Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వీడిన మబ్బులు

ఆ భార్యాభర్తలిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తూంటారు. భార్యాభర్తల మధ్య బాస్ ప్రవేశం ఎలాంటి అపోహలకు దారితీస్తుందో చదవండి  బొందల నాగేశ్వరరావువీడిన మబ్బులు‘ కథలో.

మణ, ప్రియాంకలు ఆలుమగలు. ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీ ఆఫీసులో వుద్యోగాలు చేస్తున్నారు.

ప్రియాంక పోస్టు గ్రాడ్యుయేటు. కంప్యూటరులో రకరకాల కోర్సులు చేయడమే కాక ఆంగ్లంలో బాగా ప్రావీణ్యత సంపాయించుకోవడం వల్ల ఆ కంపెనీ ఎం.డి. ఆమెను తనకు పర్సనల్ సెక్రటరీగా పోస్టు చేయించుకున్నాడు.

ప్రియాంక భర్త రమణ ఓ గ్రాడ్యుయేటు. ఎప్పుడూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుతో వుండే తను వుద్యోగరీత్యా ఎంతో ఎత్తులో వున్న భార్య దరిదాపులకు కూడా వెళ్ళలేక, తపాల్ సెక్షనులో గుమాస్తాగా వున్నాడు. వాళ్ళది ప్రేమానుబంధాలతో కూడుకొన్న అన్యోన్యమైన జీవితమే! కాని పెళ్ళయి ఏడేళ్ళయినా పిల్లలు లేరు. ఆ ఒక్క సమస్య వాళ్ళను బాగా కృంగదీస్తూ వుంది.

ఇద్దరూ రోజూ ఉదయం తొమ్మిదిన్నరకల్లా అన్ని పనులను ముగించుకొని బైకులో ఆఫీసుకు వెళ్తారు. సాయంత్రం ఆఫీసునుంచి వస్తూ మార్కెట్టులో వాళ్ళకు కావలసిన కూరలు, వెచ్చాలు కొనుక్కొని ఆరు గంటలకల్లా ఇంటికొచ్చేస్తారు. అయితే కొన్ని సమయాల్లో ప్రియాంకకు ఆఫీసులో పని వత్తిడివల్ల ఒకటి లేక రెండు గంటల పాటు బాసు క్యాబిన్‌లో వుండే నిర్భందం వుంటుంది. అలాంటి సమయాల్లో వడ్లతో పాటు తట్ట కూడా ఎండుతుందన్న చందాన భార్యాతో పాటు భర్త రమణ కూడా అంత సేపు గోళ్ళు గిల్లుకుంటూ తన సీట్లో కూర్చోవలసి వస్తుంది. పనైన తరువాత ఇద్దరూ కలసి ఏ హోటల్లోనో డిన్నరు ముగించుకొని ఇంటికి వెళ్ళిన సందర్భాలు లేక పోలేదు.

ప్రియాంక చాలా హార్డు వర్కర్. బాసు తనకు అప్పగించే ఏ పనైనా సరే, ఎంత పనైనా సరే అడ్డు చెప్పకుండా తాపీగా చేసి పెడుతోంది. అందుకే ప్రియాంక అంటే బాసుకు ప్రేమ, అభిమానం. ఓ రకంగా తన తరువాత తన స్థానాన్ని పూరించగల వ్యక్తి ప్రియాంక మాత్రమే నన్నంతగా ఆఫీసు స్టాఫ్ అనుకునేలా చేశాడు బాసు. అయితే తన భార్యను గూర్చి స్టాఫ్ అలా అనుకోవడం ఏ మాత్రం ఇష్టముండదు రమణకు. అది ఏదేని విపరీత అనర్థాలకు దారి తీస్తుందేమోనన్న భయం తనకు.

