[శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారు రచించిన ‘వెలి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆమె కంటిలో పలుచగా పరచుకున్న కన్నీటిపొర నాకు కనిపించకుండా పోలేదు. నాలో నేనే నవ్వుకున్నాను.
ఇప్పుడు నేనేమన్నానని? కన్నీళ్ళు పెట్టేసుకోవటమేమిటో.. చాలా మామూలు విషయమే కదా నేను మాట్లాడింది? దానికే కుండలు కుండలు కన్నీళ్ళు! ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతే..
తలవంచుకుని నిలబడ్డ సత్యవతిని, “ఓకే, ఈ పొరపాటు మళ్ళీ చేయకండి. ఇక మీరు వెళ్ళవచ్చు..” సీరియస్‌గా చెప్పేసి, నా ఎదురుగా ఉన్న ఫైల్ వైపు దృష్టి సారించాను. మౌనంగా బయటకు వెళ్ళిపోయింది, సత్యవతి.
ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అధికారిని నేను. దేశమంతటా మాకు బ్రాంచీలు ఉన్నాయి. నేను రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నాను. ఎంతో సమర్థతతో పనిచేస్తానని నాకు పేరుంది. అందుకేనేమో, అస్తవ్యస్తంగా ఉన్న బ్రాంచిలను నాకు అప్పజెప్పుతూ ఉంటారు, వాటిని చక్కగా సరిచేస్తానని. స్టాఫ్‌ని సరియైన దారిలో పెట్టగల చండశాసనుడిగా కూడా నాకు చక్కని పేరుంది. నా దగ్గర సోమరితనం పనికిరాదు. వాయిదాలు చెల్లవు. ఎప్పటిపని అప్పుడే నీట్‌గా చేసుకుంటూ పోవాలి. లేకపోతే కాఠిన్యానికి మారు రూపైపోతాను.
ఇంతకు ముందు సత్యవతి నేను డ్రాఫ్ట్ చేసిచ్చిన ఉత్తరంలో కొన్ని పదాలు తెలియలేదని లోపలికి వచ్చింది. ఢిల్లీలో ఉన్న మా హెడ్ ఆఫీస్ నుంచి అప్పుడే ఫోన్ వచ్చి, కొన్ని సీరియస్ సూచనలు విన్నానేమో చిరాగ్గా ఉంది నాకు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరిమీదైనా చూపించాలి కదా.. అందుకే, “మంచిచీర కట్టుకుని, దానికి చక్కగా మ్యాచింగ్ జాకెట్, మ్యాచింగ్ హెయిర్ క్లిప్ పెట్టుకోవటం తెలుస్తుంది కానీ ఇవి తెలియలేదా మీకు?” అన్నాను కూల్‌గా. దానికే ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగేసాయి.. అరె, మాటల ఈటెలంటే ఈవిడకి తెలియదు కాబోలు.. ఇది చాలా చిన్న విషయమసలు.. నా మాటలు ఎంత పదునుగా ఉంటాయో ఈ బ్రాంచ్ వాళ్ళకింకా తెలియలేదు.
ఆ తరువాతి రోజులు నా స్టాఫ్ మెంబర్స్‌కి మరింత గడ్డుతరం చేసాను. నన్ను చూస్తేనే భయపడిపోయే స్థితికి వచ్చేసారు అంతా.. ఏ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవటానికి హడలి చచ్చిపోసాగారు. ఎందుకంటే, ఎప్పుడు ఎవరికీ మెమోలు వెళతాయో వాళ్ళు ఊహించని పరిస్థితి. నా కఠినత్వం ఫలితంగా పనిలో సమర్థత, వేగం పెరిగాయి. సోమరితనం, అలసత్వం తగ్గాయి. నేను చెప్పింది చెప్పినట్టుగా పనిచేయటానికి అలవాటు పడ్డారు అందరూ.. స్త్రీ ఉద్యోగినులు నా ఛాంబర్‌కి రావటానికి వణికి చచ్చేవాళ్ళు. ఏం మాట్లాడతానోనని భయం వాళ్లకి. నిజానికి సత్యవతితో నేను అన్న మాటలు చాలా చిన్నవి, సింపుల్‌వి.
