Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వంటిల్లు

[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘వంటిల్లు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

న ఇల్లు మనకు స్వర్గం. అందులో వంటిల్లు కల్పవృక్షం.

ఊహ తెలిసినప్పటి నుంచీ అమ్మకూ, వంటింటికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని చూస్తూ పెరగటం నాకు అలవాటై పోయింది. అమ్మ జీవితం, రోజులో ఎక్కువ భాగం వంటింట్లోనే..! తెల్లవారు ఝామున ఐదుగంటలకు మొదలవుతుంది అమ్మ వంటింట్లో అడుగుపెట్టడం! రాత్రి తొమ్మిది గంటలకు వంటిల్లు సర్దుకొని అలసిసొలసిన శరీరంతో పక్కమీదికి వెళ్తుంది. పొద్దున కట్టెల పొయ్యి వెలిగించిందంటే దాని మీద కాఫీలు, టిఫిన్లు, అన్నం, కూరలు, పప్పు, పులుసూ, సాయంత్రం మళ్లీ పకోడీలు, పునుగులు వంటి అల్పాహారాలూ, రాత్రికి మళ్లీ ఇన్ని బియ్యాన్ని ఇత్తడి తెప్పాలాలో పడేయటం – ఇలా అదొక నిరంతర వంటప్రక్రియ. కట్టెలపొయ్యికి అనుబంధంగా అన్నట్టు దాలిగుంట, బొగ్గుల కుంపటి వాటిపని అవి చేస్తూ వుంటాయి. పిడకల వేడికి మరుగుతూ పాలు, నిప్పుల వేడికి మెల్లిగా ఉడుకుతూ ఉత్తపప్పు. ఇది నేను నా చిన్నతనంలో చూసిన మా అమ్మ వంటిల్లు. “తినే పదార్థాలు ఉడికి, పెట్టె చోటు గనుక అదెప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి” అనేది అమ్మ. అందుకోసమని ఆవుపేడతో పొద్దున్నే ఇల్లలికి సున్నం రాయితో చేసిన ముగ్గు పిండితో నాలుగు పక్కలా నాలుగు కర్రల ముగ్గు నాలుగు వేళ్ళలో ఒడుపుగా వేసేది. అప్పుడు మా వంటిల్లు మట్టి నేలతో ఉండేది కదా. అందుకని అలుకుగుడ్డతో అలకటం, ముగ్గు వేయటం జరిగేది. మా అమ్మ లేవగానే ఫస్ట్ చేసే పని అదే. ఆ తర్వాతే పొయ్యి వెలిగించేది.

ఆవుపేడ, సున్నం ముగ్గు వల్ల సూక్ష్మక్రిములు వంటింట్లోకి రావట, పొద్దుటి వేళ రోజు కొక్కేసారయినా ‘ఈ మాట’ అనేది మా అమ్మ. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మా వంటింటికి కొంచెం దూరంలో ఉన్న ఓ చిన్న పాక కొట్టంలో మాకు ఒక తెల్లావు ఎప్పుడూ కట్టేసి వుండేది మేతకు వెళ్ళినప్పుడు తప్ప – దాన్ని మేము కామదేనువు అని పిలిచేవాళ్ళం. మా ఇంటిల్లిపాదికీ దాని పాలే తాగటానికి. అన్నంలో కలుపుకునే వెయ్యి, పెరుగు కూడా అన్నీ దాని పాల నుంచే తయారు చేసేది అమ్మ. మా అమ్మ పేరు అన్నపూర్ణ, పేరుతో పిల్లలమైన మాకేం పని; ‘అమ్మ’ అన్న కమ్మనైన పిలుపుండగా. మా ఇంటి ముందుకొచ్చిన మా ఊరి అమ్మలక్కలు ‘అన్నపూర్ణమ్మ! గారూ’ అని పిలుస్తుంటే అప్పుడే తెలిసింది అమ్మ ‘పేరు’ అది అని. అన్నపూర్ణ అన్నం దేవత అని గుళ్లో పంతులు గారు ఒక రోజు చెబుతుంటే విన్నాను. ‘మా అమ్మకు ఆ పేరు భలే సూట్ అయింది’ అని అనిపించింది నా మటుకు నాకు. ఏ కూర చేసినా, ఏ పప్పు చేసినా భలే రుచిగా ఉండేది. కట్టెల పొయ్యి మీద వంట రుచిగా బాగుంటుందట కదా – నాకేం తెలుసు, ఆడవాళ్ళు అనుకుంటుంటే విన్నాను. కుంపటి మీద మరుగుతున్న ఆ చారులోని ధనియాలు, మిరియాల వాసన అంటే మాత్రం భలే ఇష్టం నాకు.