రమణ మాటకొస్తే…. తను అందరితో కలిసి మెలిసి వుండడు. తనేమో, తన పనేమోనన్నట్టు వుండి పోతాడు. తను తపాల్ సెక్షను క్లర్కు కనుక రోజూ ఆఫీసుకొచ్చే తపాళ్ళను సెక్షన్ల వారిగా వేరు చేసి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టరులో రాసి పంపుతాడు. అంతటితో తన పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకొని కూర్చొంటాడు. కాని తప్పకుండా ఉదయం పదకొండున్నరకు ఒకసారి, మధ్యాహ్నాం మూడున్నరకు ఒకసారి తనొక్కడే ఆఫీసుకు యెదరే వున్న రావి చెట్టు బంకు కొట్టుకెళ్ళి టీ తాగి సిగరెట్టు ముట్టించుకొని చివరి దమ్ము వరకూ పొగ పీల్చి పారేసి వచ్చి సీట్లో కూర్చొంటాడు. ఇదో రోటీన్ తతంగం.

అలా సాగిపోయే ఆ దంపతుల జీవితంలో సాధారణంగా చొచ్చుకొని వచ్చే అతి సహజమైన సందేహం చోటు చేసుకొంది. మరది ఎక్కడికి దారి తీస్తుందో!

ఓ రోజు లంచ్ అవర్లో అందరూ డైనింగ్ హాల్లో భోంచేస్తున్నారు. రమణ క్యారియర్‌ని ముందుంచుకొని భార్య కొరకు ఎదురు చూస్తూ కూర్చొన్నాడు. అఫీషియల్‌గా బాసుతో పాటు బయటికి వెళ్ళిన తన భార్య ప్రియాంక వస్తుందని. కాని టైం రెండు కావొస్తున్నా ఆవిడ రాలేదు. ఆవిడ కోసం ఎదురు చూస్తున్న రమణ సహనం కోల్పోయాడు. ఆ సమయంలో అక్కడ భోంచేస్తున్న కో-స్టాఫ్ వాళ్ళ మనసుల్లో ఎన్నో ప్రశ్నలను వుంచుకొని తనవేపే చూస్తుండడం తనకు ఇబ్బందిగా తోచింది. కొంపతీసి వాళ్ళు దగ్గరకొచ్చి తనను ప్రశ్నిస్తారేమో నన్నంతగా భయపడుతుండగా అనుకున్నట్టే ఓ సీనియర్ అసిస్టెంటు భోంచేసి బాక్సు కడిగి బ్యాగులో పెట్టుకొని దగ్గరకొచ్చి”ఏమిటీ! మేడం గారు ఇంకా రానట్టున్నారు. మీరు భోంచేయకుడదూ?” అన్నాడు. “అన్నట్టు గంట రెండు కాబోతుంది! బాసుతో బయటికెళ్ళినావిడ ఏ స్టార్ హోటల్లోనో లంచ్ ముగించుకొని వస్తుంది. వెయిట్ చేయకుండా భోంచేసి రండి. అవతల బోలెడు పనుంది” అన్నాడు తన సెక్షన్లో వున్న ఒకతను.

“కాకపోతే లంచ్ అవర్లో మీరు ఎదురు చూస్తుంటారని మేడం గారికి తెలుసుగా! ఏ సంగతికి కనీసం ఫోన్ చేసైనా చెప్పుండొచ్చుగా?”

“అన్నట్టు ఎంత ఒకవేళ ఆవిడ బాసుకు పి.ఏ. అయినా భర్తను వెయిట్ చేయించటం బాగులేదు సార్” అని మొదట వాడే అంటుండగా ఫోనొచ్చింది రమణకు. బటన్ నొక్కి’ హల్లో’ అన్నాడు. అప్పుడు ఫోన్ స్పీకర్ మోడ్‌లో వుంది.

“నేనేనండి. బాసుతో కలిసి ఇక్కడే లంచ్ చేశాను. మీరూ భోంచేయండి” అని ఫోన్ పెట్టేసింది ప్రియాంక.

“హల్లో… హల్లో… ఛీ… పెట్టేసింది” అని గొణుక్కొంటూ అందరి ముఖాల్లోకి చూశాడు రమణ. ఒక్కసారిగా అందరూ నవ్వారు.

“మీ పిచ్చికాకపోతే బాసుతో వెళ్ళినావిడ ఇంకా భోంచేయకుండా ఎలా వుంటారండి? మీరూ కానిచ్చి త్వరగా రండి” అంటూ గుసగుసలతో సెక్షన్లకు వెళ్ళి పోయారు అందరూ.

