[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
ప్రతిభాసంపన్నులు IAS అధికారులు:
ఉద్యోగాన్ని కేవలం విధి నిర్వహణగానే కాక సమాజసేవా దృక్పథంతో నిర్వహించిన కొందరు అధికారులను ప్రజలు చిరకాలం గుర్తు వుంచుకొంటారు. అట్టివారిలో యస్. ఆర్. శంకరన్ (1934-2010) అగ్రగణ్యులు. 1981లో PWG వారు ఆయనను, మరో ఆరుగురిని బందీలుగా తీసుకెళ్లారు. నిరాడంబరుడు. స్వంత ఆస్తి లేదు. 1956 బ్యాచ్ అధికారి. 1970 దశకంలో కేంద్రమంత్రి కుమార మంగళం వద్ద స్పెషల్ అసిస్టెంట్. 1990-92 కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి. త్రిపుర రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా మంచి పేరు.
1959 బ్యాచ్ అధికారి ఆర్. రాజామణి (1936) కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిగా ప్రసిద్ధులు. అన్నిటిని మించి ముగ్గురు ప్రధానుల కార్యాలయాలలో (మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ) సహాయ కార్యదర్శి. ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియట్ లలో ప్రధానపాత్ర పోషించారు.
1961 బ్యాచ్‌కు చెందిన మిత్రత్రయం – కె. పద్మనాభయ్య (1938), కె. జయభారత రెడ్డి (1937), డా. యస్. చక్రవర్తి (1938) కేంద్రంలో ఉన్నత పదవులు అలంకరించారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన పద్మనాభయ్య కేంద్రంలో పౌర విమానయాన శాఖ, హోం శాఖల కార్యదర్శి (1994-97). పదవీవిరమణ తర్వాత దశాబ్దికాలం 1999-2009 నాగాల్యాండ్ శాంతిదూత. హైదరాబాదులోని ASCI చైర్మన్.
ప్రముఖ స్వాతంత్రయోధులు, ప్రకాశం మంత్రివర్గంలో మంత్ర అయిన కడప కోటిరెడ్డి కుమారులు జయభారతరెడ్డి. తల్లి రామసుబ్బమ్మ తొలి మహిళా జిల్లా బోర్డు అధ్యక్షురాలు. కేంద్రంలో పదవులు అలంకరించి 1992 చివర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు.
యస్. చక్రవర్తి ఐఐటి నుండి పిహెడ్.డి పొందారు. ఢిల్లీలోని MRTP కమిషన్ సభ్యులు (1984). సంగీతప్రియులు.
అనంత లక్ష్మీకాంత సాహితీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న శ్రీ కె. వి. రమణాచారి, ఇఓ టిటిడి
1962 బ్యాచ్ మిత్రత్రయం – కె. ఆర్. వేణుగోపాల్, పి. అబ్రహం, బి.యస్. యుగంధర్‌లు. వేణుగోపాల్ (1937–) ప్రధానమంత్రి (పి.వి. నరసింహారావు) కార్యాలయంలో 1990-95 మధ్య కీలక పాత్ర పోషించారు. 1983లో యన్.టి. రామారావు మంత్రిగా వుండగా రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి వేణుగోపాల్.
సత్య నాదెండ్ల తండ్రి బి.యన్. యుగంధర్ (1937-2019). ముస్సోరిలో IAS అకాడమీ డైరక్టరు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి. ప్రణాళికా సంఘస్ అభ్యులు. ప్రధాని కార్యాలయంలో కార్యదర్శి (1995-97).
పి. అబ్రహాం (1940-) ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎం.ఏ. పట్టభద్రులు. 1962 బ్యాచ్ మహారాష్ట్ర అధికారి. కేంద్రంలో విద్యుచ్ఛక్తి శాఖ కార్యదర్శిగా ప్రైవేటీకరణ ప్రణాళికలు సంస్కరణపూరితం. మహారాష్ట్ర ఎలెక్ట్రిసిటీ బోర్డు చైర్మన్. వీరిని 1997లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషను సభ్యులుగా నియమించారు. వీరి అల్లుడు పి. శ్యాంబాబు ఆంధ్ర క్యాడర్ ఐఎఎస్. లోక్‌సభ స్వీకర్ జి.యం.సి. బాలయోగి వద్ద కార్యదరి.
క్యాబినెట్ సెక్రటర్ టి. ఆర్. ప్రసాద్ (1941-జూలై 2022)
1963 ఆంధ్రా క్యాడర్. ఆ హోదా పొందిన ఏకైక తెలుగు వ్యక్తి. గుంటూరు జిల్లా నిడుబ్రోలు వాసి. అటల్ బిహార్ వాజ్‍పేయి ప్రధానిగా వున్న సమయంలో 2000- 2002 మధ్య క్యాబినెట్ సెక్రటరీ. 1999 జనవరి నుండి రక్షణ శాఖ కార్యదర్శి, కార్డిల్ యుద్ధ సమయంలో కీలకపాత్ర పోషించారు. 12వ ఆర్థిక సంఘ సభ్యులు. ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ హోదాలతో బాటు విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ చైర్మన్.
