[డా. సి. భవానీదేవి రచించిన ‘వేద వాయులీనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వేదవాక్కులలో వెలసిన జీవనశ్వాస,
ఆది ఋషుల గీతాలలో ప్రవహించే గానం
అదృశ్య రూపంలో విశ్వమంతా నిండింది
జీవుల ప్రాణధారయిన హృదయనాదమే!
రథగమన వాయువేగంలాంటి గాలి సాన్నిధ్యంతో
ప్రకృతి నిలువెల్లా చైతన్యం నింపుకుంటుంది
సుగంధ పుష్ప పరిమళాన్ని మోసుకొచ్చే వాయుదూత
మేఘసందేశాలను దిక్కులన్నిటికీ చేర్చే బంధువవుతుంది
పవన వీచికలవేళ వృక్షశాఖలే వేదఘోషలయినప్పుడు
నిశ్శబ్దరాత్రిలో చల్లనిగీతంలా ఆ స్వరం వినిపిస్తుంటుంది
అగ్నిజ్వాలను రగిలించే అదృశ్య సహచరి
జీవరాశులలో ప్రాణాగ్నిని వెలిగించే వాయుబంధాన్ని
సోమరస దివ్యశక్తితో ఋషులంతా కీర్తించారు
ఆ రథం వేగానికి గుర్రాలే ప్రతీకలై నిలిచాయి
ఆ పయనం ఆకాశపథంలో స్వేచ్ఛకు సంకేతమై వెలిగింది
పర్వతాలను తాకిన గర్జన శ్వాసగా మారిపోతుంది
సముద్రతీరాన అలలతో ఆడే మధురహాసం
వర్షమేఘాలను కదిలించి భూమికి జలధారగా దించే విన్యాసం
ఎండిన నేలకు పచ్చని జీవకళను పంచే దరహాసం
ఋషుల ధ్యానంలో ప్రాణతత్త్వమై వెలుగుతుంది
జీవనాడిగా నిత్యసత్యమై నిలుస్తుంది
వాయువే లేకపోతే నిశ్చలమవుతుంది సృష్టిగమనం
ఆ స్పర్శతోనే సాగుతుంది జీవనయాత్ర నిరంతరం
దిశలన్నిటినీ దాటి స్వేచ్ఛగా విహరించే మహాశక్తి
బంధనమెరుగని ప్రకృతి స్వరూపానికి దివ్యదీప్తి
జీవితాన్ని నడిపించే నిత్య ప్రాణవాయువుని
ఋగ్వేద మంత్రాలలో దేవతగా అనుకుందామా?
దేవతలే స్మరించే విశ్వశక్తి స్వరూపం కదా!
