Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-58

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

ప్రముఖ పార్లమెంటేరియన్లు:

ఎందరో త్యాగధనులు స్వాతంత్య్రానంతరం కేంద్ర శాసనసభలో సభ్యులుగాను, అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులుగాను, ప్రతిపక్ష నాయకులుగా ప్రఖ్యాతి గడించారు.

డా. లంకా సుందరం (1904-1967) అంతర్జాతీయ న్యాయశాస్త్ర కోవిదులు, తొలి పార్లమెంటుకు విశాఖపట్టణం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెసు అభ్యర్థిని ఓడించి ఇండిపెండెంట్‌గా 1,40,718 ఓట్లతో గెలిచారు. చదవడానికి బరోడా మహారాజా శాయాజీరావు ఆర్థిక సహకారం అందించగా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి 1929లో ఇంటర్నేషనల్ లా పట్టా పొందారు. గ్రంథ రచయిత. మచిలీపట్నంలో జన్మించారు.

మోటూరి సత్యనారాయణ (1902-1995) తాత్కాలిక పార్లమెంటులో 1950 -52 మధ్య సభ్యులు. 1954 నుండి 1966 వరకు రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అధికార భాషగా హిందీని చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు. ‘తెలుగు భాషా సమితి’ వ్యవస్థాపక కార్యదర్శి, దక్షిణ భారత హిందీ ప్రచార సభకు వెన్నెముక. పద్మభూషణ్ అలంకృతులు (1962).

అల్లాడి కృష్ణస్వామి (1883 – 1953) నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది. 1928-44 మధ్య ఉమ్మడి మదరాసు రాష్ట్ర అడ్వకేట్ జనరల్. రాజ్యాంగ నిపుణులుగా ఫెడరల్ కోర్టులోను, సుప్రీంకోర్టు లోను వాదించారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ముసాయిదా రాజ్యాంగ ప్రతిని తయారుచేసే సభలో ఉపన్యసించారు. 1952-53 మధ్య రాజ్యసభ సభ్యులు. బి.ఆర్. అంబేద్కర్‌చే ప్రశంసలు పొందారు.

హరీంద్రనాథ్ చటోపాధ్యాయ (1898-1990) బెంగాలీ కవి, నాటక రచయిత. వీరి తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కళాశాల (హైదరాబాదు) ప్రిన్సిపాల్. సరోజనీనాయుడు హరీంద్రనాథ్ సోదరి. 1952లో తొలి పార్లమెంటుకు కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. సినిమా నటులుగా హిందీ సినిమా ‘బావర్చీ’ (1972)లో నటించారు. రేడియో గాయకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత (1973).

మీర్ అక్బర్ అలీఖాన్ (1899 – 1994) హైదరాబాదుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు. రాజ్యసభ సభ్యులుగా 18 సంవత్సరాలు (1954-1972) వ్యవహరించారు. తన స్వంత భూమిని ఏడెకరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దానం చేశారు. 1972-74 మధ్య ఉత్తర్ ప్రదేశ్, 1974-76 మధ్య ఒడిస్సా గవర్నరు. హిందూ ముస్లిం సమైక్యతకు కృషి చేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత (1965).

శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1908-1981). ఆంధ్రమహిళాసభ వ్యవస్థాపకురాలు. యల్.యల్.బి. చదివి న్యాయవాదిగా గణతికెక్కారు. 1946-52 మధ్య రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు. 1951లో ప్రణాళికా సంఘ సభ్యులు. చింతామణీ దేశ్‌ముఖ్‌ని వివాహమాడారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ అధ్యక్షురాలుగా ఒక దశాబ్ది పనిచేశారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఢిల్లీ ఆంధ్రులకు స్ఫూర్తి ప్రధాత.

ఆచార్య ఎన్. జి. రంగా (1900-1995) రాజకీయాలలో భీష్ముడు. అసలు పేరు గోగినేని రంగనాయకులు. 1920లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్ర పట్టభద్రులు. రైతు బాంధవుడిగా మంచిపేరు. భారత కృషీకార్ లోక్‌పార్టీ స్థాపించారు. సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యులు (60 ఏళ్లు). భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు. 1952-1991 మధ్య లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు. 1959లో స్వతంత్ర పార్టీని రాజాజీతో కలిసి స్థాపించారు. 1991లో పద్మవిభూషణ్ పొందారు.

కుమారి పద్మజానాయుడు (1900-1975). సరోజనీనాయుడు కుమార్తె పద్మజ. 1950-52 మధ్య తాత్కాలిక పార్లమెంటు సభ్యురాలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నరు (1952-1967). పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.

నార్ల వెంకటేశ్వర రావు (1908-1985). ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులుగా ప్రసిద్ధి. స్వరాజ్య పత్రిక, ఆంధ్రప్రభలలో పనిచేశారు. రెండు దఫాలు 1958-1970 మధ్య రాజ్యసభ సభ్యులు. ‘నవయుగాల బాట నార్లబాట’ అనే మకుటంతో సామాజిక చురకలు అంటించారు. వీరి కుమార్తె శారద – గుంటూరు నగర మేయరు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

పుచ్చలపల్లి సుందరయ్య (1913-1985) నెల్లూరు జిల్లావాసి. ఆడంబరాలకు దూరంగా ఆశయాల బాటలో, ఉద్యమాలే ఊపిరిగా ఆదర్శ జీవితం గడిపారు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 1952లో రాజ్యసభకు ఎంపికయ్యారు. కమ్యూనిస్టు వర్గ నాయకుడిగా వ్యవహరించారు. పార్లమెంటుకు సైకిలుపై వెళ్లేవారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు (1955-67). సుందరయ్య వాదనా పటిమను ప్రధాని నెహ్రు ప్రశంసించేవారు.

