Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-54

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

అయ్యయ్యో! ఆకాశవాణీ!:

గత కొద్ది వారాలుగా సంస్కృత కళాశాలలు, సంగీత కళాశాలల నేటి స్థితిగతులను వివరించాను. అది చదివిన మిత్రులు ఒక ప్రశ్నవేశారు. ‘మీరు పని చేసిన ఆకాశవాణి మాట ఏంటి?’ అన్నారు. ‘తల ఎత్తుకొని తిరిగిన రోజులు పోయాయి’ అనేది నా సమాధానం.

1975 ఆగస్టు 16న నేను కడప ఆకాశవాణిలో ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా అరంగేట్రం చేశాను. ఆకాశవాణి స్వర్ణయుగమది. 1938లో తెలుగు ప్రసారాలు మదరాసులో ప్రారంభమయ్యాయి. 1948 డిసెంబరు 1న విజయవాడ కేంద్రం ఆరంభం. తొలితరం ప్రసార ప్రముఖులు దిగ్గజాలు. అప్పట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి బి.వి.కేస్కర్. నెహ్రూ యుగమది. ఆ సమయంలో తెలుగువాడైన బెజవాడ గోపాలరెడ్డి ఆ శాఖను నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో శ్రీమతి ఇందిరా గాంధీ ఆ శాఖ మంత్రి. ఈ ముగ్గురి కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలురైన వ్యక్తులను కాంట్రాక్టు పద్ధతిపై ఆకాశవాణిలో ప్రొడ్యూసర్లుగా కొద్దిపాటి కాల పరిమితితో నియమించారు. ఆ తరం వ్యక్తులలో ఢిల్లీలో సంగీత విభాగంలో పండిట్ రవిశంకర్, ఈమని శంకరశాస్త్రి ప్రభృతులు ఆకాశవాణి మణిదీపాలు.

తెలుగు ప్రసారాలలో ఆ కోవలో కొలువుదీరిన వారిలో ప్రముఖులు – పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు, మునిమాణిక్యం నరసింహారావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, స్థానం నరసింహారావు, గోపీచంద్, నాయని సుబ్బారావు ప్రభృతులు. అది తొలితరం. వారి వల్ల ప్రసారాలకు వన్నె చేకూరింది. 1970 దశకం దాకా వారు ఆకాశవాణిని ఆకాశమంత ఎత్తుకు చేర్చారు. అప్పట్లో రేడియో ఒక్కటే ప్రసారమాధ్యమం. దిన పత్రికలు కూడా తక్కువే. దూరదర్శన్ రాలేదు. సినిమా పాటలు, హరికథలు, బుర్రకథలు, వార్తలు, నాటకాలు – ఇలా విజ్ఞాన వినోద కార్యక్రమాల సమ్మేళనం, ‘లైవ్’ ప్రోగ్రాంలు – లైవ్లీ ప్రోగ్రామలు – గ్రామఫోన్ రికార్డులు చేసి ప్రసారం చేసిన తొలి రోజులవి. ఆధునిక సాంకేతిక 70వ దశకంలో వచ్చి ఆడియో రికార్డుంగులు ‘స్పూలు’ మీద చేసి ప్రసారమయ్యాయి. ఆ తర్వాత ఆడియో క్యాసెట్ల యుగం. నిలయ విద్వాంసులు ఖాళీ సమయాలను జంత్ర వాద్యాలతో పూరించేవారు. పల్లెలు, పట్టణాలలో పబ్లిక్ రేడియోలుండేవి. ఆకాశవాణి వార్తల పట్ల ప్రజలకు విశ్వసనీయత వుండేది. కాని వాతావరణ శాఖ పుణ్యమా – అని ‘వాన వస్తుందని రేడియోలో చెప్తే రాద’నే చలోక్తులు విరిశాయి.

ఢిల్లీ తెలుగు వెలుగులు:

తొలిరోజుల్లో ఆకాశవాణిలో వార్తా విభాగంలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య ప్రముఖులు. తెలుగు వార్తలు ఢిల్లీ నుండి వెలువడేవి. వార్తలు చదవడంలో తనదైన ప్రత్యేకతను చాటిన ప్రముఖులలో – కపిల కాశీపతి, శ్రీవాత్సవ, కొత్తపల్లి సుబ్రమణ్యం, పన్యాల రంగనాథరావు, వనమాలి ప్రసాద్, జోళిపాళ మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, దుగ్గిరాల పూర్ణయ్య, మామళ్లపల్లి రాజ్యలక్ష్మి, వావిలాల రాజ్యలక్ష్మి, ఏడిద గోపాలరావు, కందుకూరి సూర్యనారాయణ తొలి తరంవారు. సమ్మెట నాగమల్లేశ్వరరావు, గద్దె దుర్గారావు, వడ్లమూడి రాజేశ్వరి, తురగా ఉషారమణి, సూర్యదేవర ప్రసన్నకూమార్ ఈ తరంవారు. ప్రసన్నకుమార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్. గోళ్లమూడి నళినీమోహన్ వార్తలు చదివి తర్వాత ఢిల్లీ జనరల్ న్యూస్ రూం ఎడిటర్‌గా రిటైరయ్యారు.

