Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ వారి రావణుడు-2

[శ్రీ ఫణిహారం వల్లభాచార్య గారు రచించిన ‘విశ్వనాథ వారి రావణుడు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

శ్రీరామచంద్రమహాప్రభువు తన జీవితంలో ఏనాడూ తన దైవత్వాన్ని ప్రకటించనే లేదు. రావణ వధానంతరం దేవతలు వచ్చి ఆయన దివ్యత్వాన్ని తెలిపినా ఆయన అంగీకరించలేదు సరికదా.. “ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్‌” అంటూ తనను తాను మానవునిగా, దశరథుని కుమారునిగా మాత్రమే భావిస్తున్నట్టు స్పష్టంగా చెప్పాడు. ఏ సందర్భంలోనూ దివ్యత్వాన్ని ప్రకటించని శ్రీరామచంద్ర మహాప్రభువు నడవడికకు భిన్నంగా సీతామాత చాలా సందర్భాలలో తన అతిమానుష తత్వాన్ని పరోక్షంగానైనా ప్రకటించింది!

అందుకే మహౌపాసకుడూ, మంత్రసిద్ధుడూ అయిన కావ్యకంఠ గణపతి ముని తన సీతా వ్యాఖ్యానంలో సీతకు పంచభూతములపై ప్రభుత్వముందని అంటూ “సీతాయాః ప్రభుత్వం భూతేష్వపి దదృశే” అనే సూత్రాన్ని చెప్పారు. ఆ సూత్రానికి ఉదాహరణగా “హనుమచ్ఛివాశంసాయా మగ్నౌ” లంకాదహన సమయంలో హనుమంతుని వాలానికి తగిలించిన అగ్ని ఆమె మాటతో చల్లబడటం, “ఆత్మనః ప్రవేశే చ।” అంటే తానే అగ్నిలో ప్రవేశించినప్పుడు అది ఆమెను ఏమీ చేయకపోవటం వంటి సందర్భాలలో అగ్నిపై ఆమె అధికారాన్ని ప్రకటించింది అంటారు. “అవకాశ ప్రార్థనా సమయే భువి।” ఆమె అడుగగానే ఆమె ప్రవేశించటానికి భూమి విచ్చుకోవటం ద్వారా తనకు భూమిపై వున్న అధికారాన్ని కూడా ప్రకటించుకుంది. లంకావాస సమయంలో అంత కాలమూ ఘోరోపవాసంతో తన యోగవైభవాన్ని కూడ ప్రకటించుకుంది సీత అంటూ గణపతి ముని “లంకావాస సమయే ఘోరేణోపవాసేన తస్యా అపార యోగ వైభవం వ్యాఖ్యాతం భవతి।” అంటారు.

సీతారాములిద్దరూ దివ్యాదివ్య భూమికలలో కలిసి పని చేస్తేనే రావణవధా లక్ష్యం నెరవేరింది. రావణుడు పొందిన వరం ప్రకారం నరులు, వానరులు మాత్రమే అతడిని వధించే అవకాశం వుంది. కనుక శ్రీరామచంద్ర మహాప్రభువు తనను తాను మానవునిగా మాత్రమే మనసా నిశ్చయభావనతో చరించాడు. ఆ పురుషునికి ‘శక్తి’గా సీతామాత దివ్యభూమికలో వ్యవహరించింది. ఈ రహస్యం తెలియటానికి “సదమల బుద్ధికిన్‌ బహుళ శాస్త్ర రహస్య వివేకం” తోడ్పడాలి.

విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్ష అవతారిక చివరలో కూర్చిన వచనాన్ని తప్పకుండా గమనించాలి. ఆ వచనం ఇదీ.. “మచ్చిత్తగత వేదాంతవాసనా పారిజాతప్రసవములు దక్షిణ దేశస్థ కుర్తాలము సిద్ధేశ్వరీ పీఠాధిపతులు జగద్గురు శ్రీవిమలానందభారతీ స్వామియు, గర్తపురీ నివాసులు శ్రీశృంగేరీ విరూపాక్ష పీఠాధిపతులు జగద్గురు శ్రీ కల్యాణానందభారతీ మాంతాచార్యుల వారును సాక్షాద్బ్రహ్మలుగా భావించి..”    ఈ వచనం ప్రాధాన్యం ఏమిటి? దీనిని ఎందుకు తప్పకుండా గమనించాలి? శ్రీవిమలానందభారతీస్వామి పూర్వాశ్రమంలో శ్రీ కె.టి. రామారావుగారిగా వున్నప్పుడు విశ్వనాథవారికి ఉపనిషద్రహస్యాలను వివరించారు. ఉపనిషద్వేదాంత వ్యాఖ్యానాలు ఈ కావ్యంలో పరమప్రౌఢంగా వివరితములైనాయి. దానిని అలా వుంచి విశ్వనాథవారి శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యం, పురాణవైర గ్రంథమాల, నేపాళ – కాశ్మీర చరిత్రలలో అనేక సందర్భాలలో అత్యంత రహస్యములైన మంత్ర శాస్త్ర విషయాలను పొందుపరచారు. ఈ మంత్రశాస్త్ర రహస్యాల బోధకు మూలం శ్రీకల్యాణానంద భారతీ మాంతాచార్యుల వారు. ఈనాడు భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ప్రచారంలో వున్న శ్రీవిద్యోపాసనా విధానాన్ని రూపొందించి అందించినవారు శ్రీకల్యాణానందభారతీ మాంతాచార్యుల వారే! వారి వలన విశ్వనాథ వారు అనేకానేక అత్యంత నిగూఢమైన మంత్రశాస్త్ర రహస్యాలను తెలుసుకోవటమే కాదు.. వాటిలో కొన్నిటిని నిష్ఠగా అనుష్ఠించారు కూడా. ‘విశ్వనాథ శారద’ ప్రథమభాగంలో తాను చేసిన అనుష్ఠానాల గురించి కొంత తెలియజేశారు కూడా. ఆయన వీటన్నిటి బలంతో శ్రీమద్రామాయణ కల్పవృక్ష మహాకావ్యాన్ని కావ్యధర్మానికి భంగకరం కాకుండానే మౌని వాల్మీకికృత శ్రీమద్రామాయణ కావ్యాన్ని “బహుళ శాస్త్ర రహస్య వివేక” భరితంగా రూపొందించారు.

ఇంత పునాది మీద రచించిన ఈ కావ్యంలో ముందుగా చెప్పుకొన్నట్టు శ్రీరామచంద్ర మహాప్రభువు “మానుష భూమిక”లో వ్యవహరిస్తే, ఆయన క్రియాశక్తిగా సీతామాత “దివ్యభూమిక”లో వ్యవహరించింది. రావణుడు మాత్రమే కాదు, అతని పక్షంలోని రాక్షసులు కూడా తమకు తెలియకుండానే సీతావైభవాన్ని ప్రకటిస్తూ వచ్చారు. కొందరు విశ్వనాథవారి రామాయణాన్ని వాల్మీకి రామాయణంతో పోల్చి “వాల్మీకి చెప్పలేదు కదా? వాల్మీకికి తెలియదా? వాల్మీకి కన్నా ఈయన గొప్పవాడా? జ్ఞానియా?” అంటూ ప్రశ్నిస్తూ వుంటారు. అందుకే ఈ వ్యాస పరంపర మెదటి భాగంలోనే ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు, దానికి బహుళ శాస్త్రరహస్యగర్భిత వ్యాఖ్యానమని అన్నాను. విశ్వనాథవారి శ్రీమద్రామాయణ కల్పవృక్ష మహాకావ్యం కేవలం అనువాదం కాదు.. సనాతనధర్మాంతర్గత సమస్త శాస్త్ర రహస్యాలను గర్భీకరించుకొన్న రచన. ఏ విషయమైనా మనం చూసే చూపును బట్టి వుంటుంది. అందుకే ఆయన “సదమల బుద్ధి” కావాలన్నారు!

రావణుడు అతికాముకుడు. శూర్పణఖ అతనిలోని కాముకత్వాన్ని ప్రేరేపించి తనకు సంభవించిన వైరూప్యానికి ప్రతీకారాన్ని సాధించాలని యోచించింది. వాల్మీకి రామాయణంలో సీతాసౌందర్య వర్ణనకు, విశ్వనాథవారి కల్పవృక్షంలో అదే సన్నివేశంలో సీతాసౌందర్య వర్ణనకు తేడా వుంటుంది. వాల్మీకిని అనుసరించినా చివరలో ఆమె చెప్పిన మాట? ఇక్కడ శూర్పణఖ రావణునితో అలా అంటుంది..

