Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-57

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

ఢిల్లీ తెలుగు ప్రముఖులు:

తరం దేశ రాజకీయ నాయకులలో పలువురు ఆంధ్రులు ఉన్నత పదవుల నలంకరించారు. ‘ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు’ అనే పేరుతో నేను 2000 సంవత్సరంలో 250 పుటల గ్రంథం తయారు చేశాను. తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యాక్షులు ఆచార్య ఎన్. గోపి – అంతర్జాతీయ తెలుగు కేంద్రం పక్షాన ప్రచురించారు. నవంబరు 1న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో జరిగిన రాష్ట్రావతరణోత్సవాల సందర్భంగా లోక్‌సభ స్పీకర్ జి.యం.సి. బాలయెగి గ్రంథావిష్కరణ చేశారు. 1947 నుండి 2000 వరకు ఉన్నత పదవుల లంకరించిన 800 మంది వ్యక్తుల భోగట్టా అందులో పొందుపరచాను.

సంచిక పాఠకుల దృష్టికి ఆ తరం మహనీయుల ప్రస్తావన చేస్తాను. అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని (1948-50) చేపట్టిన డా.భోగరాజు పట్టాభిసీతారామయ్య ప్రాతః స్మరణీయులు. మచిలీపట్టణంలో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపకులాయన. ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ గవర్నరు.

తిరుపతిలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ ప్రముఖ తత్వవేత్త. 110 విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవి నలంకరించారు. రాజకీయాల ప్రమేయం లేని ఆయన 1952-62 మధ్య భారత ఉపరాష్ట్రపతి. 1962-67 మధ్య రాష్ట్రపతి.

హైదరాబాదులో జన్మించిన డా. జాకీర్ హుసేన్ (1897-1969) ప్రముఖ విద్యావేత్త. 1957లో బీహారు రాష్ట్ర గవర్నరు. 1962-67 మధ్య ఉపరాష్ట్రపతి. 1967లో రాష్ట్రపతిగా ఎన్నికై 1969లో హఠాన్మరణం చెందారు.

వరాహగిరి వెంకటగిరి (1894-1980) బరంపురం వాసి. కార్మిక సంఘాల నాయకుడిగా ప్రసిద్ధి. నెహ్రూ తొలి మంత్రివర్గంలో కార్మిక శాఖమంత్రి (1952-54). ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూరు గవర్నరు. 1967లో ఉపరాష్ట్రపతి. 1969 మేలో జాకీర్ హుసేన్ మరణంతో ఏర్పడిన ఖాళీలో రాష్ట్రపతిగా ఎన్నికై 1974లో పదవీ విరణ చేశారు. ఈ ముగ్గురుకీ ‘భారత రత్న’ గౌరవం లభించింది.

అప్పటి రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్‌సింగ్ గారితో రచయిత

రాష్ట్రపతి పదవి నలంకరించిన మరో ఘనుడు – నీలం సంజీవరెడ్డి (1913-96). అనంతపురం జిల్లా కుగ్రామం ఇల్లూరు వారిది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ప్రసిద్ధులు. ఎమర్జన్సీ తర్వాత 1977లో రాష్ట్రపతి పదవి నధిష్టించారు.

ముప్పవరపు వెంకయ్య నాయుడు (1950) విద్యార్ధి నాయకుడిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. కేంద్రంలో గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా గణనీయమైన కృషి చేశారు. 2017-2022 మధ్య ఉపరాష్ట్రపతి. తెలుగు భాష పట్ల సంస్కృతి పట్ల విశేషాభిమానం.

పాత తరం రాజకీయ ప్రముఖులలో లోక్‌సభ స్పీకరు – మాడభూషి అనంతశయనం అయ్యంగారు (1891-1978) తిరుపతికి చెందిన వారు. తొలి లోక్‌సభలోను, మలి లోక్‌సభలోను స్పీకరు. సభాపతిగా ఆ స్థానానికి గౌరవం తెచ్చారు.