రమణకు ఎవరికీ ఏదీ చెప్పుకోలేని పరిస్థితి. అందుకే భార్యది బాధ్యత గల వుద్యోగం కనుక అలానే వుంటుందని తనకు తానే సర్ది చెప్పుకొన్నాడు. క్యారియర్‌ని అక్కడ బల్లలు తుడిచే పనిమనిషి చేతికిచ్చి భోంచేసి తెచ్చిమ్మన్నాడు. తను బయటికి వెళ్ళి ‘టీ’ తాగి మౌనంగా వచ్చి సెక్షన్లో కూర్చొన్నాడు. కాని తనకే అంతు పట్టని ఏదో సందేహ బీజం తన మనసులో పడిందప్పుడు.

సమయం రాత్రి పది గంటలు. రమణ మంచంమీద కూర్చొని దిన పత్రికను తిరగేస్తున్నాడు. ప్రియాంక నైటీలో పాల గ్లాసుతో లోనికొచ్చింది.

“ఇవిగోనండి పాలు” ఇవ్వబోయింది.

“ఆ టేబుల్ మీదుంచు” ముఖంలోకి చూడకుండానే అన్నాడు.

“ఏంటండీ… అదోలా వున్నారు? మధ్యహ్నాం నేను మీతో లంచ్ చేయలేదనా? ఏంచేయనూ! బాసు…” ఏదో చెప్పబోయింది.

“ఇంకేం చెప్పకు. అయినా అలాంటి సందర్భం వస్తుందని తెలిస్తే ముందే ఓ మాట నాతో అనొచ్చుగా?”

“సారీ అండీ! నేనలా అనుకోలేదు. లంచ్ టైంకి వచ్చేస్తాననుకున్నాను. ఇంతకు మీరు భోంచేయలేదటగా? బల్లలు తుడిచే అమ్మాయి చెప్పింది” అంటూ పాల గ్లాసును అందించింది ప్రియాంక. ఇద్దరూ పాలు తాగారు. బెడ్ లైటు వేసింది ప్రియాంక. అయిదు నిముషాల్లో అలసి పోయినట్టు నిద్రలోకి జారుకొందామె.

రమణ కూడా పడుకున్నాడే కాని తనకు నిద్ర పట్టలేదు. మనసు పరిపరి విధాలుగా ఆలోచింపసాగింది. అప్పుడు ఆఫీసులో తన కో-స్టాఫ్ తనమీద పరోక్షంగా రకరకాలుగా విసిరిన కామెంట్లు గుర్తుకు వచ్చాయి. వాళ్ళ కామెంట్సును బట్టి చూస్తే తన భార్య ప్రియంకకు బాసుకు మధ్య ఏదో వుందని చెప్పకనే చెప్పారందరని గ్రహించాడు. అవును వాళ్ళ మాటల తీరు తనకు సందేహాన్ని తెప్పించింది. కాకపోతే ఏమిటీ… మొదట్లో ఆఫీసు పనుల వత్తిడని చెప్పి ప్రియాంకను ఓ గంటసేపు తన గదిలో వుంచుకునేవాడు. అలాంటి సమయాల్లో తను చేసేది లేక బాసు గదినుంచి ఆమె బయటికి వచ్చేవరకూ సీట్లో కూర్చొని గోళ్ళు గిల్లుకొంటూ వుండే వాడు. ఇప్పుడు మరీ ఎక్కువై ప్రతిరోజు ఏకంగా రెండు, మూడు గంటల వరకూ అంటే రాత్రి ఏడెనిమిదైయ్యేవరకూ వుండవలసి వస్తుందంటే తనేం చేయగలడు పాపం! స్టాఫ్ కూడా ఒకలా అనుకొంటూ పరోక్షంగా తనతోనే చెపుతున్నారు.అదే మరి సందేహానికి దారి తీసింది. ఇక తను కూడా ఎవరితోనూ ఏదీ చెప్పుకోలేక, విషయాన్ని ప్రియాంకకు వివరించలేక, ఆమెను వుద్యోగాన్ని మానుకోమని చెప్పలేక, ఒకవేళ మాన్పిస్తే ఆర్థికంగా దెబ్బ తింటారనుకొని ఏవేవో ఆలోచనలతో సతమతమౌతూ అలాగే కళ్ళు మూసుకున్నాడు రమణ, త్వరలో ఇందుకో పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలనుకొంటూ.

