Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-55

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

ప్రసార రథసారథులు – 1975-2000:

1975 జూన్‌లో హైదరాబాదు, విజయవాడ, కడప, విశాఖపట్టణం కేంద్రాలు పని చేస్తున్నాయి. 1975 జూన్‌లో ప్రొడ్యూసర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు హైదరాబాదులో తొలిసారిగా జరిగాయి. ఉషశ్రీ (విజయవాడ), పద్మనాభరావు (కడప), విజయభూషణశర్మ (విశాఖపట్టణం) ఎంపికయ్యారు. కొద్ది నెలల క్రితమే రావూరి భరద్వాజను హైదరాబాదులో ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా నియమించారు. ఈ నాలుగు కేంద్రాలకు తోడు మదరాసు ‘బి’ కేంద్రం తెలుగు ప్రసారాలు చేస్తోంది.

మదరాసు కేంద్రంలో జాషువా, ఆచంట జానకీరామ్, జనమంచి రామకృష్ణ, యమ్.యస్.శ్రీరాం ప్రసార రూపశిల్పులు. డైరక్టర్లుగా తెలుగు వారు – యస్. వేణుగోపాలరెడ్డి, వి. చంద్రమౌళి, శంకర నారాయణ (బాపు సోదరులు), డి. ఆంజనేయులు (వార్తావిభాగం) ప్రముఖులు. బదిలీ మీద ఆంధ్ర నుండి పలువురు మదరాసు వెళ్లి పని చేశారు. కలివేలు, ఇలా వెళ్లారు. ఇంకెందరో. ఇప్పటికీ తెలుగు ప్రసారాలు నామ మాత్రంగా కొనసాగుతున్నాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాదు ప్రసార నాడీ కేంద్రం. ప్రభుత్వ పథకాల ప్రచారంలో అది భాగస్వామి. ప్రాంతీయ వార్తలు హైదరాబాదు, విజయవాడ కేంద్రాల నుండి రోజూ ప్రసారమవుతున్నాయి. జాతీయ వార్తలు తెలుగులో ఢిల్లీ నుండి దాదాపు ఏడు దశాబ్దాలు కొనసాగాయి. ఆ తరం వార్తలు చదివిన వారిలో కందుకూరి సూర్యనారాయణ సజీవులు. కంచు కంఠం ఆయనది.

సాంకేతిక కారణాలతో 20 ఏళ్ల నాడు ఢిల్లీ నుండి తెలుగు వార్తలను హైదరాబాదుకు తరలించారు. అక్కడ ఏళ్ల తరబడి వర్తలు చదివిన గద్దె దుర్గారావు, యండ్రపాటి మాధవీలత, తురగ ఉషారాణిలు హైదరాబాదు బదలీ అయ్యారు. జాతీయ వార్తలు ఉదయం 7. 05 నిముషాలకు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు, సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు ఉదయం 6.45 నిమిషాలకు విజయవాడ నుండి, సాయంత్రం 6.15 నిమిషాలకు హైదలాబాదు నుండి ప్రసారం. మధ్యాహ్నం విజయవాడ (1. 20 నిముషాలకు), హైదరాబాదు 1.10 నిముషాలకు ప్రసారం విడిగా చేస్తున్నాయి.

హైదరాబాదు కేంద్ర నిర్దేశకులుగా 1950 నుండి నేటి వరకు (తెలుగు వారు):

  1. యం. వి. రాజగోపాల్ 1951-253, 1955-1957 (ఆంధ్ర IAS తర్వాత)
  2. అయ్యగారి వీరభద్రరావు 1965-66
  3. పి. బాలగురుమూర్తి 1974-75
  4. పుల్లెల వెంకటేశ్వరలు 1975-78
  5. యస్. రాజారాం 1981-83(తమిళనాడు)
  6. వి. వి. శాస్త్రి 1992-96
  7. కబీర్ అహమ్మద్ 1996-99
  8. దుర్గాభాస్కర్ 1999-2005
  9. పి.యస్. గోపాలకృష్ణ 2005-2009
  10. పి. రాజారావు 2009
  11. మంగళగిరి ఆదిత్యప్రసాద్ 2012-2014, 2021-2023
  12. వి. ఉదయశంకర్ 2014-2019
  13. శైలజా సుమన్ 2019-2021

వీరే గాక ఔత్తరాహులు, దాక్షిణాత్యులు మరో 20 మంది దిశానిర్దేశం చేశారు.