“తాతమ్మగారు సరస్వతీదేవిగారి సౌందర్య మెఱుంగుదున, ఆలోచన కొలంది గాని యామె సౌందర్యము పొడకట్టదు, పరమప్రపితామహి భవాని సౌందర్య మెఱుగుదును, తదేకధ్యాననిష్ఠగాని యామె సౌందర్యము సౌందర్యమనిపించదు. సంగీతమువలె నాపాతమధురమైన సీత సౌందర్యమె వేఱు”.

ఏమి అర్థమైంది? మనుజకాంతయైన సీతాసౌందర్యాన్ని చెప్పటానికి సరస్వతీ పార్వతీ సౌందర్యాలతో పోల్చటం ఎందుకు? ఈ వచనం తరువాతి పద్యాన్ని కూడా చూడాలి..

“ఏ విద్యుల్లహరీప్రవాహములొ యిట్లే సర్వనాళంబులన్‌
బ్రావృట్కాల పయోదశీతల మరుత్ప్రాగ్భార సంసృష్టిగా
గ్రోవుల్‌ కట్టి మనోజ్ఞసారణ దనూరోమాంధువుల్‌ సొచ్చి యం
దావిష్కారము పొందు పుల్కలుగ మోహానందసంధాయియౌ”

పైన వున్న వచనం, ఈ పద్యం రెండూ చూస్తే ఏమి తెలుస్తోంది? సీతను ఒకానొక “అలౌకిక” సత్తగా విశ్వనాథవారు చూపిస్తున్నారు. ఒకానొక సాధకుని యోగానుభవసిద్ధిసారం కదూ ఇది? ఇది వాల్మీకి చెప్పినది కాదు. విశ్వనాథవారు సీతను దర్శించిన విధానం. ఒక్క శూర్పణఖ మాత్రమే కాదు.. అకంపనుడు అనే రాక్షసుడు కూడా రావణుని దగ్గర సీతను వర్ణిస్తాడు.

“అమ్మధురావలోకనమ్ము లద్భుతమయ్యెడు సీత లోచనాం
తమ్ములు సాగినంతన శతప్రమితుల్‌ మధురేక్షుచాపఖం
డమ్ములవారు రత్నమకుటంబులవారు జగద్విలోభనా
స్యమ్ముల వారునుం బ్రభవమందెద రంబుదనీలరోచిషుల్‌”

సీతాదేవి చూపు సాగినంతమేర వందలకొలది మన్మథులు పుట్టుకొస్తారట! ఇది ఆమె నేత్రసౌందర్య వర్ణన మాత్రమే కాక ఆమె చూపు పడగానే ఎదుటివారిలో కలిగే “దుర్వికారా”న్ని చెబుతున్నట్టుగా వుంటుంది. రాక్షసవాక్కు కదా! అయితే ఈ పద్యం విన్నవారికి భక్తులైతే, ఉపాసకులైతే వెంటనే అమ్మవారి ఒక నామం గుర్తుకు వస్తుంది.

హయగ్రీవుడు అగస్త్యమహర్షికి శ్రీలలితాసహస్రాన్ని ఉపదేశించాడు. అయినా అగస్త్యునికి తృప్తి కలుగలేదు. “ఇంకా ఏదో వుంది, చెప్ప”మన్నాడు. హయగ్రీవునికి ఏమీ తట్టలేదు. అగస్త్యుడు ఆయన పాదాలు పట్టుకొని కూర్చుండిపోయాడు. ఏళ్ళు గడిచాయి.. ఆయన పాదాలు వదలడు.. ఈయనకు ఏమి చెప్పాలో స్ఫురించదు. చివరకు శ్రీకామేశ్వరీ కామేశ్వరులు హయగ్రీవునికి కనిపించారు. “సర్వపూర్తికరం స్తవం” అయిన శ్రీలలితా త్రిశతిని హయగ్రీవునికి చెప్పి దానిని ఉపదేశించమని ఆదేశించారు. ఇక్కడ ఒక చమత్కారం కూడా వుంది.. అగస్త్యునికి దీనిని ఉపదేశం పొందే అర్హత వుందట.. ఎందుకంటే “ఆయన భార్య లోపాముద్ర నాకు పరమభక్తురాలు” అంటుంది శ్రీకామేశ్వరి. శ్రీలలితామంత్రద్రష్టృ సంప్రదాయంలో లోపాముద్రాగస్త్యులు కూడా వున్నారన్నది శ్రీవిద్యోపాసకులకు తెలిసిన విషయమే. లలితాసహస్రాన్ని వశిన్యాది వాగ్దేవతలు రచిస్తే ఈ శ్రీలలితా త్రిశతిని శ్రీకామేశ్వరీ కామేశ్వరులే స్వయంగా చెప్పారు. ఇది శ్రీవిద్యలోని పంచదశీ మహామంత్రాక్షరాలతో కూర్చిన నామావళి! పంచదశీ మహామంత్రంలోని పదిహేను అక్షరాలలో ఒక్కొక్క అక్షరంతో కొన్ని నామాల వంతున మూడువందల నామాలివి. వీటిలో కొన్నిటిని శ్రీకామేశ్వరి చెప్పగా మరికొన్నిటిని శ్రీకామేశ్వరుడు చెప్పగా మరికొన్ని ఇద్దరూ చెప్పారు. అటువంటి మహత్తరమైన ఈ శ్రీలలితాత్రిశతిలో ఒక నామం వుంది.. ‘కందర్పజనకాపాంగ వీక్షణ’ అని. సరిగ్గా ఆ నామానికి విస్తృత రూపమే ఈ పద్యం! అకంపనుడు రాక్షసుడే అయినా తనకు తెలియకుండానే ఈ మాట అన్నాడు.. కాదు.. విశ్వనాథవారు అనిపించారు. అక్కడితో ఆగలేదు ఆయన.. ఆ పద్యం వెనువెంటనే మరొకటి వుంది.. అది విశ్వనాథవారు సీతాతత్త్వాన్ని దర్శించిన రహస్యం!

