Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-53

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

తెలంగాణాలో సంగీత, నృత్య కళాశాలలు::

  1. శ్రీ భక్తరామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల – సికింద్రాబాదు
  2. శ్రీ త్యాగరాజు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల – హైదరాబాదు
  3. శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల – హైదరాబాదు.
  4. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం – హైదరాబాదు
  5. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం.

ప్రైవేట్ సంగీత కళాశాలలు:

  1. ఆంధ్ర మహిళా సభ కళాశాల – లలితకళలు – హైదరాబాదు
  2. బన్సీలాల్ బద్రుక సంగీత నృత్య పాఠశాల – హైదరాబాదు
  3. నాదబ్రహ్మ శాస్త్రీయ సంగీత విద్యాలయ – శ్రీనగర్ కాలనీ, హైదరాబాదు
  4. STEPS DANCE స్టూడియో – బంజారాహిల్స్ హైదరాబాదు (యు.జి.సి)
  5. స్వరార్ణవ – అమీర్‌పేట, హైదరాబాద్ (యు.జి.సి)
  6. ఆరభి – చిక్కడపల్లి – హైదరాబాద్ (యు.జి.సి)
  7. AAFT – ఫిల్మ్ సిటీ – హైదరాబాద్ (నృత్యంలో డిప్లోమా)

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారిని సత్కరిస్తున్న రచయిత

శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్యకళాశాల:

ఇది హైదరాబాదులోని రాంకోఠిలో 1966 నుండి పని చేస్తోంది. ఇక్కడ సంగీత శిక్షణతో బాటు నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిభావంతంగా కొనసాగుతున్నాయి. ఇది అతి పెద్ద సంగీత కళాశాల. ఇందులో 13 విభాగాలలో విద్యార్ధులు శిక్షణ పొందుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఇతర 12 సంగీత కళాశాలలో పోలిస్తే ఇది పెద్దది. తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని సంస్థ. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం గత 60 సంవత్సరాలుగా కొలువుదీరారు (ఫోను 040-24758090). ప్రిన్సిపాల్ పాండురంగముత్యాలు.

శ్రీ భక్తరామదాసు ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల:

ఆధునిక కాలంలో భారతీయ కళల నభ్యసించడం హాబీగా భావిస్తున్నారు. పవిత్ర శాస్త్రాలననుసరించి సంగీతం, నాదం, నృత్యం పరమాత్మతో జీవాత్మను అనుసంధానం చేసి ముక్తిని సాధించడానికి తోడ్పడతాయని విశ్వాసం, ఆ ఉద్దేశంతో ప్రభుత్వం సంగీత నృత్య కళాశాలలను ప్రారంభించింది.  “శిశుర్వేత్తి పశుర్వేత్తి గానపరసం ఫణిః” అని నానుడి.

1957 మార్చి 12న సికిందరాబాద్‌లో ప్రభుత్వం భక్త రామదాసు పేర ఈ కళాశాలను స్థాపించింది. గత ఏడు దశాబ్దాలుగా ఈ సంస్థ విశిష్ట ఖ్యాతి నార్జించింది. ప్రముఖ విద్వాంసులైన నూకల చిన్న సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, జి.యన్. దంతాలే, శ్రీరంగం గోపాలరత్నం, ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోమాండూరి శేషాద్రి ప్రభృతులు ప్రిన్సిపాళ్లుగా దిశానిర్దేశం చేశారు.

1957లో 12 మంది సిబ్బందితో పాఠశాలగా ప్రారంభమైంది. సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షణలో వుండేది. దాని డైరక్టరు సి.వి.డి.మూర్తి చొరవతో ముందుకు నడిచింది. నోరి నాగభషణం నాలుగేళ్ల పాటు సూపరింటెండెంట్‌గా కార్యకలాపాలు నిర్వహించారు. 1966లో ఆకెళ్ల మల్లికార్జున శర్మ నియమితులై నాలుగేళ్లు పర్యవేక్షించారు. అనంతరం హైదరాబాదు సంగీత కళాశాల సంగీత లెక్చరర్ నూకల చిన్న సత్యనారాయణను ప్రిన్సిపాల్‌గా ప్రమోట్ చేసి ఇక్కడ వేశారు. ఆయన రెండేళ్ల పాలన తర్వాత జి.యన్.దంతాలే ప్రభృతులు ఆ పదవి నధిష్ఠించారు.

కర్ణాటక గాత్రం, వీణ, వయెలిన్, కూచిపూడి నృత్యం, హిందుస్తానీ గాత్రం కోర్సులు నడిపారు. 1970లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు  ప్రవేశపెట్టారు. 1977లో సంగీత కళాశాలలను సాంకేతిక విద్య నుండి విద్యాశాఖకు బదిలీ చేశారు. 1979 నుండి శ్రీరంగం గోపాలరత్నం పలు సంవత్సరాలు ప్రిన్సిపాల్‌గా వున్నారు. 1980లో వెస్ట్ మారేడ్‍పల్లిలోని నూతన భవనాలలోనికి మారింది. 1983లో సాంస్కృతిక శాఖ పరిధిలోకి వచ్చింది. భక్తరామదాసు ప్రభుత్వసంగీత నృత్య కళాశాలగా రూపొందింది. 1990 వరకు పి.యస్. గోటీకర్ ప్రిన్సిపాల్‍గా చేసి రిటైరయ్యారు.

