Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సఫలమైన సాహితీ ప్రయోగం ‘వేదసాక్షిగా’ నవల

[‘వేదసాక్షిగా’ అనే గొలుసుకట్టు నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

తెలుగు సాహిత్యంలో గొలుసుకట్టు నవలలు ఒక ప్రత్యేకమైన, విలక్షణమైన ప్రక్రియ. ఒకే కథను లేదా నవలను ఒక రచయిత కాకుండా, ఒకరి తర్వాత ఒకరుగా పలువురు రచయితలు వరుసగా రాస్తూ పూర్తి చేయడాన్ని గొలుసుకట్టు నవల అంటారని తెలిసినదే. సాధారణంగా ఒక నవలను నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది రచయితలు కలిసి రాస్తారు. ఒక రచయిత కథను ఎక్కడ ఆపితే, తర్వాతి రచయిత అక్కడి నుండి కథను ముందుకు తీసుకెళ్తారు. ఒకరి ఆలోచనలు మరొకరికి తెలియవు కాబట్టి కథలో అనూహ్యమైన మలుపులు, ఉత్సుకత ఎక్కువగా ఉంటాయి.

పాత రోజుల్లో ‘ఆంధ్రపత్రిక’, ‘చందమామ’, ‘యువ’ వంటి వార/మాస పత్రికలు పాఠకులలో ఆసక్తిని పెంచడానికి ఇటువంటి ప్రయోగాలు చేసేవి.

తెలుగు సాహిత్యంలో గొలుసు నవలలు అనగానే ముందుగా 1968లో వచ్చిన పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గొల్లపూడి మారుతీరావు, కొమ్మూరి వేణుగోపాల రావు గార్ల ‘ఇడియట్’ గుర్తుకువస్తుంది.  ఆ తరువాత – డా. సి. ఆనందారామం, తురగా జానకీరాణి, వాసిరెడ్డి సీతాదేవి, నాయని కృష్ణకుమారి గార్లు కలిసి వ్రాసిన ‘అపరాజిత’ అనే గొలుసు నవల గుర్తొస్తుంది.

గొలుసుకట్టు నవల అని అనలేం కానీ, యండమూరిగారు, యర్రంశెట్టి సాయి గారు సంయుక్తంగా ‘కొంగుచాటు కృష్ణుడు’ అనే నవల రాశారు.

~

తెలుగులోనే కాకుండా, ఇతర భారతీయ భాషల్లోనూ ఈ గొలుసుకట్టు నవలలు వెలువడ్డాయి.

  1. బెంగాలీ: ఈ తరహా ప్రయోగాలు బెంగాలీ సాహిత్యంలో 20వ శతాబ్దం మధ్యలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశంలోనే అత్యంత తొలి కాలపు గొలుసు నవలగా ‘బారోయారీ ఉపన్యాస్’ (Baroiyari Upanyas) ని పరిగణిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సమకాలీన రచయితలు పలువురు కలిసి ఈ సామాజిక నవలను పూర్తి చేశారు. ఈ జాబితాలో ప్రేమేంద్ర మిత్రా, సయ్యద్ ముజ్తబా అలీ, నరేంద్రనాథ్ మిత్రా, చరణ్ చంద్ర బెనర్జీ, మోనిలాల్ గంగోపాధ్యాయ, అతాను దాస్‌గుప్తా, శరత్ చంద్ర చటోపాధ్యాయ, హేమేంద్ర కుమార్ రాయ్, సురేంద్రనాథ్ గంగోపాధ్యాయ, సత్యభరత్ దత్తా మరియు ప్రమత్ చౌదరి ఉన్నారు.

