[శ్రీ దాసరి వెంకట రమణ పదవీవిరమణ ప్రత్యేక సంచిక ‘విరమణీయమ్’ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఆయన కొందరికి శిష్యుడు.. కొందరికి పుత్రసమానుడు.. కొందరికి సహోద్యోగి, కొందరికి బాస్, కొందరికి జూనియర్.. కొందరికి అభిమాన రచయిత. కొందరికి గురుసమానుడు.. కొందరికి మిత్రుడు, కొందరికి బంధువు! అంతకుమించి చందమామ కథకులలో ఒకడు! ఇంతమందిని ఒకచోటకి చేర్చింది ఆయన పదవీ విరమణ వేడుక. ఆయనే శ్రీ దాసరి వెంకట రమణ. ప్రముఖ బాలసాహితీవేత్త. చందమామ కథలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన చందమామ అభిమాని. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. రిజిస్ట్రేషన్ శాఖలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా రిటైరయ్యారు.
దాసరి వెంకట రమణ పదవీవిరమణ ప్రత్యేక సంచిక ‘విరమణీయమ్’ లో పెద్దలు, గురువులు ఆశీస్సులు అందజేశారు, మిత్రులు, సహధ్యాయిలు, సహోద్యోగులు, అభిమానులు, తోటి రచయితలు తమ అభినందనల ఆప్యాయతల జల్లు కురిపించారు. కొందరు జ్ఞాపకాలను తవ్వుకున్నారు. కొందరు ఆయన సుగుణాలని ప్రస్తావించారు. కొందరు కార్యరంగంలో ఆయన నిబద్ధతని కొనియాడారు.
~
కాలేజీలో వెంకట రమణ గురువుగారు శ్రీ డి. చంద్రశేఖర్ రెడ్డి గారు, చదువులోనూ, ఆటలలోనూ ఇతర పోటీలలోను వెంకట రమణ చూపిన ప్రతిభను ప్రస్తావించారు. చందమామపై వారి పరిశోధనలో తన పాత్ర గురించి తెలిపారు.
చందమామ విషయంలో చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, దాసరి వెంకట రమణ గారు శాఖాపరంగా, తమకు ఓ వ్యక్తిగత సాయమెలా చేసారో వసుంధర (జొన్నలగడ్డ రాజగోపాలరావు) గారు వివరించారు.
ఒకానొక పరిపాలనా సమస్య విషయంలో వెంకట రమణ గారు చూపిన చొరవని ప్రశంసిస్తూ, ఆయన తీసుకున్న నిర్ణయం – ఆయన ధైర్యానికి, బాధ్యతకి, సామాజిక ప్రయోజనానికి నిదర్శనమని ఐఎఎస్ అధికారి శ్రీ జమలాపురం భవానీ శంకర్ పేర్కొన్నారు. వెంకట రమణగారు చందమామ డాక్టరని చమత్కరించారు యండమూరిగారు. చందమామ కథలోని విక్రమార్కుడిలానే, దాసరి వెంకట రమణ గారు కూడా పట్టుపదలని విక్రమార్కుడిలా ఒక పని సాధించిన వైనాన్ని డా. తులసీ భరత్ భూషణ్ వివరించారు.
“రమణ లోకాన్ని చూసే తీరే వేరుగా అనిపిస్తుంది. తను విన్న, కన్న, స్వయంగా అనుభవించిన ప్రతి సంఘటననూ, మూడో వ్యక్తి లాగా గమనిస్తూ, అందులో ఏదో ఒక కథా వస్తువును వెదుకులాడే ఔత్సాహిక మనస్తత్వం నాకు గోచరించింది. రచయితత్త్వమే రమణ వ్యక్తిత్వం. ఒక్కోసారి రమణ లోని రచయిత, రమణ లోని వ్యక్తి పైన ఆధిపత్యం చెలాయిస్తున్నాడేమో అని నా భావన.” అని వ్యాఖ్యానించారు గింజల మధుసూదన్ రెడ్డి.
“ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, ఆయనలో ఎప్పుడూ అహంకారం కనిపించదు. కొత్తవారిని ప్రోత్సహించటం, పిల్లల పట్ల ప్రేమతో ఉండడం, సాహిత్యాన్ని సమాజానికి ఉపయోగపడే సాధానం చూడడం ఆయన ప్రత్యేకత” అని పేర్కొన్నారు మనసు ఫౌండేషన్ మన్నం రాయుడు గారు.
“కొందరిని మనం ఇష్టపడతాం. కొంతమందిని గౌరవిస్తాం. కాని ఇష్టంతో కూడిన ప్రేమవల్ల నిండిని గౌరవం మాత్రం కొంతమందిపైనే ఉంటుంది. దాసరి వెంకట రమణ పట్ల నాకు ఉన్న త్రిదళం ఇదే” అన్నారు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర.
సినీగీత రచయిత డా. వెనిగళ్ళ రాంబాబు – దాసరి వెంకట రమణ గారి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక ఎంత ఉత్సాహభరితంగా, ఎంత వైవిధ్యంగా, ఎంత సాంప్రదాయబద్ధంగా జరిగిందో వివరించారు.
దాసరి వెంకట రమణ గారి కథల శీర్షికలు పిల్లల మనసుని ఆకర్షించెలా ఉంటాయనీ, కథలు పిల్లలనే కాదు పెద్దలకూ ఆహ్లాదకరంగా ఉంటాయని అన్నారు డా. రేవూరు అనంత పద్మనాభరావు గారు.
రిజిస్ట్రేషన్ శాఖలో ఏటేటా నిర్వహించే క్రీడా సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనేందుకు వేరే ఊర్లు వెళ్ళడం ఎంతో ఉల్లాసంగా ఉండేదని, దాదాపు ఇరవై మందిమి ఆ ప్రయాణాన్ని మధుర ప్రయాణం మార్చుకునేవాళ్ళమని, అది మాటలలో వర్ణించలేని అనుభూతులమయమని అన్నారు దేవరాజు విష్ణువర్ధన రాజు గారు.
“ఇంత బిజీగా టెన్షన్ ఉద్యోగం చేసే మనిషి పిల్లల కోసం లలితమైన చందమామ కథలు రాస్తారంటే బహుశా ఎవరికీ నమ్మశక్యం కాదు. నాకు రమణ గారిలో నచ్చింది రెండింటినీ సమన్వయ పరిచే ఆ మానసిక స్థిరత్వం.” అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ కాశీ విశ్వనాథ్.
18 ఏళ్ళ కుర్రవాడిగా తనని మొదటిసారి కలిసి, చందమామలో తన కథలు ప్రతినెలా ఎలా వస్తున్నాయో కనుక్కోడానికి ప్రయత్నించిన యువ వెంకట రమణని గుర్తు చేసుకున్నారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు.
“తరతరాలకి చక్కటి సాహిత్యాన్ని అందించే సుకృతం ఆయనకు దక్కింది” అని వ్యాఖ్యానించారు సినీ రచయిత శ్రీ ఆకెళ్ళ శివప్రసాద్.
“వాట్సాఫ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్, ఎక్స్, ఎఐ లాంటి రంగురంగుల డిజిటల్ ప్రపంచంలో తేలియాడుతున్న మనుషుల్లో నైతిక విలువలు ఎంత రంగు వెలిసి పోయాయో చెప్పడానికి ఆయన రాసిన కథలు కనువిప్పు కల్గిస్తాయి.” అన్నారు కథారచయిత శ్రీ ఇనాయతుల్లా.
దాసరి వెంకట రమణ గారు ‘రోహిణి’ అనే సినిమాకి రాసిన పాటలను ప్రస్తావిస్తూ, తేటపదాల చినుకును తన పాటలలో కురిపించారు దాసరివారు అని వ్యాఖ్యానించారు శ్రీ సి.ఎస్. రాంబాబు. తన సినిమా పాటల కోసం వెంకట రమణ గారిని ఎలా సంప్రదించారో, ఆయన పాటలు ఎంత వేగంగా రాసిచ్చారో గుర్తుచేసుకున్నారు సినీ నిర్మాత ‘రోహిణి’ కె. కుశాల్ రాజు గారు.
