[శ్రీ జి.వి. కళ్యాణ శ్రీనివాస్ రచించిన ‘విడిపోని పరిమళం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
సంపెంగ పరిమళం ముక్కుకు తగిలి, తలను తిప్పి చూశాడు.
దిండుకు ఒత్తిగిల్లి పక్కకు చూస్తే, పరిమళం తాలూకూ తుమ్మెద రెక్కల లాంటి కురుల మధ్య ఒదిగి ఉన్న ఆ సంపెంగ, పెంకిగా అలిగి అటు తిరిగి, పడుకున్న భార్య కురుల మధ్య అమాయకంగా కనురెప్పలు కొడుతూ కనిపించింది.
తడిసి ఉన్న ఆ కళ్లు, ముక్కుపుటాలు అదురుతూ, ఎరుపెక్కిన బుగ్గలను చల్లబరచటానికి అన్నట్టు, కన్నుకొనల నుంచి వస్తున్న గంగను భగీరథుడు ఆపలేక అలసి నిలిచినట్టు, అవి జలజలా బుగ్గల మీద నుంచి జారి దిండును తడుపుతున్నాయి.
వెనకనుండి వాలి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు అతడు. పెదవులకు ఉప్పగా తగిలింది, నయనాల నుండి జారిన నీరజం.
పెదవులను బుగ్గలపై రాస్తూ.. అన్నాడు అతను.. “ఎందుకు? ఇప్పుడు ఈ అలక?”
“సరే చూద్దాం! దానికే! ఇంతలా దిండు తడిపేయాలా?”
మరింత దగ్గరగా చేరి, ఆమె తుమ్మెద రెక్కల కురులలో, ముఖం పెట్టి మరింతగా హత్తుకున్నాడు. సంపెంగ ఇచ్చే మత్తు అతన్ని పరవశుడిని చేసింది.
ఉక్రోషంతో ఆమె ముక్కుపుటాలు ఎర్రబడ్డాయి. ముందుకు జరగాలి అనిపించింది. ఎందుకో కదలలేకపోయింది. అలానే బాగుంది.
“నేను వెళ్తా!”
“ఎక్కడికి?!”
“మీకు తెలుసు!”
“చెప్పొచ్చుగా!” అన్నట్టు ఆమెను ఉడికించాడు.
“మా ఇంటికి!”
“ఇదే కదా నీ ఇల్లు!”
“ఇది కాదు!” అలా అంటున్నప్పుడే వణికిన పెదవిని కింద పెదవితో బలంగా నొక్కింది.
“సరే!” అన్నాడు. “నీ ఇంటికే పంపిస్తాను!!”
“ఎప్పుడు వెళ్తావు? రేపు ఓకేనా?” చిలిపిగా అడిగాడు.
ఆమె అటు తిరిగి, అలానే తల ఊపింది. సరే అన్నట్టు.
***
ఇమ్లిబన్ బస్టాండ్ పూర్తిగా రద్దీగా ఉంది.
“వెళ్లగానే ఫోన్ చేయి!” ఆమె కన్నుల్లోకి చూస్తూ అన్నాడు. ఆమె సరే అని తల ఊపింది.
“ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతోంది. లేకపోతే నేను దగ్గరుండి దింపేవాడిని. అయినా నీ అలకను తట్టుకోలేక పంపిస్తున్నాను. సాయంత్రం నాలుగుకల్లా రేపల్లె చేరిపోతావు. మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. బస్టాండ్‌కి వస్తానన్నారు.”
ఆమె మళ్లీ తల ఊపింది.
“ఉభయభారతి!” పూర్తిపేరుతో పిలిచాడు.
ఆలా పిలిచేసరికి, చిరాగ్గా తలను ఎత్తి చూసింది. అతను నవ్వుతున్నాడు.. పెదవులు బిగించి.
“చెప్పండి శ్రీకృష్ణ..” కొద్దిగా ఉక్రోషంగా అంది.
“నేను వచ్చే ఆదివారం వస్తాను, నిన్ను తిరిగి హైదరాబాద్‌కి తీసుకు రావటానికి .”
బస్సు బయలుదేరుతుందన్నట్టు డ్రైవర్ హారన్ మోగించాడు.
మధ్యలో భోజనాలకి ఆపినప్పుడు తినడానికి, పెరుగన్నం బాక్స్ ఇచ్చాడు. టికెట్ చేతికి ఇస్తూ, “జాగ్రత్తగా వెళ్లు” అంటూ క్రిందికి దిగాడు శ్రీకృష్ణ.
బస్సు దిగిన తరువాత తిరిగి కిటికీ దగ్గరకు వచ్చాడు.
కిటికీ దగ్గర సీటు రావడంతో ఉభయ తొంగి చూస్తూ, “వెళ్తున్నా” అన్నట్టు సైగ చేసింది.
ఎందుకో ఒక్క క్షణం అతనికి వెళ్ళాలి అనిపించలేదు.
“బై” అన్నట్టు చేతి సైగ చేశాడు.
