Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-60

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తులు:

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తెలుగువారు ప్రముఖంగా న్యాయపీఠం అలంకరించారు. న్యాయమూర్తులుగా హైకోర్టులో పనిచేసి సుప్రీం కోర్టుకు ఎంపికయ్యారు. న్యాయవాదులుగా ప్రతిష్ఠ గడించి హైకోర్టు న్యాయపీఠాన్ని అలంకరించి, ఆపైన మరో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లి చివరగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులవుతారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ళు కాగా సుప్రీం కోర్టుకు సీనియారిటీపై పదోన్నతి లభిస్తే 65 ఏళ్ళ దాకా వుండవచ్చు. మామూలుగా ప్రభుత్యోద్యోగులు ఈ నెల చివర తేదీ రిటైరవుతారు. న్యాయమూర్తులు పుట్టిన తేదికి ముందు రోజు రిటైరవుతారు.

జస్టిస్ బచ్చు జగన్నాథదాసు: (1893-1968)

అవిభక్త మదరాసు రాష్ట్రంలో బరంపురానికి చెందిన జస్టిస్ బచ్చు జగన్నాథదాసు స్వాతంత్రోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడ్డారు. యం.ఎ. బి.యల్. చదివి మదరాసు హైకోర్టులో న్యాయవాదిగా పుష్కలంగా సంపాదించారు. ఆ ధనం సాంఘిక కార్యక్రమాలకు, రాజకీయాలకు ఖర్చుపెట్టారు. మదరాసు కుట్ర కేసు (1934-35)లో ముద్దాయిల పక్షాన వాదించారు. 1938-43 మధ్య మద్రాసు నగర కార్పొరేషన్ సభ్యులు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 7 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1951లో వ్యవహరించారు. 1953 మార్చి – 1958 జులై మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తి; వీరికుమారులు పార్థసారథి సుప్రీం కోర్టు న్యాయవాదిగా లబ్ధప్రతిష్ఠులు.

జస్టిస్ పెన్మత్స సత్యనారాయణ రాజు (1908-1964):

ఉమ్మడి మదరాసు రాష్ట్రంలోను, ఆంధ్రరాష్ట్రంలోను ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అజ్జారం వాసి. 1954లో ఆంధ్ర హైకోర్టు జడ్జిగా ఎంపికయ్యారు. 1964లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 1965లో అక్టోబరు 20న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ పి.బి. గజేంద్ర గడ్కర్ నాయకత్వంలోని సోవియట్ భూమికి వెళ్లిన న్యాయమూర్తుల బృందంలో ఆయన సభ్యుడు. సుప్రీం కోర్టులో పనిచేస్తూనే కాలధర్మం (ఏప్రిల్ 20, 1966 న) చెందారు.

జస్టిస్ పింగళి జగన్మోహనరెడ్డి (23 జనవరి 1910 – 9 మార్చ్ 1999):

పాత హైదరాబాదు రాష్ట్రంలోని ధనికస్వామ్య కుటుంబంలో వడ్డేపల్లిలో జన్మించారు. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో యల్.యల్.బి. చేశారు. లండన్‌లో బారిస్టరుగా నమోదై 1937లో స్వదేశానికి వచ్చారు. బొంబాయి, మదరాసు, హైదరాబాదు హైకోర్టులలో ప్రాక్టీసు చేసి ఖ్యాతి గడించారు. నిజాం – మీర్ ఉస్మాన్ అలీఖాన్ చే 1945లో హైదరాబాద్ హైకోర్టు అదనపు జడ్డి. 1952 లో శాశ్వత జడ్జి. విశాలాంధ్ర ఏర్పడిన 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1966-69 మధ్య అదే కోర్టు ప్రధాన న్యాయమూర్తి. 1969-75 మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తి. కేశవానంద భారతి కేసులో (1973) తీర్పు చెప్పిన 13 మంది జడ్జిలలో రెడ్డి ఒకరు. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా విద్యారంగానికి ఊతయ్యారు. క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చారు.

జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి (25 సెప్టెంబర్ 1922 – 14 సెప్టెంబర్ 2013):

అనంతపురం జిల్లా గుత్తిలో జన్మించిన రెడ్డి మదరాసు లా కాలేజీ నుండి పట్టా పుచ్చుకుని 1944లో మదరాసు హైకోర్టులొ ప్రాక్టీసు మొదలెట్టారు. 1967లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. ఎమర్జెన్సీ వేళ పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ కావడం వెనుక ఆయన నిర్భీతి తీర్పులు కారణంగా భావిస్తారు. 1978 నుండి 1987 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. ఆయన వెలువరించిన అనేక తీర్పులు చారిత్రాత్మకం. ‘Right to Livelihood’ అనే అంశాన్ని ఆర్టికల్ 21లో చేర్చే తీర్పునిచ్చారు. కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ (1980). సాహిత్యాభిలాష మెండు.

జస్టిస్ బి. పి. జీవన్ రెడ్డి (1932 మార్చి 14)

నిజామాబాదుకు చెందిన రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1954లో లా పట్టా పొందారు. రెడ్డి త్రయంగా ఈ ముగ్గురినీ న్యాయకోవిదులు ప్రశంసిస్తారు. 1975 నుం2 దశాబ్దిన్నర కాలం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. 1990లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అక్టోబర్ 1991- మార్చ్ 1997 మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తి. 1992లో మండల్ కేసు మెజారిటీ తీర్పు ప్రధానం. పౌరుల వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించే ప్రసార చట్టం (1995) ముఖ్యం.