ఒకరోజు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చిందని అరవిందను లోపలికి పిలిపించి, క్లాసు తీసుకున్నాను. “ఏం అరవిందా, ఎందుకు ఆలస్యం అయింది? మీ వారు ఊరినుంచి వచ్చారా?” అరవింద భర్త వేరే ఊరిలో ఉద్యోగం. వెంటనే అర్థం కాలేదు ఆవిడకి.
అర్థమైన వెంటనే కళ్ళు ఎర్రబడ్డాయి..
“ఏం మాట్లాడుతున్నారు సర్?” అన్నది కోపంగా.
“తప్పేముంది? ఆలస్యంగా లేచి ఉంటారు.. అందుకేగా రావటం లేటైంది?” అన్నాను ఎంతో నిర్లక్ష్యంగా.
“ఛీ!” అన్నది వెంటనే.
పకపకా నవ్వాను. “ఇందులో తప్పేముంది? ప్రతీ ఇంట్లో ఉండేదే, ప్రతీ మనిషీ చేసేదే.. కాకపోతే వెసులుబాటు లేక మీకు ఎప్పుడో కానీ కుదరదంతే..” అన్నాను లోతుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ..
ఆమె ఏవగింపుగా నా వైపు చూసింది. చిత్రమేమిటంటే ఆ కళ్ళల్లో దుఃఖం కనిపించలేదు.. అరుణారుణ క్రోధం తప్ప.
“నౌ యూ కెన్ గో..” అన్నాను ఓ రకమైన అసంతృప్తితో.. అవును మరి.. అవతలివాళ్ళ కన్నీరే కదా నాలోని అహాగ్నిని చల్లార్చేది!
ఈ బ్రాంచ్ లో ఉండే కిషోర్, కావ్య ప్రేమించుకుంటున్నారని తెలిసింది. అయితే ఏవో కారణాల వలన వాళ్ళ పెళ్ళికి ఆరు నెలలు గ్యాప్ వచ్చింది.
నేనంటే ఉండే భయం వలన ఆఫీసులో మాట్లాడుకోవటానికి కూడా భయపడేవారు వారిద్దరూ. నేను అన్నీ గమనిస్తూ ఉండేవాడిని. వారిద్దరి మధ్యా నడిచే చూపుల రాయబారాన్ని పసిగట్టి, కిషోర్‌ని మరో సెక్షన్‌కి మార్చేసాను. ఏడ్చుకుంటూ అటు వైపు వెళ్ళిపోయాడు కిషోర్. కావ్య నాకు కనిపిస్తూ ఉండేది. ఎక్కువసార్లు ఆమె చేతిలో ఆఫీస్ ఫోన్ చూసేసరికి నాకు సందేహం వచ్చింది, వాళ్ళిద్దరూ ఇంటర్ కామ్‌లో ముచ్చట్లు వేసుకుంటున్నారని.
ఓ రోజు, లంచ్ అవర్ తరువాత ఉన్నట్టుండి, కావ్య సీట్ ముందుకు వెళ్ళి నిలబడ్డాను నేను. నన్ను చూడగానే ఉలిక్కిపడి, ఫోన్ డిస్కనెక్ట్ చేసి, లేచి నిలబడింది. ఆమె ముఖం నిండా చెమటలు పట్టాయి. అరచేతులు తడిగా అయిపోయాయి.
“ఎవరితో మాట్లాడుతున్నావు?” మెల్లగా ఉరిమాను.
జవాబు చెప్పలేనట్టు తల వంచుకుంది. “టెల్ మీ..” ఈసారి నా ఫెళఫెళలకు స్టాఫ్ అందరూ ఉలిక్కిపడ్డారు.
“సారీ సర్.. కి.. కి..షోర్ అదే.. నా ఫియాన్స్‌తో మాట్లాడాను..” అంది కావ్య తడబడుతూ.