మరుసటి రోజు రమణ బైకులో మార్కెట్టుకు వెళ్ళాడు. ఇంటికి కావలసిన కూరలు కొనుక్కొన్నాడు. బైకు మీద కూర్చొని స్టార్టు చేస్తుండగా ఓ వ్యక్తి పరిగెత్తినట్టు ‘సార్ సార్ ‘అంటూ దగ్గరకువచ్చాడు.

‘ఏమిటీ?’ అన్నట్టు నొసలు చిట్లించాడు రమణ.

“ఏంలేదు సార్! నేను ఏ.బి.సి. కన్సట్రక్షన్ కాంట్రాక్టర్‌ని. మీ శ్రీమతి చేస్తున్న ఆఫీసులో ఓ చిన్న బిల్డింగ్ కట్టడానికి టెండరు కాల్‌ఫర్ చేస్తే అప్లయి చేశాను. అది నాకు దక్కేలా మీరే చెయ్యాలి” అడిగాడు అతను.

కోపం వచ్చింది రమణకు. “అదెలా సాధ్యం? మా ఆవిడేమన్నా ఆ కంపెనీ యజమాననుకున్నావా?” అన్నాడు.

“అదికాదు సార్! బాసుతో మేడం ఓ మాట చెబితే పని అయిపోతుందట. అవును సార్! మేడం బాసుల మధ్య అంతటి మంచి సాన్నిహిత్యముందట!” టపీమని చెప్పి నాలుక కొరుక్కున్నాడు కాంట్రాక్టరు.

“అంటే… నాకర్థం కావడం లేదు! ఎలాంటి సాన్నిహిత్యమది ?ఎవరు చెప్పారు నీతో?” కోపాన్ని అతి కష్టంమీద దిగమింగుకొంటూ అడిగాడు.

“ఆఫీసులో అందరూ అనుకొంటున్నారు సార్!లేకుంటే నాకెలా తెలుస్తుంది?” అని నసిగాడు,

“బస్! ఇక బయలుదేరు. ఇలాంటి పిచ్చి ఆలోచనలతో నా వద్దకో లేక నా మిసెస్ వద్దకో ఇక రాకు. కావాలనుకుంటే ఆ బాసునే బ్రతిమాలి టెండరును దక్కించుకో! వెళ్ళు!” కోపంగా అని బైకు స్టార్టు చేసుకొని వెళుతున్నాడు రమణ. కాని తన మనసేమో మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళి పోయింది. ఏమిటీ జనం? ఏ ఆలుమగళ్ళను నెమ్మదిగా బ్రతకనివ్వరా? ఏదో ఒక అపోహతో కుటుంబాల్లో కలతలు సృష్టించడమే వీళ్ళ పనా? కాకపోతే నా భార్య బాసుతో చెబితే వీడికి టెండరొస్తుందట. అంటే వాడి వుద్దేశం బాసుకు ప్రియాంకకు మధ్య ఏదో చెడు సంబంధం వుందనేగా!? మొన్నటికి మొన్న డైనింగ్ హాల్లో భోంచేయటానికి వచ్చిన స్టాఫ్ మొత్తం రకరకాల మాటలతో నా మెదడును తిని మనఃక్షోభకు గురి చేశారు. ఇవాళ వీడొకడు. అన్నట్టు ఒకవేళ వీళ్ళందరూ అనుకొంటున్నది, పరోక్షంగా నాతో చెపుతున్నది నిజమైతే…. మైగాడ్… అది నేను అస్సలు వూహించలేను. ఏదేమైనా సరే త్వరలో ఓ మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళ నోళ్ళను కట్టేయ్యాలి” అని అనుకొంటూ బైకును పార్కు చేసి ఇంటిలోకి నడిచాడు రమణ. అప్పుడు ప్రియాంక ఫోన్లో మాట్లాడుతోంది.

“ఫోన్లో మాట్లాడుతున్నావ్… ఎవరితో?” అడిగాడు.