ఇది కాకుండా, బెంగాలీ సాహిత్య దిగ్గజాలైన మాణిక్ బందోపాధ్యాయ, తారాశంకర్ బందోపాధ్యాయ, బిభూతిభూషణ్ బందోపాధ్యాయ (పథేర్ పాంచాలి రచయిత), ఇంకా శరదిందు బందోపాధ్యాయ (బ్యోమకేశ్ బక్షి సృష్టికర్త) కలిసి ‘చతుస్కోణ్’ (Chatuskone) అనే నవల రాశారు. కథలోని నలుగురు ముఖ్య పాత్రల కోణంలో ఒక్కొక్క రచయిత ఒక్కో అధ్యాయాన్ని రాస్తూ కథను నడిపించారు.

  1. తమిళం: ఆనంద వికటన్, కుముదం వంటి వారపత్రికలు పాఠకులను ఆకట్టుకోవడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. 1970, 80ల కాలంలో తమిళ క్రైమ్/థ్రిల్లర్ దిగ్గజాలైన సుజాత (రంగరాజన్), రా. కి. రంగరాజన్, జా. రా. సుందరేశన్ లతో పత్రికా సంపాదకులు గొలుసు నవలలు రాయించేవారు. ఒక రచయిత కథను ఉత్కంఠభరితమైన క్లిఫ్ హ్యాంగర్ (Cliffhanger) తో ముగిస్తే, తర్వాతి రచయిత దానికి సమాధానం వెతుకుతూ కథను కొనసాగించాల్సి వచ్చేది.
  2. మలయాళం: డి.సి. బుక్స్ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ఈ గొలుసు నవలల ప్రక్రియను ప్రోత్సహించాయి. ఎం.టి వాసుదేవ నాయర్, ఎన్.పి. మొహమ్మద్ కలిసి ‘అరబి పొన్ను’ అనే నవలని రచించారు.
  3. కన్నడం: కన్నడ సాహిత్యంలో గొలుసు నవలలను ‘కూటు కాదంబరి’ అని వ్యవహరిస్తారు. కన్నడ పత్రికలు సుధ, మయూర వంటివి ఈ నవలలని ప్రోత్సహించాయి. సుధ పత్రిక వారు ఆనాటి ఇద్దరు ప్రసిద్ధ రచయిత్రులు డా. అనుపమా నిరంజన, ఎం.కె. ఇందిర, థ్రిల్లర్ నవలల స్పెషలిస్ట్ టి. ఆర్ సుబ్బారావు (తరసు) గార్లతో ‘చక్రవ్యూహ’ అనే గొలుసుకట్టు నవల రాయించారు. 1970 దశకం చివర్లో, 80వ దశకం తొలినాళ్ళలో ఈ నవల కన్నడ పాఠకులను విశేషంగా ఆకర్షించిందని చెప్పుకుంటారు.
  4. హిందీ: చాలా మంది రాసిన గొలుసు నవల కాకపోయినప్పటికీ ఇద్దరు భార్యాభర్తలు రాసిన అద్భుతమైన ప్రయోగం ‘ఏక్ ఇంచ్ ముస్కాన్’. హిందీ సాహిత్య లోకంలో ప్రసిద్ధ దంపతులైన రాజేంద్ర యాదవ్, మన్ను భండారీ కలిసి దీనిని 1963లో రాశారు. కథలోని హీరో పాత్ర కోణాన్ని రాజేంద్ర యాదవ్ రాస్తే, హీరోయిన్ పాత్ర కోణాన్ని మన్ను భండారీ రాశారు. ఒకరి అధ్యాయం చదివి, మరొకరు స్పందిస్తూ రాసిన ఈ సైకలాజికల్ నవల హిందీలో ఒక క్లాసిక్ గా నిలిచింది.