“ఆఫీసు ఫోన్ నీ అబ్బ సొత్తు కాదు, నీ స్వీట్ నథింగ్స్ చెప్పుకోవటానికి. మీకిద్దరికీ అంత ఆగకపోతే, సెలవు పెట్టి ఏదైనా లాడ్జ్‌కి తగలడండి. సిగ్గు లేకుండా బిహేవ్ చేయవద్దు..” చాలా కోపంగా అరిచాను.
బొటబొటా కన్నీరు కారుస్తూ అలాగే నిలబడి ఉండిపోయింది కావ్య. చరచరా నా క్యాబిన్‌లోకి నడిచాను. అవమానం భరించలేక, వెంటనే సెలవు పెట్టి వెళ్ళిపోయింది కావ్య.
ఆ మూడోనాడు, ఏదో మిష మీద కిషోర్‌ని నా క్యాబిన్‌కి పిలిపించాను.
అతను లోపలి వచ్చాడు నన్ను విష్ చేస్తూ. మాటల్లోనే మర్యాద అంతా.. కంటిచూపులలో మాత్రం మంటలు చెలరేగుతున్నాయి. ఆ మాటా ఈ మాటా వర్క్ గురించి మాట్లాడి, “ఇంతకూ మీ పెళ్ళి ఎప్పుడూ?” అని అడిగాను.
ముభావంగా జవాబు చెప్పాడు కిషోర్.
“ఏది ఏమైనా నీది భలే మంచి సెలెక్షనోయ్ కిషోర్.. అమ్మాయ్ భలే ఎఱ్ఱగా జాంపండులా ఉంటుంది.. నీదే అదృష్టం!” గాజు అద్దాలలోంచి కనిపిస్తున్న కావ్య వైపు ఆబగా చూస్తూ అన్నాను.
“కావ్యది మీ అమ్మాయి వయసు సర్.. మీ కూతురి మీదైతే ఇలాంటి కామెంట్లే చేస్తారా?” తగ్గుస్వరంతో కటువుగా అడిగాడు కిషోర్. నాకు భలే సరదా అనిపించింది. అతని పెయిన్ నాకు వినోదంగా ఉంది మరి!
“అబ్బ, లేదు కదోయ్. ఆ సంగతి వదిలిపెట్టు.. ఆ పిల్లతో నువ్వు.. ఎన్నిసార్లు..” నా మాట పూర్తి కాకుండానే, నా టేబుల్ మీదున్న మంచినీళ్ళతో నిండి ఉన్న గాజుగ్లాసు కిందపడి పగిలిపోయింది.
“మర్యాదగా మాట్లాడరా కుక్కా.. నీకన్నా హీనమైన భాషలో మాట్లాడగలను.. నీకీ ఉద్యోగంలో ఉండాలని లేదా?” బెదిరించాడు కిషోర్. అప్పటి అతని ముఖాన్ని చూస్తే, నన్ను చంపేస్తాడేమోనని భయమేసింది. కొంచెం తగ్గాను.
“ఓకే.. ఓకే.. సారీ..” అన్నాను అప్రయత్నంగా.
“డోంట్ రిపీట్ దిస్ ఒన్స్ అగైన్, మిస్టర్ ఫణి..” గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కిషోర్.
***
మళ్ళీ నాకు ట్రాన్స్ఫరయింది.
చివరి మజిలీ అని, నా హోమ్ టౌన్ హైదరాబాద్ బ్రాంచికే బదిలీ చేసారు.
నేను రాగానే ఆత్మీయాభినందన సభ ఏర్పాటు చేసారు.
దానికి హాజరైన ప్రతీ ఉమెన్ ఎంప్లాయీ అసహనంగానే ఉన్నట్టు తోచింది నాకు. నా కీర్తి ఆ నోటా ఈ నోటా ఇక్కడివరకూ వ్యాపించే ఉండాలి. కాస్త వీళ్ళతో ఆడుకోవాలని అనుకుంటూ నవ్వుకున్నాను. నా తోక మరింత వంకర తిరిగింది.
ఓ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండి, స్టాఫ్ అందరం సాయంత్రం ఓ గంటన్నర ఎక్కువసేపు పనిచేయవలసి వచ్చింది. పని అయ్యాక, ఒక్కొక్కరూ వెళ్ళిపోతూ ఉండగా టైపిస్ట్ సరళను ఉండమన్నాను.