“బాస్ హైదరాబాదు వెళుతున్నాడట. ఏదో ముఖ్యమైన పర్సనల్ విషయం నాతో చెప్పాలట. కారు పంపుతున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్ళాలి” అంటూ డ్రసింగ్ టేబుల్ వద్దకు నడిచింది ప్రియాంక.

“ఆ సంగతి బాసు నాతో చెప్పరా?పోనీ…నీతో నేనూ కూడా రానా?”

“ఎందుకండి. మీ బ్యాగు, మనిద్దరి లంచ్ బాక్సులు టేబుల్ మీద వుంచాను. వాటిని తీసుకొని మీరు ఆఫీసు వెళ్ళండి. నేను అటునుంచి అటే ఆఫీసుకు వచ్చేస్తాను” అంటుండగానే కారొచ్చి ఇంటి ముందాగింది. ప్రియాంక అయిదు నిముషాల్లో తయారై వెళ్ళి కారులో కూర్చొంది. కారు కదిలింది. చేసేది లేక కూరల సంచిని డైనింగ్ టేబుల్ మీద గీరాటేసి మౌనంగా సోఫాలో కూలబడ్డాడు రమణ.

ఆరోజు రాత్రి….

రమణ మనసు ఏవో పిచ్చి ఆలోచనలతో నిండుకొని వుంది. ప్రియాంకను బాసు ఎయిర్‌పోర్టుకు ఎందుకు పిలిపించుకున్నాడోనన్నసంగతి ఇంతవరకూ ప్రియాంక తనలో చెప్పలేదు ఎందుకని? ఆ సంగతి వెంటనే తెలుసుకోవాలనుకున్నాడు. అటు తిరిగి పడుకున్న వాడల్లా ఇటు భార్య వేపు తిరిగాడు. ఆమె ముఖంలోకి చూస్తూ “ఏమిటి అంత అర్జంటుగా బాసు పిలిచాడని ఎయిర్‌పోర్టుకు వెళ్ళావే… ఎందుకూ?” అడిగాడు.

“నన్ను బాసు వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. పెరాలిటిక్ వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు ఈ ఒక్క రోజు స్నానమదీ చేసి బట్టలు మార్పించి, టిఫిన్ తినబెట్టి రమ్మన్నాడు. అందుకే వెళ్ళాను. అన్ని చేసి పెట్టి వచ్చాను” బాధతో వివరించింది ప్రియాంక.

షాక్ తిన్నట్టు ఫీలయ్యాడు రమణ. ఏమిటీ… ఆవిడ జబ్బు మనిషా?” ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు రమణ.

“అవునండి. ఆవిడకు ఓ కాలు చేయికి చచ్చు వచ్చింది. ఇంట్లోనే వీల్ చేయిర్లో తిరుగుతూ తన పనులు తనే చేసుకొంటుంది. అయినా స్నానమదీ కష్టం కదా!?” బాసు భార్యపై జాలిని కనుబరుస్తూ అంది ప్రియాంక.

“అంటే… ఇవాళ వాళ్ళ పనిమనిషి రాలేదా?”

“రాలేదటండి. అందుకే ఒక్క పూట సహాయం కోసం నన్ను వెళ్ళమన్నాడు పాపం”

రమణ ఇంకేం మాట్లాడలేక పోయాడు. ప్రియాంక చెప్పిన మాటల్లో ఎంతో న్యాయముందనుకొన్నాడు.

“సరే! పొద్దు పోయింది పడుకో” అంటూ దుప్పటి లాక్కొన్నాడు. బెడ్ లైటు వేసి నిద్రకుపక్రమించింది ప్రియాంక.