బస్సు బయలుదేరింది. శ్రీకృష్ణ మనసు భారంగా మూలిగింది. రాబోయే విరహానికి మౌనంగా వేసిన పునాది ఆ క్షణం.
***
ఉభయభారతి వచ్చి రెండురోజులు అయ్యింది.
కొత్తగా పెళ్లైన మనవరాలు ఉభయభారతి పెద్దగా ముచ్చట్లు చెప్పకపోవడంతో, నానమ్మ సుగుణమ్మగారికి ఏదో వెలితిగా అనిపించింది.
చెప్పాపెట్టకుండా హైదరాబాద్ నుంచి వచ్చేసరికి, ఉభయభారతి తల్లి కనకదుర్గ కూడా ఒకింత ఆశ్చర్యపోయింది.
అప్పుడే అడగటం దేనికని అడగలేదు. అసలు తానే వారించింది కోడలు కనకదుర్గని, కొడుకు రామంగారిని కూడా “అప్పుడే ఏమీ అడగవద్దు” అని.
ఉభయభారతి ఒక్కర్తే కూతురు రామంగారికి. సాంప్రదాయ కుటుంబం అవటం, ఇంకా సంప్రదాయం నమ్మే కుటుంబం అవటం వల్ల, కాస్త పాతకాలం పేరు అయినా ‘ఉభయభారతి’ అని పెట్టాలన్నది తాతయ్య సుబ్బయ్య శాస్త్రి గారి మాట.
చాలా విశాలమైన ఇల్లు అది , వెనక పెరట్లో, రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలతో ఉంది ఇల్లు. సుగుణమ్మగారు మల్లెపందిరి పక్కగా రోట్లో వంకాయ పచ్చడి రుబ్బుతున్నారు. నవనవలాడే వంకాయలను కాల్చి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఘుమఘుమలాడే పోపు దినుసులతో చేసిన ఆ వేపుడును కాస్త కచ్చా, పచ్చగా రుబ్బుతున్నారు.
ఇంగువ వేసారేమో !!?.. పక్కింటి వరకూ ఆ మధుర ఘుమఘుమలాడే వాసన వ్యాపించింది.
ఆ వాసనకేమో!!? పక్కింటి విశాలాక్షమ్మ బయటకు వచ్చింది.. “మనవరాలు వచ్చిందనుకుంటా, వదినా..?!!” పిట్టగోడ మీదనుంచి విశాలాక్షమ్మ అడిగింది సుగుణమ్మను.
“అవును వదినా!! వచ్చింది.”
“ఏమిటి విశేషం? మనవడు వచ్చినట్టు లేదు కదా?”.. ఆరా తీస్తూ అడిగింది విశాలాక్షమ్మ.
“లేదు వదినా!” అంది సుగుణమ్మ.
“కనుక్కో! ఎందుకు వచ్చిందో?”.. గొంతు తగ్గించి అడిగింది విశాలాక్షమ్మ, చుట్టూ పరికించి ఎవరైనా వింటున్నారా అన్నట్టు.
విశాలాక్షమ్మ, సుగుణమ్మ చిన్నప్పటి మంచి స్నేహితురాళ్లు. ఒకే ఊరి వారు. యాదృచ్ఛికంగా ఇద్దరికీ రేపల్లె సంబంధాలు కుదిరాయి. పక్కపక్క ఇళ్లుగా ఉండటం కూడా యాదృచ్ఛికమే. ఇద్దరికీ భర్తలు కాలం చేశారు.
ఎన్ని అవాంతరాలొచ్చినా స్నేహబంధం విడిపోలేదు. ఒకరికి, ఒకరు మాటసాయం, చేతసాయం, మామూలే. సంసారం, సంస్కారం, బాధ్యతలు, అనుభవాలు అన్నీ కలగలిపి తమ జీవితాన్ని కాచి వడపోశారు.
“కనుక్కుంటా. ఇవాళ అడగాలని అనుకున్నా..”
“అడుగు. అవసరమైతే నన్ను పిలువు, చిన్నదానితో నేను మాట్లాడతా. ఏమీ ఉండదు లే.” అంది విశాలాక్షమ్మ, కంగారుపడకు అన్నట్టు సైగ చేస్తూ.
***
సంధ్యాకాంతి బాదం చెట్టు మీద ప్రసరిస్తోంది. చలికాలపు గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశంలో తెల్లని పక్షులు గూటికి చేరాలనే ఆత్రంతో ఉత్తర దిక్కుగా ఎగురున్నాయి. సంధ్యాహారతి దీపం తులసి కోట దగ్గర పెట్టి,
బాదం చెట్టు కింద కూర్చున్న ఉభయను సుగుణమ్మగారు చూస్తున్నారు.
బాదం చెట్టుకు సన్నజాజి తీగ అల్లుకొని, జాజిపూల సువాసన పరిసరాల్లో నిండుగా ఉంది. ఆ వాసనలో ఏదో అపూర్వ జ్ఞాపకం,.. తన స్వేచ్ఛ, సంతోషం, చిలిపితనం. ఉభయ కళ్ళు దూరంగా నిలిచిపోయాయి.