జలగం వెంగళరావు గారు 1988లో ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రారంభిస్తున్న దృశ్యం. వారి వెనుక పి. శ్యాంబాబు ఐఎఎస్.
1964 బ్యాచ్ అధికార్లు:
ఈ సంవత్సరం ఇద్దరు తెలుగువారు IAS సాధించారు. వై. వేణుగోపాలరెడ్డి, పి.యల్. సంజీవరెడ్డి. ప్రధాన పదవులందుకొన్నారు. వేణుగోపాల్ రెడ్డి (1941) కడపకు చెందిన వారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా (బ్యాంకింగ్) 1995-96; రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నరు (1996- 2002), IMF ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (2002-2003), రిజర్వ్ బ్యాంక్ గవర్నరు (2003-2008), 14వ ఆర్థిక సంఘం చైర్మన్ (2013-14) ఆయన అధిష్టించిన వివిధ పదవులు. 1966లో నేను ఎం.ఏ. విద్యార్థిని. ఆయన చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టరు. విద్యార్థుల నుద్దేశించి IAS పరీక్షల గూర్చి వివరించారు. 2002లో చికాగోలో శారదాపూర్ణ శొంఠి అన్నమాచార్య కీర్తనలపై నా ప్రసంగం ఏర్పాటు చేశారు, వై.వి. రెడ్డి సభలో ముందు వరసలో కూర్చుని అభినందించారు, వీరికి పద్మవిభూషణ్ (2010)లో లభించింది.
డా. పి.యల్. సంజీవరెడ్డి (1940-15 అక్టోబర్ 2012)
వీరి తండ్రి పైడి లక్ష్మయ్య తొలి పార్లమెంటు సభ్యులు (1952-57). నీలం సంజీవరెడ్డి మీద అభిమానంతో కుమారునికి సంజీవరెడ్డి అని నామకరణం చేశారు. 1976లో సంజీవరెడ్డి కడప జిల్లా కలెక్టరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కార్యదర్శి. కేంద్రంలో కంపెనీ వ్యవహారాలు, గ్రామణాభివృద్ధి శాఖల కార్యదర్శి. పదవ విరమణానంతరం – ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టరు జనరల్. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వుండగా 1977లో ఒక సంవత్సరం ప్రత్యేక కార్యదర్శి. వీరు నన్ను బాగా అభిమానించేవారు.
బాధ్యతాయుత పదవుల్లో నలుగురు ‘శర్మ’లు:
కేంద్ర కార్యదర్శి హోదా లభించడానికి ఏ కొందరికో అవకాశం లభిస్తుంది. అందులో కీలక శాఖలు లభించడం కేవలం పనితనం, నిబద్ధత వల్లనే. నలుగురు శర్మలు – ఇ.ఏ.యస్. శర్మ (1941). 1965 బ్యాచ్. శ్రీకాకుళం వాసి.. IIT ఢిల్లీ నుండి పి.హెచ్.డి. కేంద్రంలో విద్యుచ్ఛక్తి శాఖలో (1997) కార్యదర్శి. 1999లో EXPENDITURE శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల పట్ల విభేదించి స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. విశాఖ పట్టణంలో స్థిరపడి అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శిగా 1980లో పనిచేసిన సి.యస్. శాస్త్రి సతీమణి మణి శాస్త్రి వీరి సోదరి. 1957 బ్యాచ్ బీహార్ క్యాడర్ అధికారి ఏ. ఉమాకాంత శర్మ కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వ శాఖలో 1978లో సహాయకార్యదర్శి. బీహార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గవర్నరు కార్యదర్శి. సి. ఆర్. కమలనాథన్ 1965 బ్యాచ్.
ఎవివిఎన్ శర్మ టిటిడి ఇఓ గారు, జి బలరామయ్య జెఇఓ గారు, ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారితో రచయిత
మరో కె. సుబ్రమణ్య శర్మ (1944-2026) 1968 బ్యాచ్. నాదెండ్ల భాస్కరరావు నెల రోజుల ముఖ్యమంత్రిత్వంలో ఆయన కార్యదర్శి. 1996-98 మధ్య దూర్‍దర్శన్ డైరక్టర్ జనరల్. 2002 నుండి 2006 వరకు ప్రసారభారతి సిఇఓ. శ్రీ వెంకటేశ్వర భక్తి భావల్ సి.ఇ.ఓ. పి.వి. గారు సంకల్పించిన నవోదయ విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా సకాలంలో స్థాపించిన ఘనత శర్మది. వారి హయాంలో నేను దూరదర్శన్ డి.డి.జి. అంతేగాక SVBC లో కలిసి పనిచేశాం.