ఉత్త పప్పు ఉడుకుతుంటే కూడా అదో విధమైన వాసన భలేగా వచ్చేది. మా జొన్న చేలో కాసిన దోసకాయలతో అమ్మ పచ్చడి ముక్కలు చేసేది. అదయితే ఎంత బాగుండేదో. గిసగిసా నూరుతున్న ఆ రోటి శబ్దమే వినటానికి చెవులకు ఎంత బాగుండేదో. మా అమ్మ ఎలా కనిపెట్టిందో కానీ నాకు కాస్త తిండియావ ఎక్కువనీ – భోజనప్రియుడ్ని అనీ కనిపెట్టేసింది.

నాకొక్కడికి ఆ పేరు వచ్చిందిగానీ నిజానికి మా ఇంట్లో అందరూ బాగానే తింటారు. అంత పెద్ద కిచనూ – అందులో గరిట చేతిలో పట్టుకొని మా అన్నపూర్ణమ్మ తల్లి, ఆమె రోజూ వండే రకరకాల వంటలు ఉన్న ఇంట్లో ఎవరయినా తిండిపోతులుగానే తయారవుతారు. అందులోనూ, ‘ఏదో ఇంత వండి పడేసాను’ అన్నట్టు వండుతుందా మా అమ్మ- ఆయా వస్తువుల, పదార్థాలను వంటకోసం వాడుతూ వాటికి సంబంధించిన ఆరోగ్యసుత్రాల నన్నింటిని కూడా వల్లె వేస్తుందాయె!

“తోటకూరలో పోషకపదార్థాలు చాలా ఉంటాయి. మినుములు, వంటికి బలం. బీరకాయ వంటి చలువకు, గోంగూర వేడికి పనికొస్తాయి” అంటూ స్వగతాలు ఎన్ని మాట్లాడకుంటూ వుంటుందో తనలో తాను. అవన్నీ నా చెవిలో బడి నన్ను కూడా కాస్త పాకశాస్త్ర పండితుని చేసాయి. అయినా అప్పుడు నా వయసు ఎంతని పట్టుమని పదహారేళ్లు కూడా వుండేవి కావేమో. మా అమ్మ వంటను బాగా వంటికి పట్టించుకొని వుండటం వల్ల కాస్త పుష్టిగా, ‘ఇంత’ ఏపుగా పెరిగాను. ఆరోగ్యకరమైన వంటింటి వాతావారణం; అంతకన్నా ఆరోగ్యకరం, పుష్టికరం అయిన వంటకాలు వండే అమ్మ ఉంటే ఎవరైనా ఏపుగానే పెరుగుతారు. నేను ఒక బెత్తెడు ఎత్తు, ఒక వలయం లావూ ఎక్కువుంటానేమోగానీ ఆ లెక్కన మా ఇంట్లో మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్న అందరం కూడా పుష్టిగానే ఉంటాం. మా వంటిల్లు వంటశాల మాత్రమే కాదు మందుల దుకాణం కూడా కదా మరి. సొంటి, జీలకర్ర, వాము, ఇంగువ, ధనియాలు పసుపు వంటి దివ్వౌషధాలు చెక్క అలమారాల్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వాటిని ‘దీనికిది, దానికది’ అంటూ రెడీగా పెట్టుకొని మాకిచ్చే డాక్టర్ మా అమ్మ గనుక ఏ రోగాలూ మా దరి చేరేవి కావు.

“కేశవా! అన్నానికి రా నాన్నా!”

అదిగో అమ్మ గొంతు – నన్ను అన్నానికి పిలుస్తోంది. ఎప్పుడూ అదే పిలుపు.

అమ్మకూ, వంటిల్లుకు అవినాభావ సంబంధం మరి. ‘ఆ రోజులే వేరు’ అనుకున్నాను. కేశవ్ అనే పేరు గల నేను ఆ కాలం నుంచి ఈ కాలంలోకి సడన్‍గా వచ్చిపడుతూ.

