[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
తొలి తరం సినీ ప్రముఖులు:
చలనచిత్ర పరిశ్రమ చాలా కాలం మదరాసులో వుండిపోయింది. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు చొరవతో హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో వెలసింది. గోదావరి వరద బాధితుల సహాయార్థం సినీనట బృందం పట్టణాలలో తిరుగుతూ కడప వచ్చారు. నేను, కడప ఆకాశవాణి పక్షాన మా అనౌన్సర్ గోపి రికార్డరు పట్టుకొని వారు దిగిన ప్రతాప్ హోటల్లోకి పోలీసుల పద్మవ్యూహం ఛేదించుకొని జొరబడ్డాం. యన్.టి.ఆర్, ఏ.యన్.ఆర్. ఇద్దరినీ రికార్డు చేశాం. నేను 1982 అక్టోబరులో ఆకాశవాణి హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టరుగా చేరాను. 1983 జనవరి 9న తెలుగు దేశం ప్రభుత్వం నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం లాల్ బహదూర్ స్టేడియంలో లక్షాలది జనసందోహం మధ్య జరిగింది.
వెంటనే ముఖ్యమంత్రి యన్.టి.రామారావు ఆకాశవాణి స్టూడియోకి వచ్చి ప్రసంగం రికార్డు చేశారు. సినిమా రికార్డింగు ఫక్కీలో ప్రతి పేరాను ఐదారు కట్లు చదివారు. 15 నిముషాల స్పీచ్ దాదాపు రెండు గంటలు పట్టింది. దానిని ఎడిట్ చేసి ప్రసారం చేశాము. యన్.జి.ఓ.ల సమ్మె సందర్భంగా వారు స్టూడియోకు వచ్చి ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రసంగం రికార్డు చేశారు. సమ్మె విరమణ జరగలేదు. రెండో దఫా ముఖ్యమంత్రి సందేశం రికార్డుంగు విహాయంలో ఆకాశవాణి డైరక్టరేట్‌కు ముఖ్యమంత్రికి కొంత ప్రతిష్టంభన ఏర్పడి పార్లమెంటు ఉభయ సభల్లో వాడిగా, వేడిగా చర్చ జరిగాయి.
నాగేశ్వరరావు నాకు మదరాసు తెలుగు అకాడమీ కార్యదర్శి టి.వికె.శాస్త్రి ద్వారా పరిచయం. మదరాసులో 2002లో వారి చేతుల మీదుగా సన్మానించారు. యూనిసెఫ్ వారి బహుమతుల ప్రదానంలోను వారితో కలసి నేను పాల్గొన్నాను. అన్నిటికంటె చిరస్మరణీయ ఘట్టం – నాగార్జున పెళ్ళికి ఆహ్వానం. అప్పటి మా డైరక్టరు కేశవ్ పాండేకు ఏ.యన్.ఆర్ స్వయంగా అదించారు. 1983 జూన్‌లో అనుకుంటాను, ఆ వివాహానికి నేనూ వెళ్లాను. ద్వారం వద్ద నిలబడి ఏ.యన్.ఆర్ ఒక వైపు, రామానాయుడు మరో వైపు స్వాగతం పలికారు. 1996లో నేను విజయవాడ స్టేషన్ డైరక్టర్ని. నాగేశ్వరరావు ఏదో మీటింగుకు విజయవాడ వచ్చారు. స్టూడియో ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. “ఇప్పటికి ఎన్నో మార్లు రికార్డు చేశాను” అని సున్నితంగా తిరస్కరించారు. “ఆకాశవాణి వార్షిక బహుమతులు మా సిబ్బందికి మీ చేతుల మీదుగా ఇవ్వండి!” అని కోరాను. సంతోషంగా వచ్చి బహుమతులు పంచారు. అది మొదలు ఎప్పుడు కనబడ్డా “స్వామీ! బాగున్నారా?” అని పలకరించేవారు. ఉభయ అగ్రనటుల సాన్నిహిత్యం అలా కొనసాగింది.
