[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
అలనాటి ఆకాశవాణి కవి సమ్మేళనాలు:
1975 ఆగస్టు 16
ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‍గా చేరిన రోజు. అప్పటి నా వయస్సు 28 సంవత్సరాలు. 8 ఏళ్ళు కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకత్వం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టాను. కవి పండిత గాయకులు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి రికార్డింగుకు వచ్చేవారు. మంత్రులు, అధికారులతో ఇంటర్వ్యూలు చేసేవాడిని.
అప్పటికి ఆంధ్రదేశంలో నాలుగే నాలుగు రేడియో స్టేషన్లు. 1975 జూన్‌లో కడప, విశాఖపట్టణం కేంద్రాలు రిలే స్టేషన్ల స్థాయి నుండి స్వతంత్ర స్థాయికి ఎదిగాయి. రావూరి భరద్వాజ (హైదరాబాదు) ప్రొడ్యూసర్‍గా పని చేస్తున్నారు. ఉషశ్రీ (విజయవాడ), అనంత పద్మనాభరావు(కడప), పి. విజయభూషణశర్మ (విశాఖపట్టణం) 1975 ఆగస్టులో ప్రసంగశాఖ ప్రొడ్యూసర్లుగా ఇంటర్వ్యూలో ఎంపిక అయ్యాం. నేనక్కడినే రేడియోకు కొత్త. మిగిలిన ముగ్గురు క్రింది గ్రేడులో పని చేస్తున్నారు.
సభాసదుల ఎదుట కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలు జరవడం అనవాయితీ. 1990లో ఆంధ్రదేశంలో తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లా కేంద్రాలు వచ్చాయి. అప్పటి వరకు అంటే 15 సంవత్సరాలు పాత నాలుగు కేంద్రాలు ఈ సభలు నిర్వహించేవి. సంక్రాంతి, ఉగాది, దీపావళి పర్వదినాల సందర్భంగా నాలుగైదు రోజుల ముందు కని సమ్మేళనం నిర్వహించేవాళ్లం. వాటిని నాలుగే కేంద్రాలు పంచుకొనేవి/ఎంచుకొనేవి.
ఉగాది కవి సమ్మళనం విజయవాడ వాళ్లు చేస్తామని త్రైమాసిక రివ్యూ మీటింగులో ప్రతిపాదించేవారు. దీపావళికి కడప/విశాఖపట్టణం, సంక్రాంతికి హైదరాబాదు – ఇలా రొటేషన్ మీద నిర్ణయించేవారు. ఉగాది కవి సమ్మేళనం విజయవాడలో జరిపితే అందులో పాల్గొనే కవులను మిగతా మూడు కేంద్రాలు ఎంపిక చేసి మొత్తం 12 నుండి 15 మంది కవులు మించకుండా చూసేవాళ్ళం. ఆయా ప్రాంతాల కవులకు ఆయా కేంద్రలు కాంట్రాక్టులు జారీచేసి ఆయా కవుల అంగీకార పత్రాలను విజయవాడకు పంపాలి. కవి సమ్మేళనం ముగియగానే వారికి చెక్కులు అందించేవాళ్లం.
ఒక్కొక్క కవికి పారితోషికం దాదాపు వెయ్యి రూపాయలు, ఛార్జీల క్రింద మూడు ఫస్ట్ క్లాస్ రైలు చార్జీలు, ఒక రోజు డి.ఎ. అందేవి. కవులు ముందుగా తమ కవితలను కేంద్రానికి అందజేసేవారు.
ఆకాశవాణి కవి సమ్మేళనంలో సదస్యుల ముందు పాల్గొనడం ఒక హోదాగా భావించేవారు. ఆ కవితలను నాలుగు కేంద్రాలు ఉగాది నాడు ప్రసారం చేసేవి. అదొక సంబరం. సభలు నిండుగా వుండేవి.
ఆహ్వాన పత్రికలు త్రిభాషలలో ముద్రించి నగరంలోని ప్రముఖులకు ముందుగా పంపేవారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం జనంతో నిండిపోయేది. రాష్ట్రం నలుమూలల నుండి దిగ్దంతులైన కవులు/కవయిత్రులు కవి సమ్మేళనంలో కవితాగానం చేసేవారు.