సుగుణమ్మగారు నెమ్మదిగా దగ్గరకి వచ్చి, ఆమె పక్కన కూర్చున్నారు. ఏమని అడగాలో తెలియని మౌనం మధ్య నిలిచింది.
“ఉభయా..”
ఆ పిలుపులో ఆప్యాయత మాత్రమే.. ప్రశ్న లేదు.
ఉభయ తలెత్తి చూసింది.
“నాన్నమ్మ..”
“ఏమైంది?” అడిగింది సుగుణమ్మగారు ఉభయను ఉద్దేశించి.
వంటిల్లు దగ్గర ఏదో అలికిడి వినిపించడంతో తల తిప్పి చూశారు సుగుణమ్మగారు. ఉభయ గమనించలేదు. ఉభయ తల్లి తమ వైపుకు వస్తోంది అని గమనించి సుగుణమ్మగారు చేతి సైగతో ‘ఆగమనడం’తో, కనకదుర్గ మౌనంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.. సరే అన్నట్టు తలాడిస్తూ.
“నీకు శ్రీకృష్ణకి ఏమైనా గొడవ అయ్యిందా?” సూటిగానే అడిగారు సుగుణమ్మగారు.
ఉభయ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. బాదం చెట్టు దగ్గిర కాంతి మెల్లగా మసకబారినట్టు ఆమె కళ్లలో వెలుగు తగ్గి ఏదో దిగులు కనిపించింది.
“గొడవ కాదు నానమ్మ..” నెమ్మదిగా అంది.
“అనుకున్నానే, గొడవ కాదని. చెప్పు, ఏమైంది?”
“అసలు నాతో మాట్లాడడు!” ఒక అభియోగ స్వరం.
సుగుణమ్మగారికి అర్థమైంది. పెదవులపై నవ్వు మెరిసింది. ఎన్నో కుటుంబాలను దగ్గర నుంచి చూసిన అనుభవం అది.
“అంతేనా?” అన్నారు సుగుణమ్మ.
“ఎప్పుడు చూసినా బిజీ. పని అంటారు, ఆడిటింగ్ అంటారు, ఆఫీసు అంటారు.. నాతో శ్రద్ధగా మాట్లాడరు.” ఉభయ గబ గబా చెప్పింది.
“ఇందాక అసలు మాట్లాడడు అన్నావు,”
“సరే సరే! విను.”
“నువ్వే మొదలు పెట్టు. నీ హృదయం తెరిస్తే, అతని హృదయం కూడా తెరుచుకుంటుంది.” సుగుణమ్మ కాసేపు ఆగారు.
ఉభయ కళ్ళు ఇంతంత చేసుకుని నానమ్మ వంక చూస్తున్నది.
“మగవాడు మాటల్లో కాదు తల్లీ, బాధ్యతల్లో మాట్లాడతాడు. అతని నిశ్శబ్దాన్ని నువ్వు అవమానంగా భావిస్తున్నావు.”
ఉభయ, కనుబొమలు ముడుచుకున్నాయి.
“అయితే నేను ఏమి చేయాలి నానమ్మా?”
సుగుణమ్మ నేలపై పడ్డ జాజిపువ్వు తీసుకుని వేలిమధ్య తిప్పుతూ, “ప్రశ్నలు వేయకు. ఫిర్యాదులు పెట్టకు. మాటలకు చోటు ఇవ్వు. అతను అలసిపోయి ఇంటికి వస్తాడు. నువ్వు ఆ రోజు జరిగిన చిన్నచిన్న విషయాలు అందంగా చెప్పు. వంటలో ఉప్పు ఎక్కువయ్యిందని.. తర్వాత, రసం ఆయనకిష్టమయ్యేలా ఎలా మార్చావో చెప్పు.. అతని బట్టలు ఇస్త్రీ చేసి అలమారాలో పెట్టినట్టూ చెప్పు.. అతని రోజు ఎలా గడిచిందని అడుగు.. అవే మొదలు మాటలు..”
ఉభయ నిశ్శబ్దంగా వింటోంది.
“నీ మాటల్లో మృదుత్వం ఉంటే, అతని మౌనం కరుగుతుంది. నీ చూపుల్లో నమ్మకం, విస్మయం ఉంటే అతని మాటలు వస్తాయి.”
ఉభయ కళ్లలో చిన్న మెరుపు.
“నేను ప్రయత్నించలేదేమో నానమ్మా..”
సుగుణమ్మ ఆమె చేతిపై చేయి పెట్టింది.
“ప్రయత్నించకపోతే ఏమీ రావు., ఆలోచించకపోతే ఏమీ అనిపించవు.”
బాదం చెట్టు ఆకులు చప్పుడు చేశాయి. సుగుణమ్మ వంగి జాజిపూలు ఏరుతున్నారు.
ఉభయకు తన మాటలు ఇంకాలంటే, క్షణం విరామం కావాలనీ ఆమెకు తెలుసు.
