[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
సుప్రీంకోర్టు న్యాయాధీశులు-2:
జస్టిస్ జాస్తి చలమేశ్వర్ (1953 జూన్ 23):
కృష్ణాజిల్లా మొవ్వ గ్రామానికి చెందినవారు. మొవ్వ అనగానే పదకర్త క్షేత్రయ్య స్ఫురిస్తాడు. 1976లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి లా పట్టభద్రులు. ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ (1995). ఆంద్ర హైకోర్టు అదనపు జడ్జి (1997). శాశ్వత జడ్జి 1999. తదనంతరం 2007లో గౌహతి, 2010లో కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి. 2011 అక్టోబరు నుండి 2018 జూన్ 22 వరకు సుప్రీం కోర్టు న్యాయాధీశులు. వ్యక్తిగత భద్రత హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కు అనే తీర్పు ప్రసిద్ధం. 2018 జనవరి 12న ఇతర జడ్జిలతో కలసి తొలిసారిగా పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అది చరిత్రాత్మకం. Master of the Roster – సుప్రీం కోర్టు వ్యవహార శైలిపై సున్నితమైన విమర్శ జరిగింది.
జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (1957 ఆగస్టు 27):
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన తెలుగువారిలో రెండవవారు. కోకా సుబ్బారావు తొలి వ్యక్తి. 1983లో అడ్వకేట్‌గా నమోదు కావడానికి ముందు కొద్ది కాలం ఈనాడు దినపత్రికలో పని చేశారు. వీరు కూడా కృష్ణా జిల్లా పొన్నవరంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2000లో నియమితులయ్యారు. 2013లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇంతకు ముందు ఈ స్థానాన్ని జస్టిస్ యం.జగన్నాధరావు అధిష్టించారు. 2014 ఫిబ్రవరి నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి. 2021 ఏప్రిల్ 24 నుండి 2022 ఆగస్టు 26 వరకు 16 నెలలు ప్రధాన న్యాయమూర్తి. ఆయన పదవీ కాలంలో విభిన్న రాష్ట్ర హైకోర్టులకు న్యాయమూర్తుల నియమాకం, సుప్రీం కోర్టుకు 9 మంది న్యాయమూర్తులు ఒకేసారి నియమితులయ్యారు. ప్రభుత్వ విధానాలకు చురకలు అంటించారు. సుప్రీం కోర్టు పారదర్శకతను కోవిడ్ సమయంలో జర్నలిస్టులకు ఒక యాప్ ద్వారా కలిగించారు. తెలుగు భాష పట్ల ఎనలేని అభిమానం. ఆయన భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తి.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. జయచంద్రారెడ్డిగారితో
జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి (1957 జనవరి):
కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన తొలి జడ్జి. మొదక్ జిల్లా కామారం గ్రామం వీరిది. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా పట్టభద్రులు. 1980లో జస్టిస్ బి. సుభాషిణి రెడ్డి వద్ద జూనియర్‌గా ప్రాక్టీసు మొదలెట్టారు. 2001-2002 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ల సంఘానికి ప్రెసిడెంటు. 2002 డిసెంబరులో అదనపు జడ్జి, 2004 జూన్ నుండి శాశ్వత జడ్జ్. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 2018 నవంబరు నుండి 2022 జనవరి 4 వరకు సుప్రీం కోర్టు న్యాయాధీశులు. వివాహ సంబంధ కేసులలో maintenance సంబంధిత అదేశాలిచ్చారు. వికలాంగులైన ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో సామాజిక ఐక్యత సాధించే తీర్పు వెలువరించారు.