***

“ఏమండీ. బ్రేక్‌ఫాస్ట్‌కి రండి త్వరగా. నాకు ఆఫీసుకు టైమ్ అవుతోంది. మీరు ‘లేట్’ చేస్తే ‘నాకు’ లేటవుతుంది” అని మా ఆవిడ మంజుల కేకేసింది కిచెన్ నుంచి. దానికి కోరస్ అన్నట్టు గ్యాస్ స్టవ్ మీది నుంచి ప్రెజర్ కుక్కర్ విజిల్లూ, కుయ్ కుయ్ మంటూ మైక్రో వోవెన్ శబ్దం వినిపించాయి. హీటింగ్ టైమ్ అయిపోయినా ఇంకా అందులో పెట్టిన గాజుపాత్ర తీయకపోతే అది అలాగే మొత్తుకుంటుంది. మంజుల ఫ్రిజ్ లోనుంచి ఇప్పుడే ఏదో తీసి ఠక్కున తలుపేసి పోయింది – తలుపు సరిగా పడలేదేమో అది ‘కుయ్. కుయ్’ మని మొత్తుకోవటం మొదలు పెట్టింది. చెయ్యి తెరిపి లేకపోవటం వల్ల ఫ్రిజ్ దగ్గరికి రాకుండా సుమీత్ మిక్సీలో ఏదో పచ్చడి నూరుతోందిలా వుంది. అది బర్ బర్‌మని అరవడం మొదలు పెట్టింది. నా చెవులు ఆ బృందగానానికి బద్దలవుతుండటంతో నేనే లేచి ఫ్రిజ్ డోర్ వేసాను. మంజుల ఇడ్లీలున్నీ హాట్‌ప్యాకు, కారప్పొడి, నా దగ్గర పెట్టి పెద్ద శబ్దంతో స్టీలు ప్లేట్‌ని విసురుగా డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది – వెళ్ళింది కాదు ఉరికింది. ఆ టైమ్‌లో ఆమె నడవదు. ఉరుకులు పెడుతూ ఉంటుంది.

నల్లగా ఉన్న కారప్పొడిని స్పూన్ ప్లేట్లో వేసుకుంటూ ‘మా అమ్మ రోట్లో కారప్పొడి కొడితే – ఆ రుచి ఉండేదీ! పొడి తడిసి ముద్దయ్యే దాకా నెయ్యి పోసేది’ అనుకుంటూ షాప్‌లో కొనుక్కోచ్చిన రుచీపచీ లేని కారప్పొడిని ఇడ్లీ ముక్కకు అద్ది నోట్లో పెట్టుకున్నాను. నాలో నేను స్వగతంలో అనుకున్నా మంజుల ముఖం ముడుచుకపోయింది. మిక్సీ జార్లో నుంచి ఇడ్లీ చట్నీని నా ప్లేట్లో వేస్తుంటే చూసి అప్రయత్నంగానే “ఇలా స్విచ్ వెయ్యగానే అలా చట్నీ నలుగుతుందేమో, మిక్సీలో. అందుకే ఆ రోటి టేస్ట్ రాదు” అన్నాను మళ్ళీ నాలో నేను అనుకుంటున్నట్టుగానే. ఈ మధ్య వినేవాళ్ళు ఎవరూ లేకపోవటంతో నాకు స్వగతాలు ఎక్కువైపోయాయి. అయినా మా ఆవిడకు వినబడుతూనే ఉంటాయి అదేంటో మరి.

చట్నీ జార్ పైకెత్తి పట్టుకొని ఇంతింత కళ్లు చేసుకొని నావంక షార్ప్ గా చూసింది. ‘నోరు మూస్తారా లేకుంటే ఈ చట్నీ నెత్తిన గుమ్మరించనా?’ అన్నట్టుంది నిలుచున్న ఆ పోజు. అది చూసి “అహఁ. నిన్ను అనటం లేదూ. నువ్వూ వర్కింగ్. నాలా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు నీకు – నువ్వు ఆఫీసుకు వెళ్ళాలి. నాలో నేను పట్టిగానే అనుకుంటున్నాను. అసలూ – నిన్ను కాదులే – నాకు వంట నేర్పని మా అమ్మను అనాలి. ‘మగ పిల్లాడివి – మగపిల్లాడివి’ అంటూ సిద్ధిలా నన్ను పీట మీద కూర్చోబెట్టి మరీ దగ్గరుండి భోజనం వడ్డించేది. అందుకే ఇలా తయారయ్యాను” అన్నాను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటున్న ధోరణిలో.

