Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ వారి రావణుడు-1- ప్రవేశిక

[శ్రీ ఫణిహారం వల్లభాచార్య గారు రచించిన ‘విశ్వనాథ వారి రావణుడు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

విశ్వనాథ వారి రావణుడు అర్థం కావాలంటే ముందుగా విశ్వనాథ వారి సీతను అర్థం చేసికొనే ప్రయత్నం చేయాలి. విశ్వనాథ వారి సీత అర్థం కావాలంటే శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని అధ్యయనం చేయటానికి ఆయన విధించిన షరతులలో రెండవ దాని మీద పట్టు వుండాలి. ఏమిటా షరతులు?

ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్
సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్
మదికి నుదాత్త కల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శా
రద సకలార్థ దాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ!

దీనిలో రెండవది ఏమిటి? ఆ చదువరికి సదమల బుద్ధి వుండాలి. అంటే అది సద్బుద్ధి అయి వుండాలి, మలినం కాని బుద్ధీ అయి వుండాలి. అలాంటి సదమల బుద్ధికి ‘బహుళ శాస్త్ర రహస్య వివేకము’ అబ్బి వుండాలి. ఎందుకు? రామాయణం ఒక కావ్యం.. దానిని ఈయన తెలుగులో వ్రాస్తున్నాడు.. ఆ మాత్రం దానికి ‘బహుళ శాస్త్ర రహస్య వివేకం’ ఎందుకు? పైగా బహుళ శాస్త్ర రహస్యాలు తెలిస్తే చాలదట! ఆ రహస్యాలకు సంబంధించిన ‘వివేకం’ కూడా వుండాలట! ఎందుకు? కావ్యాన్ని అర్థం చేసుకోవటానికి కావ్యశాస్త్రం చాలు. అది మొదటి షరతులోనే అంతర్గర్భితమై వుంది. తదితర అనేక శాస్త్రాల రహస్య వివేకం కూడా వుంటేనే శ్రీమద్రామయణ కల్పవక్ష అధ్యయనానికి అర్హతగా విశ్వనాథ వారు నిర్ణయించారు.

ఈ పద్యానికి వెనుక రెండవ పద్యం..

ఈ సంసార మిదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భా
షాసంక్రాంతఋణంబు దీర్పగలదా? సత్కావ్య నిర్మాణ రే
ఖా సామగ్రి ఋణంబు దీర్పగలదా? కాకుత్సుడౌ స్వామి గా
థా సంపన్నము భక్తి దీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్!

మౌని వాల్మీకి ఏనాడు శ్రీమద్రామాయణాన్ని లోకానికి అందించాడో ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే కథను అనేకులు వ్రాస్తూ వచ్చారు. చివరకు కవికులగురువు కాళిదాసు కూడా ‘కవియశః ప్రార్థి’నంటూ రఘువంశ రచనకు పూనుకున్నాడు. ఒకే వేదం నుంచి జ్ఞానులైన తత్త్వవేత్తలు వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించినట్లే ఆయా కాలాల్లోని కవులు తమ తమ భావనాబలం చేత, తమ తమ శాస్త్ర పాండిత్య వైభవం చేత, తమ తమ ఉపాసనా బలం చేత అదే కథను వివిధ విధాలుగా వ్యాఖ్యానిస్తూ రచిస్తూ వచ్చారు. కనుకనే మనకు ఆధ్యాత్మ రామాయణం, ఆశ్చర్య రామాయణం, ఆనంద రామాయణం, అద్భుత రామాయణం వంటి ఆధ్యాత్మ, తంత్రాత్మక వ్యాఖ్యాన రూప రచనలూ వెలువడ్డాయి. అందుకే విశ్వనాథ వారు ఆ కథను ‘ద్వైతాద్వైత మార్గా’లలో ఎంత వ్రాసినా మౌని వాల్మీకి ఋణాన్ని ఈ లోకం తీర్చలేదని అన్నారు. మౌని వాల్మీకి రచనను కొందరు యధాతథంగా తెలుగులోనికి అనువదించారు. మరికొందరు అదే కథ ఆధారంగా తమ భక్తిభావాన్ని చాటుకొనే స్వతంత్ర రచనలూ చేశారు. అయితే విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్ష మహాకావ్యం మౌని వాల్మీకి రచనకు అనువాదం కాదని ముందుగా స్పష్టంగా గుర్తు పెట్టుకోవాలి. అది బహుళ శాస్త్ర వివేక రహస్య గర్భితమైన వ్యాఖ్యాన రూప రచన అన్నది ఆయన స్పష్టంగానే చెప్పారు.