~

ఇక భావుక బృందం ప్రచురించిన ‘వేదసాక్షిగా’ అనే గొలుసుకట్టు నవల విషయానికి వస్తే, దీన్ని భావుక గ్రూప్ సభ్యులైన 25 మంది రచయితలు వ్రాశారు. నేటి యువతను తప్పుదోవ పట్టిస్తున్న ‘సహజీవనం’ అనే అంశం నవల ఇతివృత్తం. ఈ నవలలో అపర్ణ అనే పాత్ర సాంప్రదాయ కుటుంబానికి చెందినది, చక్కని నడవడికతో పెరిగిన యువతి. ఆమె మిత్రురాలు రాగిణి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటుంది. కాపురానికి వెళ్ళాకా, భర్త వేధింపుల తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతుంది. దీంతో తీవ్రంగా చలించిపోయిన అపర్ణ వివాహం కంటే సహజీవనమే మేలైన మార్గమని నమ్మి తన కొలీగ్ వివేక్‌తో కలిసి జీవించాలని నిర్ణయించుకుంటుంది. వివేక్ కేమో భార్య వల్ల మోసపోయిన తన మిత్రుడు అభిషేక్ కారణంగా పెళ్ళి మీద నమ్మకం పోతుంది. తమ అభిప్రాయాలు కలవడంతో, అపర్ణ, వివేక్‌లు సహజీవం మొదలుపెడతారు. అపర్ణ, వివేక్‌లు వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పినప్పుడు – వాళ్ళు చెప్పిన మాటలు భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని వెల్లడించేవిలా ఉంటాయి. కానీ వాళ్ళు పెద్దల మాట వినరు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన జెన్నీఫర్ పరిచయం అపర్ణకి ఉపకరిస్తుంది.

అపర్ణ గర్భవతి అవుతుంది. అదే సమయంలో వివేక్ ఆమెని వదిలించుకోడాని ప్రయత్నిస్తాడు. అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ సహజీవనానికి అపర్ణ ఇచ్చిన నిర్వచనం, వివేక్ చెప్పిన నిర్వచనం – ఒకదానికొకటి ఎంత విరుద్ధంగా ఉంటాయో! ఆమె ఊహించని విధంగా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు వివేక్. అబార్షన్ చేయించుకోడానికి గడువు మించిపోవడంతో, తప్పక, గర్భాన్ని ఉంచుకుంటుంది. ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను తన స్నేహితురాలు విరజ ద్వారా తన తల్లిదండ్రులకు అప్పగించి, ఆస్ట్రేలియాకు వెళ్లిపోతుంది. తామున్న చోట ఉండడం ఇష్టం లేక, ఆ వృద్ధ దంపతులు ఒక స్నేహితుడి సహాయంతో గ్రామానికి మారిపోతారు. పాపకి వేదరామాయణి అని పేరు పెడతారు. స్థానిక ఆలయంలో సేవ చేస్తూ, తమ అపర్ణ తిరిగి వస్తుందని ఎదురుచూస్తూనే, మనవరాలిని సాంప్రదాయ పద్ధతిలో పెంచుతారు.

అపర్ణ ఆస్ట్రేలియాకి వచ్చి మూడేళ్ళు గడుస్తాయి. ఆమెలో అంతర్మథనం మొదలవుతుంది. ఆఫీసులో, ఒకప్పుడు.. అంటే చెన్నై ఐఐటిలో ఆమెకి సూపర్ సీనియర్ అయిన యశ్వంత్ ఆమెను ప్రేమిస్తాడు. ఆమె సాంప్రదాయ స్వభావం, గాన నైపుణ్యాన్ని చూసి అతను ఆమెను ఎంతగానో అరాధించినప్పటికీ, తన ప్రేమను వ్యక్తపరచలేకపోతాడు. ఒకరోజు, ఒకరి ఫోన్‌లో తన ముద్దుల కుమార్తె ఫోటోను చూసిన అపర్ణకి మొదటిసారిగా మాతృప్రేమ అసలైన అర్థం బోధపడుతుంది. తల్లిదండ్రులు ముందే హెచ్చరించినప్పటికీ తప్పుడు మార్గంలో వెళ్లి, వారికి తీవ్ర ఆవేదనను మిగిల్చి దూరం చేసుకున్న అపర్ణ.. తిరిగి వారి వద్దకే వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. జెన్నీఫర్‌ కూడా ఇండియా వెళ్ళిపొమ్మనే చెబుతుంది. తన కుమార్తెతో పాటు తల్లిదండ్రులను కూడా తానే చూసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇండియా వచ్చేసి అమ్మానాన్నలని కలుస్తుంది. అంతేకాకుండా యశ్వంత్ అపర్ణను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని గ్రహించిన జెన్నిఫర్ అపర్ణ గురించి అన్నీ వివరాలు చెప్పేస్తుంది. అంతకు ముందే యశ్వంత్ తన అక్క ఝాన్సీకి అపర్ణ ఫోటో ఒకటి పంపిస్తాడు. ఈ ఊర్లో అపర్ణని చూసి, ఆమె వేదరామాయణి తల్లి అని గ్రహించి, ఓ రోజు అపర్ణతో మాట్లాడి ఆమె గతం తెలుసుకుంటుంది.