***
రాత్రి, కొడుకు, కోడలితో భోజనాలు అయ్యాక, ఉభయ పక్కనే సుగుణమ్మగారు పడుకోవడానికి మంచం వేసుకుంది. ఉభయ, తల్లి ఇచ్చిన మంచినీళ్ల మరచెంబు, సుగుణమ్మగారి మంచం పక్కనే ఉన్న స్టూల్ పై ఉంచింది.
“అమ్మా! నువ్వూ, ఉభయ మాతో రేపు కోవెలకు రావాలి,” అన్నారు రామంగారు.
“అలాగే లే.. రా? నేనే నీతో!”…
“ఈ కార్తీక మాసం తొలి సోమవారం, శివుడికి అభిషేకం చేయించాలి.” అంది అని, అంది సుగుణమ్మగారు, గుర్తు చేస్తునట్టు .
“అదే! అదే లే!”.. అన్నారు రామంగారు.
చలి పెరగడంతో ఉభయ దుప్పటి కప్పుకొని, నానమ్మ ఏం చెబుతుందా అన్నట్టు సుగుణమ్మగారి వైపు చూసింది.
పెళ్లికి ముందు, రాత్రిళ్లు నిద్రకు ముందు, ఇలానే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇద్దరూ. ఎన్నో రోజుల తరువాత ఈ అవకాశం రావడంతో ఉభయలో మళ్లీ అదే ఉత్సాహం.
గడచిన రెండ్రోజులుగా.. నానమ్మతో మాట్లాడకుండానే నిద్రపోయింది ఉభయ.
“చెప్పు! ఇంకా ఏమిటి నీ సమస్య?” మరో సారి సూటిగానే అడిగారు సుగుణమ్మ.
“నాకు వంట రాదని నీకు తెలుసుగా!”
“అసలుగా రాదు అని కాదూ..!!”
“కానీ.. అమ్మలాగా, నీలాగా రుచిగా వండటం రాదు. హైదరాబాద్‌లో, మొదట్లో వంట చేస్తూ కాస్త ఉప్పు ఎక్కువైంది. దానికే ఆయన విసుక్కున్నారు.. అప్పటి నుండి.. నాకు విపరీతమైన భయం.. ఉప్పు ఎక్కువైపోతుందేమో!?!.. కారం ఎక్కువైపోతుందేమో..?! అని ఒక రకమైన భయం. పోనీ, నాకు రుచిగా అనిపించినా.. ఎలా ఉందీ? అని అడగలేను.. నాకే అనుమానం, రుచిగా ఉందో లేదో! అని.”
సుగుణమ్మ మనవరాలు చెప్పిన ప్రతిమాట వినింది.
“ఒకటి గుర్తుపెట్టుకో ఉభయా.. నీకు అర్థం కావలసింది ఇంకోటి ఉంది.., అది నీ వంటపైన విసుగు కాదు.. ఆ రోజు, బహుశా, అతనికి ఆఫీసులో ఏదో ఒత్తిడి ఉండి ఉంటుంది. ఆ విసుగు, ఆ క్షణంలో నీ వంటలో వేసిన ఉప్పుపైకి మారింది. వంటలో ఒకసారి, మరోసారి ఉప్పు ఎక్కువైనంత మాత్రాన, దానికి భర్త విసుక్కున్నాడంటే, నువ్వు అంతగా దిగులు పడకూడదు. వంటలో ఉప్పు ఎక్కువైతే సరిచేసుకోవచ్చు. కానీ ఒకసారి మాటలో ఉప్పు ఎక్కువైతే సరిచేయలేం. నేను అంటున్న ‘ఉప్పు’ పొందిక లేకపోవటం.” అంటూ ఆపారు.
మళ్ళీ మాట్లాడుతూ, “అలా ఆయన విసుక్కున్నప్పుడు, ఒక ‘సారీ’ చెప్పి బుగ్గపై ముద్దు పెడితే అతనే చల్లబడిపోయేవాడు. ఇది నీకు ముందే తెలిసి ఉండాలి.. లేకపోతే తెలుసుకోవాలి” అని సుగుణమ్మ మాట ముగించారు.
ఆ మాటల వెనుక ఉన్న జీవితానుభవపు బరువు, అనుభవం, ఆమె గొంతులో కాసేపు నిలిచిపోయింది.
ఉభయ దుప్పటి లోపలే ఒళ్లు ముడుచుకుంది.
“నేను అంత చిన్న విషయానికే.. కాస్త ఎక్కువగా ఆలోచించాను? ఇంతగా భయపడ్డానా నానమ్మా?” .. నెమ్మదిగా అంది.
సుగుణమ్మగారు చిరునవ్వు నవ్వారు.
“భయం అనేది బలహీనత కాదు తల్లి. అది ప్రేమకు ఇచ్చిన విలువ.”
కొన్ని క్షణాలు మౌనం.
బయట చలిగాలి ఇంకా పెరిగింది. కిటికీ తెర పలుచని కాగితంలా ఊగింది.
“మరొకటి చెప్పనా?” అంది సుగుణమ్మ.
ఉభయ తల ఊపింది.
