[‘వందిమాగధులు’ అనే ఈ సినీ వ్యాసంలో ‘దానవీర శూర కర్ణ’ సినిమాలోని ‘జయీభవ! దిగ్విజయీభవ!’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
పూర్వం మహారాజుల దగ్గర వందిమాగధులు అనేవారు ఉండేవారు. వంది, మాగధుడు ఇద్దరూ రాజుగారు సభలోకి అడుగు పెట్టేటప్పుడు ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ “రాజాధిరాజ.. రాజమార్తాండ..” అంటూ ఉండేవారు. ఆయన సభలోకి అడుగు పెట్టేటప్పటికి సభికులు అందరూ గౌరవంగా లేచి నిలబడేవారు. ఇలా వందిమాగధులకు జీతాలిచ్చి పొగిడించుకోవాల్సిన అవసరం ఏమిటి? అనిపిస్తుంది సాధారణంగా. రాజులు తరచూ యుద్ధాలకు వెళ్ళాల్సి వస్తుంది. యుద్ధంలో జయించవచ్చు లేదా ఓటమి ఎదురు కావచ్చు. జయాపజయాలు దైవాధీనాలు. ఒకవేళ ఓడిపోతే ఆ మహారాజు నిరాశ పడి కార్యవిముఖులు కాకుండా, గత వైభవాన్ని గుర్తుకు తెచ్చి ఉత్సాహం కలిగిస్తూ ఉంటారు వందిమాగధులు. ఇది పూర్వులు పెట్టిన ఆచారం.
‘దానవీర శూర కర్ణ’ (1977) చిత్రంలో దుర్యోధనుడు కొలువుకూటం లోనికి ప్రవేశించేటప్పుడు వందిమాగధులు పాడే ఒక చక్కటి గీతం ఉన్నది. దీనిని సి.నారాయణ రెడ్డి రచించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్ గానం చేశారు. ఇందులో దుర్యోధనుడుగా యన్.టి.రామారావు నటించారు. ఆ పాట ఒకసారి గుర్తు చేసుకుందాం.
“జయీభవ! దిగ్విజయీభవ!
చంద్రవంశ పాదోధి చంద్రమా!
కురుకుల సరసీ రాజ హంసమా!”
భవము అంటే శుభము, పాదోధి అంటే సముద్రము, సరసి అంటే కొలను, సరసు అని అర్ధాలు. నీకు జయమగు గాక, దిక్కులను జయించిన వాడా నీకు శుభమగు గాక, చంద్ర వంశం అనే సముద్రము లో ఉదయించిన చంద్రుడి వంటి వాడా, కురువంశం అనే సరసు లో విహరించే రాజహంస వంటివాడా! నీకు జయమగు గాక! అంటూ మొదలు పెడుతున్నారు స్తోత్ర పాఠకులు.
చంద్రుడు సముద్రంలో ఎలా పుట్టాడు? అనే సందేహం వస్తుంది చదువరులకు. ఆ కథేమిటంటే— ఒకసారి దుర్వాస మహర్షి వైకుంఠం వెళ్లి విష్ణువుని పూజిస్తాడు. విష్ణువు సంతోషించి ఒక పారిజాత పుష్పాన్ని బహుమతిగా ఇస్తాడు. దుర్వాసుడు తిరిగి వస్తూండగా దారిలో ఇంద్రుడు కనబడి “మహర్షీ! ఎక్కడ నుండీ రాక!” అని పలకరించాడు. తను వైకుంఠానికి వెళ్లి వస్తున్నానని చెప్పి పారిజాతాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు దుర్వాసుడు.
