Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-70

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

పాతతరం పండిత ప్రకాండులు:

20వ శతాబ్ది ప్రారంభంలో సుప్రసిద్ధ పండితులు పలువురు తెలుగు నేల నాలుగు చెరగులా వ్యాపించి భాషా సేవకు నడుంకట్టారు. ‘స్వర్థయావర్థతే విద్యా’ అనే రీతిలో పరస్పర వాదోపవాదాలతో తాము నమ్మిన సిద్ధాంతాల ప్రచారానికి సర్వశక్తులు ధారపోశారు. అలా వెలసినవే గ్రాంథిక వ్యావహారిక భాషోద్యమాలు. గిడుగు రామమూర్తి పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు ఈ కోవలోని వారు. వీర గ్రాంథిక భాషను వదలి విశ్వవిద్యాలయ పరీక్షలలో సమాధానాలు వ్యావహారిక శైలిలో వ్రాయడానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. సాహిత్య మాసపత్రికలు నలుమూలలా వెల్లువిరిశాయి. కాని దురదృష్టవశాత్తు ఆ పత్రికలు ప్రోత్సాహం లేక మూడు, నాలుగు సంవత్సరాలకు మంచి మనుగడ సాగించలేదు.

భారతి మాసపత్రిక ఆంధ్రపత్రిక అనుబంధ పత్రికగా దశాబ్దులు నడిచినా కాలగర్భంలో కలిసిపోయింది. భారతి పత్రికలో సాహిత్య విమర్శలు వింత పోకడలు పోయాయి. ‘అర్జునుడు ఏ వర్ణము (రంగు) వాడు’ వంటి అంశాల మీద కూడా పండితులు విమర్శనాస్త్రాలు గుప్పించారు. భారతిలో వ్యాసం ప్రచురించారంటే కిరీటదారియే. కాకినాడ నుండి జమీందారు ప్రోత్సాహంతో త్రైమాసిక పత్రికగా ‘ఆంధ్రసారస్వత పరిషత్’ పత్రిక వెలువడేది.

నిఘంటు నిర్మాణము, విజ్ఞాన సర్వస్వ నిర్మాణము ఒక యజ్ఞంగా దశాబ్దాల పాటు నడిచాయి. సూర్యారాయాంధ్ర నిఘంటువు ఆ కోవ లోనిదే. విజ్ఞాన సర్వస్వసంపుటులు అకారాది క్రమంలో విడుదలైనాయి. ‘అముద్రితాంధ్ర గ్రంథచింతామణి’ పేరుతో సాహిత్య మాసపత్రికను నెల్లూరు నుండి 1885లో పూండ్ల రామకృష్ణయ్య కొంత కాలం నడిపి అముద్రిత గ్రంథాలు ప్రచురించారు.

చాటు పద్య సేకరణకు వేటూరి ప్రభాకరశాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి అవిరళ కృషి చేశారు. దీపాల వారు గుర్రం మీద రహదారి సౌకర్యం లేని గ్రామాలు తిరిగి మూడు పద్యమణి మంజరి ప్రకటించారు. శాసన పరిశోధకులైన మల్లంపల్లి సోమశేఖరశర్మ గ్రామగ్రామాలు తిరిగి తెలుగు శాసనాలు ప్రచురించారు. కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వకళా పరిషత్ అధిపతిగా వున్నప్పుడు మల్లంపల్లి వారిని యూనివర్శిటీలో ఆచార్యులుగా నియమించారు. వారి గురించి “డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు రాని పాడు కాలన పుట్టి” అని విశ్వనాథ ఆవేశంతో పలికారు.

ఆనాటి ప్రసిద్ధ పత్రికలు:

  1. 1871 ఆంధ్రభాషా సంజీవని – కొక్కండ వెంకటరత్నం-రాజమండ్రి
  2. 1880 చింతామణి- రాజమండ్రి – వావిలాల వాసుదేవశాస్త్రి
  3. 1883 సతీహితబోధిని – రాజమండ్రి – కందుకూరి వీరేశలింగం పంతులు.
  4. 1895 శ్రీ వైజయంతి – పనప్పాకం ఆనందాచార్యులు
  5. 1896 శ్రీ శారద – బుచ్చిరెడ్డిపాళెం – దొడ్ల వెంకటరామిరెడ్డి.
  6. 1910 గౌతమి – రాజమండ్రి – శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి.
  7. 1902 హిందూసుందరి – కాకినాడ –మొసలి కంటి రమాబాయి.
  8. 1903 కల్పవల్లి – విశాఖపట్టణం – ఆచంట వెంకట సాంఖ్యాయనశర్మ.
  9. 1906 మనోరమ – రాజమండ్రి – చిలకమర్తి లక్ష్మీనరసింహం.
  10. 1910 ఆంధ్రభారతి – మచిలీపట్టణం – అయ్యంకి వెంకటరమణయ్య.
  11. 1912 ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రిక – కాకినాడ – త్రైమాసికం / ద్వైమాసికం.
  12. 1914 త్రిలింగ – మదరాసు –వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి.
  13. 1919 తెలుగు – పర్లాకిమిడి – గిడుగు వెంకటరామమూర్తి.
  14. 1919 సాహితి – తెనాలి – తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి.
  15. 1922 కళ – మదరాసు – జస్టిస్ పి.వి. రాజమన్నారు.
  16. 1923 ప్రబుద్ధాంధ్ర – రాయవరం – శ్రీపాదసుబ్రమణ్యశాస్త్రి.
  17. 1923 శారదా – మచిలీపట్టణం – కౌతా శ్రీరామశాస్త్రి.
  18. 1923 సరస్వతి – ముక్త్యాల – వాసిరెడ్డి సదాశివేశ్వరప్రసాద్
  19. 1924 భారతి – మదరాసు – గన్నవరపు సుబ్బరామయ్య.
  20. 1926 గోల్కొండ – హైదరాబాదు – సురవరం ప్రతాపరెడ్డి.
  21. 1927 గృహలక్ష్మి – మదరాసు – కె.యన్.కేసరి
  22. 1927 సుభాషిణి – రాజమండ్రి – పందిరి మల్లికార్జునరావు.
  23. 1930 జయంతి – బందరు – విశ్వనాథ సత్యనారాయణ.
  24. 1932 జ్వాల – విజయవాడ – ముద్దు కృష్ణ.
  25. 1935 ఉదయని – మదరాసు – కొంపెల్ల జనార్దనరావు.
  26. 1936 ప్రతిభ – రాజమండ్రి – తెలికిచర్ల వెంకటరత్నం
  27. 1939 ఆంధ్ర – పల్లెపాలెం – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి.
  28. 1944 ఆంధ్రమహిళ – మదరాసు – దుర్గాబాయ్ దేశముఖ్.
  29. 1947 శోభ – వరంగల్లు – దేవులపల్లి రామనుజరావు.
  30. 1947 కిన్నెర – మదరాసు – పందిరి మల్లికార్జునరావు.

వీరి సాహిత్యసేవ అపారం, అమోఘం.

అలనాటి సంపాదక మహాశయులు:

కొందరిని మాత్రమే స్మరిస్తున్నాను. మదరాసులో స్వరాజ్య పత్రిక స్థాపించి, ప్రకాశం పంతులు తాను లాయర్‍గా సంపాదిచిన ధనాన్ని స్థిరాస్థులను పత్రిక కోసం ధారపోసిన త్యాగశీలి. కృష్ణాపత్రికను సమర్థవంతంగా నిర్వహించిన యశస్వి ముట్నూరి కృష్ణారావు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నాలుగు సంవత్సరాలు పత్రికకు దూరంగా వుండవలసి వచ్చింది.

ధైర్యసాహసాలతో వివేకవర్ధని పత్రికను విరేశలింగం పంతులు స్థాపించి న్యాయవాద వృత్తికి దూరమై జడ్జీల కోపతాపాలకు గురిఅయ్యారు. వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి వావిళ్ల సంస్థ పక్షాన ఎన్నో సంస్కృతాంధ్ర గ్రంథాలు ప్రచురించారు. త్రిలింగ పత్రికను నడిపారు. గన్నవరం సుబ్బరామయ్య భారతి మాసపత్రికలో కాశీనాథుని నాగేశ్వరరావు సంపాదకత్వంలో 1938 దాకా పని చేశారు. సాహిత్య పత్రికగా దశాబ్దాలు సేవ చేసింది ఆ పత్రిక.

గిడుగు పిడుగు వ్యావహారిక భాషాద్యమ స్పూర్తి ‘తెలుగు’ పత్రికను నడిపారు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ఆ వాదాన్ని సమర్థించారు. వారి అవధానాలలో కూడా వ్యవహారికమే. పద్యనాటకాలు – పాండవోద్యోగ విజయాలు ప్రసిద్ధం కావడానికి వారు వాడిన సరళభాష మూలకారణం. ‘బావా! ఎప్పుడు వచ్చితీవు’, ‘అదిగో ద్వారక’ పద్యాలు ప్రసిద్ధం.