“మీరిలా రుచులు బాగా మరిగి వంటకు సంబంధించిన సజేషన్స్ ఇలాగే ఇచ్చారంటే ఈ మాత్రం వంట కూడా చెయ్యకుండా కిచెన్‌కి తాళం వేసేస్తాను. ఆ కాలంలో మీ అమ్మ చేసినట్టు పొడులు, పచ్చళ్లు రోట్లో నూరుతూ – ఇడ్లీ పిండి రుబ్బుపోత్రంతో రుబ్బుతూ చేయాలంటే ఎలా కుదురుతుంది. కాలంతో పాటు మారలేరా మీరు? నిన్న కూడా అంతే – ఇడ్లీలు గట్టిగా ఉన్నాయంటూ గొణుగుతున్నారు. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల యుగం – స్విచ్‌లు వేసి, లైటర్‌తో గ్యాస్ పొయ్యి వెలిగించి వంట చేస్తేనే టైమ్ సరిపోవడం లేదు నాకు. రన్నింగ్ రేస్ అవుతోంది టైముకి ఆఫీసుకు వెళ్ళడమంటే.. మోడ్రన్ మొగుళ్ళలా, వంట గదిలో కాస్త ఏమయినా నాకు హెల్ప్ చేస్తారా అంటే అది లేదు. మళ్ళా కూర్చొని సూకరాలు పోతూ రుచుల చిట్టా విప్పుతూ వుంటారు, రోజూ మీ ఈ సుత్తి భరించలేక చస్తున్నాను. మొన్న సూపర్ బజారుకు వెళ్ళినప్పుడూ అంతే చారుపొడి, సాంబారుపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు పాకెట్స్ కొంటుంటే మీ ప్రాణం ‘అయ్యో అయ్యో’ అంటూ విలవిల లాడిపోయింది పాపం.. నేనంతా గమనిస్తూనే ఉన్నాను.” అని మా ఆవిడ అష్టోత్తరంలా గడగడా చదువుతూ పోతుంటే మళ్లీ ఆవేశం ఆపుకోలేక “అవన్నీ మా అమ్మ ఇంట్లోనే శుచిగా రుచిగా భలే చేసేది మంజూ” అన్నాను మరో వాగుడు వాగుతూ.

“ఎహే నోరు ముయ్యండి. ఎంత చెబుతున్నా మళ్లీ అదే పాత పాట! మిమ్మల్ని కాదు మిమ్మల్నిలా తిండిబోతుగా తయారుచేసిన మీ అమ్మను, మిమ్మల్ని నాకు మొగుడిగా అంటగట్టిన మా నాన్ననూ అనాలి” అంటూ నెత్తికొట్టుకుంటూ ఆఫీస్‌కి రెడీ అవటానికి తన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది మంజుల.

బయట కొనుక్కొస్తున్న ఈ పొడులు, పేస్టుల మూలంగా ఈ మధ్య నాకు కడుపులో ఎసిడిటీ, గ్యాస్టిక్ ట్రబుల్ చేరి బాధపెడుతున్నాయి. జీర్ణక్రియ పనిచేయనని భీష్మించుకు కూర్చున్న ఫీలింగ్! నేనెవరితో చెప్పుకోను నా బాధ? ఇంటికి వంటిల్లే కదా ఆరోగ్య కేంద్రం. అదే సరిగా పని చెయ్యకపోతే మనిషి బతికేది ఎలా? అని అనుకుంటుంటే ‘కేశవా, అన్నానికి రా నాన్నా!’ అని అమ్మ పిలుస్తున్నట్టు ఎక్కడో దూరం నుంచి లీలగా ఆ గొంతు చెవులకు వినిపించడం మొదలు పెట్టింది.