“మగవాడి కోపం చాలాసార్లు తనకే తెలియని అలసట నుంచే పుడుతుంది. అది నిన్ను తగ్గించడానికి కాదు, తనను తాను సంభాళించుకోలేని పరిస్థితి. అతను నిన్ను తక్కువ చేయలేదు తల్లి. ఆ క్షణంలో, తానే తనను తాను మోయలేకపోయాడు.”
ఉభయ బలం గా ఒక నిట్టూర్పు విడిచింది.
“నువ్వు వంటను భయంతో కాదు, ఆప్యాయతతో చేయాలి. రుచి చేతుల్లో ఉండదు, మనసులో ఉంటుంది.”
సుగుణమ్మ ఉభయ నుదిటిపై చేయి వేసింది.
“ఒకరోజు ఉప్పు ఎక్కువైందంటే, జీవితం చేదు అయిపోదు. కానీ మాటల్లో ప్రేమ తగ్గితే, రోజులు మసకబారతాయి. నువ్వు అదే చేస్తున్నావు. అతని సమస్యను అప్పుడే అర్థం చేసుకుని ఉంటే, నీకు, నీ వంటమీద కూడా నమ్మకం రెట్టింపు అయ్యేది.”
సుగుణమ్మగారు మెరుస్తున్న పలువరస నవ్వు నవ్వింది.
ఉభయ ముఖం వికసించింది. ఏదో మనసులోంచి తెర తొలగినట్టు అనిపించింది.
సుగుణమ్మ కళ్లుమూసి ప్రార్థించారు, “ఈ చిన్నదాని జీవితం బాగుండాలి.”
ఉభయ ముఖం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.
చీకటి చిక్కబడింది. చలిగాలి కిటికీ నుంచి లోపలికి దూసుకొచ్చింది. ఉభయ క్రమంగా గాఢనిద్రలోకి జారిపోయింది.
***
పొద్దుపొడుస్తూ, మెలకువ వచ్చింది ఉభయభారతికి. బాత్రూంలో ముఖం కడుక్కుని నేరుగా వంటింట్లోకి వెళ్లింది.
రామంగారు ముందుగదిలో పేపరు చదువుతూ కాఫీ తాగుతున్నారు. విభూది ధరించిన, తెల్లని బట్టల్లో, గుడికి వెళ్ళటం కోసం రెడీగా ఉన్నారు.
తల్లి కనకదుర్గ, టిఫిన్ చేస్తూ వంటింట్లో కనిపించింది.
“కాఫీ తాగుతావా?” అడిగింది కనకదుర్గ.
“ఊ..” అంది ఉభయ.
“రాత్రి పొద్దుపోయేంతవరకు నానమ్మా, నువ్వూ కబుర్లు బాగా చెప్పుకున్నట్టున్నారు!” అరా తీస్తున్నట్టు అడిగింది కనకదుర్గ.
“ఏముంటాయి?!! నీకు తెలియనివీ..” అని సుగుణమ్మగారు లోపలికి వస్తూ అంది.
“పద ఉభయా, త్వరగా కాఫీ తాగి రెడీ అవ్వు. శివాలయంకు వెళ్దాం. శివయ్యకు అభిషేకం నాన్న చేయిస్తున్నారు. తిరిగి వచ్చి నలుగురం కలిసి టిఫిన్ తినేద్దాం.”
“అవును ఉభయా, త్వరగా రెడీ అవ్వండి!” అన్నారు రామంగారు ముందుగదిలోనుంచి.
***
అభిషేకం, హారతి అయ్యాక, ప్రసాదం తింటూ ఒక పక్కగా కూర్చున్నారు సుగుణమ్మ, ఉభయ.
మంటపాన్ని చూపిస్తూ, .. “ఇక్కడే కదా నీ పెళ్లి జరిగింది..” అన్నారు సుగుణమ్మ.
“పెళ్లికి వచ్చిన బంధువులందరూ, మీది ‘ముచ్చటైన జంట’ అన్నారు.”
ఒక్కసారి తన పెళ్లిరోజు గుర్తొచ్చింది ఉభయకు. అవును, తన స్నేహితురాళ్లు శ్రీకృష్ణను చూసి “ఇంత అందంగా ఉన్నాడు.. నిజంగా కృష్ణుడేనా?! ఎవరైనా ఎత్తుకుపోతారేమో చూడు!” అని చెవిలో చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి.
“నానమ్మా..” అంది ఉభయ.
“చెప్పు తల్లి, ఏమిటి?”.. అన్నారు సుగుణమ్మ.
“మేము ఇద్దరం మా అత్తగారి ఇంటికి వెళ్లినప్పుడు గానీ.., మా అత్తగారు, మామగారు హైదరాబాద్ మా ఇంటికి వచ్చినప్పుడు కానీ, అయన ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అన్నీ వాళ్లమ్మ మాటే వింటారు. నేను ఏమైనా సలహా ఇస్తే పట్టించుకోరు. నేను ‘అవును’ అన్నా, మా అత్తగారు ‘కాదు’ అంటారు. మావారు వాళ్ల అమ్మ మాటే వింటారు.”
ఉభయ మాట పూర్తవగానే, సుగుణమ్మ ఒక్క క్షణం మౌనం వహించారు.
