[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
కళ తరిగిన సంగీత కళాశాలలు:
కర్ణాటక సంగీతం కావేరీ నదీ జల ప్రసాదంగా తమిళులు భావిస్తారు. దిగ్గజాల వంటి సంగీత వేత్తలు తమిళనాట 20వ శతాబ్దిలో కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం కలిగించారు. 1953 అక్టోబరులో భాషా ప్రయుక్త్ రాష్ట్రంగా ఆంధ్రదేశం కర్నూలు రాజధానిగా ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఏర్పడింది. అప్పటి వరకు ఆంధ్ర జిల్లాలు అవిభక్త మదరాసు రాష్ట్రంలో భాగంగా వున్నాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో సంగీత కళాశాలలు:
- మహారాజా సంగీత కళాశఆల, విజయనగరం – 1919
- శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి
- ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల, విజయవాడ.
- డి.వి.యన్. కళా క్షేత్రం సంగీత కళాశాల, విశాఖపట్టణం.
- ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, నెల్లూరు.
- శారదా ప్రభుత్వ సంగీత కళాశాల, కర్నూలు.
- ప్రభుత్వ సంగీత కళాశాల, రాజమండ్రి.
- శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.
- సంగీత నృత్య పాఠశాల – గుంటూరు.
మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయనగరం:
దక్షిణ భారతంలో 1919లో విజయనగరం మహారాజా పూసపాటి విజయరామగజపతి రాజు దాతృత్వంతో తొలిసారిగా విజయనగరంలో తొలి సంగీత కళాశాల నెలకొల్పబడింది. శ్రీ విజయరామ గాన పాఠశాలగా నామకరణం జరిగింది. ఈ పాఠశాల ప్రారాంభానికి వెనుక ఒక విచిత్ర గాథ ప్రచారంలో వుంది. విజయరామగజపతిరాజుగారికి ప్రియమిత్రులు చాగంటి జోగారావు. ఆయన కుమారుడి గంగరాజు అంధులు. ఆయనకు సంగీతం పట్ల ప్రేమ. జోగారావు రాజాగారిని తన బిడ్డ సంగీత విద్యకు దోహదం చేయమని అర్థించాడు. మహారాజా టౌన్ హాల్ భవనాన్ని సంగీత పాఠశాలకు విరాళంగా ప్రకటించి పాఠశాల ప్రారంభించారు. ప్రముఖ హరికథా, విద్వాంసులు ఆదిభట్ల నారాయణదాసు ప్రిన్సిపాల్‌గా, ద్వారం వెంకటస్వామి నాయుడు అధ్యాపకులుగా నియమితులయ్యారు.
బాలకృష్ణప్రసాద్, అన్నవరపు రామస్వామి గార్లతో రచయిత, హైదరాబాద్, 2017
చరిత్ర:
నూరు వసంతాలు ఘన చరిత్రగల ఈ కళాశాల 1919 ఫిబ్రవరి 5న అలనాటి అభినవ భోజులు పూసపాటి విజయరామగజపతి ప్రారంభించారు. విద్యాపోషకులైన విజయనగరరాజులు తర్వాతి కాలంలో సంగీత నృత్యాలను అభ్యసించే విద్యార్థులను ప్రోత్సహించారు. అలక్ నారాయణ గజపతి, పి.వి.జి.రాజు ప్రముఖ వ్యవస్థాపకులు. ఇక్కడి విద్యార్థులు భారతదేశంలో ప్రముఖ సంగీత విద్వాంసులుగా ఖ్యాతి గడించారు. సంగీత పండితులు కళాశాల అధ్యక్షులుగా కీర్తి తెచ్చి పెట్టారు. శిష్యపరంపర ద్వారా కీర్తి వ్యాపించింది.
స్వాతంత్రానంతరం 1955 ఆగస్టు 15న ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలను స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (రాజమండ్రి) అనుబంధ సంస్థగా కళాశాల నడుస్తోంది.