“ఇలాంటి పూలు నా నందనోద్యాన వనంలో కోకొల్లలుగా ఉన్నాయి” అని ఇంద్రుడు నిర్లక్ష్యంగా ఐరావతం కుంభస్థలం మీద పెట్టాడు. ఆ పువ్వు చుట్టూ భ్రమరాలు చేరి జుమ్మని మ్రోగుతూ ఉంటే ఐరావతం చిరాకుగా దాన్ని తొండంతో కిందకు విసిరి కాలితో తొక్కేస్తుంది. అది చూడగానే దుర్వాసుడికి ఆగ్రహం వచ్చింది. “ఓయీ! ఇంద్రా! సురాపాన మత్తుడవై శ్రీహరి ప్రసాదాన్ని కింద పడేసి కించపరిచావు గనుక నీ సమస్త సంపదలూ సముద్రంలో పడిపోవు గాక!” అని శపించి వెళ్ళిపోయాడు.
వెంటనే స్వర్గ లక్ష్మి రూపంలో ఉన్న లక్ష్మీదేవి అమరావతిని వదలి వెళ్ళిపోయింది. ఆమె వెంటనే చంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు మొదలైనవి అప్సరసలతో సహా అన్నీ వెళ్ళిపోయాయి. ఇంద్రుడు వెళ్లి విష్ణువుకు క్షమాపణ చెప్పి వేడుకున్నాడు. “నా భక్తులను అవమానిస్తే నన్ను అవమానించినట్లే! పారిజాతాన్ని నిర్లక్ష్యం చేశావు కాబట్టి మహాలక్ష్మి కోపించింది. దేవతలంతా వెళ్లి క్షీర సముద్రాన్ని చిలకండి. లక్ష్మి, ఆమెతో పాటు వెళ్ళినవి అన్నీ మళ్ళీ ఉద్భవిస్తాయి” అని చెప్పాడు విష్ణువు.
దేవతలు రాక్షసుల సాయం తీసుకుని మంధర పర్వతం కవ్వంగా, వాసుకిని కవ్వపు తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని మధించగా లక్ష్మీదేవి, చంద్రుడు, కల్పవృక్షం అన్నీ మళ్ళీ పుట్టాయి. ఆ విధంగా చంద్రుడు సముద్రంలో నుంచీ పుడతాడు.. సరే! మళ్ళీ పాట విశ్లేషణ లోకి వద్దాం..
“ధన్య గాంధారి గర్భ శుక్తి ముక్తా ఫలా!
మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజః ఫలా!
దిగ్గజ కుంభ విదారణ చణ శత సోదర గణ పరివేష్టితా!
చతుర్దశ భువన చమో నిర్దళన చటుల భుజార్గళ శోభితా!”
ఇక్కడ శుక్తి అంటే ముత్యపు చిప్ప అనీ, తిమిరం అంటే చీకటి అనీ, విదారణము అంటే చీల్చబడినది అనీ, చటుల అంటే వేగవంతమైన, అర్గళ అంటే శక్తి అని అర్ధాలు. దుర్యోధనుడు గాంధారీ దేవి గర్భం అనే ముత్యపు చిప్పలో పుట్టిన ముత్యం వంటి వాడు ! అతడు పుట్టటంతో గాంధారి ధన్యురాలైంది. అందరి చేత గౌరవింపబడే ధృతరాష్ట్ర మహారాజు కంటి చీకట్లను పోగొట్టే వెలుగు వంటి వాడు అని అంటున్నారు. అంటే దుర్యోధనుడు తండ్రి దగ్గరే ఉండి తండ్రికి కావలసిన సేవలు చేస్తూ, కాపాడుతూ కళ్ళు లేని లోటు తీరుస్తున్నాడు. తనే ఆయన కంటి వెలుగు లాంటి వాడు అని భావం.
ఏనుగు కుంభస్థలాన్నైనా ఛేదించ గలిగిన శక్తి గలిగిన వంద మంది సోదర బృందం చేత పరివేష్టితుడైన వాడు, పద్నాలుగు లోకాల లోని సైన్యాన్ని కకావికలం కావించిన సమర్థవంతమైన భుజాల చేత ప్రాకాశించే వాడు అని దుర్యోధనుడిని ప్రశంసిస్తున్నారు వందిమాగధులు.