ఆవిడ చేతిలో ప్రసాదం అలానే ఉంది. మంటపం అంచున ఉంటున్న, నందీశ్వరుడి చిన్న రాతి విగ్రహాన్ని ఒకసారి చూశారు.
“ఇది కొత్త విషయం కాదు తల్లి..” అన్నారు నెమ్మదిగా.
ఉభయ తలెత్తి చూసింది.
“మగవాడు తన తల్లి ముందు ఎప్పుడూ చిన్నవాడే. అది నీపై ప్రేమ తగ్గిందని కాదు, ఆమె ముందు అతని బాల్యం మళ్లీ నిలుస్తుంది.”
ఉభయ ముఖంలో అసంతృప్తి ఇంకా కనిపించింది.
“కానీ నానమ్మా.. అప్పుడు నా మాట విలువ ఏమవుతుంది?”
సుగుణమ్మ చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులో ఉభయను తేలిక చేస్తునట్టు లేదు, కేవలం అపారమైన అనుభవమే ఉంది.
“నీ మాట విలువ, అతను ఎవరిమాట వింటున్నాడో చూసి నిర్ణయించబడదు. నువ్వు ‘ఎప్పుడు మాట్లాడుతున్నావో’ చూసి నిర్ణయించబడుతుంది.”
ఉభయ కనుబొమలు ముడిచాయి.
“అత్తగారు ఉన్నప్పుడు నీ మాట నెగ్గాలన్నట్టు పోటీ పెట్టకు. అది నువ్వు ఓడిపోయే పోటీ.”
“అయితే, నేను మౌనంగా ఉండాలా?” ఉక్రోషంగా.
“మౌనం కాదు తల్లి, సంయమనం.”
సుగుణమ్మ ప్రసాదం, బుట్టలో తమలపాకులో పెట్టింది.
“ఆయన తల్లి మాట వింటున్నప్పుడు, నువ్వు కేవలం గమనించు. వాదించకు. తర్వాత, ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు నెమ్మదిగా చెప్పు, ‘అత్తగారు చెప్పింది సరే, కానీ నాకు ఇలా అనిపించింది’ అని. అత్తగారి మాటకు ఎదురు నిలిస్తే, అతను నీ నుంచి దూరం అవుతాడు. అదే మాటను సరైన సమయంలో చెబితే, సరైన స్వరంతో చెపితే, అతను నీ పక్కన నిలుస్తాడు.” స్వరం అనే పదం వట్టి పలికింది.
ఉభయ కళ్లలో ఆలోచన మెరిసింది.
“ఇంకొకటి గుర్తుపెట్టుకో, అత్తగారు నీకు పోటీ కాదు. నీ భర్తకు ఆమె తల్లి. ఆ స్థానం ఎప్పటికీ మారదు. నువ్వు భార్యవు. ఆ స్థానం కూడా ఎవరికీ ఇవ్వబడదు. రెండు స్థానాల మధ్య నువ్వే పోటీ పెడితే, నువ్వే అలసిపోతావు.”
“అయితే.. నన్ను నేను తగ్గించుకున్నట్టేనా నానమ్మా?”
సుగుణమ్మ తలాడించారు కాదు అన్నట్టు. “తగ్గించుకోవటం కాదు, బలంగా నిలబడటం. బలమైనవాళ్లకే, ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ ఆగాలో తెలుస్తుంది. ఎప్పుడు అధికార స్వరం వాడాలి, ఎక్కడ సున్నిత స్వరం ఉపయోగించాలి అనేది కూడా తెలుసు” అన్నారు.
అప్పుడు మోగింది గుడిగంట. ఆ శబ్దం ఉభయ మనసుని తేలిక చేసింది. చాలా పవిత్రమైన స్పందన.
“అర్థమవుతోంది నానమ్మా..” అంది.
సుగుణమ్మ ఆమె తలపై చేయి వేసింది.
“నీ స్థానాన్ని నువ్వే తెలుసుకునే రోజునుంచి, ఇంకెవరూ నీ స్థానాన్ని నిర్ణయించలేరు.”
ఉభయ ముఖంలో కొత్త స్థిరత్వం కనిపించింది.
గుడి ప్రాంగణంలోని సంపెంగ చెట్టు, ఆ సంపెంగ పరిమళం మళ్లీ గాలితో కలిసి వచ్చి, ఆమె జడలో ఒదిగినట్టు అనిపించింది.
***
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఉభయ “నానమ్మా.. అప్పుడప్పుడూ అతని ప్రపంచంలో నేను ఒంటరినేమో అని అనిపిస్తుంది.. ఆఫీస్ నుంచి రాగానే, తన ఆఫీస్ విషయాలు, లేకపోతే తన తల్లిదండ్రుల సంగతి, లేకపోతే, భవిష్యత్తులో నేను ఏమి చేయాలన్నది.. ఇవే. అమ్మ, నాన్న, కుటుంబం,.. ఇవే!!. నాకు అనిపించేది, నాకు అసలు స్థానం ఉందా?” కొంచెం ఉద్వేగంతో చెప్పింది.
