[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
విజయవాడ సంగీత నృత్యకళాశాల:
కావేరీ తరంగాలు సంగీతానికి ప్రోత్సాహమిస్తాయని నానుడి. అక్కడి ఎందరో కర్ణాటక సంగీత విద్యాంసులు వెల్లివిరిశారు. ఆంధ్రదేశం నుండి పలువురు అక్కడి విద్వాంసుల శిష్యరికంలో సంగీత సాదనలు చేశారు. ఒంగోలు జిల్లా కరవది వాడైన షేక్ చిన మౌలానా సాభ్ నాదస్వరం నేర్చుకోవడానికి శ్రీరంగం చేరుకొని అక్కడే స్థిరపడ్డారు. అదే రీతిలో కృష్ణా నదీ తరంగాలు సంగీత నృత్యాలకు ఊతమిచ్చాయి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు 20వ శతాబ్దిలో విజయవాడలో శిష్యపరంపరకు ఆరాధ్య దైవమయ్యారు. పంతులుగారు (1883-1951) గాత్ర సంగీత విద్వాంసులు. త్యాగరాజ శిష్య పరంపరలో సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి, మనంబుచావాడి వెంకటసుబ్బయ్య వరుసలో రామకృష్ణయ్య పంతులు అగ్రగణ్యులు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో థానేదారుగా వ్యవహరించారు. వారి శిష్యులలో శిఖరాయమానులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆ సమయంలోనే నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు (వయోలిన్) అన్నవరపు రామస్వామి (వయోలిన్) అభ్యసించారు.
కూచిపూడిలో నాట్యసంప్రదాయం వర్ధిల్లింది. క్షేత్రయ్య మువ్వవేణుగోపాలస్వామి నారాధించి క్షేత్రయ్య పదాలు సమర్పించాడు. కూచిపూడి నృత్య సంప్రదాయం 17వ శతాబ్దిలో సిద్ధేంద్రయోగి విజ్ఞన పరంపర. ప్రాచీన నాట్యశాస్త్రం దానికి మూలం. 20వ శతాబ్దిలో వేదాంతం లక్ష్మీ నారాయణశాస్త్రి, వెంపటి చినసత్యం గురు పరంపరలో కూచిపూడి నాట్యం వర్ధిల్లింది. భామాకలాపం, భక్తి ప్రదాయ యక్షగానాలు శిష్యప్రశిష్య పరంపరలో అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ సత్యనారాయణపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంగీత నృత్య కళాశాల 1960లో ఆరంభించారు. ఇక్కడ సంగీతంలో, నృత్యంలో బి.ఏ. డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సులు నడుస్తున్నాయి. ఈ కళాశాల ఆవరణలో విశాలమైన ఆడిటోరియం అనుకూలంగా వుంది.
విజయవాడ సంగీత కళాశాలను గానగంధర్వడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేర నామకరణం చేసింది ప్రభుత్వం. గతంలో ఈ కళాశాల అధ్యాపక వర్గంలో/ప్రిన్సిపాల్‌గా సుప్రసిద్ధ వ్యక్తులు బోధన చేశారు. వారిలో శిఖరాయమానులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (1930-2016). వీరు కళాశాల ప్రిన్సిపాల్‌గా 1960వ దశకంలో మూడేళ్లు పని చేశారు. అదే విజయవాడ ఆకాశవాణిలో కర్ణాటక సంగీతం విభాగం ప్రొడ్యూసర్‌గా ‘భక్తిరంజని’ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
నూకల చిన సత్యనారాయణ ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రసిద్ధులు. ద్వారం వెంకటస్వామి గారి శిష్యులు. నూకల వారు పలు సంగీత కళాశాలల ప్రిన్సిపాల్‌గా ప్రత్యేకతను సాధించారు. విజయగరం కళాశాల ప్రొఫెసరు, సికిందరాబాదు, హైదరాబాదు, విజయవాడ తిరుపతి సంగీత కళాశాలల ప్రిన్సిపాల్.
