోహిత, వేద భాష్య, వేదాంగ విభాగాలలో బోధన జురుగుతోంది.

ఆచార్య రాణి సదాశివమూర్తి ప్రస్తుత వైస్ ఛాన్స్‌లర్. ఈ రీతిగా తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయము, శ్రీ వేంకటేశ్వర వేద విద్యాలయాలు సంస్కృత భాషాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. గత సంచికలలో కొడిగట్టిన సంస్కృత కళాశాలల ప్రస్తావన చేసాను. ఈ సంచికలో విశ్వవిద్యాలయ స్థాయిలో సంస్కృత భాష అధ్యయన అధ్యాపనలు కొనసాగడం హర్షణీయం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version