గదిలో కొద్ది క్షణాల మౌనం. కిటికీ దగ్గర చలి గాలి పలుచని తెరను కదిపింది.
సుగుణమ్మ వెంటనే మాట్లాడలేదు. ఉభయ వైపు చూసింది. ఆ చూపులో తీర్పు లేదు, కేవలం సంతోషింపజేయాలనే ప్రయత్నం. నిజం చెప్పాలని ఆలోచన.
“ఇక్కడ నీకు ప్రకృతి గురించి ఒకటి చెప్పాలి.. మగవాడు చెట్టు లాంటివాడు.” అన్నారామె.
ఉభయ వింటోంది. చాలా ఆసక్తిగా..
“ఒక చెట్టు వేర్లు నేలలో లోతుగా ఉంటాయి. కొమ్మలు మాత్రం ఆకాశం వైపు పాకుతాయి. ఆ చెట్టు కొమ్మలు, పక్షులకు ఆశ్రయమిస్తాయి. ఆకులు గాలితో మాట్లాడతాయి. కానీ వేర్లు మాత్రం, ఎవరికీ కనిపించవు.”
ఉభయ మరింత శ్రద్ధగా వింటోంది.
“ఆ చెట్టు నిలబడటానికి వేర్లే ఆదారం. అవి గట్టిగా లేకపోతే, చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా, ఒక గాలి ఊపుతో కూలిపోతుంది. నీకూ ఆ విషయం తెలుసు. నీ భర్త జీవితంలో, ఆఫీసు అతని కొమ్మలు. ఆ కొమ్మలు లేకుంటే జీవితంలో జీవన ఆధారం ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు అతని ఆకులు. నువ్వు, ఆ వేర్లు.”
ఉభయ కళ్లలో మెరుపు.
“ఒకప్పుడు, అతని తల్లిదండ్రులే వేర్లు. పెళ్లి అయ్యాక, ఇప్పుడు నువ్వు. వేర్లు కనిపించవు తల్లీ. కానీ అవి లేకపోతే చెట్టు నిలబడదు. నీకు, నీ స్థానం లేదేమో?! అని అనిపిస్తే, అది నువ్వు బయటకు నీకు నువ్వు కనిపించకపోవడం వల్ల. నీ అవసరం తగ్గినందుకు కాదు.”
ఉభయ నిటారుగా కూర్చుంది.
“అయితే.. అతను నాకు ఆ విషయం చెప్పకపోవడం? నేనే ముఖ్యం అని, నా స్థానం చాల పెద్దదని..?!”
సుగుణమ్మ చిరునవ్వు నవ్వారు.
“వేర్లతో చెట్టు రోజూ మాట్లాడదు తల్లి. అవి అక్కడ ఉన్నాయన్న నమ్మకం చాలు.”
ఉభయ దీర్ఘంగా శ్వాస విడిచింది.
“నువ్వు అతని ప్రపంచంలోకి బలవంతంగా వెళ్లాలనుకోవద్దు. అతని ప్రపంచం, నెమ్మదిగా నీ దగ్గరకు రావాలి. నువ్వు వినగానే, అతను మాట్లాడటం ప్రారంభిస్తాడు.”
సుగుణమ్మ ఆమె చెయ్యిని పట్టుకున్నారు.
“నీ స్థానం ఎప్పుడూ పదిలమే. నన్ను నమ్ము, నీవే అతని వెన్ను, దన్ను. నువ్వు లేని క్షణం, అతను కూలిన వృక్షం. నీ విషయం లోనే కాదు, ప్రతి కుటుంబం లోనూ అంతే.”
ఉభయ కళ్లూ మూసుకుంది. మనసులో ఏదో బరువు తగ్గినట్టు అనిపించింది.
రాత్రి మరింత నిశ్శబ్దంగా మారింది.
ఆ నిశ్శబ్దంలో, ఉభయ తన స్థానాన్ని స్పష్టంగా చూస్తోంది. మానసికంగా!! బలంగా!!
***
“నానమ్మా.. ఇప్పటివరకూ నువ్వు చెప్పినవి అన్నీ, నీ అభిప్రాయాలా? లేక నీ అనుభవాలా?”, సూటిగా అడిగింది ఉభయ.
సుగుణమ్మ అప్పడాలు పెట్టడానికి పిండి వత్తుతున్నారు. చేతుల కదలికలో అలవాటు. మనసులో ప్రశాంతత.
కనకదుర్గ, రామం గారు గుంటూరులో ఎవరికో బాగోలేదని చూసేందుకు వెళ్లారు. వాళ్ల నమ్మకం ఒక్కటే.. ఈ రెండు రోజుల్లో తమ కూతురిలో మార్పు రావాలి. అది సుగుణమ్మ గారి చేత్తో ఉందని తెలుసు.
అప్పటికే సుగుణమ్మ గారు, ఉభయకు తెలియకుండానే, వాళ్లిద్దరికీ మొత్తం విషయం, పూసగుచ్చినట్టు చెప్పారు.
“లేదు తల్లి..”, మెల్లగా అన్నారు సుగుణమ్మ.
