[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
హైదరాబాదు కవితాగోష్ఠులు:
ఆకాశవాణి హైదరాబాదులో నేను 1982-87 మధ్య అసిస్టెంట్ డైరక్టరు. ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా సుప్రసిద్ధులు రావూరి భారద్వాజ, కార్యక్రమ రూపకర్త. దాశరథి, రజని ఎమిరటస్ ప్రొడ్యూసర్లు. దాశరథి గతంలో హైదరాబాదు ఆకాశవాణిలో అసిస్టెంట్ ప్రొడ్యూసరు. మదరాసు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్. సినీ గీత రచయితగా పేరు ప్రతిష్ఠలు లభించాయి. సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలి వచ్చిన తొలి రోజులు. పరిశ్రమ దిగ్గజాలు యిచ్చిన హామీలు నమ్మి దాశరథి రేడియో వదలివేశారు. స్వచ్ఛంద విరమణ చేశారు. క్రమంగా సినీ గీతరచయితలు కొత్తవారు విజృంభించారు. దాశరథి గిరాకీ తగ్గింది. బషీర్‌బాగ్ మాతృశ్రీ అపార్ట్మెంట్లో జీవనయానం చేయసాగారు. ఆ దశలో ఆకాశవాణి డైరక్టరేట్ మిత్రులు ఆయనకు ఉపాధికల్పనగా ఎమిరిటస్ ప్రొడ్యూసర్‌గా రెండేళ్లు అవకాశం కల్పించారు. నెలసరి గౌరవ పారితోషికం లభించేది. ఎప్పుడైనా ఆకాశవాణికి వచ్చి ఏదైనా ఒక కార్యక్రమ రూపకల్పన చేసేవారు.
‘రజని’గా పిలవబడే బాలాంత్రపు రజనీకాంతరావు వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. 35 సంవత్సరాలు ఆకాశవాణి వివిధ కేంద్రాలలో పని చేసి 1978లో బెంగుళూరు ఆకాశవాణి డైరక్టరుగా రిటైరయ్యారు. ఎమిరిటస్ ప్రొడ్యూసర్‌గా పలు సంగీత రూపకాలు తయారు చేశారు. అప్పుడు డైరక్టరు లీలా బవ్‌డేకర్. చాలా కఠిన నియమాలు ఉద్యోగులకు ప్రవేశపెట్టారు. రవీంద్ర భారతిలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. పాత కొత్తల మేలు కలయికగా 16 మంది కవులు ఎంపికయ్యారు. హాలు కళకళలాడింది. తెలంగాణాకు చెందిన సుప్రసిద్ధులతో బాటు గులాం యాసీన్, ఆచార్య తిరుమల, వరంగల్ నుండి పేర్వరం జగన్నాథం, కోవెల సుప్రసన్నచార్య పాల్గొన్నారు. ఉగాది నాటి ఉదయం కవితా గోష్ఠి అన్ని కేంద్రాలు రిలే చేశారు.
భువన విజయాలు:
తెలుగు నాట పద్య నాటకాలు ప్రసిద్ధం. తిరుపతి వెంకట కవుల పాండవోద్యగ విజయాలు దానికి తార్కాణం. అదే రీతిలో 1970 దశకంలో భువన విజయ ప్రదర్శనలు వ్యాప్తి చెందాయి. శ్రీకృష్ణదేవరాయలుగా స్థానిక సాహిత్య పోషకునికి కిరీటం పెట్టి, ప్రసాదరాయ కులపతి వంటి వారు తిమ్మరుసుగా సభానిర్వహణ చేసేవారు. అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన, రామలింగకవి, తిమ్మన, ధూర్జటి తప్పనిసరి. తక్కన నలుగురిని ఆయా ప్రాంతాలను అనుసరించి చేర్చేవారు. ఆ సాహితీ ప్రక్రియ ప్రచారంలో వుండటం చేత విజయవాడ కేంద్రం పక్షాన భువన విజయ ప్రదర్శనను సదస్యుల సమక్షంలో ఏర్పాటు చేశాం. ప్రసాదరాయ కులపతి తిమ్మరుసు.
కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అద్యాపకుడిగా నాటి భువన విజయంలో తెనాలి రామకృష్ణుడిగా పండించాను. తర్వాతి కాలంలో పలు పాత్రలు వేశాను. రాయలుగా రెండు, మూడు దఫాలు తిరుపతి, శ్రీకాకుళంలలో వేషాలు దక్కాయి. అనుకోకుండా ఇంద్రపదవి లభించింది.
1996లో ప్రసాదరాయ కులపతి ప్రోత్సాహంతో విజయవాడ మాంటిస్సోరి కళాశాలలో ఆకాశవాణి పక్షాన ఇంద్రసభ సదస్యుల ముందు కల్పన చేశాం. రాయలుగా గుంటూరు జిల్లా కలెక్టరు సి. ఉమామహేశ్వర రావు, బృహస్పతిగా ప్రసాదరాయ కులపతిని ఎంచుకొని స్టూడియోలో ఆ మద్యాహ్నం రికార్డు చేశాం. సభ ఆ సాయంకాలం అనుకోకుండా వర్షాలు పడి కలెక్టరు ఉమామహేశ్వరరావు గుంటూరులో హెడ్ క్వార్టర్సు వదలి రాలేని ప్రకృతి వైపరీత్యం. ఆపద్ధర్మంగా కులపతి నన్ను ఇంద్ర సింహసనంపై కూర్చోబెట్టారు.
అవధానాలు:
తెలుగు సాహిత్య ప్రక్రియలలో అష్టావధానం విశిష్టం. 1980వ దశకంలో ‘స్పర్ధయా వర్ధతే విద్యా’ అనే రీతిలో సహస్రావధానాలు ఆంధ్రదేశంలోని పండితులు ప్రదర్శించారు. ఆ అవధాన విద్యపై ఒక వినూత్న ప్రయోగం చేశాం. అప్పటికి నాలుగే కేంద్రాలు – విజయవాడ, కడప, విశాఖపట్టణం, హైదరాబాదులు. మూడు కేంద్రాలలో ముగ్గురు అవధానులు, మరో కేంద్రంలో సంచాలకులు. ఆశావాది ప్రకాశరావు, బేతవోలు రామబ్రహ్మం, పేరాల భరతశర్మ – అవధానులు. లైవ్ ప్రోగ్రాం టెలిఫోను అనుసంధానం. ప్రేక్షకులు ఆయా కేంద్రాలలో వున్నారు. ఆ ప్రయోగం సఫలమైంది. సాంకేతిక విజయ చిహ్నమది.
సర్వ భాషా కవి సమ్మేళనం:
సంగీత సాహిత్యాలకు పూర్వం రాజాశ్రయం ఉండేది. రాజులు కవిగాయకులను పోషించారు. తర్వాతి కాలంలో ఆకాశవాణి అట్టి ప్రోత్సాహం కలిగిస్తోంది. అందులో భాగంగా సర్వభాషా కవి సమ్మేళనం ప్రతి ఏటా జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం ముందు రోజు 25 రాత్రి ఆకాశవాణికి దేశంలో వున్న అన్ని కేంద్రాలు ఆ కవి సమ్మేళనం ప్రాసారం చేస్తాయి. 1956లో ఈ కవి సమ్మేళనాలు మొదలై గత 70 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి.
ఆకాశవాణి డైరక్టరేట్ ఢిల్లీలో డైరక్టర్ SPOKEN WORD అనే అధికారి ఈ కార్యక్రమ రూపకర్త. రాజ్యంగం ఆమోదించిన 22 భాషలలో ఒక్కొక్క కవి ఇందులో పాల్గొంటారు. సంస్కృత కవి ఒకరు, హిందీ కవులు ఇద్దరూ, మిగతా ఇరవై మంది తమ తమ భాషాలలో సదస్సుల ముందు ఈ కవితలు వినిపిస్తారు.
కవుల ఎంపిక ప్రక్రియ:
రాష్ట్ర రాజధాని కేంద్రాలు ఏటా ఒక సెలక్షన్ కమిటీ ద్వారా వారి భాషలో ముగ్గురు కవుల పేర్లు వారి కవితలు (మూడు నిముషాల నిడివి), దాని ఆంగ్ల, హిందీ అనువాదాలను ఢిల్లీ డైరక్టరేట్‌కు పంపుతారు. ఢిల్లీ స్టేషన్ డైరక్టరు కమిటీ చైర్మన్‌గా అన్ని కేంద్రాల నుండి వచ్చిన సూచనలను వడపోస్తారు. ఈ ప్రక్రియ నవంబరు నాటికి పూర్తి అవుతుంది. సెలక్టు అయిన కవితలను, కవి పేరును ఆయా కేంద్రాలకు ముందుగా తెలియజేస్తారు.