జస్టిస్ లావు నాగేశ్వరరావు (1957 జూన్ 8):
సుప్రీం కోర్టు న్యాయవాదుల నుండి నేరుగా న్యాయముర్తిగా ఎంపికైన వారిలో నాగేశ్వరరావు ఏడవవారు. గతంలో హైకోర్టులో పని చేయలేదు. గుంటూరు జిల్లా పెదనందిపాడు వాస్తవ్యులు. జిల్లా న్యాయవాది స్థాయి నుండి అత్యున్నత న్యాయస్థానాధీశులుగా ఎదగడం ఒక చరిత్ర. 1995లో తొలిసారిగా ఢిల్లీలో సుప్రీం కోర్టులో వాదించారు. 2000లో సీనియర్ అడ్వకేట్ NDA ప్రభుత్వంలో 2003-04 మధ్య, UPA ప్రభుత్వంలో 2013-14 మధ్య అదనపు సొలిసిటర్ జనరల్. 2014లో ముద్గల్ కమిటీ సభ్యులు. 2016-22 మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తి. మరాఠ తెగవారికి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కొట్టివేసిన ఐదుగురు సభ్యుల బెంచిలో నాగేశ్వరరావు ఒకరు. 2022లో ఇండియన్ ఒలంపిక్ సంఘ చట్టాల సవరణకు నియమించిన కమిటీ అధిపతి. భారత ఫోర్జ్ కంపెనీ కుటుంబ తగాదా పరిష్కార బాధ్యతలు సుప్రీం కోర్టు వీరికి 2026 లో అప్పగించింది.
జస్టిస్ యస్.వి. భట్ (1962 మే 6):
మదనపల్లి వాస్తవ్యులు. బెంగుళూరు నుండి లా పట్టభద్రులు. 1987లో బార్ కౌన్సిల్ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ (2000-03). 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి. 2019 మార్చి కేరళ హైకోర్టు న్యాయమూర్తి. 2023లో ప్రధాన న్యాయమూర్తి. 2023 జులై 14 నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి. 2027 మే 5 వరకు కొనసాగుతారు. వారసత్వ భవనాల పరిరక్షణ తీర్పు ప్రధానం.
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూరి శ్రీ ఎన్. వి. రమణ గారితో
జస్టిస్ పి. యస్. నరసింహ (1963 మే 3):
హైదరాబాదులో జన్మించిన నరసింహ విషయంలో అనేక ప్రత్యేకతలున్నాయి. వీరి తండ్రి జస్టిస్ పమిడిఘంటం కోదండరామయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. ఆధ్యాత్మిక సంపన్నులు. భద్రాచలంలో దశాబ్దాలుగా అంబా సత్రం నిర్వహించే ధార్మికులు. ఆర్ష విజ్ఞాన పరిషత్ స్థాపించి వాల్మీకి రామాయణానికి ఆచార్ల పుల్లెల శ్రీరామచంద్రుని వ్యాఖ్యానం ప్రచురించారు. ఆచార్య శలాక రఘునాధశర్మ వ్యాఖ్యానంతో మహా బారతం విఫులంగా ముద్రించారు. నరసింహ హైదరాబాదు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. అనంతరం ఢిల్లీలో స్థిరపడి రాజ్యాంగ సంబంధ కేసులు వాదించారు. 2008లో సీనియర్ అడ్వకేట్. 2014 నండి 2018 వరకు అదనపు సొలిసిటర్ జనరల్. 2021 ఆగస్టు 31న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బార్ నుండి ఎంపికయ్యారు. బార్ నుండి నేరుగా ఎంపికైన వారిలో తొమ్మిదవ వ్యక్తి. అలాంటి వ్యక్తులు ప్రధాన న్యాయమూర్తులుగా ఇప్పటి వరకు ఇద్దరే వున్నారు. జస్టిస్ యస్.యం.సిక్రీ, యు.యు.లలిత్. మూడవ వారుగా నరసింహ 2027 అక్టోబరులో ఆ పదవిని అలంకరిస్తారు. అదేగాక తెలుగువారిలో ఆ పదవిని అలంకరించబోయే మూడో వ్యక్తి. గతంలో జస్టిస్ కోకా సుబ్బరావు (1958-61), జస్టిస్ యస్.వి.రమణ (2021-2022) ఇద్దరే వున్నారు.
