[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ సంగీత విభాగం:
తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం అప్పటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు దార్శనికతతో 1983లో నెలకొల్పబడింది. తొలి వైస్ ఛాన్సలర్ శ్రీమతి వనజా ఆయ్యంగార్. సంగీత, నృత్యాలలో ప్రతిభావంతులను తయారుజేసే లక్ష్యంతో పరిశోధనాత్మక విభాగాలు రెండింటిని ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ సంగీతా నృత్యాలు కర్ణాటక సంగీత సంప్రదాయాలకు ప్రాధాన్యం కల్పించారు.
ఇక్కడ ఎం.ఏ. (సంగీతం), ఎం.ఏ. (నృత్యం – భరతనాట్యం) రెండేళ్లు కోర్సులు (నాలుగు సెమిస్టర్లు) లభ్యం. అత్యాధునిక సౌకర్యాలతో శబ్దనియంత్రణ సౌకర్యాలుగల శిక్షణ లభిస్తుంది. పి.హెచ్.డి పరిశోధనకు అవకాశం వుంది. మహిళా సంగీత విద్వాంసులు స్వయం ప్రతిభతో రాణించే విధంగా శిక్షణ యిస్తారు. శాస్త్రీయ లక్షణ గ్రంథాల అద్యయనం, దాక్షిణాత్య సంగీత సంప్రదాయ వారసత్వం బోధిస్తారు.
ఆచార్య వర్గం:
ఈ విశ్వవిద్యాలయం సంగీత విభాగంలో ప్రతిభావంతులు అధ్యాపకులుగా పని చేశారు.
ఆచార్యులు:
డా. ప్రపంచం సీతారాం – ప్రముఖ ప్లూట్ విద్వాంసులు. ఆకాశవాణి మదరాసు, విజయవాడ కేంద్రాలలో వివిధ హోదాలలో పని జేశారు. తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో 1993-2002 మధ్య బోధించారు.
ఆచార్య డా. కె. సరస్వతీవాసుదేవ్. ఆచార్యులు 1993-2021
ఆచార్య డా. ద్వారం వి.జె.లక్ష్మీ (1960):
ఈమె ద్వారం వెంకటస్వామి నాయుడు మనుమరాలు. తండ్రి ద్వారం భావనారాయణ. మూడు దశాబ్దాల పాటు ద్వారం లక్ష్మి తమ గాత్ర మాధుర్యంతో ఎందరికో శిక్షణ ద్వారా తీర్చిదిద్దారు. వారి భర్త N. వెంకట రమణ ప్రోత్సాహంతో ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మి కర్ణాటక, హిందూస్థానీ సంగీత కళాకారిణి. ఆకాశవాణి గ్రేడ్ గాత్ర విద్వాంసురాలు. తిరుపతి దేవస్థానం వారికి అనేక అన్నమా చార్య కీర్తనలను స్వరపరచి ఆడియో సి.డిలు విడుదల చేశారు. ఆమె యం.యల్. వసంతకుమారి, టి.ఆర్. సుబ్రమణ్యం శిష్యురాలు. తాను ఎందరో గాయనీ గాయకులను తీర్చిదిద్దారు. పరిశోధనలు చేయించారు. 1991-2002 మధ్య ప్రొఫెసరు.
డా. ఆర్.యన్.యస్. శైలేశ్వరి (రాణి నాగశ్రీ శైలేశ్వరి):
ఆచార్యులుగా గత 14 సంవత్సరాలుగా బోధిస్తున్నారు. వీరి భర్త రాంలాల్ సంస్కృత విశ్వవిద్యాలయ ఆచార్యులు. శైలేశ్వరి 2006-2019 మధ్య సంగీత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ప్రస్తుత శాఖాధపతి.
డా. ఉప్పరి హిమబిందు – అసిస్టెంట్ ప్రొఫెసరుగా 2015 నుండి బోధిస్తున్నారు.
డా. యన్. అన్నపూర్ణ – 1993-2009 అసోసియేట్ ప్రొఫెసరు
డా. యం. సుశీల – అసోసియేట్ ప్రొఫసరు 1987-2004
ఈ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంతో బాటు నృత్య విభాగం కూడా బోధన, పరిశోధనలు కొనసాగిస్తోంది.