ఈ కళాశాలలో కర్ణాటక సంగీతం – గాత్రం వయోలిన్, వీణ, మృదగం, ఫ్లూట్, నాట్యంలో కూచిపూడి, భరతనాట్యంలో బోధనలు జరుగుతాయి. నేదునూరి కృష్ణమూర్తి కూడా తిరుపతి, విజయగరం, సికింద్రాబాద్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ . విజయవాడ కళశాల ప్రిన్సిపాల్‌గా 1985లో రిటైరయ్యారు.
పెమ్మరాజు సూర్యారావు (1934-2021) ఈ కళాశాల ప్రధానాచార్యులుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. సుప్రసిద్ధ గాత్ర విద్వాంసులు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె.యస్. గోవిందరాజన్ ఆ పదవినధిష్టించారు. అద్యాపకులుగా గాత్ర సంగీత లెక్చరర్. యన్.సి.హెచ్. బుచ్చయాచార్యులు. (యన్.సి.హెచ్. కృష్ణమాచార్యుల కుమారుడు), వి. కృష్ణవేణి [ఉదయశంకర్, ముకుందశర్మ – (ఆకాశవాణి) సోదరి], అజయకుమార్ (నృత్యం) పేరెన్నికగన్నారు.
బాలమురళీకృష్ణ విజయవాడ కళాశాల ఆవిర్భావానికి మూల కారకులు. ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రిగా యన్.బి.పి.కె. పట్టాభిరామారావు వ్యవహరిస్తూ ఈ కళాశాలకు అనుమతి నిచ్చి 1960లో ఆకాశవాణిలో పని చేస్తున్న బాలమురళీకృష్ణను కళాశాల అధిపతిగా నియమించారు. మూడేళ్లు సంస్థను తీర్చిదిద్ది బాలమురళీకృష్ణ మదరాసుకు తరలి వెళ్లారు.
ఈ కళాశాలలో విద్యనభ్యసించిన పలువురు, ఈ సంస్థతో అనుబంధం గల పలువురు విద్వాంసులు ఈ కళాశాల ప్రారంగణాన్ని ఇతర కార్యక్రమాలకు వాడుకొనడాన్ని నిరసిస్తూ 2016లో ప్రదర్శన చేశారు.
శారదా సంగీత కళాశాల కర్నూలు:
ఒకప్పుడు రాయలసీమ రతనాలసీమ. కరువు కోరల్లో చిక్కిన రాయలసీమలో కవి పండితులకు కొదువలేదు. పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం వెంకటశేషశాస్త్రి, భూతపురి సుబ్రహణ్యశర్మ, కుంటిమద్ది శేషశర్మ ప్రభృతుల జీవగడ్డ. రాయలసీమలో 1973లో కర్నూలులో ప్రభుత్వం శారదా సంగీత కళాశాల ప్రారంభించింది. కర్నూలు అనగానే సంగీత దిగ్గజం డా. శ్రీపాద పినాకపాణి గుర్తు వస్తారు. ఆయన వృత్తిరీత్యా కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రొఫెసరు. శతసంవత్సరాలు జీవించిన విద్వాంసులు. నేదునూరు, నూకల వంటి శిష్యులకు గురువు.
శారదా కళాశాల ప్రిన్సిపాల్‌గా 1980వ దశకంలో కె. చంద్రమౌళి ప్రముఖులు. వారి గాత్రకచేరీల రికార్డింగులు ఆకాశవాణి కడప నుండి ప్రసారమయ్యాయి. మృదంగ విద్వాంసులు రామచంద్ర ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.
2023 మే 8న న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో వచ్చిన వార్త ఆ కళాశాల దుస్థితికి అద్దం పడుతోంది.
“1973లో స్థాపించిన ఈ సంగీత కళాశాల రాయలసీమలో ఒకే ఒక్కటి. తొలి బ్యాచ్ 50 మంది విద్యార్ధులతో ఆరంభమై 2023 నాటికి 50 ఏళ్లలో 350 సంఖ్యకు చేరింది. నాలుగేళ్ల సర్టిఫికేట్ కోర్సులు, రెండేళ్ల డిప్లొమా కోర్సులు సంగీత, నృత్యాలలో ఇక్కడ లభ్యం. అయితే సంగీత వాద్య పరికారల కొరత – వయెలిన్, నాదస్వరం డోలు – అధికం.