ఆకాశవాణి ఢిల్లీ స్వర్ణోత్సవం వేడుకలు

సమాచార ప్రసార మంత్రిత్వశాఖ మంత్రులుగా రెండో తరంలో పర్వతనేని ఉపేంద్ర (1988) మల్లికార్జున్, డిప్యూటీ మంత్రి (1983-84) యస్. జైపాల్ రెడ్డి (1997) ప్రభృతులు దిగ్దర్శనం చేశారు. మంత్రిత్వశాఖలో ఏ. ఉమాకాంత శర్మ (నందలూరు, బీహార్ క్యాడర్ IAS), కె. సుబ్రహణ్యశర్మ (1996-దూరదర్శన్) ప్రసారభారతి సి.ఈ.వో. ప్రసారభారతి చైర్మన్‌గా కన్నడిగుడైన ఏ.సూర్యప్రకాశ్ 2020 ఫిబ్రవరి వరకు నియమితులయ్యారు. వెంపటి శశి శేఖర్ 2022 వరకు సి.ఈ.వో.

సమాచార ప్రసారశాఖల మంత్రిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు సంవత్సరకాలం 2016-2017 మధ్య వ్యవహరించి 2017 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మంత్రిత్వశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం ఆంధ్రా క్యాడర్ IAS అధికారి సంజయ్ జాజు (1992 బ్యాచ్) 2024 ఫిఫిబ్రవరి నుండి పర్యవేక్షిస్తున్నారు.

దూరదర్శన్ డైరక్టర్ జనరల్‌గా గతంలో కె.యస్.శర్మ IAS, ఆకాశవాణి డైరక్టర్ జనరల్‌గా ఆర్. వెంకటేశ్వర్లు ( 2013-14) తెలుగువారి కీర్తికిరీటాలు. దూరదర్శన్ అదనపు డైరక్టర్ జనరల్‌గా ఆర్. అనంత పద్మనాభరావు 2001లో పదోన్నతి పొంది 2005 ఫిబ్రవరిలో రిటైరయ్యారు. పాతతరం డి.డి.బిలు – బి.కె.రావు, IAS; పి. వి. రాఘవరావు IA&AS; వి. పురుషోత్తమరావు, యస్.యన్.మూర్తి, పుల్లెల వెంకటేశ్వర్లు ప్రభృతులు, విశ్వనాథవారి కుమారులు అచ్యుతదేవరాయలు చీఫ్ ఇంజనీరు.

ఆకశావాణి డైరక్టర్ జనరల్ కార్యలయంలో సంగీత విభాగంలో ఈమని శంకరశాస్త్రి, ప్రపంచం సీతారాం, బి.రామన్న పంతులు, వి.ముకుందశర్మ డైరక్టరు స్థాయి అధికారులు. ఆరెకపూడి రమేష్ చౌదరి, బి. ఆర్. చలపతిరావు, రాయప్రోలు వారి కుమారులు ఆర్. సి. రాజశేఖర్, పి.ఆర్. రెడ్డి, శంకరమంచి సత్యం ప్రభృతులు వివిధ హోదాల నలంకరించారు.

ప్రతిష్ఠాత్మకమైన ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర డైరక్టర్లు నేటి వరకు ముగ్గురే దిశానిర్దేశం చేశారు. సూరి నారాయణమూర్తి (1965), ఆర్. అనంత పద్మనాభరావు (1997-2000), శైలజాసుమన్ (2014).

కర్ణాటక గవర్నరుగా వ్యవహరించిన శ్రీమతి వి. యస్. రమాదేవి 1960లో హైదరాబాదు కేంద్ర మహిళా కార్యక్రమ విభాగంలో వ్యాఖ్యాతగా పని చేశారు.

తెలగునాట ఆకాశవాణి కేంద్రాలు:

1948లో విజయవాడ, 1950లో హైదరాబాదు కేంద్రాలు వెలిశాయి. 1935 నుండి డెక్కన్ రేడియో పని చేయగా 1950లో ఆకాశవాణి చేపట్టింది. 1975 వరకు హైదరాబాదు, విజయవాడ మాత్రమే కేంద్రాలు. రిలే కేంద్రాలుగా వున్న కడప, విశాఖపట్టణం కేంద్రాలు 1975 జూన్ లో స్వతంత్ర ప్రతిపత్తి సంపాదించాయి. అందువల్ల 1938 (మదరాసు) నుండి 1975 వరకు ప్రసారరంగ తొలితరం.

ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం, కాకినాడలో సంక్రాంతి కవి సమ్మేళనం

తొలి తరం మహనీయులు. హైదరాబాదు కేంద్రం – డైరక్టర్లు – యం. వి.రాజగోపాల్, IAS, అయ్యగారి వీరభద్రరావు, పసలబాల గురుమూర్తి, యస్. రాజారాం, కబీర్ అహమ్మద్ ప్రభృతులు. ప్రసార విబాగ రూపకర్తలైన లబ్ధప్రతిష్ఠులు – త్రిపురనేని గోపీచంద్, నాయని సుబ్బారావు, స్థానం నరసింహారావు, బుచ్చిబాబు, మునిమాణిక్యం నరసింహారావు, రేడియో అన్నయ్య, అక్కయ్య – న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి దంపతులు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, భాస్కరభట్ల కృష్ణారావు, దాశరథి, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, అజర్ అఫ్సర్, వేటూరి సహజానంద, నండూరి విఠల్, కేశవపంతుల నరసింహశాస్త్రి, రామ్మూర్తి రేణు, యన్.వి.యస్.ప్రసాదరావు, మల్లాది నరసింహశాస్త్రి, వింజమూరి వరదరాజ అయ్యంగార్, మంచాళ జగన్నాధరావు, వింజమూరి సీతాదేవి, పండు ధర్మజ్ఞాని, యస్.యన్.శ్రీనివాసన్, ఎల్లా వెంకటేశ్వరరావు, పాలగుమ్మి విశ్వనాధం, మొదలి అరుణాచలం, కె. చిరంజీవి, శారదా శ్రీనివాసన్, దండమూడి మహీధర్, తురగా జానకీరాణి ప్రభృతులు. ఇంకా ఎందరో మహానుభావులు.

సాహితీ ప్రముఖులతో రచయిత

గొల్లపూడి మారుతీరావు మాటల్లో..

“ఆకాశవాణి హైదరాబాదులో కొలువు 1963లో నేను అడుగు పెట్టేనాటికి భువన విజయంలా వుండేది. వాళ్ల పేర్లు చెబితేనే శరీరం గగుర్పొడుస్తుంది.”

విజయకేతనం – విజయవాడ:

ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయవాడలో 1948 డిసెంబరు నుండి ప్రసారాలు కొనసాగుతున్నాయి. పాత తరం ప్రముఖులు – బందా కనకలింగేశ్వరరావు, శ్రీవాత్సవ, పింగళి లక్ష్మీకాంతం, జి.వి.కృష్ణారావు, బాలాంత్రపు రజనీకాంతరావు, ఆమంచర్ల గోపాలరావు, గుమ్మలూరి సత్యనారాయణ, మల్లిక్, వింజమూరి శివరామారావు, ప్రయాగ నరసింగశాస్త్రి, రాచకొండ నరసింహమూర్తి, జరుక్ శాస్త్రి, కందుకూరి రామభద్రరావు, వేమవరపు శ్రీధరరావు, తెన్నెటి హేమలత (లత), జె. వరలక్ష్మి, శ్యామసుందరి – ప్రభృతులు.

కర్ణాటక సంగీత విభాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, అన్నవరపు రామస్వామి, యన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు, దండమూడి రామమోహనరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతశాస్త్రి, సంధ్యావందనం శ్రీనివాసరావు, సుందరపల్లి సూర్యనారాయణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, యన్.సి.వి. జగన్నాధాచార్యులు, దత్తాడ పాండురంగరాజు ప్రభృతులు. వీరు నిలయ విద్వాంసులు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సంక్రాంతి రంగవల్లి

1948 డిసెంబర్లో కేంద్రం ప్రారంభించడానికి రెండు నెలల ముందు అన్నవరపు, యన్.సి.హెచ్ కృష్ణమాచార్యులు నిలయ విద్వాంసులుగా చేరారు. రామస్వామిగారు వందేళ్ల యువకుడు. వీరికి పద్మశ్రీ లభించింది.

విస్మృతిలో కొందరి పేర్లు మరచి వుండవచ్చు. ఇది 1948-1975 మధ్య స్వర్ణయుగం. రెండో తరం మాది – 1975-2000. తొలి తరం ప్రసార ప్రముఖుల వల్ల రేడియో పేరు గడించింది. మలితరం మాబోంట్లు ఆకాశవాణిలో చేరడం వల్ల ఖ్యాతి గడించాము. 2000-2025 మధ్య నేటి తరం ప్రసార రథం గతుకుల బాటలో లాగుతున్నారు. ఏవి తల్లీ! నాటి తీపి గురుతులు?

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version