రక్తకన్నీరు నాగభూషణం:
మదరాసులో మా బంధువుల ఇంటి కెళ్లాము. వాహినీ స్టూడియో షూటింగుకు ఆయన తీసుకెళ్లారు. జమున, నాగభూషణం నటించే సీన్ అది. 20 నిముషాల తర్వాత సీన్ ‘కట్’ అన్నారు డైరెక్టరు. “అత్యంత సహజంగా నటించారు మీరు” అని నాగభూషణాన్ని జమున ప్రశంసించారు. నేను కందుకూరు కాలేజిలో పని చేస్తుండగా కావలిలో ఒక సాంస్కృతిక సంస్థ కార్యక్రమంలో నేను నాగభూషణంతో వేదిక పంచుకొన్నాను. కడప మునిసిపల్ ఓపెన్ ఆడిటోరియంలో రక్తకన్నీరు నాటకం 1976లో చూచి ఆనందించాను. అద్భుత నటుడాయన. అప్పటికప్పుడు ఆయా ప్రదేశాల కనుగుణంగా డైలాగులు చెప్పి రక్తి కట్టిస్తారు.
కడపలో ప్రభుత్వోద్యోగులు 12 ఆఫీసుల వాళ్లం ‘ప్రభుత్వోద్యోగుల క్రీడాసాంస్కృతిక సంస్థ’ను 1977 జులై 7న స్థాపించాం. దానికి నేను ప్రధాన కార్యదర్శిని. సినీనటులు హరనాథ్‌కు సన్మాన పత్రం నేను తయారు చేసి చదివి ఆయనకు అందించాను. మర్నాడు ఉదయం మా ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చి సన్మాన పత్రం బాగా వచ్చిందని ప్రశంసించారు.
ఆంద్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ జమున కడప వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. 1992లో పుట్టపర్తిలో ప్రధాని పి.వి. సత్యసాయి ఆసుపత్రి ప్రారంబించారు. కార్ పార్కింగ్ చాలా దూరంగా నిలిపే ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి కారు దగ్గరగా నిలిపాము. రిటన్లో మా కారులో జమున ప్రయాణించారు. మా డ్రైవరు ఆనందానికి అవధులు లేవు. ముందు సీట్లో ఆమె కూచున్నారు.
కడప సమీపంలో సింహద్రిపురం హాస్యనటులు పద్మనాభం ఊరు. కడప ఆకాశవాణి పక్షాన హాస్యకదంబం ఏర్పాటు చేశాం ఆడిటోరియంలో. ఆదివిష్ణు తదితర రచయితలను ఆహ్వానించాం. పద్మనాభం ముఖ్య అతిథి. చలనచిత్ర రంగంలో మధుర స్మృతులను పంచుకొన్నారు.
నాగభైరవ కళాఫీఠం అవార్డును నా జన్మదిన సందర్భంగా హైదరాబాదులో సిటీ సెంట్రల్ లైబ్రరీలో నాగభైరవ కోటీశ్వరరావు ఘనంగా చేశారు. గుమ్మడి, సి.నా.రె ముఖ్య అతిథులు. సాహిత్య సమావేశంలో పాల్గొనడం తనకెంతో ఆనందదాయకమని గుమ్మడి వివరించారు.
గొల్లపూడి:
కడప ఆకాశవాణిలో 1981-82 మధ్య గొల్లపూడి మారుతీరావు ముందు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసు నుండి బదిలీ మీద వచ్చారు. కొద్ది నెలల్లోనే అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొంది అధిపతి అయ్యారు. నేనప్పుడు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్ని. ఇద్దరం ‘బావగారి కబుర్లు’ సంవత్సరం పైగా రేడియోలో చేశాం. ముందుగా రికార్డు చేసే వాళ్లం. రేపు సాయంత్రం ప్రసారం. మదరాసు వెళ్లిన ఆయన రాలేకపోయారు. కబుర్లు ఆగకూడదు ఎలా మరి? ఇంకొకర్ని పెట్టుకొని కథ నడిపించవచ్చు. కాని శ్రోతలకు వెలితిగా వుంటుంది. విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రతి రోజూ సాయంకాలం వార్తలకు ముందు బావగారి కబుర్లు ప్రసారమయ్యేవి. నండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు ఆ కార్యక్రమాన్ని పండిచేవారు.