25 వయెలిన్లలో 15 నిరుపయోగం. 15 పియానోలలో ఆరు పనికిరావు. 20 వీణలు, ఆరు డోళ్లు అసలు వృథా. వాటిని భద్రపరచే బాక్సులు అసలే లేవు. వీటిని రిపేర్లు చేయాడానికి నిధులు లేవు. ప్రిన్సిపాల్ తప్ప పదిమంది అధ్యాపకులలో తొమ్మదిమంది కాంట్రాక్టు పద్ధతిలో వున్నారు. రెండు దశాబ్దాలుగా ఆఫీసు సిబ్బంది కొరత వుంది. విద్యార్ధులు తమ స్వంత వాద్యపరికారాలు కొనవలసి వస్తోంది. 2023 నాటికి సి. మునికుమార్ ప్రిన్సిపాల్, 1995 నుండి అధ్యాపకుల నియామకం జరగలేదని ప్రిన్సిపాల్ వాపోయారు.”
విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేర రాజమండ్రిలో నడుస్తోంది. వీణ, మృదంగం, వయోలిన్, గాత్రంలో డిగ్రీ కోర్సులున్నాయి. ఇవి సంగీత కళాశాలల నేటి స్థితి.
ప్రభుత్వ సంగీత పాఠశాల, నెల్లూరు:
విక్రమసింహపురిగా ప్రసిద్ధి కెక్కిన నెల్లూరు కవి పండిత గాయకులకు ప్రసిద్ధి. మహభారతకర్త కవిబ్రహ్మ తిక్కన ఇక్కడివాడు. ఆధునికులలో గాన గందర్వుడు యస్.పి. బాలసుబ్రమణ్యం ఈ ఊరివాడు. 1976లో అప్పటి రాజకీయ నాయకులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తమ స్వగ్రామంలో కోటలో సంగీత పాఠశాల స్థాపించారు. విద్యార్ధులు ఆసక్తిగా చేరి సంస్థ క్రమంగా వృద్ధి చెందింది.
1990లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ కళాశాలను జిల్లా ముఖ్య కేంద్రమైన నెల్లూరుకు తరలించారు. అది బెజవాడ గోపాలరెడ్డి చిరకాల వాంఛ. ఈ కళాశాల సాంస్కృత శాఖ డైరెక్టర్ పర్యవేక్షణలో నడుస్తోంది. అప్పటి 300 మందిదాకా విద్యార్ధులున్నారు. తెలుగు యూనివర్శిటీ పరీక్షలు నిర్వహిస్తుంది.
అద్యాపకులు – కె.తిరుపతమ్మ (భరతనాట్యం), ఇలపావులూరి పినాకపాణి (మృదంగం), బి. మాదేశ్వరకుమార్ (వీణ), యం. లోకేష్ బాబు (వీణ) జె. మల్లికారెడ్డి (డోలు).
ఈ పాఠశాలలో ఏటా జరిగే కార్యక్రమాలు.
- బహుళ పంచమికి త్యాగరాజ ఆరాధన
- ప్రతి సోమవారం విద్యార్ధులు/అధ్యాపకుల కార్తీక దీపోత్సవం
- యం.ఎస్. సుబ్బలక్ష్మి జయంతి
- నాట్యాచార్యుల నృత్యోత్సవాలు
- ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి – హరి కథాగాన సప్తాహం.
2020లో ఈ పాఠశాలను యస్.పి. బాలసుబ్రమణ్యం పేర నామకరణం చేశారు. 50 ఏళ్ల గడిచినా పాఠశాలకు స్వంత భవనాలు లేవు. అద్దె భవనాలలో వుంది. ఏటా 30 నుండి 300 దాకా విద్యార్ధులు చేరుతారు.
గత దశాబ్దాలుగా ప్రిన్సిపాళ్లు: కొమండూరి శేషాద్రి, అన్నాజీరావు, ఏ. అరుణ, రంగనాయకమ్మ, దుడ్డు సీతారామయ్య, ముని కుమార్, మద్దెల సాయిబాబా.
ప్రస్తుతం జ్యోతిర్మయి ప్రిన్సిపాల్. ఇదీ సంగీత కళాశాల దుస్థితి.
విశ్వవిద్యాలయాలలో సంగీత, నృత్య విభాగాల స్థితి గమనిద్దాం.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