“ఇవి అర్జెంట్‌గా డిస్పాచ్ అవ్వాలి. కవర్ల మీద అడ్రెస్‌లు వ్రాయి.. జీపీవోకి నారాయణ చేత పంపిస్తాను..” అన్నాను, బాస్ చేత సంతకాలు పెట్టించిన కొన్ని ఉత్తరాలు చూపిస్తూ.
“సర్, టైపింగ్ చేసి ఇచ్చాను కదా.. నాకు చంటిపాప ఉంది, ఇప్పటికే ఆలస్యం అయింది. త్వరగా వెళ్ళి ఫీడింగ్ ఇవ్వాలి..” హడావుడి పడుతూ అన్నది.
“హే.. అవునా?” నా దృష్టి ఆమె ఎద భాగం పైన పడింది. పలుచని పైట వెనుకనుంచి జాకెట్, లోపలి మంగళ సూత్రాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
“పాపం నీకూ ఇబ్బందే కదా..” హస్కీగా అంటూ, కన్నార్పకుండా అటే చూస్తుంటే, ఆమె గబుక్కున వెనక్కి తిరిగిపోయింది సిగ్గుతో కుంచించుకుపోతూ.. ఆమె అలా ఇబ్బంది పడటం నాకు భలే వినోదంగా తోచింది. నా దృష్టి ఆమె కటి భాగం పైన పడింది.
సరళ ఒక్క ఉదుటున తన బ్యాగ్ అందుకుని, వెళ్తున్నాననైనా చెప్పకుండా విసురుగా బయటకు నడిచింది. నవ్వుకుంటూ, కవర్లు తీసి ముందేసుకున్నాను, అడ్రెస్‌లు వ్రాయటానికి.
ఆ మర్నాడు, మూడోనాడు కూడా సరళ ఆఫీస్‌కి రాలేదు. ఆ తరువాత వచ్చినా దుప్పట్ల వంటి దుక్క చీరలు కట్టుకుని వచ్చేది. నా ఎక్స్‌రే కంటికి ఏమీ కనబడేది కాదు.
‘తెలివి మీరిపోతున్నారు జాణలు!’ అనుకున్నాను ఉక్రోషంగా..
***
ఈరోజే నేను రిటైరయ్యేది. ఉదయం నుంచీ చూస్తున్నాను. లేడీ ఎంప్లాయీస్ అందరి ముఖంలోనూ కొట్టొచ్చినట్టు సంతోషం కనిపిస్తోంది. అందరి ముఖాల్లోనూ చిరునవ్వు దాగనంటోంది.
నాకు రిటైరయిపోతున్నానన్న బాధ కన్నా, ఈ ఆడవాళ్ళ పైన కామెంట్లు చేసే అవకాశం పోతున్నందుకు ఎక్కువ దుఃఖంగా అనిపిస్తోంది. రేపటినుంచి వాళ్ళకుండే స్వేచ్ఛను తలచుకుంటే మనసు మండిపోయింది.
ఆ సాయంత్రం ఫార్మల్‌గా మీటింగ్ జరిగింది. నా పై అధికారులు, ఉద్యోగులు అందరూ రొటీన్‌గా నాగురించి, విధి నిర్వహణలో నా సమర్థత గురించి కొన్ని మాటలు చెప్పి, సన్మానం చేసారు. అదేమిటో తెలియదు, ఒక్క ఉద్యోగిని కూడా నా గురించి మాట్లాడటానికి ముందుకు రాలేదు.
షాల్ కప్పి, చెక్ చేతిలో పెట్టాక నన్ను మాట్లాడమని అన్నారు. నేను కూడా క్లుప్తంగా మాట్లాడి ముగించాను.
“ఫణిభూషణం గారి ఫ్యామిలీ రాలేదేమి?” కొత్తగా చేరిన ఆఫీసర్ నా గురించి అడుగుతూ ఉంటే, సెక్షన్ హెడ్ చెబుతున్న మాటలు నా చెవిని పడ్డాయి.