కార్యక్రమ నిర్వాహకులు/అసిస్టెంట్ డైరక్టర్లుగా పలువురు ఈ కేంద్ర ప్రసారాలకు పుష్ఠిని చేకూర్చారు. రాష్ర ప్రభుత్వాలు మారినా, కేంద్ర ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పథకాలకు ప్రచారం సమకూర్చారు. వీరు తర్వాత వివిధ కేంద్రాల డైరక్టర్ బాధ్యతలు చేపట్టారు. వారిలో కొందరు –

సి. రాజగోపాల్, యం. నిత్యానందరావు, యస్. సి. హెచ్. నరసింహాచార్యులు, డా. కె. విజయ, శైలజామూర్తి. డా. ఆర్. అనంతపద్మనాభరావు, నాగసూరి వేణుగోపాల్, ప్రభృతులు.

ప్రమోషన్లు రాక పలువులు ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు/అసిస్టెంట్ డైరెక్టర్లు గానే రిటైరయ్యారు. 1997లో ప్రసార భారతి నెలకొల్పారు. యు.పి.యస్.సి. నియామకాలు ఆగిపోయాయి. 30 ఏళ్ల సర్వీసు చేసి ఒక్క ప్రమోషన్‌తో సరిపెట్టుకున్నారు. వారిలో – ఏ.వి.రావు చౌదరి, జె.ఆర్.సి. పాత్రో, కృష్ణమాచార్యులు, జీడిగుంట రామచంద్రమూర్తి, సుధామ, ఉషారాణి దంపతులు, మంత్రవాది మహేశ్వర్, వసుమతి దంపతులు, కలగా కృష్ణమోహన్ – మరి ఎందరో. ఆడియన్స్ రిసెర్చి విభాగంలో  హెచ్. హనుమంతరావు, బి.యస్.యన్.రావు, పి.యస్.మూర్తి, (ఢిల్లీ విభాగ డైరక్టర్).

హైదరాబాదు ఆకాశవాణి కార్యక్రమ రూపశిల్పులు:

జ్ఞానపీఠ బహుమతి గ్రహీత రావూరి భరద్వాజ, గొల్లపూడి మారుతీరావు, తురగా జానకీ రాణి, యన్.యస్. శ్రీనివాసన్(ఫ్లూట్), వింజమూరి సీతాదేవి, మొదలి అరుణాచలం, కె.బి. గోపాలం, బి.జి.యన్.రావు, చల్లా ప్రసాదరావు, ఇ.యల్.నారాయణ, వై. రాఘవులు, అజర్ అప్పర్, సునందినీ ఐపే – ఇది చిన్నలిస్టు.

గొల్లపూడి హైదరాబాదు, మదరాసు, కడప కేద్రాలలో 20 సంవత్సరాలు పని చేశారు. 1981లో కడపలో అసిస్టెంట్ డైరక్టరుగా పని చేస్తూ సినీరంగ ప్రవేశానికి నాంది పలికి రాజీనామా చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో సినీరంగ అరంగేట్రేం చేశారు.

జంధ్యాల దర్శకులుగా విజయవాడలో పని చేసిన శ్రీ గోపాల్, సుత్తి వీరభద్రరావులు సినీరంగంలో ప్రవేశం చేశారు. విజయవాడ, కడప, మదరాసులలో పని చేసిన యం.యస్. శ్రీరామ్ సినీ నిర్మాత. దూరదర్శన్‌లో పని చేస్తూ అకాల మరణం చెందారు.

హెదరాబాదు దూరదర్శన్:

1977లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అక్టోబరు 23న తెలుగు టి.వి.ప్రసారాలు ప్రారంభించారు. రాజ్‌భవన్ రోడ్డులో ప్రసారాలు ఆరంభం తర్వాత రామంతపురానికి స్వంత భవనాలలోకి మారింది. 2014లో తెలుగు రాష్ట్రాల విభజనతో యాదగిరి, సప్తగిరి (విజయవాడ) ఛానళ్లు ఏర్పడ్డాయి. తొలినాళ్లలో భద్రవ్రత, నండూరి విఠల్ డైరక్టర్లు, వడ్డాది అప్పారావు, వి.వి. కృష్ణశాస్త్రి, దేవళ్ల బాలకృష్ణ, సి. రామనుజాచార్యులు ప్రసారాలకు పుష్ఠిని చేకూర్చారు.