***

అమ్మ చరిత్ర గర్భంలో కలిసిపోయి చాలాకాలమైంది. మన కళ్ళ ముందే ముందు తరాలు అంతరించిపోవడం – వాళ్ళ ఆచారాలూ, పద్ధతులు, వంటలు; వంటగది శుచి, శుభ్రతా అన్నీ మటుమాయమై పోవడం గుర్తుకొచ్చినప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది నాకు. మా అమ్మే పద్ధతయిన మనిషి అనుకుంటే మా బామ్మ మరీనూ. నిప్పులు కడిగే ఆచారం, మడీ ఆమెది. ఎప్పుడూ మడి వంటే – ‘తాకుతావ్- తాకుతావ్’ అంటూ పిల్లలమైన మమ్మల్ని దూరంగా ఉంచుతూ – చీర కుచ్చెళ్ళు దగ్గరికి పట్టుకొని తిరిగేది. బావి దగ్గరి నుంచి బిందెలో మడి నీళ్లు తెచ్చుకుంటూ, అడగు వెయ్యడానికి ముందు అక్కడ నేల మీద మునివేళ్ళతో నీళ్లు చిలకరించుకుంటా నడిచేది. అప్పుడు అదంతా చాదస్తం అనుకునే వాడిని గానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తోంది ఆ వెనకటి పద్ధతులన్నీ వంటింట్లోకి సూక్ష్మక్రిములు, దుమ్ము, దూళి రాకుండా అని.

బామ్మ తరం, అమ్మ తరం చూస్తూ పెరిగిన నాకు నా భార్య మంజుల వంట చేసే పద్దతి చూస్తూ ‘కాలం బాగా మారిపోయింది’ అనుకున్నాను. గ్యాస్ పొయ్యి మీద ప్రెజర్ కుక్కర్‌లో ఉడికే ఆ అన్నం, రెడీమెడ్ కూరముక్కలు ప్యాక్ చేసినవి సూపర్ బజార్ నుంచి తెచ్చుకొని నాన్ స్టిక్ ప్యాన్‌లో వంపేసి వండుకోవటం, మిక్సీలో చిటికెలో పేస్ట్‌లా అయ్యే పచ్చడీ తింటూ, ‘రుచి బాగా తగ్గిపోయింది – ఆరోగ్య సూత్రాలు పాటించడం కూడా అంతంత మాత్రం అన్నట్టే వుంటున్నాయి’ అని గొణుక్కునేవాడిని. పైకి అనాలంటే ‘హెవీ వర్క్ – టైమ్ లేదు’ అని నా భార్యామణి మహిళా శంఖం ఎక్కడ పూరిస్తుందోనని భయం వేసేది. అదొక వంట ప్రహసనం ఆ రోజుల్లో! అదయినా ప్రాప్తం లేకుండా అకస్మాత్తుగా, అత్యంత ఆశ్చర్యకరంగా నా కన్నా రెండేళ్ళు చిన్నదయిన ఆ ఇంటి ఇల్లాలు నన్ను ఒంటరివాడ్ని చేసి తనువు చాలించి రెండేళ్లు అయింది ఇప్పటికి. దాంతో నా జీవితం నా కొడుకు ఇంటికి షిఫ్ట్ అయింది. వాళ్ళిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.

కెరీర్ అనే పరుగు పందెంలో తోటి ఉద్యోగులతో అనునిత్యం పాల్గొంటున్నవాళ్ళు. లక్షల్లో జీతం గనుక డబ్బునే అన్నం బదులు భోంచేస్తూ ఉంటారు. నాకూ అదే పెడుతుంటారు. అంటే అర్థం మా కోడలికి వంటింట్లోకి అడుగు పెట్టే పని పెద్దగా ఉండదు, అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెడితూ వుంటుంది. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో స్విచ్ ఆన్ చేసి వండిన అన్నం మేకుల్లా వుంటుంది గనుక నేను నమలలేకపోతున్నాను. నాకోసమయినా పిడికెడు బియ్యం ఆ ప్రిస్టేజ్ కుక్కర్లో నయినా సరే పెట్టి కాస్త మెత్తగా వండిపెడితే బాగని అనిపిస్తుంది. అయినా అడగాలంటే మొహమాటం, దానికి తోడు భయం కూడా, ఎక్కడ విసుక్కుంటుందోనని. ఐదు కోట్లు పెట్టి ఈ మధ్యనే ఈ సూపర్ డీలక్స్ ఫ్లాట్ సైబర్ సిటీలో కొన్నాడు మా అబ్బాయి. అన్ని రూమ్‌లూ మోడ్రన్ హంగులూ, ఆర్భాటాలతో సూపర్ గానే ఉంటాయి. ఒక్క కిచెన్ తప్ప. కిచెన్ చాలా చిన్నది. పక్కనే మరో అపార్ట్‌మెంట్ బిల్డింగ్ ఉండటంతో గాలి, వెలుతురూ సరిగా ఉండవు. కొంటున్నప్పుడే అన్నాను నేను; “వంటిల్లు మరీ చిన్నగా ఉందిరా. వెంటిలేషన్ కూడా సరిగా లేదు” అని!