ఇప్పుడు మనం కొంత లోతుగా వెడదాం. మనకు సమీప గతంలో వున్న మహాసాధకుడు, మంత్రవేత్త కావ్యకంఠ గణపతి ముని. తంత్రశాస్త్రంలో దశ మహావిద్యలున్నాయి. వాటిని ఇప్పటికీ ‘అస్పృశ్య విద్యలు’గా చూస్తున్న ‘మేధావులు’ వున్నారు. ‘ఛిన్నమస్తా’ ఉపాసన ద్వారా జీవించి వుండగానే ‘కపాల భేదన సిద్ధి’ని పొందిన గణపతి ముని ఆ దశ మహావిద్యలలోని ప్రతి విద్యకు ఉపనిషత్ ప్రామాణ్యాన్ని నిరూపిస్తూ ‘దశ మహావిద్యాది సూత్రావళి’ అనే ఒక సూత్ర గ్రంథాన్ని వ్రాశారు. ఆ గ్రంథం ప్రసక్తిని కొంచెం ఆగి మళ్లీ ప్రస్తావిస్తాను.

మనకు ఉపనిషత్తులో ‘పంచాగ్ని విద్య’ అనేది ఒకటి వుంది. ఒకడు ఈ లోకంలోకి ఎలా వస్తాడు అనే దానిని ఆ విద్య వివరిస్తుంది. దానిని ఇక్కడ వివరించుకుంటే సీతారాముల అవతరణలోని దివ్యత్వం మనకు అర్థమవుతుంది. ఇది ముండకోపనిషత్తులోని ద్వితీయ ముండకము నందలి మొదటి ఖండములో వున్న అయిదవ మంత్రము. ‘తస్మాదగ్నిస్సమిధో యస్యసూర్యః, సోమాత్పర్జన్యః ఓషధయః పృథివ్యామ్, పుమాన్ రేతస్సించతి యోషితాయాం, బహ్విః ప్రజాః పురుషాస్సంప్రసూతాః’. ద్యులోకము, పర్జన్య లోకము, పృథివి, పురుషుడు, స్త్రీ అనేవి అయిదు అగ్నులు. ప్రజ ఈ పంచాగ్ని ద్వారముననే సంచరిస్తుంది. ద్యులోకము మొదటి అగ్ని. దానికి సూర్యుడు సమిధ. ఆ ద్యులోకము నుండి చంద్రుడు సిద్ధిస్తాడు. చంద్రుని నుండి పర్జన్యమనే రెండవ అగ్ని ఏర్పడుతుంది. దాని నుండి భూమిపై ఓషధులు ఉద్భవిస్తాయి. వీటిని ఆహారంగా స్వీకరిస్తాడు పురుషుడనే నాలుగవ అగ్ని. వాటి ఫలితంగా రేతస్సు జనిస్తుంది.. దానిని అయిదవ అగ్ని అయిన స్త్రీ యందు ఆధానం చేయటం వల్ల సంతానం కలుగుతుంది. ఇది యోనిజులైన వారి  జన్మక్రమం. అంటే స్త్రీపురుష సంయోగ ఫలితంగా జీవులు జన్మిస్తారు. కానీ అటు సీత కానీ, రాముడు కానీ అలా జనించలేదు. మౌని వాల్మీకిని మాత్రమే ప్రమాణంగా స్వీకరించేవారు కూడా దీనిని అంగీకరించక తప్పదు.

కావ్యకంఠ గణపతి ముని ‘దశ మహావిద్యాది సూత్రావళి’ గ్రంథం చివరలో మరి కొన్ని వ్యాఖ్యానాలున్నాయి. వాటిలో ‘సీతా వ్యాఖ్యానం’ ఒకటి. సీతావతరణాన్ని వ్యాఖ్యానిస్తూ ఆయన సీత ‘అయోనిజ’ అవటంలోని ఆంతర్యాన్ని వివరించారు. ముందు చెప్పుకొన్న జన్మక్రమం వీరిద్దరి విషయంలోనూ వర్తించలేదు. వీరు అయిదు అగ్నుల ద్వారా ఈ లోకంలోకి రాలేదు. చివరి రెండు అగ్నులనూ పరిహరించి, అంటే పురుషుడు, స్త్రీ అనే అగ్నులను పరిహరించి నేరుగా మూడవ అగ్ని నుంచే అవతరించారు. ఇక్కడ గణపతిముని ఇలా అంటారు..

