[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
పరిశోధనా పరమేశ్వరులు:
పాత తరం పండితులు పరిశోధన విషయంలో మొండిఘటాలు. తాము పట్టిన అంశాన్ని లోతుగా తరచి చూచి నిర్ధారణకు వచ్చేవారు. అలా పట్టుబట్టి తమ శిష్యవర్గం చేత ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసేవారు. తిరుపతి వెంకట కవులకు రామకృష్ణ కవులకు కవిత్వ విషయంలో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. ‘గీరతం’ అలా వచ్చిందే. సాహితీ వివాదాలు, ఆక్షేపణలకు ప్రతిస్పందనగా తిరుపతి కవులు ప్రచురించారు. కేవలం ఆక్షేపణ లేకకుండా వ్యాకరణ, అలంకార శాస్త్రం, సాహితీ నియమాల మీద కత్తిదూశారు.
అదే రీతిలో వేదం వెంకటరామ శాస్త్రికీ, దీపాల పిచ్చయ్య శాస్త్రికి సాహిత్య వివాదం శిష్యుల ద్వారా చెలరేగింది. అది సాహితీ స్పర్ధ. ఇద్దరూ నెల్లూరు సీమవారే. ఇద్దరు చక్కని పండితులు. వేదం వారు ఆముక్తమాల్యద కావ్యానికి సంజీవనీ వ్యాఖ్య ప్రచురించారు. రాయలవారి నారికేళపాక పద్యాలకు వ్యాఖ్యానమది. దీపాలవారు సాహిత్య సమితి పేర విమర్శనాత్మక దాడి కొనసాగించారు. ‘విమర్శ పారిజాతం’ పేరుతోను, సాహిత్య సమీక్ష పేరనా వ్యాఖ్యానలోపాలను ఎత్తి చూపారు. ఆ కాలంలో వెలువడే ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికల్లో వీరు, వీరి శిష్యులు ఖండన మండనలతో లంఘించారు. తెలుగు కవిత్వంలో ప్రయోగ సాధుత్వంపై పరిశోధనలకు మార్గం సుగమమైంది. కేవలం వ్యక్తిగత విమర్శలు గాక, ప్రాచీన ప్రయోగాలు, శాస్త్ర ప్రమాణాలతో విమర్శనా పద్ధతిని పెంపొందించారు.
అన్వేషణా జ్యోతి – నిడుదవోలు వెంకటరావు 1944-60 మధ్య మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు మార్గనిర్దేశనం చేశారు. బి.ఏ. పరీక్షకు ఫీజు కట్టలేని స్థితిలో మదరాసులోని వావిళ్ల రామస్వామి శాస్త్రుల కంపెనీకి పద్యాలతో అభ్యర్ధన లేఖ పంపారు. పిఠాపురం రాజా కళాఆలలో (కాకినాడ) అధ్యాపకులయ్యారు. సుర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణంలో పాల్గొన్నారు. పరిశోధనలకు పెద్ద పీట వేసి ఎన్నో గ్రంథాలకు బహుళ పీఠికలు వ్రాశారు. ఉదాహరణ వాఙ్మయ చరిత్రలో త్రిపురాంతకోదాహరణ వెలుగులోకి తెచ్చారు.
ఆ తరం పరిశోధకులలో కోరాడ రామకృష్ణయ్య ప్రసిద్ధులు. మదరాసు ప్రాచ్యపరిశోధనా సంస్థలో అధ్యాపకులుగా తెలుగు, తమిళభాషల తులనాత్మక అధ్యయనానికి కృషి చేశారు. ద్రవిడయన్ ఎటిమలాజికల్ డిక్లనరీ ప్రకటించారు.
కోరాడ రామకృష్ణయ్యగారు
వీరశైవ సాహిత్య పునరుద్ధరణ దీక్షా కంకణ బద్దులు బండారు తమ్మయ్య (1891-1979) పాల్కురికి సోమనాథుని రచనలను వెలుగులోకి తెచ్చారు. పండితారాధ్య చరిత్ర, బసవపురాణాలను పరిష్కరించారు. పాల్కురికి సోమన జీవిత చరిత్ర సమగ్ర పరిశోధనా గ్రంథం. ద్విపద కావ్యాలను వెలుగులోకి తెచ్చిన దీశాలి.
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ (1893-1979) బహుభాషా పండితులు. తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన ప్రజ్ఞాశాలి. ప్రాకృత గాథా సప్తశతిని తేట తెలుగు పద్యాలతో అనువదించారు. వేమనపై విమర్శనాత్మక ప్రసంగాలు, రాయల నాటి రసికత ఆయన పాండిత్య ప్రకర్షకు నిదర్శనం.