“నీకు నేను చెప్పింది నా అభిప్రాయాలు కాదు. నా అనుభవాలు, జీవితంలో నేర్చుకున్న పాఠాలు. నేనూ నీలాగే ఒకింటికి కోడలినే ఒకప్పుడు. నాకూ ఎన్నోసార్లు, మీ తాతగారి ప్రేమ పూర్తిగా నాకే ఉందో లేదో అన్న భయం వచ్చేది. అప్పట్లో మావి పెద్ద సంసారాలు!!”
ఉభయ చాలా ఆసక్తిగా వింటున్నది.
“నానమ్మా, మరి నాకూ అప్పుడప్పుడు అతని ప్రేమ దూరమవుతుందేమో అని అనిపిస్తుంది.”
సుగుణమ్మ పిండి వత్తడం ఆపారు. ఉభయ వైపు తిరిగి చూశారు.
“అలా అనిపిస్తుందంటే, నీ మనసులో అతనికి ఎంతో ప్రత్యేక స్థానం ఉందన్న అర్థం. అవ్యాజమైన ప్రేమే, ఒకొక్కప్పుడు అలాంటి భయాన్ని పుట్టిస్తుంది.”
ఒక్క క్షణం ఆగి, “సీతమ్మ గురించి ఒకటి చెబుతా. విను.” అన్నారు.
ఉభయ మరింత శ్రద్ధగా వినసాగింది.
“అడవిలో రాముడితో ఉన్నప్పుడు, అతని ప్రేమపై సీతమ్మకు ఎలాంటి సందేహం లేదు. అతను తన కోసమే జీవిస్తున్నాడని నమ్మకం. పట్టాభిషేకం తర్వాత, రాముడు రాజైనప్పుడు, రాజధర్మం ముందుకొచ్చింది. ప్రజలు, రాజ్యం, బాధ్యతలు, అన్నీ అతని చుట్టూ నిలబడ్డాయి. అప్పుడు సీతమ్మకూ అనుమానం వచ్చింది ‘ఇప్పుడు నా స్థానం ఎక్కడ?’ అని.”
ఉభయ ఊపిరి బిగబట్టి వింటున్నది.
“కానీ, ఆమె ఎప్పుడూ రాముడి ప్రేమను ప్రశ్నించలేదు. అతని నిశ్శబ్దాన్ని తిరస్కారంగా భావించలేదు. బాధ్యతలు పెరిగినా, ప్రేమ తగ్గలేదని ఆమెకు తెలుసు.”
సుగుణమ్మగారు పిండిముద్దపై తడి గుడ్డ కప్పారు.
“రాముడు రాజధర్మం కోసం మౌనంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. సీతమ్మ ఆ బాధ్యతను గౌరవించి మౌనంగా నిలిచింది. అదే పరిణతి, తల్లీ. ‘ప్రేమ’ మాటల్లో కనిపించదు. బాధ్యతల బరువుతో ప్రేమను కొలిస్తే మనం తప్పుతాం. ప్రేమ లేకుంటే, భయం ఉండదు.” చెప్పటం పూర్తి చేసి సుగుణమ్మగారు మౌనం వహిచారు.
ఆవిడకు తెలుసు, తనమాటలు ఉభయ మనసులోకి ఇంకాలి అంటే, కొన్ని క్షణాల మౌనం అవసరం అని.
ఆ మౌనం, ఉభయ హృదయాన్నే మార్చింది.
కొన్ని క్షణాల తర్వాత.. “నానమ్మా.. నేను ఆదివారం హైదరాబాద్ వెళ్లిపోతాను.” అంది.
గుడి దగ్గిర సంపెంగ చెట్టు నుంచి తెచ్చి మందిరం లోని దేవుడి పాదాల వద్ద పెట్టిన సంపెంగ పువ్వు పరిమళం గదిలోకి వచ్చింది. దేవుడి దగ్గర పెట్టిన పూల సువాసనతో కలిసి ఒక్కసారిగా గదంతా గుప్పుమంది.
సుగుణమ్మగారు అలమారాలో అప్పడాల పిండిని సర్దుతూండగా ఆవిడ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. అది సాధించిన నవ్వు.
ఆమెకు తెలుసు, ఇది ‘విడిపోని పరిమళం’ అని.
సాఫ్ట్వేర్ రంగంలో గత పాతికేళ్ళుగా వుంటూ, రచనా రంగంలో మొదటి నుండి ఆసక్తి కలిగి, ప్రస్తుతం కథలూ, సినిమాలకు స్క్రిప్ట్ వ్రాయాలన్న అభిలాషతో ముందుకు వెళుతున్నారు జి.వి. కళ్యాణ శ్రీనివాస్, యూట్యూబ్ చానెల్ ‘Kalyana’s I my voice’ లో కథలు చదువుతూ. చాలా మంది శ్రోతలకు ఆయన గొంతుక ద్వారా పరిచయమే.
తెలుగు డబ్బింగ్ మరియు ‘పొడ్ కాస్టింగ్’ ఇష్టమైన కళలు.
