[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
ఆ తరం కేంద్ర కార్యదర్శులు:
కేంద్ర ప్రభుత్వం రైలు పట్టాలపై వేగంగా పరుగులు తీస్తోందంటే దానికి వెనుక వున్న కేంద్ర కార్యదర్శులేనని గుర్తుంచుకోవాలి. స్వాతంత్ర్యానికి పూర్వం I.C.S. అధికారులు, ఆ తర్వాత IAS అధికారులు ప్రభుత్వ చక్రాన్ని సమర్థవంతంగా త్రిప్పారు. 24 సంవత్సరాల వయస్సులో IAS లో చేరిన వ్యక్తి దాదాపు 32 ఏళ్లు కష్టించి పనిచేసి పై అధికారుల చేత మెప్పు పొందగలిగితే చివరి రెండేళ్లు కేంద్ర కార్యదర్శిగా పదవి లభించే అవకాశం ఒకరిద్దరికి వస్తుంది. అలా ఆ పదవీ బాధ్యతలలో సెహభాష్ అనిపించుకొన్న ఆంధ్రా క్యాడరు అధికారులను స్మరిస్తాను. వారిలో పలువురితో ఉద్యోగ రీత్యా ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాల ద్వారా, అధికారిక మీటింగుల ద్వారా నాకు పరిచయం.
ఐ.సి.యస్. అధికారులు:
శొంఠి రామమూర్తి (1888 ఆగస్టు – 1964 జనవరి):
విశాఖపట్టణవాసి. 1911లో ICS. 1946లో బొంబాయి రాష్ట్రతాత్కాలిక గవర్నరు. 1947లో ఉదయపూర్ సంస్థాన దివాను. 1939లో అవిభక్త మదరాసు రాష్ట్ర విధాన కార్యదర్శి అయిన తొలి భారతీయుడు. 1952-60 మధ్య ప్రణాళికా సంఘ సభ్యులు. రామపాద సాగర్ వ్యూహకర్త. అదే ఇప్పటి పోలవరం ప్రాజెక్టు. బ్రిటీష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో సత్కరించింది.
ఓ. పుల్లారెడ్డి (1902-1989):
చిత్తూరు జిల్లా వారు. 1925లో ICS సాధించారు. లండన్‌లో ప్రొబేషన్ పూర్తి చేసుకున్నారు. 1930లో ఒరిస్సాలోని జయపూర్ సంస్థాన దివాను. 1948లో మదరాసు రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అయిన తొలి భారతీయుడు. 1953లో కర్నూలులో ఆంధ్ర రాష్ట్రానికి తొలి చీఫ్ సెక్రటరీ. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి. 1957-63 మధ్య కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి. 1964-72 మధ్య ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్. ఆయన తన అనుభవాలను ‘Autumn Leaves’ అనే గ్రంథంలో వివరించారు. హైదరాబాదులో వారి యింటి వద్ద రేడియోకు 1985లో ఇంటర్వ్యూ చేశాను.
నాటకంలో భువనవిజయంలో విదేశీ రాయబారిగా రచయిత, APVN శర్మ దంపతులు
బుర్రా వెంకటప్పయ్య (1907-1998):
కాకినాడకు చెందినవారు. 1932లో ICS. 1946లో బొంబాయి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరు. 1955లో ప్రణాళికా సంఘ సభ్యులు. జాతీయ గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థకు అధిపతిగా ఉండగా 1974లో నేను వారిని కలిసి అర్జీ సమర్పించి మా చెన్నూరు గ్రామానికి ఎలక్ట్రిసిటీ తెప్పించగలిగాను. ఢిల్లీ ఆంద్రా ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు.
యం. రామకృష్ణయ్య, ఐఎఎస్ (1947 ఒరిస్సా క్యాడర్) (1920 – జూలై 2013):
నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్యులు. స్వాతంత్య్రానంతరం కొత్తగా ఏర్పడిన IAS తొట్ట తొలి బ్యాచ్ ఒరిస్సా క్యాడర్ అధికారి. ఒరిస్సా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 1972-74 మధ్య పని చేశారు. ముఖ్యమంత్రి నందినీ శతపథితో విధానపరంగా విభేదించి కేంద్రానికి వెళ్ళారు. నౌకాయాన, రవాణా శాఖల కార్యదర్శి (1975). 1978లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నరు. తొట్ట తొలిసారిగా NABARD – జాతీయ గ్రామాభివృద్ధి బ్యాంక్ అధిపతిగా నియుక్తులై 1983 వరకు గ్రామాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేశారు. హైదరాబాదులో ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ కార్యకలాపాలకు మార్గదర్శి. 1981లో ఢిల్లీలో అంద్ర ప్రదేశ్ భవన ప్రాంగణంలో ప్రకాశం విగ్రహ స్థాపనకు కృషి చేశారు. ఆ స్థాపనకు ఢిల్లీలో పనిచేసిన ఎన్నికల కమిషనర్ జి.వి.జి, కష్ణమూర్తి బృందంలో నేనూ ఒకడిని.