సరిగ్గా 50 ఏళ్ళ కిందట కడపలో నా సభానిర్వహణలో జరిగిన కవి సమ్మేళనం నా మదిలో మెదలుతోంది. అప్పటికి కడపలో పెద్ద ఆడిటోరియం లేదు. మునిసిపల్ ఓపెన్ ఆడిటోరియంలో సభ పెట్టాం. లబ్ధప్రతిష్ఠులైన కవులు విచ్చేశారు. ప్రతిష్ఠాత్మక సన్నివేశం.
కవులు తమ తమ విడిదులు తామే ఏర్పాటు చేసుకోవాలి. ఆయా ప్రాంతాల నుండి విచ్చేసే కవులు వసతి ఏర్పాట్లకై ఫోను చేసేవారు. కడపలో ఒకటి, రెండు లాడ్జీలు వుండేవి. అక్కడ రూంలో చెప్పిపెట్టేవాళ్ళం. ప్రభుత్వ గెస్ట్ హౌస్, మునిసిపాలిటీది. ఆర్ అండ్ బిది, జిల్లా పరిషత్ వారిది వున్నవి. ఆయా అధికారుల సౌజన్యంతో ప్రముఖలకు అక్కడ విడిది ఏర్పాటు చేసేవాడిని.
కడప మునిసిపల్ కమీషనర్లుగా సాహిత్యపరులుండేవారు. వై.వి.రమణారెడ్డి భాషాప్రియుడు. తర్వాత వచ్చిన వేమరాజు నరసింహారావు స్వయంగా రచయిత. హైదరాబాదులో నవ్య నాటక సమితి స్థాపకులు. అంతకు ముందెప్పుడో గుంటూరు శేషేంద్రశర్మ మునిసిపల్ కమీషనరు. ఆంజనేయులు తర్వాత వచ్చిన కమీషనరు. భువనవిజయం నాటకంగా వేశాం. ఆయన ధూర్జటి పాత్ర పోషించారు. తర్వాత చాగంటి శంకర్ – కడపలో మునిసిపల్ కమీషనరు. ఆయన చాసో కుమారులు. వీరంతా సాహిత్యాభిమానులు కావడం వల్ల ఆకాశవాణి అభ్యర్థనను మన్నించి మునిసిపల్ గెస్ట్ హాల్లో నాలుగైదు రూములు బుక్ చేసేవారు. దాశరథి అధికారభాషా సంఘం అధిపతిగా ఆర్ అండ్ బిలో దిగేవారు అధికారికంగా.
ఈ ఉపోద్ఘాతానికి కారణం – కడప లాంటి పట్టణంలో 1976లో భారీ కవి సమ్మేళనం ఏర్పాట్లలోని ఇబ్బందుల గూర్చి చెప్పడానికే. నేను కడపలో మూడు పర్యాయాలు ఉద్యోగించాను. మొత్తం 7½ సంవత్సరాలు. ప్రొడ్యూసర్‌గా రెండో దఫాలు, స్టేషన్ డైరక్టరుగా 1993-1995 రెండేళ్ళు. ఆయా సంవత్సరాలలో ఆహూతుల ముందు ఎన్నో సభలు/కచేరీలు నిర్వహించాం. నన్ను ప్రభావితం చేసినది కవి సమ్మేళనాలే.
పాల్గొన్న కవుల పేర్లూ మీ ముందుంచుతాను. వారు సుపరిచితులు. సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న యశస్వులు. వారిని ఎంపిక చేసుకొనే సమయంలో కేంద్రాల వారు ప్రాంతాలను, వర్గాలను, భిన్న వాదాలను దృష్టిలో పెట్టుకుంటుండేవారు. కొందరు అన్ని కవి సమ్మేళనాలకు తప్పనిసరి, వారు స్టార్ అట్రాక్షన్ కాబట్టి. వారిలో శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర ముఖ్యులు.
అవి ఎమర్జెన్సీ రోజులు.
1976 కవి సమ్మేళనం గుర్తులివి.