‘ఏమండోయ్! బావగారూ! రావాలి! రావాలి!’ అంటూ సరదాగా ప్రారంభించి ఆ రోజు వార్తలలో ప్రధానాంశాల్ని విశ్లేషించేవారు. అది బాగా ప్రశంస లందుకొంది. ఆ బాణీలో నేను, గొల్లపూడి కడపలో ప్రయత్నించాం.
మరి ఆ రోజు ఆయన రాని లోటు ఎలా పూరించాలి?
ఒక ఘటితి స్పీర్తి కలిగింది.
“బావగారూ!” అంటే ఆయన పలకరు.
“బావగారికి కోపం వచ్చింది” అంటూ నేను ఒక్కడినే కాలక్షేపం చేసి ప్రోగ్రాం గిట్టించాను.
పినిసెట్టి వ్రాసిన ‘ఆడది’ అనే నాటిక సరదాగా రంగస్థలంపై కడలో ప్రదర్శించాం. స్త్రీ పాత్రలేని నాటిక. గొల్లపూడి ఇంటి యజమాని. నేను వారి యింట్లో వంట మనిషిని. కాఫీ సరిగా పెట్టలేదని ఆయన నా చెంప వాయించే సన్నివేశం వుంది. రెండు. మూడు రిహార్సల్సు చేశాం. స్టేజీ మీద ఆయన వాస్తవంగా నా చెంప వాయించాడు. ఆ నాటిక మరోసారి మునిసిపల్ ఆడిటోరియంలో కూడా ప్రదర్శించాం.
దర్శకుడు కోడి రామకృష్ణ 1981లో ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమా స్క్రిప్టు డిస్కషన్‌కు కడప వచ్చేవారు. హోటల్లో బస. కథ పూర్తి అయింది. గొల్లపూడినే ప్రధాన పాత్రగా ఎంచుకొన్నారు. సినిమా నిర్మాణం పూర్తి అయింది. రిలీజుకు సిద్దం. అప్పటి వరకు సినీ రచయితగా ‘గొల్లపూడి’ అనే పేరుతో చాలా సినిమాలకు వ్రాశారు.
సినిమాలో యాక్టింగ్‌కు ఆకాశవాణి పర్మిషన్ ఇవ్వరు. ఒకనొక రోజు ఆయన ఆకాశవాణికి సాహసంగా రిజైన్ చేశారు. అప్పటి కింకా 20 సంవత్సరాల సర్వీసు ఆయనకు పూర్తికాలేదు. ఆరు నెలలు తక్కువ. సినిమా రిలీజ్ 6 నెలలు ఆగదు. 20 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే మినిమం పెన్షన్ వస్తుంది. ఆయన రిజైన్ చేయడానికి కలం తీసుకోగానే కరెంటు పోయిందట.
అయినా ఆయన నటుడిగా విజృంభించాడు. క్యారక్టర్ యాక్టర్‌గా నిలదొక్కుకొన్నాడు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమా ఫస్ట్ షోని కడప థియేటర్లో మేమిద్దరం కలసి చూశాం. ఆయన నన్ను ‘బావగారూ’ అని ఆప్యాయంగా పిలుచేవారు.