“యథా సకామ వ్యష్టికర్మమయః పురుషః సంసారీ తథా నిష్కామ సమష్టికర్మమయోవతారః”

ఏ విధంగా సకాముడై, వ్యష్టికర్మ యందు ఆసక్తుడైన పురుషుడు సంసారి అవుతాడో, అదేవిధంగా నిష్కాముడై సమష్టికర్మ యందు ఆసక్తుడైన పురుషుడు అవతారం అనబడుతాడు.

“దేవతా ముక్తపురుషోవా లోకానుగ్రహాయ భువిమవతరేత”

దేవత లేదా ముక్తపురుషుడు లోకాన్ని అనుగ్రహించటానికి భూమి మీద అవతరిస్తారు. అలాటి సందర్భాలలో.. “తత్రాహుతి సంఖ్యా క్వచిదాదృతా స్యాన్మాతాపిత్రో రనుగ్రహాయ” మాతాపితరులను అనుగ్రహించటానికి ఒక్కొక్కసారి ఈ పంచాగ్ని స్వరూప ఆహుతి సంఖ్యను ఆదరిస్తారు.

మరికొన్ని సందర్భాలలో.. “క్వచిత్తృతీయస్యామేవాహుతౌ శరీరధారణం మహాభాగ్యాత్”.. ఒక్కొక్కప్పుడు దానికి మూడవ ఆహుతి యందే తన మహాభాగ్యకారణంగా శరీరధారణం జరుగుతుంది. శ్రీరామచంద్ర మహాప్రభువు విషయంలో పుత్రకామేష్టి ఫలితంగా వచ్చిన పాయసాన్నం చేతనే అవతరణం జరిగింది, అయితే మాతాపితరులను అనుగ్రహించటానికి కౌసల్యాగర్భవాసాన్ని ఆయన అంగీకరించాడు. సీతామాత విషయంలో అది కూడా అంటే గర్భవాసం కూడా లేదు. నేరుగా మూడవ ఆహుతి అయిన అన్నానికి ఆధారమైన భూమియందే ఆమె అవతరించింది. కనుక సీతామాత లోకాన్ని అనుగ్రహించటానికి శ్రీరామచంద్ర మహాప్రభువుతో పాటుగా అవతరించింది.

ఇప్పుడు రావణుడు ఎవరు? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు అనే ఈ మూడు జంటలూ సనకసనందాదుల చేత శప్తులైన శ్రీవైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు కదా? వీరిలో ఒకరు నేరుగా మునులను అవమానించినవారు కాగా రెండవవారు దానికి ఆమోదించినవారు. ఆ శాపవేళ, దాని విమోచనం కోసం ఎంచుకొన్న విధానం వైరం! శ్రీమహావిష్ణువుతో వైరాన్ని వహించి మూడు జన్మలలోనే ఆ శాపం నుంచి విముక్తులు కావాలని వారి ఆశయం. ఆయనను భూమికి దింపి ఆయన చేతిలో సంహరింపబడే మార్గం వారి అంతశ్చేతనలో నిక్షిప్తమై వుంది. ఆయనను అవతరింపజేయాలంటే భగవద్భక్తులను పీడించాలి, సృష్టి నియతిని దెబ్బతీయాలి. అప్పుడాయన “నిష్కామ సమష్టికర్మ మయుడై లోకసంరక్షణార్థం” దిగి వస్తాడు. హిరణ్యాక్ష హిరణ్య కశిపులు చేసినదదే. రెండవ జంట అయిన రావణ కుంభకర్ణుల దగ్గరకు వచ్చేసరికి మునుల అవమానాన్ని నిరోధించని వాడు కుంభకర్ణుడై నిద్రలో మునిగిపోగా, ఆ దోషాన్ని చేసినవాడు రావణుడై తీవ్రుడయ్యాడు. వానిలో ఒకానొక ‘జీవుని వేదన’ వుంది. భగవద్భక్తులను హింసిస్తూ చిరకాలం శ్రీమహావిష్ణువు రాక కోసం వేచి వుండేంత ఓపిక లేదు. అందుకే నేరుగా శ్రీరామచంద్ర మహాప్రభువుతోనే వైరం పెట్టుకొన్నాడు. సీతను అపహరించాడు.