అన్నమయ్య విగ్రహం వద్ద రచయిత
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి:
ఈ విశ్వవిద్యాలయంలో PERFORMING ARTS విభాగంలో సంగీతం, నృత్యం, బోదిస్తున్నారు. భరతనాట్యం విభాగంలో ఎం.ఏ. ఆదర్శ్ అసిస్టెంట్ ప్రొఫెసరు. డా. హన్స్ ప్రభాకర రవిదాస్ సితార అధ్యాపకులు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు డా. వైజరుసు బాలసుబ్రహ్మణ్యం సంగీత విభాగ అధిపతి. దూర విద్య ద్వారా కర్ణాటక, హిందూస్థానీలలో 6 నెలలు సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. అదే రీతిలో రెగ్యులర్ క్లాసులు నడుపుతారు.
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం:
సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 2019 నుండి సంగీతం ఒక శాఖ. సంగీత విభాగంలో డా. డి. పావని అధ్యాపకురాలు. డా. యం. అరణ్యకుమార్, డా. ప్రగ్యప్యాసి ఇతర అద్యాపకులు. పావని భర్త డా. వైజరసు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో సంగీతం బోధిస్తున్నారు. నృత్య విభాగంలో యం.పి.ఏ. పి.హెచ్.డి. కోర్సులున్నాయి. డా. జె. అనురాధ శాఖాధిపతి. ప్రస్తుతం (2026 ఏప్రిల్) ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లార్. డా. యం.యస్. శివరాజు, అరుణా భిక్షు అధ్యాపకులు. 1988లోనే ఈ విభాగం ఆరంభించారు. 2009లో మ్యూజిక్ స్టూడియో నిర్మించారు. సంగీత విభాగంలో యం. సాంబశివరాజు ఆచార్యలు. ఎం.ఏ సంగీత కోర్సు బోధిస్తారు. 20 మంది విద్యార్ధులు, ముగ్గురు అద్యాపకులు. నృత్య విభాగాధిఫతి అనురాధ వైస్ ఛాన్స్లర్ కావడం చరిత్ర.
విజయవాడ ఆకాశవాణి కేంద్రం వద్ద రచయిత
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు:
ముఖ్యమంత్రి యన్.టి.రామారావు దార్శనికతతో 1985 డిసెంబరు 2న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆరంభమైంది. తూమాటి దోణప్ప తొలి వైస్ ఛాన్స్లర్. ఆచార్య వి. నిత్యానంద రావు ప్రస్తుత వైస్ ఛాన్సలర్. ఇక్కడ సంగీత నృత్యవిభాగాలున్నాయి.
ఈ విశ్వవిద్యాలయం ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది. సర్టిఫికెట్ కోర్సు, డిప్లమా కోర్సులు దీని ఆధ్వర్యంలో నడుపబడుతున్నాయి.
విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతం – గాత్రం, వాద్య సంగీతం – వీణ, మృదంగంలలో బి.ఏ, ఎం.ఏ, కోర్సులున్నాయి. డిగ్రీ మూడేళ్లు, ఎం.ఏ. రెండేళ్లు, దూరవిద్య కూడా లభ్యం. పరిశోధనలకు అవకాశం వుంది. వరంగల్ లో మరొక క్యాంపస్ వుంది. తెలంగాణా విభజన తర్వాత సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు.
తెలుగు విశ్వవిద్యాలయ సంగీత విభాగంలో పని చేసిన అధ్యాపకులు:
దీపా చంద్రశేఖర్, ఉమాదేవి, శేషులత, యం.పద్మ, యస్.కె.వెంకటాచార్యులు. ప్రస్తుతం రాధా సారంగపాణి విభాగాధిపతి. వైజరసు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం నుండి డెప్యూటేషన్‌పై వచ్చి యిక్కడ బోధిస్తున్నారు.
2025లో రాజమండ్రీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. డి. మునిరత్నం నాయుడు వైస్ ఛాన్స్‌లర్‌గా నియుక్తులయ్యారు. శ్రీశైలం కూచిపూడిలలో కేంద్రాలున్నాయి.