వెంటనే అందుకుంది మా కోడలు “కిచెన్ అంత చాలు! మరీ పెద్దగా ఎందుకు? నేనేమయినా అస్తమానం వంటలు చేస్తూ అందులో ఉండేదుందా? నాకసలే వంట అంటే చిరాకు” అని. నేను ఆశ్చర్యపోయాను. ఇంటి ఇల్లాలికి ‘వంటంటే చిరాకు’ అయితే ఎలా? వంటగదికి, వంటకు ఈ కాలం వాళ్ళు ఎందుకంత తక్కవ ప్రాముఖ్యతని ఇస్తున్నారు? అన్నపూర్ణల్లా గరిటె చేతిలో పట్టుకొని శుచియైన, వంటికి బలాన్ని ఇచ్చే పుష్టికరమైన వంటను సిద్ధం చేయటానికి ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు? ‘తిండి గలిగితే కండ గలదోయ్ – కండగలవాడేను మనిషోయ్’ అన్నాడు ఒక మహాకవి. మనకు, మన పిల్లలయిన భావితరాలకు ఆరోగ్యకరమైన; శారీరక, మానసిక శక్తిదాయకమైన తిండిని వండుకొని తింటేనే, పెడితేనే కదా మంచి సమాజం మనకు దక్కేది? ‘ఈ రెడీమెడ్ పొడులు, పేస్ట్‌లు, పచ్చళ్లు, ఫ్రీజ్ చేసి అమ్మే కూరగాయ ముక్కలు; ఫ్రోజన్ తినుబండారాలు వీటి మూలంగా, వాటిలో వున్న కల్తీల, నిల్వ సరుకుల కారణంగానే కదా ఈ అకాల వృద్ధాప్యాలు, అంతుబట్టని రోగాలు మనుషులకు. కంటికి కనిపించని వైరస్‌ల మూలంగానే కదా ఈ అంటురోగాలు, ఇన్ని ఎలర్జీలు’ అనుకున్నాను నేను.

మా కోడలు ఒక ఆదివారం రోజు సాంబారు చేసిందంటే మళ్లీ వచ్చే ఆదివారం దాకా దాన్నే ఫ్రిజ్‌లో పెట్టి, కొద్ది కొద్దిగా మైక్రోవోవెన్ వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఒకరోజు నేను అన్నంలోకి వేసుకోలేదని “రోజూ ఫ్రెష్‍గా అప్పటికప్పుడు వండినవి కావాలంటే కుదరదు. నేనూ వర్కింగ్. ఇంట్లోవాళ్లు ఎడ్జస్ట్ కాక తప్పదు” అంది ఏ గోడకో, బల్లకో చెబుతున్నట్టు అన్యాపదేశంగా నాతో. దాంతో ముక్కు మూసుకొని, నోరు మాత్రం తెరిచి ఆ రుచి పచీ లేని గడ్డిలాంటి తిండిని తినలేక అంటున్నాను.

మా కోడలికి ‘మా ఆడవాళ్ళే వంట చేయాలా?’ అని స్త్రీవాదం వల్లించే అవకాశం లేదు. ఎందుకంటే మా అబ్బాయి కూడా ఆమె కిచెన్ లోకి వెళ్ళినప్పుడు వెనకాలే వెళ్ళి తనూ హెల్ప్ చేస్తాడు.

అయినా మా వంటిల్లు పూర్వవైభవాన్ని కోల్పోయి ఎప్పుడూ కళావిహీనంగా కనిస్తుంటుంది.

(సమాప్తం)

Exit mobile version