గణపతిముని సీతా వ్యాఖ్యానంలో ఒక మాట అన్నారు.. యజ్ఞమయుడైన విష్ణువు అవతరించినప్పుడు ఆయన ధర్మాచరణకు ఆలంబనగా ఒక దేవత కూడా అవతరిస్తుంది. ఆ దేవత పేరు ‘శ్రీ’ (లక్ష్మి). ఆమెయే సీత. ఆయన ధర్మాచరణకు ఆలంబనమైన ఆ ‘శ్రీ’ని ‘ముట్టినా’ చాలు.. ఆయన వస్తాడు. వైరభక్తి ద్వారా మోక్షగామి కావటానికి ఇదే సులభమార్గం. కనుక రావణుడు ఆ పని చేశాడు. రావణునిది వైరభక్తి అనడానికి పెద్దగా విశ్లేషించ వలసిన అవసరం ఏమీ లేదు. మౌలికమైన జయవిజయుల కథ తెలిస్తే చాలు కదా?

సీతారాములది అవినాభావం అంటూనే మౌని వాల్మీకి కూడా సీతామాతకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాడు. వాల్మీకికి బ్రహ్మ రామాయణ కథను వ్రాయమని చెప్పినప్పుడు ఒక మాటన్నాడు.. “రహస్యం చ ప్రకాశం యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యాశ్చాపి యద్వృత్తం ప్రకాశం యది వా రహః  తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి”.. లక్ష్మణుడు, రాక్షసులతో కూడిన ధీమంతుడైన రాముని చరిత్ర ఎవరికీ తెలియనిది (రహస్యం), అందరికీ తెలిసినదీ (ప్రకాశం) అంతా నీకు తెలుస్తుంది. వైదేహి చరిత్ర కూడా (వైదేహ్యాశ్చ అపి) ఎవరికీ తెలియనిది, అందరికీ తెలిసినదీ కూడా నీకు తెలుస్తుంది.. అని. అలాగే తన కావ్యాన్ని “సీతాయాః చరితం మహత్” అనీ అన్నాడు మౌని వాల్మీకి. ఈ మాట ఎందుకన్నాడు? ప్రత్యేకంగా మహత్తరమైన సీతా చరిత్ర అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి? వాల్మీకి ఈ కావ్యానికి మూడు పేర్లు పెట్టాడు.. ఒకటి ‘రఘువర చరితం’, రెండవది ‘దశశిరసశ్చ వధమ’, మూడవది ‘సీతాయాః  చరితం మహత్’. కనుక మౌని వాల్మీకి దృష్టిలో ఈ కావ్యంలో మూడు కోణాలున్నాయి. మొదటిది మానవునిగా రాముని ఆదర్శ ధర్మాచరణ గాథ, రెండవది రావణుని నడవడిక, మూడవది సీతా చరిత్ర. ఈ కావ్యాన్ని విడివిడిగా ఈ మూడు కోణాల నుంచీ పరిశీలించవచ్చు అన్నది ఆయన మాటలోనే దాగి వుంది. అంతే కాదు.. ఈ మూడు కోణాలలోనూ “రహస్యం”, “ప్రకాశం” అనే రెండు తలాలు కూడా వున్నాయి. వాల్మీకి ముని, మహర్షి. మహర్షి వినియోగించే పదాలను వివేచించటానికే విశ్వనాథ వారు పెట్టిన రెండవ షరతు.. “సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్” అన్నది.

మన వైదిక, పురాణ, కావ్య వాఙ్మయం అంతా ప్రతీకాత్మకం. అది వేదోపబృంహణం. వేదములందలి అభిప్రాయాలను, సిద్ధాంతాలను కథా రూపంలో ప్రతీకాత్మకంగా చెప్పేవే పురాణ, కావ్య గ్రంథాలు. కనుక వాల్మీకి వినియోగించిన “రహస్యం, “ప్రకాశం” అనే పదాలను కూడా ఆ వెలుగులోనే చూడాలి! పైకి ఎవ్వరికీ తెలియనివి, అందరికీ తెలిసినవీ అనే అర్థాలే వర్తించినా,అది మహర్షి వాక్కు కనుక కొంత లోతైన వివేచన అవసరం అవుతుంది. దానికి విశ్వనాథ వారు చెప్పిన ‘బహుళ శాస్త్ర రహస్య వివేకం’ అవసరం.

(ఇంకా ఉంది)

Exit mobile version