దేశంలోని ఏదో ఒక కేంద్రంలో సదస్యుల ముందు ఈ కవులు స్వయంగా వెళ్లి కవితా గాన చేస్తారు. ఆయా భాషల కవితలకు వెంటనే హిందీ అనువాదం మరొక కవి వినిపిస్తారు. తెలుగు భాషా కవులను ఎంపిక చేసే కమిటీలో 1976 నుండి నేనూ భాగస్వామిని. గతంలో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న అల్లంరాజు వెంకటరావు (సుధామ) ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన గోష్ఠిలో చదివారు. అతి చిన్న వయసులో సెలక్ట్ అయ్యారు. 2014లో హైదరాబాదులో సర్వభాషా కవిసమ్మేళనం RTC ఆడిటోరియంలో నిర్వహించారు. తెలుగు కవిగా నేను ఎంపికయ్యాను. నా కవితకు హిందీ అనువాదం చిల్లర భావానీదేవి చదివారు. సభకు గవర్నరు ESL నరసింహం ముఖ్య అతిధి.
ఆకాశవాణి పటేల్ స్మారకోపన్యాసాలు:
ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఏటా రెండు స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీలో నేషనల్ మ్యూజియం ఆడిటోరియంలో ఈ సభలు జరుగుతాయి. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గుర్తుగా హిందీలో ఒక గంట సేపు ఒక ప్రముఖ వ్యక్తి ప్రసంగిస్తారు. నేను ఢిల్లీ కేంద్ర డైరెక్టర్‌గా 1997-2000 మధ్యకాలంలో ఏ.పి.జె.అబ్దుల్ కలాం, కపిలా వాత్యాయన్, కరణ్ సింగ్‌లు ఈ ప్రసంగాలు చేశారు. అప్పటికి అబ్దుల్ కలాం ఇంకా రాష్ట్రపతి కాలేదు. వారు ఎంచుకున్న విషయంపై వక్తలు మాట్లాడతారు. ప్రసంగ పాఠం ముద్రించి సభలో పంచిపెడతారు. పబ్లికేషన్ డివిజన్ వారు పది సంవత్సరాల కొకసారి ఆ ప్రసంగాలు గ్రంథరూపంలో తెస్తారు.
1998 అబ్దుల్ కలాం గారి సభలో వేదిక పై డైరక్టరుగా కూర్చునే అవకాశం లభించింది. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ సభ్వీ ముఖ్య అతిథి. ప్రసంగ విషయం – SECOND VISION FOR THE NATION – DEVELOPED INDIA. అది సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం. 1955లో ప్రారంభం. అక్టోబరు 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు ప్రసారం. ఈ ప్రసంగ పరంపరలో పాల్గొన్న కొందరు ప్రముఖులు –
- 1955 – సి. రాజగోపాలాచారి (ప్రారంభ ప్రసంగం) – The Good Administration
- 1958 – డా. జాకీర్ హూసేన్ Educational Reconstruction In India.
- 1963 – మొరార్జీ దేశాయి – Integration & Consolidation Of India.
- 1998 – అబ్దుల్ కలాం
- 1999 – కరణ్ సింగ్.
1969 నుండి అదే రీతిలో హిందీలో రాజేంద్ర ప్రసాద్ స్మారకోపన్యాసాలు. పాల్గొన్న ప్రముఖులు – హాజరీ ప్రసాద్ ద్వివేది (1969), మహాదేవి వర్మ (1970), శంకర దయాళ్ శర్మ (1982), అటల్ బిహారీ వాజ్‌పేయ్ (1983), చంద్రశేఖర్ (2000), నా ఆధ్వర్యంలో – ఓ. నామ్వర్ సింగ్ (1998), జస్టిస్ జె.యస్.వర్మ(1999).
ఇవీ కొన్ని మధుర స్మృతులు. చిరస్మరణీయాలు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
