Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విడిచిపెట్టిన వేళ

[మంత్రిపగడ శ్రీనివాస్ గారి ‘విడిచిపెట్టిన వేళ’ అనే కవితని అందిస్తున్నాము.]


విడిచిపెట్టగానే గుండె గోడలు పలికాయి,
నిన్ను బంధించి వేసింది నీ నీడలేనయ్యా అని
కాలం గడియారం ఆగింది ఒక క్షణం –
పోతున్న దానిలో పుడుతన్న పునర్జన్మను చూశాను.

వదలి పెడితేనే వస్తుందట శాంతి
గాలి చేతుల్లోకి వదిలిన పువ్వులా,
ఆత్మ కూడా తేలికై ఎగిరిపోతుంది;
దేవుడు మన హృదయంపై వెలుగులా
చిరునవ్వు నవ్వుతాడు.

నిజం ఏంటంటే – దాచుకున్న నొప్పే భారమయ్యింది,
దాచుకున్న ఆశలే శిక్షలు అయ్యాయి;
వాటిని వదిలేసిన రోజే తెలిసింది –
నా అంతరంలో పాట పాడుతున్నదే పరమాత్మ అని.

వదలడం ఓటమి కాదు,
మనసు వేస్తున్న మట్టిని తీసి
లోపలి వెలుగును చూసే సాధన.
వదిలిన చోటే దేవుడు నివసిస్తాడు.

ప్రతి ముగింపు ఒక ప్రార్థన,
ప్రతి విడిచిపెట్టడం ఒక ఆశీర్వాదం –
“నీకు సరిపడేది నేనే ఇస్తాను” అని
విశ్వం నెమ్మదిగా చెవిలో చెప్పే మాట.

Exit mobile version