రెండు రోజుల తరువాత…

రమణ మధ్యహ్నాం ముడున్నర గంటల సమయంలో తన పని ముగించుకొని టీ తాగటానికి ఆఫీసుకు ఎదరే వున్న బంకుకు వెళ్ళాడు. టీ మాస్టరుతో టీ చెప్పుకొని బల్లమీద కూర్చొన్నాడు. అప్పుడు అక్కడ తన భార్య, బాసుని గూర్చి ఓ ఇద్దరు స్టాఫ్ చెడుగా చెప్పుకొంటున్నది తన చెవులారా విన్నాడు. వెంటనే బాధతో ఉద్రిక్తుడై లేచాడు. చెమటలు పట్టిన తన ముఖాన్ని కర్చాఫ్‌తో తుడుచుకున్నాడు. వాళ్ళను నాలుగు తన్ని బుధ్ధి గరపాలనుకొని పిడికిలి బిగించాడు. కాని అదో రభసగా మారిపోయి ఇంకో రకమైన సమస్యకు దారి తీస్తుందేమోనని భయపడ్డాడు. తొందరపడి అలా చేయడం సంస్కారం కాదనుకొన్నాడు. కోపాన్ని దిగమింగుకొని ‘టీ’ని కాన్సిల్ చేసి బరబరా వెళ్ళి సీట్లో కూర్చొన్నాడు. అప్పుడు తనకు బి.పి పెరిగిపోయింది. తన్ను తానే సముదాయించుకొని మెల్లగా మనసును ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు.

గంట అయిదయ్యింది. అందరూ వెళ్ళిపోయారు. రమణ కూడా అన్నీ సర్దుకొని భార్య కొరకు ఎదురు చూస్తుండగా ఆమే నవ్వుతూ తన వద్దకొచ్చింది. ‘పోనీలే…ఈ రోజైనా త్వరగా ఇంటికి వెళతాం’ అనుకొంటూ బ్యాగు తీసుకొని పైకి లేవబోయాడు రమణ.

“సారి అండీ! కాస్సేపు కూర్చొండి. బాసెందుకో తన క్యాబిన్‌కు రమ్మన్నారు. వెళ్ళి చూసి వెంటనే వచ్చేస్తాను” అంటూ తన బ్యాగును భర్త చేతికిచ్చి బాసు క్యాబిన్లోకి వెళ్ళి పోయింది ఏ మాత్రం భర్తకు

మాట్లాడే సందర్భాన్ని కలిగించకుండా!

రమణ చేసేది లేక మళ్ళీ మామూలుగా చేతులు నలుపుకొంటూ అలాగే సీట్లో కూర్చొన్నాడు. పావుగంటయ్యింది ప్రియాంక రాలేదు. అర్థగంటయ్యింది ఆమె ఇంకా రాలేదు. ఇక టెన్షనుకు లోనైన రమణ పిచ్చిపిచ్చిగా ఆలోచించసాగాడు. వూహించకూడని విషయాలను వూహించ సాగాడు. మళ్ళీ తనకు బి,పి రైజైంది. ఇక సీట్లో కూర్చొలేక పోయాడు. కోపంగా లేచాడు. ప్రియాంక తనకు భార్యో లేక బాసుకు వుంపుడుగత్తో తేల్చుకోవాలనుకొన్నాడు. మెల్లగా వెళ్ళి కాబిన్ డోరు తెరచాడు. లోపల ప్రియాంక బాసుల మధ్య ఏవో సంభాషణలు. అవి వినాలని కర్టన్ చాటున నిలబడ్డాడు చెవులు రిక్కించుకొని రమణ.

“ప్రియాంకా! మొన్న నేను హైదరాబాదు వెళుతూ నువ్వైతే తప్పకుండా నా మాట విని నా భార్యకు ఓ పూట సేవలు చేస్తావన్న నమ్మకంతో మా ఇంటికి పంపాను. నన్ను తప్పుగా అనుకోలేదుగా?”

“లేదు సార్! మీ ఆవిడని చూస్తూనే చనిపోయిన నా తల్లి గుర్తొచ్చింది. అందుకే విసుక్కోకుండా మీరు చెప్పినట్టు ఆమెకు చక్కగా స్నానం చేయించి, బట్టలు మార్చి, టిఫిన్ తినబెట్టి మరీ వచ్చాను” చెప్పింది.