హైదరాబాదు సోదరీమణులు లలిత, హరిప్రియల ఉభయ కళాశాలల్లో పని చేశారు.

హైదరాబాదు సోదరీమణులు లలిత, హరిప్రియ గార్లకు జ్ఞాపికలు అందిస్తున్న రచయిత

ఆకెళ్ల మల్లికార్జున శర్మ 1993 వరకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించి తర్వాత త్యాగరాజ కళాశాల హైదరాబాదుకు బదిలీ అయ్యారు. వి.కనకదుర్గ ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరించిన మీదట కళాశాల పద్మారావునగర్ నుండి వెస్ట్ మారేడ్ పల్లికి మారి 2004 వరకు కొమాండోరి శేషాద్రి ప్రిన్సిపాల్ తర్వాతి కాలంలో పేరి శ్రీరామమూర్తి, యన్.సువర్ణలత, సి.హెచ్. శ్రీరామచంద్రమూర్తి, యల్. విజయలక్ష్మి, పి.వి.యన్.శేషయ్యశాస్త్రి, డి. సీతారామయ్య, కందుకూరి వరలక్ష్మిలు ప్రిన్సిపాళ్లు. 2024 సెప్టెంబరు నుండి శ్రీమతి యం. సరిత ప్రిన్సిపాల్.

ప్రిన్సిపాళ్ల పరంపర:

షేక్ చిన మౌలానా గారితో రచయిత

అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాదు:

ఈ కళాశాలను 1996 డిసెంబరు 31న ఆరంభించారు. ఇక్కడ కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలు, కూచిపూడి, పేరిణి నృత్యాలు, వయెలిన్, తబలా, మృదంగం కోర్సులు నిర్వహిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంగీత కళాశాలలు నడుస్తున్నాయి. సంగీత నాదస్వరూపం. భారతీయ కళలను నేర్చుకోవాలనే తృష్ణగల వారికి ఈ కళాశాలల అవకాశం కల్పిస్తున్నాయి. అధ్యాపకులు – డి. జయకుమార్ (మృదగం), జైకిషన్ (తబల) పి.సుశీల (పేరిణి) చింతామణి (హిందుస్థానీ గాత్రం).

ఆకెళ్ల మల్లికార్జున శర్మ తొలినాళ్లలో ప్రిన్సిపాల్.

ప్రిన్సిపాళ్ల పరంపర:

  1. శ్రీమతి యల్.విజయలక్ష్మి – తొలి ప్రిన్సిపాల్ (1997-2000 జూలై). ఆమె భరతనాట్యం ఉమారామరావు వద్ద అభ్యసించారు.
  2. శ్రీమతి యన్. సువర్ణలత – 2002 – 2004, 2005-2007. భరతనాట్య కళాకారిణి. ఆమె వేదాంతం జగన్నాథ శర్మ శిష్యురాలు. తొలి తరం ప్రిన్సిపాల్స్ ఇద్దరూ నృత్యకళాకారులు కావడం విశేషం.
  3. సి.హెచ్. శ్రీరామచంద్రమూర్తి 2004 – 2005 (గాత్రం,) 2007 – గ్వాలియర్ ఘరానాకు చెందిన పండిట్ భీమశంకరరావు శిష్యులు.
  4. డి. సీతారామయ్య 2005 – 2007 వీణ విద్వాంసులు. డి.వి.శేషమ్మ శిష్యులు.
  5. యస్.వి. రమణమూర్తి 2011 – 2024 వయోలినిస్టు. తాతగారు శిష్ట్లా రాజశేఖరం శిష్యులు. సుదీర్ఘ కాలం ప్రిన్సిపాల్.
  6. శ్రీమతి కందుకూరి వరలక్ష్మి 2024 ఆగస్టు నుండి నేటి వరకు (గాత్రం). 1991 నుండి అధ్యాపకురాలుగా 16 సంవత్సరాలు బోధించారు. కర్నూలు శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా 4 సంవత్సరాలు, గుంటూరు సంగీత పాఠశాల ప్రిన్సిపాల్‌గా 4 సంవత్సరాలు, భక్తరామదాసు కళాశాల సికింద్రాబాదు ప్రిన్సిపాల్‍గా 2024 ఆగస్టు వరకు వ్యవహరించారు.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన సంగీత సభలో ప్రసంగిస్తున్న రచయిత

ప్రస్తుతం ఈ కళాశాల హైదరాబాదులో నుండి మల్కాపురులో నడుస్తోంది. కర్ణాటక వయెలిన్ విద్వాంసులు యస్.వి.రమణమూర్తి, (ప్రిన్సిపాల్) గాత్ర కళాకారులు పి. రాజు ఇక్కడ అధ్యాపకులుగా రిటైరయ్యారు. ఇక్కడి విద్వార్థులు పలువురు నగరంలో పలు ప్రాంతాలలో సంగీత శిక్షణా సంస్థలు నడుపుతున్నారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version