హైదరాబాదులో కర్ణాటక సంగీత విభాగంలో డా. ఎల్లా వెంకటేశ్వరరావు, వింజమూరి సీతాదేవి అతిథి ప్రొఫెసర్లు. హిందూస్థానీ సితార విద్వాంసులు పండిట్ జనార్ధన మిట్టా ప్రసిద్ధులు. నృత్యవిభాగంలో ఉమారామారావు ఎందరినో తీర్చిదిద్దారు. అలేఖ్య పుంజల నృత్య విభాగాధిపతి, ఆమె రిజిష్ట్రార్‌గా కొంత కాలం వ్యవహరించారు. డా. వనజా ఉదయ్ తెలుగు విశ్వవిద్యాలయ అకడమిక్ డీన్‌గా నృత్య సంప్రదాయానికి కరదీపిక.
ఈ విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో సంగీత నృత్యాల కోర్సులు నడుస్తున్నాయి.
ఆదిభట్ల నారాయణదాసుగారి విగ్రహం వద్ద రచయిత
ఆంధ్ర మహిళా సభ కళాశాల లతిత కళల విభాగం:
హైదరాబాదులోని ఆంధ్ర మహిళా కళాశాల దుర్గాబాయి దేశ్‌ముఖ్ మందుచూపుకు నిదర్శనం. ఇక్కడే 2005లో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ (లలిత కళలు, ప్రసారమాద్యమ విద్య) ప్రారంభమైనది. తొలుత 1938లో ప్రారంభమైన ఆంధ్ర మహిళా సభ హైదరాబాదులో కూడా విస్తరిల్లింది. ఆమె వీణా వాద్య నిపుణురాలు. ఈ లలిత కళాల విభాగంలో తొలుత సంగీత కోర్సులు తెలుగు విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో నడిచాయి. తర్వాత ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం కోర్సులు ప్రవేశ పెట్టారు. దూరవిద్య ద్వారా పద్మావతీ మహిళా కళాశాల కోర్సులకు శిక్షణ యిస్తారు. ప్రవేశానికి వయోపరిమితి లేదు. గృహిణులు ఖాళీ వేళల్లో పార్ట్ టైమ్‌గా నేర్చుకుంటారు. 2007 డిసెంబరు 1న శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రం ద్వారా ఎం.ఏ. (సంగీతం) కోర్సు ప్రారంభించారు. మూడేళ్ల డిగ్రీ కోర్సు, ఒక సంవత్సరం డిప్లోమా కోర్సులున్నాయి. శ్రీమతి వై. రమాప్రభ, శ్రీమతి టి. చంద్రభాను అధ్యాపకులు.
నిర్లక్ష్యానికి గురైన సంగీత విద్య:
ఈ విధంగా సేకరించిన సమాచారం గమనిస్తే సంగీత బోధన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అద్దం పట్టినట్లు కనబడుతోంది. గతంలో ద్వారం, నేదునూరి, శ్రీరంగం ప్రభృతులు అధ్యాపకులు. కళాశాలల్లో విద్యకు పూర్వం గురుకుల పద్ధతిలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వంటి మేరు శిఖరాలు ఇద్దరో, ముగ్గురో ప్రతిభావంతులకు శిక్షణ యిచ్చేవారు. 1980 దశకం వరకు ప్రభుత్వ కళాశాలలు కూడా సుసంపన్నంగా బోధించాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులలో నూతన నియామాకాలు లేనట్లు సంస్కృత, సంగీత కళాశాలల్లో అధ్యాపకాలు నియమకం జరగడం లేదు.
హరికథలు, నాదస్వరం కోర్సులలో చేరేవారు అరుదు. కొంత కాలం గడిస్తే గురు శిష్య పరంపరలో తర్ఫీదు పొందిన వ్యక్తులు కనిపించరు. ఉద్యోగ భద్రత, ఉదర పోషణకు సంగీతం ఆసరాగా లేదు. తెలుగు పండితులు సంస్కృత విద్వాంసులు కానవసరం లేదు. ఇంటర్మీడియెట్‌లో సెకండ్ లాంగ్వేజి సంస్కృతం. శబ్దమంజరి వరకే విద్య పరిమితం. భవిష్యత్తు నిరాశాజనకం!
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