ఆదర్శ విద్యార్ధులు:
అదృష్టవశాత్తు ఈ కళాశాలలో చదివిన వారు అఖండ కీర్తి గడించారు. వారిలో సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, పద్మభూషణ్ డా. నూకల చినసత్యనారాయణ, మారెళ్ల కేశవరావు, ఇవటూరి విజయేశ్వరరావు, కొమండూరి కృష్ణమాచార్యులు, వాసావారు, ఐతం అప్పలరాజు, మండా మాణిక్యం, ద్వారం రమణ కుమారి, ద్వారం సత్యనారాయణ, సాలూరి రాజేశ్వరరావు, సాలూరి హనుమంతరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి. సుశీల, అశ్వత్థామ, సుసర్ల దక్షిణాముర్తి ప్రభృతులు తమ ప్రతిభతో వెలుగొందారు.
కళాశాల ప్రిన్సిపాళ్లు:
- ఆదిబొట్ల నారాయణదాసు – 1919-1936
- ద్వారం వెంకటస్వామి నాయుడు – 1936-1952 (వయోలిన్ ప్రొఫసరు 1919-36)
- ద్వారం నరసింగరావు – 1852-1960
- ద్వారం భావనారాయణరావు – 1962-1973 (థియరీ ఫ్రొఫెసరు 1948-53)
- నేదునూరి కృష్ణమూర్తి – 1977-1979 (పూర్వ విద్యార్థి 1940-45)
- శ్రీరంగం గోపాలరత్నం – 1979-80
- ద్వారం దుర్గాప్రసాదరావు – 1982-2000
- పి.వి.యస్.శేషయ్యశాస్త్రి – 2000-2007 (గాత్ర అధ్యాపకులు 1978-92)
- బి. అనురాధా పరశురాం – 2007-2018 (రాజమండ్రి ప్రిన్సిపాల్ 2004-2007)
- మండపాక నాగలక్షి – 2022 (మృదంగం అధ్యాపకులు)
డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో రచయిత దంపతులు
ప్రస్తుత అధ్యాపకులు:
విజయనగర సంగీత కళాశాలలో ప్రస్తుత అధ్యాపకులు
- డా. మండపాక నాగలక్ష్మి (ప్రిన్సిపాల్ – మృదంగ అధ్యాపకులు)
- కవిరాయుని ఏ.వి.యల్.శాస్త్రి – వీణ అధ్యాపకులు (1992-2010)
- చాగంటి రాజ్యలక్ష్మి – గాత్రం అధ్యాపకురాలు (1992-2023)
- నడుకుర్తి రాధాకృష్ణ – మృదంగం అధ్యపకులు
- అన్నవరపు శ్రీనివాసులు – డోలు అధ్యాపకులు
- ఏ.కనకమహాలక్ష్మి – గాత్ర సహాయకులు
- దామరాజు హిమబిందు – భరతనాట్యం అధ్యాపకులు
- చింతల పవనకుమార్ – వయెలిన్ అధ్యాపకులు
- యన్. గోపాలరావు – నాదస్వరం అధ్యాపకులు
కళాశాలలో లభించే కోర్సులు:
డోలు, మృదంగం, సర్టిఫికెట్, డిప్లోమా కోర్సులు
బొబ్బిలి వీణ, వయోలిన్, కోర్సులు లభ్యం. పార్టటైం కోర్సుగా నట్టువాంగ ఉదయం/ సాయంత్రం నేర్పే అవకాశం వుంది.
2019 లో ఫిబ్రవరి 3 నుండి 5 వరకు శతజయంతి ఉత్సవాలు విజయనగరంలో ఘనంగా జరిగాయి. సినీనటులు గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి, సంగీత విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావు, ద్వారం లక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిధి.
వింజమూరి సోదరీమణులు
శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి:
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ కళాశాల నడుపుతున్నారు. సంగీతం, నృత్యం కళాశాలతో బాటు నాదస్వరం, డోలు పాఠశాల కూడా వుంది. విశారద (డిప్లామా) ప్రవీణ (అడ్వాన్స్ డిప్లమా) తో బాటు గాత్రం, వీణ, ప్లూట్, వయోలిన్ కోర్సులున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం కోర్సులు బోధిస్తారు. నాదస్వరం, డోలు స్కూలు ద్వారా ఫుల్ టైమ్ సర్టిఫికెట్, డిప్లోమా కోర్సులు లభ్యం.