లోక్‌సభ స్పీకరుగా చేసిన మరో ఆంధ్రులు – జి.యం.సి. బాలయోగి (1951-2002). తెలుగుదేశం పార్లమెంటు సభ్యులుగా 1998 మార్చిలో స్పీకరుగా ఎన్నికయ్యారు. 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 1977లో విజయవాడ పార్లమెంటు స్థానం నుండి గెలిచిన గౌడే మురహరి (1926-82) లోక్‌సభ డిప్యూడీ స్పీకరు (1976).

అసమాన ప్రతిభా విశేషాలతో దేశ ప్రధానిగా వ్యవహరించిన పి.వి. నరసింహరావు (1921-2004) అపర చాణుక్యులు. బహుభాషా ప్రవీణులు. 1991 జూన్ – 1996 మే మధ్య దేశ ప్రధాని. కేంద్ర మంత్రిగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మంత్రివర్గాలలో పలు విశిష్టశాఖల మంత్రిగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రరాష్ట్రం నుండి ఆ పదవి నధిష్టించిన ఏకైక వ్యక్తి. నెహ్రూ కుటుంబం నుండి కాకుండా బయటి వ్యక్తిగా నిలిచిన తొలి ప్రధాని.

మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్, డా. సి. నారాయణరెడ్డి గార్లతో రచయిత

1971లో జాతీయ కాంగ్రెసు అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన అతి సామాన్య వ్యక్తి దామోదరం సంజీవయ్య (1921-1972). అతి చిన్న వయస్సులో 1960లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. 1964 నుండి 1971 వరకు కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి.

కాంగ్రెసు రాజకీయాలలో పలువురు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులుగా పని చేశారు. అంతర్గత పోరాటంలో వారు ఢిల్లీ వెళ్లక తప్పలేదు. ఆ కోవలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి – కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు.

నెహ్రూ, ఇందిర మంత్రివర్గ సభ్యులు (1947 – 1984):

తెలుగువారు తొలి రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో ప్రధాన శాఖలు నిర్వహించారు. విచిత్రం – ఆర్థికశాఖ మంత్రిగా తెలుగువారు లేరు. ఆ కొరత తెలుగింట కోడలు నిర్మలా సీతారామన్ తీర్చింది. మొసలికంటి తిరుమలరావు 1950లో ఆహార వ్యవసాయశాఖ ఉపమంత్రి. కాసు బ్రహ్మానంద రెడ్డి, పి.శివశంకర్‌లు ఆ శాఖ మంత్రులు. గుంటూరుకు చెందిన కొత్త రఘురామయ్య వివిధ శాఖల మంత్రి. ఆ తరానికి చెందిన ఆర్. జగన్నాథరావు, జె.బి.ముత్యాలరావు, యమ్.యస్. సంజీవరావు, నీలం సంజీవరెడ్డి, పి.వి. నరసింహారావు, వి. కిశోర చంద్రదేవ్, డా. బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కె.వి.రఘునాధరెడ్డి, బి.యన్.మూర్తి, మల్లికార్డున, డి.యస్. రాజు, పెండేకంటి వెంకటసుబ్బయ్య (హోం శాఖ), దామోదరం సంజవయ్య, డా. కె. యల్. రావు (నీటి పారుదల)టి. అంజయ్య, జి. వెంకటస్వామి, పులి వెంకట రెడ్డి, అంకినీడు ప్రసాదరావు, పార్థసారథి, కె.కమలకుమారి ప్రముఖులు.