భారత రాజ్యాంగ సమీక్షా సంఘంలో సభ్యులు. 15వ లా కమిషన్ ఛైర్మన్ (1997-2000). 2004లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ చట్టం సమీక్షా సంఘానికి జీవన్ రెడ్డి (2004) చైర్మన్.

జస్టిస్ కె. జయచంద్రారెడ్డి (15 జూలై 1929–9 ఫిబ్రవరి 2020):

కడప జిల్లా రాయచోటికి చెందినవారు. క్రిమినల్, రాజ్యాంగ చట్టాల నిపుణులు. 1966-75 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. 1975 మార్చిలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో అదనపు జడ్జి, 1976 జూన్‍లో శాశ్వత జడ్జి అయి 1990 జనవరిలో సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 1994 జూలై 14న రిటైరయ్యారు. 1995-97 మధ్య లా కమీషన్ చైర్మన్. 1999లో అంతర్జాతీయ నిపుణుల బృందంలో సభ్యులుగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా నియనించారు. 2001-2005 మధ్య ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. 2003 జనవరిలో అనంతలక్ష్మీకాంత సాహితీ సంస్థ పక్షాన మా నాన్నగారి స్మారక అవార్డును వారి చేతుల మీదుగా ‘వైశ్యప్రబోధిని’ సంపాదకులు పి. లక్ష్మీకాంతశెట్టికి అందజేశాను.

జస్టిస్ కె. రామస్వామి (13 జూలై 1932- 6 మార్చి 2019):

పశ్చిమ గోదావరి జిల్లా దళిత కుటుంబంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి లా పట్టా పుచ్చుకున్నారు. 1982లో నవంబరులో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. 1989 అక్టోబరు నుండి 1997 జూలై వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. రిటైరయిన తర్వాత నేషనల్ లీగల్ రైట్స్ అథారిటీ, నేషనల్ హ్యుమన్ రైట్స్ కమీషన్ సభ్యులు. 1997లో గిరిజనుల భూమి హక్కులపై తీర్పునిచ్చారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు.

జస్టిస్ యం. జగన్నాథ రావు (2 డిసెంబర్ 1935 – 25 నవంబర్ 2024):

ఒకే కుటుంబం నుండి మూడు తరాల వ్యక్తులు హైకోర్టు న్యాయమూర్తులు కావటం చరిత్రాత్మకం. యం. యస్. రామచంద్ర రావు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి. ఆయన కుమారుడు జగన్నాథరావు. ఆయన కుమారుడు రామచంద్రరావు ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (22 జూలై 2025 నుండి). అంతకు ముందు ఝార్ఖండ్ హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి.

జగన్నాథరావు 1960-82 మధ్య హైదరాబాదు హైకోర్టు న్యాయవాదిగా సివిల్ చట్టాల నిపుణులుగా ప్రసిద్ధి. 1982 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. సౌజన్యమూర్తిగా పేరు.

1991లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

1994లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

1997-2000 మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తి.

2001- 2006 మధ్య 16,17 లా కమీషన్‍ల ఛైర్మన్.

ఆయన కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ పునర్నిర్మాణానికి మూలకారకులు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు స్థాపించాలని తీర్పునిచ్చారు.

జస్టిస్ యస్. యం. ఖాద్రి (5 ఏప్రిల్ 1938):

బ్రిటన్‌లో చదివి 1963లో 25వ ఏట న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. 1981-86 మధ్య ప్రభుత్వ ప్లీడరు. 1987 జులైలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. కొద్ది నెలలు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. 1997 డిసెంబర్ 4న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎదిగి 2003 ఏప్రిల్ 4 వరకు బాధ్యతలు నిర్వహించారు. భారత ప్రభుత్వం అథారిటీ ఫర్ అడ్వాన్స్‌డ్ రూలింగ్స్ (ఇన్‍కమ్‍టాక్స్) ఛైర్మన్‍గా నియమించింది. చారిత్రాత్మక సుప్రీం కోర్టు తీర్పులతో ఆయన భాగస్యామి.

జస్టిస్ పొణకా వెంకట్రామి రెడ్డి (10 ఆగస్టు 1940):

క్రిమినల్ చట్టాల విషయంలో కీలక తీర్పులనిచ్చారు. నెల్లూరుకు చెందిన రెడ్డి 1962లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో అడ్వకేటుగా చేరి, కంపెనీ లా, సర్వీసులు, పన్నుల విషయంలో నిపుణత సాధించారు. 1990 మార్చిలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. అదే సమయంలో జుడీషియల్ అకాడమీ చైర్మన్. అక్టోబరు 2000లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 2001 ఆగస్టు నుంచి 2005 ఆగస్టు వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. 19వ లా కమీషన్ చైర్మన్. జాతీయ జుడిషియల్ కమీషన్ చైర్మన్.

జస్టిస్ బి. సుదర్శనరెడ్డి (8 జూలై 1946)

రంగారెడ్డి జిల్లా – హైదరాబాదుకు చెందిన సుదర్శనరెడ్డి 1971లో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ల అసోసియేషన్ ప్రెసిడెంటు. 1995 నుండి ఒక దశాబ్ది కాలం అదే కోర్టు న్యాయమూర్తి. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 2007 జనవరి నుండి 2011 జూలై వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. 2013లో గోవా లోకాయుక్త ఛైర్మన్. 2025లో ఉప రాష్ట్రపతి ఎన్నికలలో INDIA బ్లాకు అభ్యర్థిగా నిలచారు. రాధాకృష్ణన్ గెలుపొందారు. మరి కొందరు న్యాయమూర్తుల వివరాలు మరో సంచికలో.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version