[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వినూత్న యత్నోత్సాహము’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]
కట్టుబాట్ల నెఱుగనట్టి కంపముండ్ల మనిషికిన్
చట్ట సభలు పాడుచేయు *సభికులెట్లు దొరకిరో
చట్టము విలువెఱుగనట్టి చవటనెన్నుకొంటిమే
చట్టుబండలైన చదువు సాక్ష్యమిపుడు దొరకెనే
*సభికులు = జూదగృహ నిర్వాహకులు
భరతమాత కిపుడు వలదు వందనమని యందురే
భరతమాత అన్న పేరు పలుకవలదనందురే
భరతపుత్రు విత్తనమ్ము వ్యర్థమైన నేలలో
భరత జాతి సంకరమ్ము పరగుటేల జరిగెనో
జరిగెనెట్లొ జరిగెననుచు జరిపి ప్రక్కకుంచకున్
తిరిగి నెత్తి మీద పెట్టి తేరు మీద త్రిప్పిరే
భరతమాత కష్టములకు పరమ కారణంబవన్
మరల మరల మరల మరల మౌళి* వీడనందురే
మౌళి = శ్రేష్ఠుడు
చెత్త మనిషి చెత్త బ్రతుకు చిత్తమంత చెత్తయే
చెత్త కంపు చట్ట సభకు చేటు తెచ్చెనెంతయో
చెత్త వెధవనెన్నుకొన్న చెత్త ప్రజలు మనమెగా
చెత్తనెత్తి పోయు కొఱకు చిత్తశాంతి కావలెన్
మతము దైవ మార్గమగును మౌఢ్యమనగ వలదుగా
మతము దేశభక్తి కాదు మానవతకు మార్గమౌ
మతము లేదు దైవమునకు మతము మనిషి సృజనమే
మతము కొఱకు చంపుకొనుట మానహీన క్రౌర్యమౌ
బ్రతుకు కొఱకు ధూర్తమైన పద్ధతులను కనుగొనన్
మతము నడ్డుపెట్టుకొనెడు మనిషి మృగము సోదరా
వెతలు మరచి ధైర్యమూను వినత కొడుకు కావలెన్
హితము గూర్చు మాటయొకటి హృత్కమలపు సౌరగున్
జాతి వలయు భరత జాతి జ్ఞానము వెలుగొందగా
నీతి వలయు భరత నీతి స్నేహము విలసిల్లగా
రీతి గలిగి నడువవలెను పృథ్వి మెచ్చునట్లుగా
భీతి విడచి బ్రతుకవలెను వృత్రుని దునుమాడగా
గతము మరువ వలదు మనది కర్మభూమి భరతుడా
సతతము పనిచేయవలెను సజ్జనులకు మేలవన్
జతనము విడనాడ వలదు సహనము జత కూడగా
ప్రతి నిమిషము రవికి నూత్న ప్రాగ్దిశయని యెఱుగమే!
శ్రీ వరిగొండ కాంతారావు భారతీయ జీవిత బీమా సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత అయిన కాంతారావు గారు – ‘ఉద్యానం’, ‘ఝరి’, ‘సంద్రం’, ‘గగనం’, ‘అనలానిలం’, ‘ప్రణవం’ – అనే కవితా సంపుటులు; ‘దోస్తానా’, ‘కృష్ణార్పణం’ అనే కథా సంపుటులు వెలువరించారు. ‘దోస్తానా’ కథా సంపుటిని డా. యం. రంగయ్య గారు హిందీలోకి అనువదించారు. ‘సాహచర్యం’, ‘వ్యామోహం’ అనే నవలను రచించారు. ‘ఏలికకొక లేఖ’, ‘వినగనేర్తున భాజపా!’, ‘భరతసుతుడా మేలుకో!’, ‘స్వీయ ప్రకటనమ్’, ‘తల్లి భారతి!’, ‘వారు ఓటును నాకు వేసెను!’, ‘ముదమునందగ మోది వచ్చెను’, ‘దేహమన్నది భ్రాంతియేనా!’ – అనే గేయ శతకములు రచించారు. ‘బాసర జ్ఞానమనంత ప్రవాహము’, ‘శుభకృత్తంతయు మేలే జరుగును’ అను మకుట సహిత గేయాళి రచించారు. ‘శోభకృన్మాతృవత్సరం శుభములిచ్చు’ అనే పద్య శతకం వ్రాశారు. ఇవి కాక, ‘పంచాగాన్ని నమ్మడమెలా? ఒక ఆలోచన’, ‘ఇట్ల సుత – కురుక్షేత్ర రహిత మహాభారత గాథ’, ‘బమ్మెర పోతన చరిత్రలో కొన్ని విశేషాలు’, ‘శ్రీ అరవిందులు’ వంటి రచనలు చేశారు. ‘వరిగొండ కాంతారావు సాహిత్య విశ్లేషణ’ అన్న అంశంపై పరిశోధన చేసి శ్రీమతి తాండ్ర సునీత కాకతీయ విశ్వవిద్యాలం నుంచి పిహెచ్.డి. పట్టాను పొందారు. అభినవ కాళోజీ, కాకతీయ కవితాజు, ఖగోళ సరస్వతి వంటి బిరుదులు గల కాంతారావు గారు 2019 శ్రీ కాట్రగడ్డ సాహిత్య అవార్డు గ్రహీత.
