Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వారాల ఆనంద్ చిన్న కవితలు 4

వారాల ఆనంద్ రచించిన 9 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

~ ~
1) యుద్ధం ముగిసాక
నిశ్శబ్దం ఆవరిస్తుంది
దాన్ని ఛేదించడానికి మళ్ళీ యుద్ధం చేయాలి
~ ~
2) కలయికకు ఆనందానికి
అంతిమ రూపం
జ్ఞాపకమే
~ ~
3) మనిషి నుండి మనిషికి
శాశ్వతతత్వానికి శాశ్వతతత్వానికి నడుమ
ఆత్మగల వారధి మానవత్వమే
~ ~
4) కటిక నేల పైనైనా, హంస తూలిక పైనైనా
నిద్ర రానప్పుడు
కలలు మాత్రం వస్తాయా
~ ~
5) ఊయల లూగే ఊహలు
సాగిలపడే సాధన
రెంటి నడుమా అగాధమే
~ ~
6) మర్చిపోవాలనే నెపంతో ఎంత తాగినా
మత్తు దిగినప్పుడల్లా
మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే వుంటుంది
~ ~
7) మాటల నడుమ అసలు అర్థం దాగినప్పుడు
ఎన్ని మాటలయినా
అర్థ రాహిత్యాన్నే మోస్తాయి
~ ~
8) నువ్వెపుడూ లోనెక్కడో ఉంటావు
నిజం
నివురు గప్పిన నిప్పు
~ ~
9) మాటలెప్పుడూ ఎగురుతూ దుముకుతూ వుంటాయి
నిశ్శబ్దమే
లోనెక్కడో ధ్యానం చేస్తూ వుంటుంది

Exit mobile version