నీలం రాజశేఖరరెడ్డి (1918-1992) అనంతపురం జిల్లావాసి. వీరి సోదరులు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. 30వ ఏట రాజశేఖరరెడ్డి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1971లో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర సంఘానికి కొచ్చిన్ సభలలో ఎంపికయ్యారు. 1992లో చైనాకు వెళ్లిన ప్రతినిధి వర్గానికి నాయకులు.

రాజ బహదూర్ గౌర్ (1920-1996) కార్మిక నాయకుడు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1952-62 మధ్య రాజ్యసభ సభ్యులు. 1957లో అఖిల భారత ట్రేడ్ యూనియన్‌కు అధ్యక్షలు.

మాకినేని బసవపున్నయ్య(1914-1992) కామ్రేడ్ యం.బి.గా ప్రసిద్ధులు. పుచ్చలపల్లి సుందరయ్య వలె నిరాడంబరుడు. గుంటూరు జిల్లావాసి. 1948-51 మధ్య కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు. 1952 నుండి 66 వరకు మూడు దఫాలు రాజ్యసభ సభ్యులు. నెహ్రు ప్రశంసలందుకొన్నారు. మార్క్సిస్టు పార్టీ అధినేత.

మోటూరి హనుమంతరావు (1917-2001). కామ్రేడ్ యం.హెచ్. పాత గుంటూరు జిల్లాకు చెందినవారు. రాజకీయ నాయకుడిగానే గాక జర్నలిజం లోను చేయి దిరిగిన వ్యక్తి. ప్రజాశక్తి దినపత్రికకు సుదీర్ఘకాలం సంపాదకులు. 11 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో వున్నారు. 1953-62 మధ్య విశాలాంధ్ర పత్రికా సంపాదకులు. 1952-55 మధ్య మదరాసు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులు. శాసనమండలి సభ్యులు. 1978-84 లో ఎన్నికయ్యారు. 1988-94 మధ్య రాజ్యసభ సభ్యులు. మార్క్సిస్ట్ సాహిత్యోద్యమం, ఆంధ్ర ప్రజలలో కమ్యూనిస్టులు గ్రంథ రచయిత. వారి సతీమణి మోటూరి ఉదయం పార్టీ కార్యకలాపాలలో పాల్గొనేవారు.

రావి నారాయణరెడ్డి (1908-1998). నల్గొండ జిల్లావాసి. కమ్యూనిస్టు పార్టీ నాయకులు. నిజాం రాష్ట్ర కాంగ్రెసు నేతలలో ముఖ్యులు. 1941-44 మధ్య ఆంధ్ర మహాసభ అధ్యక్షులు. తెలంగాణ సాయుధ పోరాట నాయకులు. తొలి లోక్‌సభకు 1952లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు.

సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ (1931-2008) ఎన్నికలలో ఓటమి నెరుగని నాయకుడు. మజ్లిస్ పార్టీ అధినేత. 1962-84 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు. 1984-2004 మధ్య ఆరుసార్లు లోక్‌సభ సభ్యులు. వీరి కుమారులు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాదు పార్లమెంటు సభ్యులు. రెండో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీ సభ్యులు.

తెన్నేటి విశ్వనాధం (1893-1979). విశాఖపట్టణవాసి. 1921లో మదరాసు హైకోర్టులో న్యాయవాది. టంగుటూరి ప్రకాశం వద్ద 1937 లోను 1946-47 మధ్య ముఖ్యమంత్రికి పార్లమెంటరీ కార్యదర్శి. 1953లో ప్రకాశం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినపుడు విశ్వనాధం ఆర్థికశాఖ మంత్రి. 1962లో విశాఖ పార్లమెంటు సభ్యులు.

చండ్ర రాజేశ్వరరావు (సి.ఆర్.) (1914-1944). ప్రతిపక్ష నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో జన్మించారు. పాలిట్‌బ్యూరో సభ్యులు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు సి.పి.ఐ. పార్టీ ప్రధాన కార్యదర్శి.

సీతారాం ఏచూరి (1952 – 2024) కమ్యూనిస్టు పార్టీ ప్రధాన వక్త. వామపక్ష నాయకులలో ప్రధానులు. సి.పి.ఐ (యం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో వ్యవహరించారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. ఎకనామిక్స్ చేశారు. విద్యార్థి నాయకుడు. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు. 1992లో 40వ ఏట పాలిట్‍బ్యూరో సభ్యులు. ఆయనను రాజకీయ చాణక్యుడిగా కూటమి ప్రభుత్వం గతంలో భావించింది. 2015లో పార్టీ ప్రధాన కార్యదర్శి. 2005-2017 మధ్య రాజ్యసభ సభ్యులు.

ఇలా ఆ తరం పార్లమెంటేరియన్లు ఎందరో! ఎందరో!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version