“కవి గాయక నట వైతాళిక సంస్తూయమాన విభవా భరణా!
నిఖిల రాజన్య మకుట మణి ఘ్రుణీ నీరాజిత మంగళ చరణా!
మేరు శిఖరి శిఖరాయమాన గంభీర ధీర గుణ మానధనా!
క్షీర పయోధి తరంగ విమల విస్ఫార యశోధన సుయోధనా!”
మహారాజులకు వేకువనే మేలుకొలుపులు పాడేవారిని వైతాళికులు అని అంటారు. సంస్తవము అంటే స్తుతి, ఘ్రుణి అంటే వెలుగు, శిఖరి అంటే కొండ, పయోధి అంటే సముద్రం, విమల అంటే నిర్మలమైన, యశస్సు అంటే కీర్తి, విస్ఫార అంటే అధికమైన అని అర్ధాలు. కవులు, గాయకులు, నటులు, మేలుకొలుపు పాడేవారు మొదలైన జనులు అందరూ స్తుతి చేయటం అనే సంపదే ఆభరణంగా కలవాడు, సమస్త రాజన్య లోకం యొక్క కిరీటాల లోని మణుల వెలుగులతో నీరాజనాలు అర్పించే శుభమైన చరణాలు కలవాడు, మేరు పర్వత శిఖరం అంతటి గంభీరమైన, ధైర్య గుణాలు కలిగిన మానధనుడు, పాలసముద్ర తరంగాల కంటే ఎక్కువ స్వచ్చమైన యశస్సు కలిగిన వాడు సుయోధనుడు అని కీర్తిస్తున్నారు స్తోత్ర పాఠకులు.
“జగనొబ్బ గండ జయహో!
గండరగండ జయహో!
అహిరాజ కేతనా జయహో!
ఆశ్రిత పోషణా జయహో!”
గండ అంటే మగవాడు, అహి అంటే సర్పం అని అర్ధాలు. ప్రపంచం మొత్తం మెచ్చే మగవాడు, వీరాధి వీరుడు, సర్పరాజు జండాపై కలిగిన వాడు, ఆశ్రయించిన వారిని కాదనకుండా పోషించేవాడు అయిన సుయోధనుడికి జయమగు గాక! అని కీర్తిస్తున్నారు.
అర్జునుడి జెండా మీద హనుమంతుడు ఉంటాడు. భీష్ముడి జెండా మీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది. ఇలా ఒక్కక్కరి జెండా మీద ఒక్కొక్క గుర్తు ఉంటుంది. విరాటపర్వంలో ఉత్తర గోగ్రహణం సందర్భంలో కౌరవ సేనని చూసి ఉత్తరుడు “వారిలో ఎవరెవరు వీరులు ఉన్నారో నీకు తెలుసా!” అని అడుగుతాడు బృహన్నలని. కౌరవ వీరుల కేతనాలను చూపించి వారిని పరిచయం చేస్తూ “కాంచన మయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు..” అనే ఒక మంచి పద్యం ఉన్నది. అందులో దుర్యోధనుడి గురించి చెప్పేటప్పుడు “మణి మయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితి పతి..” అని పరిచయం చేస్తాడు బృహన్నల. అంటే “మణులతో పొదగబడిన పడగ గల నాగుపాము జెండాగా కలవాడు దుర్యోధనుడు” అని అర్ధం. తిక్కన రచించిన పద్యంలోని ఆ అర్థం స్పురించేటట్లు “అహిరాజ కేతనా..” అనే పదప్రయోగం చేశాడు కవి సి.నా.రె., ఈ పాటలో.