శ్రీ జి.ఎం.సి. బాలయోగి, శ్రీ మోహన్ కందా గార్లతో రచయిత
అబిద్ హుసేన్ (1926 – జూన్ 2012)
ఆంధ్రా క్యాడరు 1950 సంవత్సరం IAS అధికారి. విశాఖపట్టణం జిల్లా కలెక్టరుగా ప్రజల అభిమానం చూరగొన్నారు. భారతదేశ ఆర్థిక సంస్కరణలు, 1991లో ముఖ్య పాత్ర వహించారు. 1985-90 మధ్య ప్రణాళికా సంఘ సభ్యులు. అమెరికాలో భారత రాయబారిగా 1990-92 మద్య దౌత్యవేత్తగా మంచి పేరు. ప్రసారభారతి తొలి బోర్డు సభ్యులు (1997-2001). ఆ సమయంలో నేను ఢిల్లీ ఆకాశవాణి డైరక్టరుగా పలు సమావేశాలలో వారితో కలిసి పాల్గొన్నాను. రాజ్యాంగ సమీక్షా సంఘ సభ్యులు.
టి. యన్. రాఘవేంద్రరావు (1936- 2025 ఏప్రిల్):
ఆంధ్ర క్యాడరు అధికారి (1961). పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శిగా చిరస్మరణీయులు (1992-94). సహజవాయువుల వెలికితీతల నిపుణులు. ముంభై హై నార్త్‌లో భయంకర అగ్నిప్రమాదం జరిగిన కారణాలు కనుగొనే కమిటీ సారథి. ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ శాఖల పనితీరును మెరుగు పరచారు.
సి.యస్. శాస్త్రి (1951-2003):
చావలి శ్రీనివాస శాస్త్రి 1956 బ్యాచ్ అధికారి. కృష్ణాజిల్లా కలెక్టరుగా ప్రసిద్ధులు. 1983లో రాష్ట్ర ఆహార వ్యవసాయశాఖ కార్యదర్శి. కేంద్ర ఆశ వ్యవసాయశాఖ కార్యదర్శి (1986-88). అంతర్జాతీయ స్థాయిలో భారత వ్యవసాయ రంగాన్ని నిలిపారు. వీరి సతీమణి మణిశాస్త్రి ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్‌లో రీడర్. వారి కుమార్తె షర్మిల నార్తన్ రైల్వేలో ఉన్నతాధికారిగా (IRAS) రిటైరయ్యారు.
బి.కె. రావు (భమిడిపాటి కుక్కుటేశ్వర రావు) (1931- 15 డిసెంబరు 2024):
కుక్కుటేశ్వర రావు 1954 సంవత్సర ఆంధ్ర క్యాడరు I.A.S. చిత్తూరు జిల్లా కలెక్టరుగా ప్రజాభిమానం చూరగొన్నారు. ఆకాశవాణి డైరక్టరు జనరల్ కార్యాలయంలో డి.డి.జి అడ్మినిస్ట్రేషన్‌గా (1985-86) రెండేళ్లున్నారు. విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ (1978-82). షిప్పింగ్ శాఖ డైరక్టర్ జనరల్ (1982-85). కేంద్ర గనుల శాఖ కార్యదర్శి (1986-89 జూన్). లాతూరు భూకంపం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేసింది. వ్యాసభారతంపై ఆయన అథారిటీ. పరిపాలనా రీతులు అందులో వర్ణించిన తీరు నాతో తరచు ముచ్చటించేవారు.
శ్రీ కె.ఎస్. శర్మ ఐఎస్, ప్రసారభారతి అధిపతితో రచయిత
కె.సి. మాదప్ప (1921)
కర్ణాటక లోని కూర్గ్ (కొడగు) ప్రాంతవాసి. తొలి బ్యాచ్ IAS 1947. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణం తర్వాత 1958లో మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు తరలి వచ్చారు. 1966-69 విద్య కేంద్రంలో షిప్పింగ్ శాఖ డైరక్టర్ జనరల్. ఈజిప్టులో ఐక్యరాజ్యసమితి పక్షాన డిప్యుటేషవ్ వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్‌లో అదనపు చీఫ్ సెక్రటరీ. 1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగానే రాష్ట్రపతి కార్యదర్శిగా 1980 వరకు క్రియాశీలకంగా పనిచేశారు. మిలిటరీ సర్వీసు కోటాలో IAS సాధించారు.