అక్క సలహా మేరకు యశ్వంత్ కూడా ఇండియాకి వచ్చేస్తాడు. ఝాన్సీ, యశ్వంత్‌లు ఇద్దరూ కల్సి అపర్ణ విషయంలో తల్లిదండ్రులని ఒప్పిస్తారు. ఒకరోజు యశ్వంత్ తండ్రి అపర్ణతో మాట్లాడి, ఆమె సంశయాలన్నీ తీర్చి, కోడలిగా రమ్మని ఆహ్వానిస్తాడు. శ్రీరామనవమి మరుసటి రోజు దశమి నాడు అదే పందిరిలో అపర్ణ యశ్వంత్‌ల వివాహం జరుగుతుంది. కథ సుఖాంతం అవుతుంది.

~

వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చాటే ఈ నవల ద్వారా సుందరకాండ పారాయణం ప్రయోజనమేమిటో తెలుస్తుంది. జీవితంలో ప్రతి సమస్యకూ ఏదో విధంగా భగవద్గీత సమాధానమిస్తుందని ఈ నవల చెబుతుంది.

~

సాధారణంగా గొలుసుకట్టు నవలల రచనా ప్రక్రియలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. ఒక రచయిత శైలికి, మరొక రచయిత శైలికి వ్యత్యాసం ఉంటుంది. దానిని సమన్వయం చేయడం కష్టం. మొదటి రచయిత అనుకున్న పాత్ర స్వభావాన్ని, తర్వాతి రచయితలు మార్చే అవకాశం ఉంటుంది. కథను అందరికీ నచ్చేలా, లాజికల్‌గా ముగించడం చివరి రచయితకు పెద్ద సవాల్‌గా మారుతుంది. అయితే భావుక అడ్మిన్‌లు, పుస్తకం సంపాదకురాలు శ్రీమతి కలవల గిరిజారాణి గారు చక్కని సమన్వయంతో, ఎటువంటి ఇబ్బందులు రాకుండా నవల చక్కగా వచ్చేందుకు దోహదం చేశారు. ఎవరు ఏ భాగం రాశారో, ఆ యా రచయితల పరిచయం పాఠకులకు అందించారు.

నవల పూర్తి చేశాకా, భావుక గ్రూప్ వారు చేసిన సాహితీ ప్రయోగం సఫలమైందని చదువరులు భావిస్తారు.

***

వేదసాక్షిగా (గొలుసుకట్టు నవల)
రచన: 25మంది రచయితలు
ప్రచురణ: భావుక గ్రూప్
పుటలు: 202
(ఈ పుస్తకం భావుక ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యుల కోసమే ముద్రించబడింది. అందువల్ల ధర, ప్రతులకు చిరునామా వంటి వివరాలు లేవు. పుస్తకం కావల్సినవారు భావుక గ్రూప్ అడ్మిన్స్‌ని సంప్రదింవచ్చు)

పుస్తకం సంపాదకురాలు శ్రీమతి కలవల గిరిజారాణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-kalavala-girijarani/

Exit mobile version