అన్నమాచార్య కీర్తనలను లోకానికి పరిచయం చేసిన వారిలో వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి ప్రాతఃస్మరణీయులు. పాత తరం పరిశోధకులలో మానవల్లి రామకృష్ణకవి నన్నెచోడుని కుమార సంభవ కావ్యాన్ని వెలుగులోకి తెచ్చారు. నన్నయ కంటె పూర్వీకుడనే వాదన లేవనెత్తారు. విస్మృత కవుల పేరుతో ప్రాచీన కవులను లోకానికి పరిచయం చేశారు. క్రీడాభిరామం ప్రాధాన్యతను చాటిచెప్పారు.
మరో పరిశోధకులు చిలుకూరి నారాయణరావు వాఙ్మయతపస్వి. (1890-) అనంతపురం ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు. వజ్ఝుల చినసీతారామస్వామి శాస్త్రి వ్యాకరణ నిష్ణాతులు.
ఆంధ్రమహాభారత సంశోధిత ప్రతిని 8 సంపుటాలుగా ఉస్మానియా తెలుగు విభాగం పక్షాన పరిశోధన చేసిన అక్షర తపస్వి ఖండవల్లి లక్ష్మీరంజనం (1908-86) సంగ్రహ ఆంధ్రవిజ్ఞాన కోశం 8 సంపుటాల సంపాదకత్వం వహించారు. తర్వాతి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆంధ్ర మహాభారతానికి టీకా తాత్పర్యాలు వ్రాయించే బృహత్ ప్రయత్నం చేశారు. దీవాకర్ల వెంకటావధాని తొలి సంపాదకులు. తర్వాత డి.నాగసిద్ధారెడ్డి. చివరిగా ఆచార్య జి.వి.సుబ్రహమణ్యం 2007లో 25 సంవత్సరాల పండితకృషి 15 సంపుటాలుగా వెలువడింది.
ఖండవల్లి లక్ష్మీరంజనంగారు
విరాటపర్వంలో కొంత భాగానికి నేను (అనంత పద్మనాభరావు) వ్యాఖ్య వ్రాశాను. అదీ రీతిలో పోతన భాగవతానికి వ్యాఖ్యలు రెండు సమయాలలో తిరుపతి దేవస్థానం ప్రచురించింది. నండూరి రామకృష్ణమాచార్య సంపాదకులుగా కేవలం తాత్పర్యంలో ముందు ప్రచురించారు. ఆ తర్వాత అర్థతాత్పర్యాలతో విపులంగా రవ్వా శ్రీహరి సంపాదకత్వంలో వెలువడ్డాయి. చతుర్ధ స్కంధంలో కొంత భాగానికి నేను వ్యాఖ్యానించాను. భగవత్ కృప!
అన్నమయ్య సంకీర్తనా పరిశోధకులు:
తిరుమల ఆలయంలో భద్రపరచబడిన రాగి రేకులపై వున్న సంకీర్తనలు 14 వేలదాకా లభించాయి. ఒక అరలో మనుషులు దూరి ఆ రాగి రేకులను వెలికి తీసి చింతపండు రసంతో కడిగారో? ఏం చేశారో తెలియదు. వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పండిత పరిషత్తు పరిష్కరించి ముద్రణ మొదలు పెట్టింది. చెలికాని అన్నారావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా అప్పట్లో ఈ బృహత్ ప్రణాళికకు దోహదం చేశారు. వేటూరి, రాళ్లపల్లి ప్రభృతులు నాందీ ప్రవచనం చేశారు. తిరుమల శ్రీనివాసాచార్యులు ప్రాతఃస్మరణీయులు.
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు
రాళ్లపల్లి వారితో కలిసి పని చేసిన గౌరిపెద్ది రామసుబ్బశర్మ దాదాపు 27 సంపుటాల పరిష్కారణలో అత్యంత కీలకపాత్ర పోషించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజి లెక్చరర్. అన్నమయ్య జననకాలం 1408 సంవత్సరం అని పరిశోధనాత్మకంగా ప్రకటించారు.
సాధు సుబ్రమణ్యశాస్త్రి తిరుమల శాసనాలను, తాళ్లపాక వంశకవుల చరిత్రను, కాలాన్ని, శోధించే ప్రాథమిక పరిశోదనలు చేశారు. ఆకాశవాణి డైరక్టరుగా పని చేసిన బాలాంత్రపు రజనీకాంతరావు అన్నమయ్య సంగీత శైలి, పదకవితా లక్షణాలపై సాహిత్య విశ్లేషణ చేశారు.
అన్నమయ్య సాహిత్య పీఠాన్ని 1981లో పి.వి.ఆర్.కె. ప్రసాద్ నెలకొల్పి లోకానికి ఉపకారం చేశారు. తొలి డైరక్టరుగా తిరుపతి ఆర్ట్స్ కళాశాల తెలుగు లెక్టరర్ కామిశెట్టి శ్రీనివాసులును నియమించారు. గాయకులుగా గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, శోభారాజు ప్రభృతులు నియమితులయ్యారు. ఆంధ్రదేశమంతా ఈ బృందం సంచరించి లలిత సంగీత బాణీలో ప్రజలలోకి తీసుకెళ్లారు. తర్వాతి కాలంలో డా. మేడసాని మోహన్ మూడు దశాబ్దాలు ఆ వెలుగులను అంతర్జాతీయంగా ప్రసరింప చేశారు.
మంగళపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, యం.యస్.సుబ్బలక్ష్మి, నూకల చిన్న సత్యనారాయణ, శ్రీపాద పినాకపాణి ప్రభృతులు స్వరకల్పనలు గానం చేసి అన్నమాచార్య కీర్తనలకు పట్టం గట్టారు. అన్నమాచార్య సంకీర్తనల సంపుటాలు పునర్ముద్రణ చేశారు.
శ్రీ వెంకటేశ్వర రికార్డు ప్రాజెక్టు స్థాపించి అన్నమాచార్య కీర్తనలు సుప్రసిద్ధ గాయకులచే వేలాదిగా ఆడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేశారు. ఆ విభాగం అధిపతిగా కామశెట్టి శ్రీనివాసులు గణనీయ కృషి చేశారు. నేనూ 2005-2007 మధ్య వెయ్యి దాకా కీర్తనల రికార్డింగు చేసే కార్యక్రమానికి కోఆర్డినేటర్ని.
సాహిత్య చరిత్రకారులు:
తెలుగు సాహిత్య చరిత్ర రచనలో పలువురు కష్టించి పని చేశారు. ప్రాచీన కవులలో పలువురు తమ జీవిత విశేషాలను గ్రంథావతారికలో పాల్గొనలేదు. తెలుగు కవుల చరిత్ర రచయితలలో కందుకూరి వీరేశలింగం ఆద్యులు. ఆంధ్రకవుల చరిత్ర మూడు భాగాలు వీరేశలింగం ప్రచురించారు. వంగూరి సుబ్బారావు ఆంధ్ర కవుల చరిత్ర తరువాత వెలువడింది. వారి ఆంధ్ర శతక కవుల చరిత్ర ప్రామాణికం. ఆంధ్ర రచయితలు పేరుతో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి (1920-1992) 20వ శతాబ్ది కవులను పరిచయం చేశారు.
ఆంధ్రసాహిత్య చరిత్రకారులలో అగ్రగణ్యులు పింగళి లక్ష్మీకాంతం. వీరు ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖాధిపతిగా ఎం.ఏ. విద్యార్ధులకు సాహిత్య చరిత్రకు బోధించి నోట్స్ చెప్పారు. ఆ నోట్సును పలువురు శిష్యులు వారి కంటే ముందు తమ రచనలుగా ప్రచురించారు. పింగళి వారి సాహిత్య యుగ విభజన చెలామణీలో చాలా కాలం వుంది.
నిడదవోలు వెంకటరావు దక్షిణాంధ్ర వాఙ్మయ చరిత్ర సృష్టికర్త. సమగ్ర ఆంధ్ర సాహిత్యం 12 సంపుటాలుగా ఆరుద్ర రచించారు. ఎమెస్కో ప్రచురించింది. సంవత్సరాల పాటు దేశమంతా గ్రంథాలయాలలో నెలలతరబడి కూచుని అజ్ఞాతకవుల విషయాలు సేకరించారు.
నిడదవోలు వెంకటరావుగారు
ఉస్మానియా విశ్వవిద్యాలయాల ఆచార్యులు దివాకర్ల వెంకటావధాని, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు కొర్లపాటి శ్రీరామమూర్తి, వెలమల సిమ్మన్న, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆచార్యులు జి.నాగయ్య సాహిత్య చరిత్రలు విశిష్టాలు. గిడుగు సీతాపతి History of Telugu Literature ఆంగ్లంలో వినూత్న రచన. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు యస్.వి.రామారావు శతజయంతి సాహితీమూర్తులు. వీరి రచనలను నీల్కమల్ పబ్లిషర్స్ ప్రచురించారు.
ద్వానాశాస్త్రి
ద్వానాశాస్త్రి రచించిన తెలుగు సాహిత్య చరిత్ర పోటీ పరీక్షల అభ్యర్దులకు ఉపయోగకారిగా వేలాది కాపీలు విశాలాంద్ర ప్రచురించింది.
పరిశోధనయే తమ జీవిత పరమావధిగా ఎందరో మహనీయులు సంవత్సరాల తరబడి వ్యయ ప్రయాసలకోర్చి శ్రమించారు. వారి కృషి చిరస్మరణీయం. వారు డాక్టరేట్ బిరుదులకు, పద్మశ్రీల కోసం వ్రాయలేదు. ఆత్మసంతృప్తి కోసం వ్రాశారు. నమోస్తు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