డైరక్టరుగా జి.కె మరార్ క్రికెట్ వ్యాఖ్యాత ప్రసిద్ధులు. ఆర్.వెంకటేశ్వర్లు హైదరాబాదు, బెంగుళూరు దూరదర్శన్ కేంద్రాల డైరక్టరు. ఢిల్లీ ఆకాశవాణిలో డైరక్టర్ జనరల్‌గా 2014లో రిటైరయ్యారు. డి. ప్రసాదరావు, పి. మధుసూదనరావు, శైలజాసుమన్, పి.వి.రమణ, యం.జె.రావు, ఆర్. కె. శ్రీ. ప్రముఖులు. పుట్టపర్తి నాగపద్మిని, జె. శకుంతుల అసిస్టెంట్ డైరక్టర్లు. 2024 నుండి కామేశ్వరి డైరక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఛానళ్ల సునామీతో దూరదర్శన్ తడబడింది.

విజయవాడ ఆకాశవాణి ప్రముఖలు:

ప్రసారాల నాణ్యత విషయంలో విజయవాడ కేంద్రం శ్రోతల మెప్పుపొందింది. ఆదివారం మూడు గంటలకు (సాయంకాలం) ప్రసారమైన నాటకాలు ఈనాటికీ శ్రోతలు గుర్తు తెచ్చుకుంటారు. ధర్మసందేహాలు కార్యక్రమాలు ఉషశ్రీ రామాయణ భారత భాగవతాలను తనదైన శైలిలో ప్రసారం చేసి చరిత్ర సృష్టించారు. భక్తిరంజని కార్యక్రమాలు విశిష్టం. యస్. బి. శ్రీరామ మూర్తి, జయప్రకాశ్ ప్రసారం చేసిన రూపకాలు జాతీయ స్థాయిలో పలు బహుమతులు సంపాదించాయి. శ్రీగోపాల్, రజని అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సాధించారు. ఇక్కడి కేంద్ర డైరక్టర్లలో ప్రాచీనులలో శ్రీనివాస పి.ఆర్.రెడ్డి ముఖ్యులు. రజనీకాంతరావు పరిపాలన స్వర్ణయుగం.

ఈ కేంద్రం డైరక్టర్లుగా నలుగురు మహిళలు గత మూడు దశాబ్దాలలో పని చేయడం ప్రత్యేకం. దుర్గాభాస్కర్, పి.వేదవతి, యం. కృష్ణకుమారి, శైలజామూర్తి. ఇక్కడ డైరక్టర్‌గా పని చేసిన అనంత పద్మనాభరావు ప్రతిష్ఠాత్మక ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా 1997-2000 మధ్య నియమితులయ్యారు.

ప్రసార రథసారధులు:

శంకరమంచి సత్యం, శ్రీ గోపాల్, యస్. రామమోహన్ రావు, పి. పాండురంగ, కె.వి.హనుమంతరావు (జానపదం), వై. హనుమంతరావు (వ్యవసాయం), పి.వి.శారద, పన్నాల సుబ్రమణ్యం భట్, మల్లాది సూరిబాబు, వెంపటి రాధాకృష్ణ, సుమన్ రెండోతరం వారు.

కడపలో ఆరవేటి శ్రీనివాసులు, గంగిరెడ్డి, మాచిరెడ్డి ఆ తరం డైరక్టర్లు. విశాఖపట్టణం పారిశ్రామిక కేంద్రం. 1988లో నోరిన్ నక్వీ ఢిల్లీ నుండి డైరక్టర్‌గా వెళ్లారు. దేవళ్ల బాలకృష్ణకు ముందు ఏ.యస్.మూర్తి, ప్రముఖులు, సలాది కనకారావు చిరకాలం పని చేశారు. కాకరపర్తి సత్యనారాయణ నేటి తరానికి వారసులు. యావత్ కేంద్రాల అధినేతలు. అతి కొద్ది మంది సిబ్బంది.

ప్రస్తుతం తెలుగు నాట ఆకాశవాణి కేంద్రాలు:

తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాదు. కరీంనగర్, మహబూబ్‌నగర్, సూర్యాపేట.

ఆంధ్రాలో – కడప, విజయవాడ, విశాఖపట్టణం, మార్కపురం, కర్నూలు, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, మాచెర్ల, శ్రీకాకుళం.

సిబ్బంది కొరత, నిధుల కొరత ఈ కేంద్రాల శల్యావశిష్టతకు నిదర్శనం.

ప్రైవేట్ ఎప్.యం రేడియోలు పలుపట్టణాలలో పని చేస్తున్నాయి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version