“పదుగురు మెచ్చేలా – సదా పదుగురూ తన వెంట వచ్చేలా బతకాలనే తత్వం డా. దాసరి వెంకట రమణది. ఆయన ఎలాంటి వారితోననా స్నేహం చేస్తారు. ఆయన్ని కలిసిన ఎవరైనా ఆయన స్నేహంలో చిక్కుకుపోతారు. అలా చిక్కుకుపోయినవాడినే నేను!” అన్నారు శ్రీ చొక్కాపు వెంకటరమణ.
చందమామలో ప్రచురితమైన దాసరి వెంకట రమణ గారి కథ ‘విత్తనం గింజ’ కథ చిత్రకారులు శంకర్‌ని ఎంతగా కదిలించిందో, చందమామ మాజీ సహ సంపాదకుడు కె. రాజశేఖర రాజు గారు వివరించారు.
శ్రీ సాధన నరసింహాచార్య తన సందేశానికి ‘దాసరి ‘వి’రమణకు విరమణ లేదు’ అని శీర్షికనుంచడం ఎంతో ఔచితీమంతంగా ఉంది.
కథలో సందేశాన్ని అన్యాపదేశంగా చెప్పడంలో దాసరి వెంకట రమణ గారి నేర్పుని అభినందించారు శ్రీ కంతేటి చంద్రప్రతాప్.
దాసరి వెంకట రమణగారు చందమామపై చేసిన పరిశోధనా గ్రంథాన్ని అధ్యాయాల వారీగా విశ్లేషించారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ.
“డా. దాసరి వెంకటరమణ గారి రచనల్లో పిల్లల మనస్తత్వం, విలువలు, జీవన సత్యాలు సహజంగా కలిసిపోతాయి. బోధనా ధోరణి లేకుండా, సరళమైన కథనంతో, పిల్లలలో మంచితనాన్ని మేల్కొలిపే శక్తి ఆయన రచనలకుంది” అని పేర్కొన్నారు శ్రీ మాకినీడి సూర్య భాస్కర్.
చందమామలో దాసరి వెంకట రమణ గారు 1982 – 2012 మధ్య వ్రాసిన కొన్ని కథలను పరామర్శించి, సీరియల్స్/నవలల మారథాన్ మొదలుపెట్టాలని కోరుకున్నారు శ్రీ గాలి త్రివిక్రమ్.
అపారమైన జీవితానుభవం పొందిన రచయిత పదవీ విరమణ తర్వత చేసిన రచనల్లో పరిపక్వత తప్పకుండా ఉంటుందనీ, అందువల్ల రచనా వ్యాసంగం కొనసాగించాలని శ్రీ వాణిశ్రీ (సిహెచ్ శివరామ ప్రసాద్) గారు సూచించారు.
మార్చ్ 2000 నెల చందమామలో ప్రచురితమైన దాసరి వెంకట రమణ గారి ‘మంచితనం – మంచిధనం’ కథని సమగ్రంగా విశ్లేషించారు శ్రీ ఎన్. శివనాగేశ్వరరావు.
ఆవుల చక్రపాణి యాదవ్ ‘అమ్మ మనసు’ పుస్తకాన్ని సంక్షిప్తంగా సమీక్షించి రచయితకి అభినందనలు తెలిపారు.
~
ఇంకా ఎందరెందరో తమ సందేశాలను పంపారు. కవితల, పద్యాల రూపంలో ఆత్మీయతను పంచారు.
దాసరి వెంకట రమణ గారి వ్యక్తిత్వం, సాహిత్యాలకు ఈ అభినందన సంచిక ఒక కరదీపికగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
~
శ్రీ దాసరి వెంకట రమణ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-dasari-venkata-ramana/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