“పెళ్ళంటూ అయితే కదా ఫ్యామిలీ ఉండటానికి?” ఆ వెటకారపు మాటలు నన్ను తలవంచుకునేలా చేసాయి.
***
రిటైరయ్యాక నా బ్రతుకు నిజంగా దుర్భరమై పోయింది. వయసులో ఉన్నప్పుడు కట్నాలకు ఆశపడి పెళ్ళికూతుళ్ళను రిజెక్ట్ చేయటంతో నాకు పెళ్ళే కాలేదు. ఆ తరువాత కాంప్రమైజ్ అయినా సరైన పెళ్ళి సంబంధాలూ రాలేదు. ఇప్పుడు ఒంటరిగా బ్రతుకు ఈడ్వటం చాలా కష్టం అయిపోతుంది. పనివాళ్ళు ఉన్నా ఇంటి మనుషులు కారు కదా.. పనమ్మాయి, వంటమనిషి రొటీన్‌గా పనిచేసి వెళుతూ ఉంటారు.
ఒంటరితనం నన్ను కాల్చివేస్తోంది. ఏదో, కాస్త రాసే అలవాటు ఉండబట్టి అప్పుడప్పుడూ ఏవో ఆంగ్లవ్యాసాలవీ వ్రాసి, పత్రికలకు పంపిస్తూ ఉంటాను.
ఒకరోజు ఏదో పర్సనల్ పని ఉండి మా ఆఫీసుకు వెళ్లాను.
నా ఛాంబర్‌లో మేనేజర్‌గా కిషోర్.. త్వరత్వరగా ప్రమోషన్స్ వచ్చినట్టున్నాయి. లోపలి హాల్లో నా రాకను గమనించినా, ఒక్క అమ్మాయి కూడా లేచి నిలబడలేదు. పలకరింపుగా చూడలేదు. చిరునవ్వుతో పలకరించలేదు. పైగా నన్ను చూడనట్టుగా నటిస్తూ వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోయారు.
ఒక నిట్టూర్పు విడిచాను. తప్పులు చేసి, శిక్ష వద్దంటే ఎలా? వీళ్ళల్లో నా తోబుట్టువులు, (పెళ్ళి అయి ఉంటే) నా కుమార్తెలు ఉంటారని మర్చిపోయాను. ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ చేసాను. ఎవరికీ చెప్పుకోలేక, భరించలేక ఎంత బాధపడి ఉంటారో కదా, ఈ ఆడకూతుళ్ళు!
ఇంకా నయం.. ఇప్పుడిప్పుడు టెక్నాలజీ బోలెడంత అభివృద్ధి చెందింది.. లేకుంటే నాకు తెలియకుండా నా పిచ్చి వాగుడుని ఆడియో లేదా వీడియో రికార్డింగ్ చేసి రిపోర్ట్ చేసి ఉంటే నా పరువు ప్రతిష్టలు ఏమైపోయి ఉండేవో..
అపరాధ భావనతో నా తల క్రుంగిపోయింది.. మౌనంగా నా పని చేయించుకుని, అది చేసి పెట్టిన ఉద్యోగికి ధన్యవాదాలు చెప్పి, ఎటూ చూడకుండా బయటపడ్డాను.
ఈ మానసికమైన ‘వెలి’ నాకు సరైన శిక్షే కదా!
సమాజంలోని సమస్యలను, విషయాలను కథాంశాలుగా చేసుకుని కథారచన కొనసాగిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. వివిధ దిన, వార, మాసపత్రికలలో 350కి పైగా కథలు ప్రచురితమయ్యాయి. ‘అమూల్యం’, ‘నువ్వు కడలివైతే…’, ‘పూల మనసులు’ అనే కథా సంపుటాలు ప్రచురించారు. ‘స్వాతిముత్యం’, ‘తరలి రావే ప్రభాతమా’, ‘అతులిత బంధం’ అనే మూడు నవలలు ప్రముఖ పత్రికలలో ధారావాహికలుగా ప్రచురితమయ్యాయి.