రాయలసీమలో ఆనంతపురం నుండి పప్పూరు రామాచార్యులు 1922లో పినాకిని పత్రికను స్థాపించారు. సహాయనిరాకరణోద్యమంలో పొల్గొన్నారు. శ్రీసాధన అనే పత్రికను కూడా మొదలెట్టారు.

నాలుగు దశాబ్దాల పాటు త్రివేణి ఆంగ్ల పత్రికను నడిపారు – కొలవెన్ను రామకోటీశ్వరరావు. అనేక కవితోద్యమాలను ప్రోత్సహించారు. వామ పక్షభావజాలంతో ‘నవశక్తి’ పత్రికను ముద్దూరి అన్నపూర్ణయ్య వెలువరించారు.

ప్రాతః స్మరణీయులు, దినపత్రిక వ్యవస్థాపకులు – కాశీనాథుని నాగేశ్వరరావు. 77 సంవత్సరాలు ఆ పత్రిక మనుగడ సాగించింది. శివలెంక శంభుప్రసాద్, శివలెంక రాధాకృష్ణ దినపత్రిక నిర్వహణ భారాన్ని మోశారు. ఆ తరం సంపాదకులలో ఖాసా సుబ్బరావు అగ్రగణ్యులు.

సురవరం ప్రతాపరెడ్డి చారిత్రక పరిశోధకులు, గోల్కొండ పత్రిక ద్వారా చారిత్రక పరిశోధనలకు ఊతమిచ్చారు. 24 సంవత్సరాలు పత్రికను నిరాఘాటంగా నడిపారు. 1926 మే నెల నుండి 1947 వరకు ఆయనే సంపాదకులు. పాఠకులలో ఆసక్తి పెంచడానికి తానే స్వయంగా ఏదో ఒక సామాజిక వివాదం లేవనెత్తేవారు. ‘ఆయన చేతుల్లో గోల్కొండ పత్రిక దినదిన ప్రవర్థమానమై యావదాంద్ర దేశంలోనూ పేరు పొందింద’ని హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రశంసించారు.

నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ సంపాదకులుగా ఒక కొత్త ఒరవడి సృష్టించారు. అప్పటి వరకు ఆంధ్రపత్రిక ఒక్కటే తెలుగు దినపత్రిక. 1938లో సహాయ సంపాదకులుగా ఆంధ్రప్రభలో చేరి 1942లో సంపాదక బాధ్యతలు చేపట్టారు 1958-59 మధ్య కార్మిక వివాదంతో యజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల రాజీనామా చేశారు. ఆంధ్రప్రభ సంపాదకులుగా పొత్తూరి వెంకటేశ్వరరావు గణనీయమైన గుర్తింపు పొందారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పని చేశారు. నార్లవారు ఆంధ్రజ్యోతి సంపాదకులయ్యారు. 1958-70 మధ్య రెండు దఫాలు రాజ్యసభ సభ్యులు.

దంపూరు నరసయ్య ‘నెల్లూరు పయోనీరు’ పత్రికా సంపాదకులు. 1900 సంవత్సరం ‘ఆంధ్రభాషా గ్రామ వర్తమాని’ వార్త పత్రిక నడిపారు.

ఒకే ఒక వ్యక్తి మూడు మాసపత్రికలను సాహిత్యపరంగా నడపడం విశేషం. రాజమండ్రికి చెందిన పందిరి మల్లికార్జునరావు సుభాషి, పందిరి, కిన్నెర పత్రిక విశేషాదరణ పొందాయి.

ఆంధ్రజ్యోతి సంపాదకవర్గంలో పని చేసిన నండూరి రామమోహన్ రావు, పురాణం సుబ్రమణ్యం శర్మ, తుర్లపాటి కుటుంబరావులు పాత్రికేయ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారు. తుర్లపాటి వారికి పద్మశ్రీ లభించింది.

గోరాశాస్త్రి సంపాదకశ్రేష్ఠులు.

ఈనాడు పత్రిక ప్రారంభంతో సి.హెచ్. రామోజీరావు దినపత్రిక యాజమాన్య రంగంలో నూతన అధ్యాయం ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యంలో కె.యన్.ప్రసాద్, డెక్కన్ క్రానికల్ టి.చంద్రశేఖరరెడ్డి రాజ్యసభ సభ్యులయ్యారు. సజీవ స్వరమైన ఏ.బి.కె.ప్రసాద్ పలు దినపత్రికల సంపాదకులు. విశాలాంధ్ర పత్రికను నడిపిన సి.రాఘవాచారి నిబద్ధత గల వ్యక్తి.

ఈ విధంగా పాత్రికేయ రంగ ప్రముఖులను స్మరించుకోవడం ఆనందదాయకం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version