జి. వి. రామకృష్ణ (1930 – మార్చ్, 2021):
1952 బ్యాచ్ IAS అధికారి. ఆధునిక భారత క్యాపిటల్ మార్కెట్ పితామహుడు. యన్.టి. రామారావు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ప్రధాన కార్యదర్శి (1983). SEBI వ్యవస్థాపక చైర్మన్ (1990-94). డిజిన్వెస్ట్‌మెంట్ కమీషన్ చైర్మన్ (1996-99). పెట్రోలియం శాఖ కార్యదర్శి (1985-88). 1989లో యూరప్ ఎకనామిక్ కమ్యూనిటీ రాబియబారి. 1988-89 మధ్య తమిళనాడు గవర్నర్‌కు సలహాదారు. 1981-83 ప్రణాళికా సంఘం సభ్యుడు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధానులకు నమ్మకస్థుడైన, సమర్థవంతమైన అధికారిగా పేరు.
యస్.వి. గిరి (1937):
1960 సంవత్సర IAS అధికారి. కడప కలెక్టర్ (1970). అప్పుడే భగవాన్ సత్యసాయి ప్రభావానికి లోనయ్యారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, కేంద్ర విజిలెన్స్ కమీషనర్ వంటి పదవులు నిర్వహించారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల వైస్-ఛాన్సలర్ బాధ్యతలు స్వీకరించారు. అది మొదలు సత్యసాయి సేవా సంస్థల కేంద్ర కమిటీ సభ్యులు. ఆధ్యాత్మక భావ సంపదతతో బాబా దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు.
పాత తరం అతిరథ మహారథులు:
ఐ.జె. నాయుడు (1921-1947):
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదరి (1978). రెవిన్యూ బోర్డు సభ్యులు. కేంద్రంలో వ్యవసాయ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి శాఖల అదనపు కార్యదర్శి. 1976లో ప్రపంచ ఆహార సదస్సుకు భారత ప్రతినిధి. తమిళనాడు గవర్నరుకు సలహాదారు.
డా. ఆర్.కె. వేపా (1923-2004)
వేపా రామకృష్ణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ డాక్టరేట్ పొందారు. 1950-57 మధ్య ఆకాశవాణిలో ఇంజనీరు. 1958లో IAS. కాకినాడ కలెక్టరుగా ప్రసిద్ధులు, 1968-69 మధ్య ఆంధ్ర ప్రదేశ్ భవన్ స్పెషల్ కమీషనర్. APIDC కి మేనేజింగు డైరక్టరు. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ. అంతర్జాతీయ ప్రతినిధి బృందాల సభ్యుడు. బహు గ్రంథ రచయిత.
యం.టి. రాజు (1911-)
లండన్ విశ్వవిద్యాలయ బారిష్టరు పట్టా పొందారు. పాత తరం ICS అధికారి. ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. 1967లో ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రాంతీయ అసమానతల నిర్ధారణ కమిటీ వీరి ఆధ్వర్యంలో ఏర్పడింది. 1971-77 మధ్య నరసాపురం నియోజక వర్గ లోక్‌సభ సభ్యులు. IAS అధికారులుగా వుండి పార్లమెంటుకు ఎన్నికైన వారిలో కె.యస్.ఆర్ మూర్తి (అమలాపురం); జె.డి. శీలం (బాపట్ల), కేంద్ర సహాయ మంత్రి. IPS అధికారి పి.వి. రంగయ్య నాయుడు (ఖమ్మం) కేంద్రంలో సహాయమంత్రి.
శ్రీ ఎస్. కె. జోషీ గారితో రచయిత
రావు సాహెబ్ సి. ఆర్. కృష్ణస్వామి రావు (1927-2013):
1950 బ్యాచ్ IAS అధికారి. అత్యున్నత కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ పదవిని అధిష్టించిన తొలి ఆంధ్ర క్యాడరు వ్యక్తి. చాలా కాలానికి టి. ఆర్. ప్రసాద్ ఆ స్థానం పొందగలిగారు. కృష్ణస్వామి 1981-85 మధ్య ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల కాలంలో, తర్వాత కాలంలో క్యాబినెట్ సెక్రటరీ. 2006లో పద్మవిభూషణ్. వారి తాత రామచంద్రరావు నెల్లూరు జిల్లా కలెక్టరు. వీరి తాతగారికి బ్రిటీష్ ప్రభుత్వం ‘రావ్ సాహెబ్’ బిరుదు ప్రధానం చేసింది.
ఇతరులు:
యస్. కె. రావు అనబడే సత్యవోలు కామేశ్వర రావు (1922) కేంద్రంలో ప్రణాళికా సంఘం కార్యదర్శి, జౌళి శాఖ కార్యదర్శి. మరో వి.కె. రావు (వల్లూరి కామేశ్వర రావు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. సి. నరసింహం (1905-1998) భారత ఆహార సంస్థ తొలి అధిపతి. యం. నరసింహం (1927) రిజర్వు బ్యాంకు గవర్నరు.
ఇలా మరికొందరి విశేషాలు మరు ‘సంచిక’లో..
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