ఆరుద్ర మదరాసు నుండి సొంత కారులో కడప వచ్చారు. మునిసిపల్ గెస్ట్ హౌన్‌లో బస. సాయంకాలం 6 గంటలకు సభ. మధ్యాహ్న భోజనానికి ముందు వారిని కలవడానికి వెళ్లాను. ఆయన టేబుల్ ముందు రెండు బీర్ బాటిళ్ళు ఉన్నాయి. “రండి! కంపెనీ ఇవ్వండి!” అన్నారు ఆరుద్ర.
నేను సున్నితంగా తిరస్కరించాను.
“నాతో కలిసి సేవించడం గొప్ప అవకాశం” అన్నారు.
ముకుళిత హస్తాలతో వారిని ప్రార్థించాను. అంతటితో ముగిసింది.
శ్రీశ్రీ కోసం ఒక హోటల్ గది ఏర్పాటు చేశాం. వారికి అందుబాటులో ఇద్దరు యువ మిత్రులను పెట్టాం. సభకు సజావుగా వారిని తీసుకువచ్చే బాధ్యత వారిది.
ఆనాటి కవి సమ్మేళనానికి హైదరాబాదు నుండి వచ్చిన కవి ప్రముఖులు: సి. నారాయణరెడ్డి, గుంటూరు శేషేంద్ర వర్మ (శ్రీమతి ఇందిరాదేవి ధనరాజ్‌గిరితో), జె. బాపురెడ్డి IAS, ఉండేల మాలకొండారెడ్డి, బోయి భీమన్నలు.
బాపురెడ్డి త్రయం చాలా సందర్భాలలో కలిసే వచ్చేవారు ఎక్కడికి వెళ్లినా.
స్థానిక కడప కవులు – పుట్టపర్తి నారాయణాచార్యులు, యస్. రాజన్న కవి, సి.వి. సుబ్బన్న శతావదాని, పాలా వెంకట సుబ్బయ్య (మాజీ MLA), మహిళా ప్రతినిధి – శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. ప్రతి దఫా కవి సమ్మేళనాలలోను ఒక మహిళను, ఒక మైనారిటీని దృష్టిలో పెట్టుకోవడం సంప్రదాయం.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి విశిష్ట వ్యక్తి. వారి అన్నకుమారులు జంద్యాల లక్ష్మీ నారాయణ శాస్త్రి కందుకూరులో నేను పని చేసినపుడు శాఖాధిపతి. ఆ పరిచయంతో కరుణశ్రీని భోజనానికి మా యింటికి ఆహ్వానించాను.
మధ్యాహ్నం వేళకు కవులందరూ కడప చేరుకున్నారు.
టి. ఆర్. రెడ్డి మా స్టేషన్ డైరక్టర్ – సభలో ఆహ్వానం పలికారు.
కవులను పరిచయం చేస్తూ సభను నేను నిర్వహించాను.
ఎవరిని ముందు పిలవాలి? ఎవరిని చివర్లో పెడితే ఆడియన్స్‌ను ఆకర్షించగలమని ముందే అంచనా వేస్తాం. ఒక పద్యకవి, తర్వాత వచనకవి, ఒక వయోవృద్ధుడు, మరొక యువకవి – ఇలా వరుస.
ఆఖరి నిముషంలో శ్రీశ్రీ సభా ప్రాంగణానికి విచ్చేశారు.
ఆయన కవిత ముందుగా మాకు చూపలేదు (వ్రాయలేదనుకుంటా). వేదికమీది కెక్కారు.
ఎమర్జెన్సీ రోజులు. ఆయన ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వ్యక్తి.
ఏం చదువుతారోనని ఆందోళన.
కవులందరి చివరన ఆకర్షణగా ఆయనను పిలిచాం.
గొంతు సవరించుకుని –
“మనకున్నది డెమోక్రసీ
ఇదంతా హిపోక్రసీ” అంటూ గళం విప్పారు.
(యథాతథ ప్రసారం కాదు గాబట్టి బతికిపోయాం).
సభలో చప్పట్లు, కేరింతలు, హర్షధ్వానాలు.
అలా ముగిసింది. కవి సమ్మేళనం.
అనుకున్న పంథాలోనే దాశరథి, సినారె, కరుణశ్రీ, శేషంద్ర కవితలు జనాకర్షణ పొందాయి. అది నా తొలి కవి సమ్మేళన నిర్వహణ స్మృత్యంకం.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