ఏ.పి.వి. నారాయణ శర్మ (1949) సౌజన్యశీలి. 1974 బ్యాచ్. వరంగల్ REC లో బి.ఇ. చేశారు. ఆంధ్ర ప్రదేశ్‍లో ఆరోగ్యశాఖ కార్యదర్శి. సింగరేణి బొగ్గు గనుల సంస్థను నాలుగేళ్లలో నష్టాల నుండి తప్పించి లాభాల బాట త్రిప్పిన ధీశాలి. కార్యదక్షులు. కేంద్రంలో బొగ్గు శాఖ సహాయ కార్యదర్శి. 2005-07 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం EO. కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి (2007-09). 2014 నుండి 2024 వరకు తెలంగాణా రాష్ట్ర గవర్నర్ సలహాదారు. నేను శర్మగారి జీవిత చరిత్ర ‘నరుని సేవలో నారాయణుడు’ రచించాను. గవర్నర్ ఇ.యస్.యల్. నరసింహన్ గ్రంథావిష్కరణ చేశారు (2019).
డా. జె. శ్రీధర శర్మ 1971 బ్యాచ్ అధికారి. ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి. కేంద్రంలో టెలికాం కార్యదర్శి (2008-09). TRAI ఛైర్మన్ (2009-2012). అనేక విప్లవాత్మక మార్పులు టెలికాం రంగంలో తెచ్చారు. 2014లో అనారోగ్యంతో మరణించారు. వీరి సోదరి జె. హేమలత అనంతపురంలో సత్యసాయి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ గతంలో.
బి. పి. రావు (1939-)
పార్థసారథి రావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ప్రసిద్ధులు. 1968 బ్యాచ్ అధికారి. సింగరేణి కాలరీల మేనేజింగ్ డైరక్టరుగా విశిష్ట సేవలందించారు. 1963 68 మధ్య మిలిటరీలో పని చేశారు.
1966 బ్యాచ్ ఇద్దరు: ఆర్.వి. వైద్యనాథ అయ్యర్ (1943); పి.వి.ఆర్.కె. ప్రసాద్ (1941-2017).
అయ్యర్ ప్రకాశం జిల్లా కలెక్టరు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, కేంద్రంలో సాంస్కతిక శాఖ కార్యదర్శి (1998). ఢిల్లీ ఏ.పి. భవన్ కమీషనర్. సౌజన్యమూర్తి.
పి.వి.ఆర్.కె. అనగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో E.O.గా ఆయన చేసిన చిరస్మరణీయ కార్యక్రమాలు గుర్తుకువస్తాయి (1978-82). అన్నిటికి మించి 1991-92 మధ్య ప్రధాని పి.వి. నరసింహారావుకు సమాచార సలహాదారు. MCHRD హైదరాబాదు డైరక్టరు జనరల్. విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్.
1967 బ్యాచ్ జె.వి.ఆర్. ప్రసాదరావు పశ్చిమబెంగాల్ గవర్నరు కార్యదర్శి. 1997లో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి. 1967 బ్యాచ్ వి.గోవిందరాజన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు వింజమూరి వరదరాజు అయ్యంగార్ కుమారులు. సింగరేణి కాలరీస్ యం.డి. (1988). కేంద్ర పారిశ్రామక పాలసీ కార్యదర్శి. అదే బ్యాచ్‍కి చెందిన సి.యస్. రావు కేంద్ర ఎక్స్‌పెండిచర్ కార్యదర్శి. IRDAI చైర్మన్ 2003-2008.
ఎన్. ముక్తేశ్వరరావు, జెఇఓ, టిటిడి గారితో రచయిత
మోహన్ కందా 1968 బ్యాచ్. జస్టిస్ భీమశంకరం కుమారుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గవర్నరు, ఉపరాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి. చమత్కార ప్రియులు.
సుజాతారావు (1974) కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి. డా. కె.యల్. రావు కుమార్తె. జె. హరి నారాయణ (1970) 2008-13 మధ్య IRDAI ఛైర్మన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (2001-08). జె. సత్యనారాయణ 1977 బ్యాచ్ కేంద్ర I.T. శాఖ కార్యదర్శి. ఎ. గిరిధర్ రక్షణ శాఖ కార్యదర్శి.
వీరే గాక పలువురు రాష్ట్రేతర ఆంధ్రా క్యాడర్ IAS అధికారులు కేంద్రంలో కీలక పదవులు పొందారు. వారిలో ఏ.యన్. తివారి, కె.కె. బంగర్, జె.పి.మూర్తి, ఆశామూర్తి దంపతులు, రజత్ భార్గవ, యస్.కె. జోషీ, సి.డి. ఆర్య, వి.కె. అగ్నిహోత్రి, యస్.కె. పచూరి, సంజయ్ జాజు ప్రభృతులు.
జయోస్తు ఆంధ్ర క్యాడర్!
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