కె.విజయ భాస్కరరెడ్డి కేంద్ర మంత్రిగా పని చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు వ్యవహరించారు. బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి. కేంద్రమంత్రి. ప్రతిపక్ష నాయకులలో అగ్రగణ్యులు. ఆచార్య యన్.జి. రంగా (1900-1995) ఆరు దశాబ్దాలు పార్లమెంటు సభ్యునిగా చట్ట సభలో తన గళం వినిపించారు. స్వతంత్ర పార్టీ స్థాపకులు. 1920లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్ర పట్టభద్రులు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా జలవిద్యుత్ రంగాలలో నిపుణులైన డా. కె.యల్. రావును (1902-1986) జవహర్ లాల్ నెహ్రూ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు (1963). కేంద్ర నీటి పారుదల, విద్యుచ్ఛక్తి శాఖల మంత్రిగా 1963-73 మధ్య దశాబ్ది కాలం దేశ ప్రగతికి దోహదం చేశారు. వారి కుమార్తె సుజాతా రావు, IAS, కేంద్రంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శిగా రిటైరయ్యారు.

మాజీ గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ గారితో రచయిత

సోషలిస్టు భావాలు గల కె.వి.రఘునాధరెడ్డిని ఇందిరాగాంధీ తన మంత్రివర్గంలో వివిధ శాఖలకు వివిధ సమయాలలో మంత్రిగా నియమించింది. తర్వాతి కాలంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల గవర్నరు. వీరి కుమారులు డా. కె. శ్రీనాధరెడ్డి ప్రఖ్యాత హృద్రోగ నిపుణులుగా ఢిల్లీలో సేవలందిస్తున్నారు.

మైసూరు రాష్ట్రానికి చెందిన కె.సి.రెడ్డి తెలుగువారు. నెహ్రూ మంత్రివర్గంలో వివిధ శాఖల మంత్రి.

కర్నూలు జిల్లాకు చెందిన పెండేకంటి వెంకట సుబ్బయ్య 1957 నుండి 1985 వరకు 27 సంవత్సరాలు నంద్యాల పార్లమెంటు సభ్యులు. అతి దీర్ఘకాలం పార్లమెంటు సభ్యులు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయమంత్రిగా 1980 – 84 మధ్య పని చేశారు.

కేంద్రంలో వివిధ శాఖలు నిర్వహించిన మరో ప్రముఖులు పి.శివశంకర్. ఇందిరా గాంధీ కోర్డు కేసులో వాదించి ఆమె అభిమానం చూరగొన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి (1974-75) మంత్రిగా న్యాయ కంపెనీ వ్యవహారాలు, పెట్రోలియం, వాణిజ్యం, ప్రణాళికలు, మానవ వనరుల శాఖలకు అధిపతి. సిక్కిం (1994-95), కేరళ(1995) గవర్నరు.

గత 70 సంవత్సరాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల నాయకత్వం పలువురు వహించడం గమనార్హం. నెహ్రూ హయాంలో డా. బెజవాడ గోపాలరెడ్డి ఆ పదవి నధిష్టించారు. పర్వతనేని ఉపేంద్ర 1989లో వి.పి.సింగ్ మంత్రి వర్గంలో ఆ శాఖ మంత్రి.

వక్తగా పేరు తెచ్చుకొన్న యస్. జైపాలరెడ్డి సమాచార శాఖ మంత్రిగా మంచి పేరు. ఇందిర మంత్రివర్గంలో మల్లికార్జున్ ఆ శాఖ డిప్యూడీ మంత్రి. తనదైన శైలిలో ప్రసంగాలకు పేరు తెచ్చుకొన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల అధిపతిగా 2017 వరకు వ్యవహరించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

డా. బెజవాడ గోపాలరెడ్డి గారితో రచయిత

పార్లమెంటు సభ్యులుగా మరి కొందరు ప్రముఖులు:

తొలి పార్లమెంటు సభ్యులు – పైడి లక్ష్మయ్య (అనంతపురం) వై. ఈశ్వరరెడ్డి (కడప), పిశుపాటి రాఘవయ్య (ఒంగోలు), బద్దం ఎల్లారెడ్డి (కరీంనగర్), బెజవాడ రామచంద్రరెడ్డి (నెల్లూరు).

ఈ విధంగా ప్రభుత్వంలోను, ప్రతిపక్షంలోను పలువురు ఢిల్లీలో రాణించారు. సేవాదృక్పథంతో పని చేశారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version