అతి ప్రాచీనమైన ఈ కళాశాల ఘన చరిత్ర గలది. 1959లో స్థాపించిన ఈ సంస్థ అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్‌గా లబ్ధప్రతిష్ఠులు పని చేశారు. ఈ కళాశాల భారతీయ సంప్రదాయ కళాశాలను ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
తిరుపతి శ్రీవెంకటేశ్వర సంగీత నృత్యకళాశాల ప్రిన్సిపాళ్లుగా గతంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు దీక్షా దక్షతలతో బాధ్యతలు వహించారు. తొలి రోజుల్లో 1959 ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర కళాపీఠాల ఆధ్వర్యంలో నడిచింది. ప్రధాని పండిత జవహర్ లాల్ నెహ్రూ ఈ సంస్థను దర్శించి ఆశీర్వదించారు. చెలికాని అన్నారావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా ఉండగా కళాశాలకు వసతులు సమకూరాయి. ప్రముఖ సంగీతజ్ఞులు పిచ్చు సాంబమూర్తి తొలి ప్రిన్సిపాల్. మదరాసు విశ్వవిద్యలయంలో 1937-61 మధ్య సంగీత విభాగం రీడరు. 1964-66 మధ్య తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయ సంగీత విభాగం ప్రొఫసర్ గాను, కళాశాల ప్రిన్సిపాల్ గాను సేవ చేశారు. వీరికి 1971లో పద్మభూషణ్ సత్కారం లభించింది.
తరువాత కాలంలో నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన సత్యనారాణ, ద్వారం భావనారయణలు డిప్యూటేషన్‌పై ప్రిన్సిపాల్‌గా వచ్చారు. డి.పశుపతి సంగీత విభాగంలో ప్రొఫసర్‌గా చేరి ప్రిన్సిపాల్ పదోన్నతి పొందారు. అన్నమాచార్య కీర్తనల ప్రాచుర్యానికి దోహదం చేశారు. యం. యస్. బాలసుబ్రమణ్యశర్మ అతి విశిష్టులు.
ఆధునిక తరం ప్రిన్సిపాళ్లు:
పుదుక్కోటై, ఆర్. కృష్ణమూర్తి (వీణ), ఇంద్రాణి, రాజేశ్వరి, చల్లా ప్రభావతి, ఆరవేటి ప్రభావతి (2005), వై.వి.యస్. పద్మావతి. జమునారాణి (నృత్యం), మృదంగం సుధాకర్‌లు.
పాత తరం అధ్యాపకులు:
పుదుక్కొటై రామనాధన్ (వయోలిన్), వి. యల్. జానకీరాం (వీణ), పుల్లెల పేరి సోమయాజులు (గాత్రం), వంగల పట్టాభి భాగవతార్ (హరికథ).
2000 తర్వాత అధ్యాపకుల నియమాకాలు జరగలేదు. 2005లో నంది వెలుగు ముక్తేశవరరావు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా కొత్త తరాన్ని మెరికల్లాంటి వారిని ఎంపిక చేశారు.
20 ఏళ్ళుగా వారు ఆ కళాశాల బోధనా ప్రమాణాలు పెంచారు. శ్రీమతి కొత్తపల్లి వందన (గాత్రం), యాళ్ల శ్రీవాణి (వీణ), కోమండూరి వెంకటకృష్ణ (వయెలిన్), శబరి గిరీష్ (గాత్రం), మండా అనంతకృష్ణ, వరసా శ్రీ శైలజ – అధ్యాపకులు. జె. సింహాచలశాస్త్రి (హరికథకులు), ఉమా ముద్దుబాల ప్రస్తుత ప్రిన్సిపాల్.
నాదస్వరం, డోలు పాఠశాల:
సంగీత కళాశాలకు అనుబంధంగా ఈ పాఠశాల నడుస్తోంది. దాలిపర్తి పిచ్చిహరి, అలుగోలు సత్యనారాయణ, వి.సత్యనారాయణ, ఈశ్వరమ్మ ప్రిన్సిపాళ్లు. ప్రస్తుతం సువర్ణలక్ష్మి ప్రిన్సిపాల్.
హరికథా విభాగంలో జగన్నాధం, దుర్గాంబ, భాస్కరశర్మ ప్రధానులు. దాదాపు 250 మంది విద్యార్థినీ విద్యార్థులు అన్ని విభాగాలలో బోధన పొందుతున్నారు. వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు దేవస్థానం కల్పిస్తోంది. కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు విరివిగా రావడం లేదు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