“సంతోషమమ్మా! తనూ కూడా చెప్పింది, నిజంగా మాకో కూతురున్నా నీలా చేయదని. మేమూ పిల్లలు లేనివారమే కదమ్మా” అని బాధపడి కర్చీఫ్‌తో కళ్ళద్దుకొని మళ్ళీ తనే “ఎనివే… నీకు కృతజ్ఞతలమ్మా! ఇంతకు నిన్ను పిలిపించిందెందుకో తెలుసా? ఇదిగో విజిటింగ్ కార్డు. ఈ విజిటింగ్ కార్డులో వున్న ఈ డాక్టరు పేరు మోసిన ఫెర్టిలిటి స్పెషలిస్టు. ఆయనతో నేను మాట్లాడాను. మీ భార్యాభర్తలిద్దరూ ఆయన వద్దకు వెళ్ళి విషయాలను వివరించి ట్రీట్‌మెంటు తీసుకుంటే ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులవుతారు. ఆ నమ్మకం నాకుంది” అంటూ విజిటింగ్ కార్డు చేతికిచ్చాడు.

ఆశ్చర్యంగా బాసు ముఖంలోకి చూసి పేలవంగా నవ్వి”సార్! గత నాలుగేళ్ళగా ఇలాంటి డాక్టర్లను ఎంతో మందిని చూశాం, ప్రయోజనం శూన్యం” అంటూ నిట్టూర్చింది.

“లేదమ్మా! అలా అనుకోకు. ఈ డాక్టరుమీద నాకు నమ్మకం వుంది. నేను నీకు తండ్రి స్థానంలో వుండి చెపుతున్నాను. నా మాట విని చివరి ప్రయత్నంగా ఈ పని చేయ్! ఓ మాసం శెలవు పెట్టుకో. మీ ఆయన్ను తీసుకొని వెళ్ళు. అవసరమైతే ఇద్దరూ ట్రీట్‌మెంటు చేయించుకొండి. అందుకయ్యే ఖర్చు మన కంపెనీ భరిస్తుంది. అవునమ్మా మీరు తల్లిదండ్రులు కావాలి. నేనూ,నా శ్రీమతి మీకు పుట్టబోయే ఆ బిడ్డకు తాతయ్యా అమ్మమ్మలమవ్వాలి” ఎమోషన్‌కు గురై కనుకొలకల్లో వున్న కన్నీటిని కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు బాసు.

“సార్…!” ప్రియాంక కూడా ఓ విధమైన ఎమోషన్‌కు గురై ఒకడుగు ముందుకేసింది.

“ఇదిగో! నీ పేర రెండు లక్షల రూపాయలకు రాసి వుంచిన చెక్కు. ఆఫీసు డబ్బేలే! నీకు తండ్రి స్థానంలో వుండి ఇస్తున్నాను. తీసుకు వెళ్ళు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో”అన్నాడు బాస్ .

అప్పటికే నిర్ఘాంతపోయి ఆయన ముఖంలోకి చూస్తున్న ప్రియాంక అలాగే కాళ్ళమీద పడింది తన్ను ఆశీర్వదించమన్నట్టు.

“లక్షణంగా వుండు తల్లీ! ట్రీట్‌మెంటుతో నువ్వూ మీ ఆయన తల్లిదండ్రులు కావడం ద్వారా నేనూ మా ఆవిడా అమ్మమ్మ తాతయ్యలమౌతాం” అన్నాడు సంతోషంతో.

అంతే…! అదంతా కర్టన్ చాటునుంచి విన్న రమణకు కళ్ళు చమర్చాయి. అందాక పిచ్చి వూహలతో, వూహించరాని సందేహాలతో సతమతమైపోయి తలను బ్రద్దలు కొట్టుకొంటున్న రమణ హాయిగా నిట్టూర్చి మనసును తేలిక చేసుకొని, మనసులోనే బాసుకు దణ్ణం పెట్టుకొని సీటు వద్దకు నడిచాడు తనలోని సందేహాలకి సమాధి కడుతూ.

అంతలో “ఏమండీ!మీకో శుభవార్త చెప్పాలి. త్వరగా పదండి ఇంటికి” రమణ వద్దకు పరిగెత్తినట్టు వచ్చి అంది ప్రియాంక.

‘సరే’నన్నట్టు తలూపుతూ బైకు వద్దకు నడిచాడు రమణ అమాయకమైన ఆమె ముఖంలోకి చూస్తూ.

అప్పుడు ఆకాశంలోని చంద్రుని చుట్టూ వున్న మబ్బులు విడిపోతుంటే రమణ మనసు బాగా తేలికయి కుదుట పడింది.

Exit mobile version