[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘విశ్వం యవనికపై పసిబిడ్డల ఆకలి చావులు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అక్కడ..
భయంకరమైన విపత్తు
విశృంబలంగా నర్తిస్తోంది!
పసిబిడ్డల ఆకలి కేకలు నిత్యకృత్యం కాగా
తినడానికి తిండిలేక..
పొత్తి కడుపులు ముడుచుకు పోయాయి!
లేలేత శరీరాలు బక్కచిక్కి ఎముకలు మాత్రమే
కనిపిస్తోన్న దయనీయ దీన స్థితి!
నడవడానికే కాదు..
ఏడవడానికి కూడా
సత్తువ లేని దుస్థితి!
ఐసియులో చికిత్సలకు
ఔషధాలు మృగ్యమై పోగా
వైద్యులు చేతులెత్తేసిన వేళ..
ఎవరో వస్తారని
ఆపన్నహస్తం అందిస్తారని
కన్నబిడ్డలను కాపాడతారని
కన్నీరు ఇంకిపోయిన గాజు కళ్ళతో
ఎదురు చూస్తోన్న
కడుపు తీపి బంధాలు!
ఎవరు చేసిన పాపానికి
ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు!?
అంతరిక్షంలో అద్భుతాలను ఆవిష్కరించే ప్రయత్నంలో..
నీల శూన్యాకాశంలో
పరిశోధనలు చేస్తున్న ఆధునిక మానవుడు
సమాజ శ్రేయస్సును విస్మరించి..
యుద్ధ విమానాలతో విహంగ వీక్షణం చేస్తూ..
బాంబులతో.. మిస్సైళ్ళతో.. డ్రోన్లతో
మానవ జాతి వినాశనానికి శ్రీకారం చుట్టాడు!
జాతినేతలు తీసుకునే
విపరీత నిర్ణయాలకు..
భావి పౌరులైన పసికూనలు ఆహుతి కావాలా!?
ఇదేమి న్యాయం!?
ప్రపంచ మేధావి వర్గాల విశ్వశాంతి నినాదం
నేతి బీరకాయ చందమేనా?
అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు
స్వచ్ఛంద సేవాసంస్థలు
సాయం కోసం ప్రపంచ దేశాల ముంగిట..
సాగిల పడవలసిందేనా?
ఈ ఆధునిక నాగరిక యుగంలో
ఓ మనిషిని మరో మనిషి
ఓ జాతిని మరో జాతి..
అంతం చేసుకోవడానికి అనివార్యమంటూ..
విశ్వమానవ జాతిపై
వికృత విన్యాసాలు చేస్తోన్న
మారణాయుధాల వ్యాపారులైన
సంపన్న దేశాల అధినేతలు..
యుద్ధం క్రీడను ప్రోత్సహిస్తూ
సంబరాలు చేసుకుంటున్నారు!
ఇంకా.. ఎంత కాలమీ నరమేధం?
అవనీతలమంతా ఒక్కటై
ఈ హత్యాకాండను అంతం చేసి
విశ్వం యవనికపై..
శాంతి పతాకను ఎగుర వేసే
ఆ మహా పర్వదినమెప్పుడో!?
(గాజాపై ఇజ్రాయిల్ దాడులలో ఆకలి చావులకు గురైన చిన్నారుల దయనీయ స్థితికి నా హృదయ స్పందన.)
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