2026లో జస్టిస్ జె. కె. మహేశ్వరి రిటైరు కాగా నరసింహ సుప్రీం కోర్టు కొలోజియం లోని ఐదవ సభ్యులయ్యారు. నరసింహ వెలువరించిన తీర్పులలో ప్రధానమైనవి.
పుట్‍పాత్‌లపై నడవడాన్ని ఆర్టికల్ 21 ప్రకారం Right To Walk అనే ప్రాథమిక హక్కుగా తీర్పు.
అయోధ్య రామాలయ జన్మభూమి వివాద విషయంలో మధ్యవర్తిత్వం శాస్త్ర ప్రమాణాలతో, ఇతర వాదనలను అధిక్షేపించకుండా సూక్ష్మ విషయాలను రాజ్యంగ ధర్మసనానికి అందించి సహకరించారు.
బార్ కౌన్సిల్ క్రమశిక్షణా యంత్రాంగాన్ని క్రమబద్ధం చేశారు.
2027 అక్టోబరులో ప్రధాన న్యాయమూర్తి కాబోయే జస్టిస్ నరసింహకు శుభాభినందనలు.
ఇతర సంస్థలు/ప్రముఖులు:
జస్టిస్ జాస్తి ఈశ్వరప్రసాద్ (1934 ఆగస్టు – 2021 జులై 6):
మదరాసులో జన్మించారు. 1959 నుండి 1990 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. వీరి తల్లి సీతామహాలక్ష్మి హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. 1990 మార్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. 1996 ఆగస్టులో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి Appellate Tribunal for Forfeited Property సంస్థ (ఆర్ధిక మంత్రిత్వ శాఖ చైర్మన్ గా గురుతర బాధ్యత వహించారు.)
శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి గార్లతో
జస్టిస్ యం.డి. సర్దార్ అలీఖాన్:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రిటైరై జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా 1993-96 మధ్య వ్యవహరించారు.
రిజిష్ట్రార్లు:
సుప్రీం కోర్టు తొలి రిజిష్ట్రార్ తెలుగువారైన పి.యన్.మూర్తి 1950 జనవరి 26న బాధ్యతలు స్వీకరించి 1956 జనవరి 4 వరకు వ్యవహరించారు. 55 ఏళ్ల వయసులో అస్వస్థతతో మరణించారు. వీరి కుమార్తె శ్యామలా పప్పు సుప్రీం కోర్టు న్యాయమూర్తి.
ఆ తర్వాత ఒరిస్సాకు చెందిన తెలుగువారు ఆర్. సుబ్బారావు సుప్రీంకోర్టు రిజిష్ట్రారుగా 1979 నుండి 1986 వరకు వ్యవహరించారు. పదవీ వరమణ తర్వాత జాతీయ వినియోగదారుల కమీషన్ తొలి రిజిష్ట్రారు.
సుప్రీం కోర్టు తీర్పులను హిందూ ఆంగ్ల దిన పత్రికలో ప్రముఖంగా ప్రచురించిన లీగల్ కరస్పాండెంట్ తలుపూరు పద్మనాభరావు గూడూరు (నెల్లూరు జిల్లా) వాసి.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావు గారితో
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ యం.ఆర్. అన్సారీ నెల్లూరివారు. జమ్ము కాశ్మీరు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదే రీతిలో జస్టిస్ టి. వి. ఆర్. తాతాచారి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి. 1974-77 మధ్య ప్రధాన న్యాయమూర్తి.
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులలో అగ్రగణ్యులు పవని పరమేశ్వరరావు (పి.పి.రావు).
ఇలా సర్వోన్నత న్యాయస్థానాన్ని అలంకరించిన తెలుగువారిని స్మరించుకోవడం అదృష్టం.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