విజయవాడలో విజయకేతనం:
1995 – 97 మధ్య విజయవాడ ఆకాశవాణి కేంద్రలో పలువురు సినీ ప్రముఖుల రికార్డింగులు హైలైట్. జగ్గయ్య ఆకాశవాణి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. మధ్యాహ్న భోజనానికి మా ఇంటికి ఆహ్వానించాం. వడ్డించేటప్పుడు ‘వడలు తినన’ని మా ఆవిడతో అన్నారు. కారణం చిన్నతనంలో వారి తల్లి వడలు తింటే బుద్ధిమాంద్యం కలుగుతుందని హెచ్చరించడమే అన్నారు.
నటులు బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, కోట శంకరరావు, జంధ్యాల, గాయకులు యస్.పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ ప్రభృతులు పలు సందర్భాలలో విచ్చేశారు. భానుమతి, నాగేశ్వరరావులు రావడం హైలైట్.
జంధ్యాల విజయవాడ కేంద్రానికి చాలా నాటకాలు వ్రాశారు. పలువురు విజయవాడ కేంద్ర సిబ్బందిని సినిమాకు పరిచయం చేశారు. అందులో వీరభద్రరావు హాస్యనటుడిగా నిలదొక్కుకొన్నాడు. 1978-80 మధ్య మా తెలుగు ప్రసంగ శాఖలో ఆయన నాకు సహాయకుడు.
రావి కొండలరావు తన హాస్యంతో నవ్వుల పూలు విరియించారు. సినీ రచయిత, దర్శకులు డి.వి. నరసరాజు ఒక సాయంత్రం ఇంటర్య్యూ రికార్డు చేశారు. వారొక సహాయం కోరారు. వారికి హైస్కూలులో టీచరైన ప్రసాదరావు (85 సంవత్సరాలు) విజయవాడలో నివసిస్తున్నారు. వారికి సంబంధించి ఏ వివరాలు లేవు. వారిని కలిసి పరామర్శించి నమస్కరించాలనే కోరిక వెల్లడించారు.
మా సిబ్బందిలో వేగుల వంటి వారికి ఆ పని అప్పగించాను. తెల్లవారి 10 గంటలకు లబ్బీపేటలో నున్న గురువుగారిని నరసరాజు దర్శించి ఎంతో ఆనందం వెలిబుచ్చారు.
ధూళిపాళ రికార్డింగుకు వచ్చినప్పుడు నాకు సన్నిహితులయ్యారు. అప్పటికింకా ఆయన కాషాయ వస్త్రాలు ధరించలేదు. గుంటూరు గుజ్జనగూళ్ళలో ఆయన హనుమాలయం నిర్మించి ఆశ్రమ స్వీకారం చేసి నన్ను ఆహ్వానించారు.
విజయవాడలో స్థిరపడ్డ మిక్కిలినేని పలుమార్లు తన అనుభవాలు శ్రోతలతో పంచుకున్నారు. ఆ మధురస్మృతులు చిరస్మరణీం.
సినీ దర్శకులు రాఘవేంద్రరావు తిరుపతిలో అన్నమయ్య 600 జయంతి సభల ఏర్పాటు సమయంలోను, SVBC కార్యక్రమాలలోను సన్నిహితులయ్యారు. రేలంగి నరసింహారావు 1987లో నిర్మించిన ‘కాబోయే అల్లుడు’ సినిమా ఓపెనింగ్ షాట్లో గొల్లపూడి, రావి కొండరావు, నేను కలసి కనిపించడం నాకు విస్మయం.
శోభాదేవిగారి రచన స్వీకరించిన శ్రీ బ్రహ్మానందం
ఆధునిక దర్శకులో మోహన్ కృష్ణ ఇంద్రగంటి మా స్నేహితులు శ్రీకాంత శర్మ కుమారులు. వి.యన్. ఆదిత్య మా స్నేహితులు సత్యప్రసాద్ కుమారుడు. సుద్దాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్, చంద్రబోస్, అనంత శ్రీరామ్, తనికెళ్ల భరణి, వైజగ్ ప్రసాద్, గాంధీ, ఆకెళ్ల, ఆదివిష్ణు పరిచిత పూర్వులు. ఇంకెన్నో జ్ఞాపకాలు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