ఈ పాట చిత్రీకరణ చాలా బాగా చేశారు. దుర్యోధనుడు వస్తున్నట్లుగా వేత్రహస్తులు (వేత్రదండం ధరించిన వారు) బరాబరులు (బహుపరాక్ అనే హెచ్చరికలు) చెబుతూండగా, వందిమాగధులు స్తోత్ర పాఠాలు చదువుతూ ఉండగా, పరిచారికలు ముందుండి, నడిచే దారిలో పూలు చల్లుతూ, పుణ్యాంగనలు హారతులు పడుతూ ఉండగా శతసోదరులతో కలసి నడిచి వస్తూ ఉంటాడు రారాజు. రారాజుగా యన్.టి.రామారావు ఆజానుబాహు రూపంతో గద భుజం మీద పెట్టుకుని, వెనక వైపు పొడవాటి వస్త్రం (హుడ్) వేలాడుతూ ఉండగా, రాజసంగా, సింహపు నడకలతో నడవటం, సగర్వంగా మీసం మెలివేయటం.. ఇవన్నీ చూసి ఆ అభినయానికి ఎవరైనా ముగ్ధులు అవక తప్పదు. మహాభారతంలో దుర్యోధనుడి గుణగణాలను కురువృద్ధుల నోటిమీదుగా వివరించటమే ఎక్కువగా ఉంటుంది తప్ప ఆయన రాజ్య పాలన గురించి ఉండదు (హస్తినాపురాన్ని13 ఏళ్ళు పరిపాలిస్తాడు దుర్యోధనుడు). ఈ సన్నివేశం చూస్తే ఆనాటి దుర్యోధనుడు ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది.
ఈ సన్నివేశంలో ఇంకా శకుని గా ధూళిపాళ, దుశ్శాసనుడుగా జగ్గారావు కూడా కనిపిస్తారు.
(‘జయీభవ! దిగ్విజయీభవ!’ అనే పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=jqgqgyFxH_c )
***
వందిమాగధులను హాస్య సన్నివేశాలకు వాడుకోవటం కూడా కొన్ని సినిమాల్లో కనిపిస్తుంది. ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో రాజుగారి చిన్నకొడుకు సేనాపతితో చేతులు కలిపి, అక్రమంగా తండ్రిని చెరసాలలో పెడతాడు. మరుక్షణం చెరసాల దగ్గరకే వందిమాగధులను పిలిపించి, “ఇప్పుడు నేనేగా రాజును. నా దండకం చదవండి” అంటాడు.
“చిత్తం.. చిత్తం.. మత్స్యావతార, కూర్మావతార, వరహావతార..” అని ఏదో చెప్పబోతారు.
“ఇదిగో! సంస్కృతంలో మీరు తిట్టినా నాకు అర్థం కాదు, తెలుగులో చదవండి”
“చేపగా, తాబేలుగా, పందిగా..”
“ఏమిటా కూతలు?”
“కూతలు కావు ప్రభూ! అన్ని అవతారాలు ఎత్తిన ఆదినారాయణు ఆశీర్వదించాలని..”
“నాకు ఆశీర్వాదాలు అక్కర్లేదు. నేను చేసిన ఘనకార్యాలు పొగడండి”
“ఘనకార్యాలా!.. ఓ.. అలనాడు సీతను చెరపట్టినట్లు ఇలనాడు రాజ్యలక్ష్మిని చెరపట్టిన..”
“ఆ.. ఆ.. రావణబ్రహ్మ’’
“ఆ రావణ బ్రహ్మా! బహుపరాక్..”
“బాగుంది.. బాగుంది.. ఇంకా..”
“ముల్లోకములు కల్లోల పడగా తల్లిదండ్రులనే చెరలో నుంచిన..”
“ఆ.. ఆ.. కంసబ్రహ్మ..”
“ఆ కంసబ్రహ్మా! బహుపరాక్..”
ఇదంతా చెరసాలలో నుంచీ చూస్తున్న మహారాజు “నీకీ పురాణం జ్ఞానం కూడా నా ఖర్మరా.. ఖర్మ..” అని తల గోడకేసి కొట్టుకుంటాడు.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.

