కంటినొక్క దివ్యకాంతను స్వప్నాన కనుల వెంట నీరు కార్చుచుండె మదిని కలత చెంది ముదితను దరిజేరి పలుకరించితినిటు పడతినపుడు
ఎవరివమ్మ నీవు? ఏలయేడ్చుచునుంటి వేమి కారణమ్ము? ఏమి కడిది? చేయగలిగినంత చేసెద సాయమ్ము చెప్పుమమ్మ మదికి సేదతీర
అన్యుడనుచు నన్ను అనుమానపడక నీ కొడుకునంచు నెంచి గోడు చెపుమ యనుచు పలికినంత కనులను తుడుచుచు పలుక సాగెనిట్లు పడతి యపుడు
వేయి వత్సరముల వేదన యొకమాట చేరి పలికినంత తీరబోదు పలుకరించినావు పదివేలదే నాకు వినుమ చెప్పుచుంటి వెతలనన్ని
కలరు యోధులైన పలు కుమారులు నాకు కలిగి పరుల పంచ మెలగవలసె కలిసిమెలసి యుండవలసిన సోదరుల్ కలహమాడ కీడు కలుగబోదె?
నిగమసారమరసి నీరజోద్భవు పగిది తనరు వేదవిదులు ధరణిసురలు వీరవిక్రమముల విశ్వవిజేతలై ప్రజల గాచు మగలు పాలెగాండ్రు
రాచవీధులందు రత్నరాశులు బోసి అమ్మునట్టి మేటి యాపణికులు వసుధ పైని పసిడి పండించు రైతులు ఘనులు నాదు సుతులు గట్టివారు
నా కబంధమున సనాతన ధర్మంబు వెలసి జగతిలోన విస్తరించె తక్షశిల నలంద దక్ష గురుకులము లుద్భవించె నాదు యుదరమందు
రామ కృష్ణ బుధ్ధ వామన నరసింహు లవతరించిరిచట యతిశయమున రాతియుగము భువిని రాజ్యమేలెడు నాడు స్వర్ణయుగము నాకు సంభవించె
అట్టి వైభవంబులా ఘనరాజ్యముల్ అలవికాని సిరుల నతిశయముల ముష్టిలోన పట్టు ముష్కరులదియెట్లు కొల్లగొట్టినారొ కొంత చెపుమ?
రాజ్యమేలిరిచట రాక్షసుల్ వేయేండ్లు ప్రజల జేసినారు బానిసలను కడకు వీడి చనిరి గాంధీ సుభాషాది వీరవరులు కరము పోరుసలుప
కొల్లగొట్టినారు కోహినూరు మణిని చంపివేసినారు సంస్కృతులను చీల్చినారు నన్ను చివరకు రెండుగా నింపినారు యెదలనిండ విషము
స్త్రీలను సన్మానింపరు జాలిగ పేదలకు కొంత జార్చరు ధనమున్ మేలని పూజలు సేయరు ఏలా నా సుతులు చెడిరి యీరీతి భువిన్?
సహజవనరులెల్ల స్వార్థంబునకె గాని పరిసరముల చింత పట్టలేదు పుట్ట చెట్టు నదుల పూజించు సీమలో పిండిచేసినారు కొండలన్ని
పొందగలనె మరల పూర్వవైభవమును? మెరయగలనె విశ్వ గురువునగుచు? తీరనగునె మునుల దీవెనల్ నాయందు? ఆర్తి దీర చెప్పుమా కుమార!
గద్గదంబుగాగ కంఠంబు వణకగా జలము నిండ కనుల కొలనులందు మాతృమూర్తితోడ మాటలాడితినిట్లు కరములంజలించి కరము భక్తి
కలుగు శుభోదయమ్ము నిను కమ్మిన చీకటులెల్ల తొల్గెడిన్ ఎలమి ఘటించు మా బ్రతుకు లేర్పడ నీకయి యంజలించి మా మలినములెల్ల బాపుకొని మాత! భజింతుము నిన్నె యెన్నడున్ వెలుగుత నీదు వైభవము విశ్వమునందు యనంతకాలముల్
కలగము మేము యొండొరుల కయ్యము మాని సతంబు ప్రేమతో మెలిగెదమీ ధరిత్రి మితిమీరి గ్రసింపము నీదు సంపదల్ సలిలము గాలి నేల కలుషంబగకుండగ గాతుమెల్లెడన్ నిలబడి నిగ్రహించెదము నీపయి జేసెడు దాడులేకమై
నలుగురు మెచ్చురీతిని సనాతన సంస్కృతి నిత్యనూత్నమై పొలుపుగ మానవాళి పరిపూర్ణ ప్రశాంత ప్రమోదితంబుగా విలువల గూడి జీవనము ప్రేమల పంచుచు చేయునట్లుగా చెలగి శ్రమింతుమీ జనని సేతుము బాసల నేడు భారతీ!
భరత మాత వేదన కళ్ళకు కట్టినట్టు చూపించారు . చాలా బాగుంది
భరత మాత వెతలను బహు హృద్యంగా చిత్రించారు ఫణి ప్రసన్న కుమార్ గారు.
తనలయుమై ఉండి మనం ఏం చేసినా ఋనం తీర్చుకొలేము !
మీ కలం నుండి మరింత స్ఫూర్తిదాయక సాహిత్యం వెలువడాలని ఆకాంక్షిస్తూ,
శుభాభినందలతో
nice
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™