పోనీ.. అకంపనుడు చెప్పిన మాట శృంగార – కామ సంబంధి ప్రేరేపణయే అనుకుందాం కాసేపు. సీతానేత్ర సౌందర్యాన్ని చెప్పిన తరువాత వున్న పద్యం అకంపనుని మాట అంతమాత్రమే కాదు – దానిపైన ఏదో వుందని స్పష్టం చేస్తుంది. ఆ పద్యం ఇదీ..

“నిగమ మహార్థముల్‌ జగము నిండెను దన్నిగమాంతవైఖరుల్‌
నిగమచయంబుకన్న హవణించెను దన్నిగమాంత చూడమై
తగిలెను బ్రహ్మనాబడు పదార్థము..”

ఇక్కడివరకూ ఎవడైనా చెబుతాడు.. ఆ తరువాతి మాటే “సీతాయా చరితం మహత్‌!” అది ఇదీ…

“…బ్రహ్మము మౌళి సీత క్రొం
జిగురు పదంబు గోటి రుచిచే రుచిమంత మదెంత చిత్రమో”

వేదం ఈ జగత్తు అంతా నిండిపోయింది, ఆ వేదముల అంత్యభాగం వేదం కన్నా అతిశయించింది, ఆ వేదాంతములకు శిరోమణిస్థానీయంగా నిలిచింది “బ్రహ్మము” అనే పదార్థము. ఇది వేదాంతం చెప్పే విషయమే.. దీనిలో క్రొత్తగా ఏమీ లేదు. కానీ ఆ తరువాత చెప్పినదే విశ్వనాథ సీతాదర్శనం. వేదాంతములకే చూడాస్థానమైన బ్రహ్మ అనే పదార్థపు శిరస్సు సీతలేత ఎఱుపు పాదాలకున్న గోటి కాంతుల చేత కాంతిమంతమైంది! అంటే వేదాంతచూడమైన బ్రహ్మము అనే పదార్థము సీతాదేవి పాదాలకు తన శిరస్సునానించి నమస్కరించింది.  ఇంతకుముందు శూర్పణఖ నోట పలికించిన వచనం, ఇప్పుడు అకంపనుని నోట పలికించిన పద్యం రెండు కలిపి చూస్తే అమ్మవారి వైభవాన్ని వివరించే “భావనోపనిషత్తు” మొత్తం వ్యాఖ్యాతమైపోయింది. అందుకే కవిసమ్రాట్‌ “సదమల బుద్ధికిన్‌ బహుళ శాస్త్రరహస్య వివేకమబ్బినన్‌” అన్నది. ఒక కవి ఒకానొక మహాకావ్య నిర్మాణానికి పూనుకున్నప్పుడు ఆ కవి తన సాహిత్యజీవనాన్ని ఏ లక్ష్యానికి అంకితం చేశాడన్నది స్పష్టంగా తెలుసుకుని వుండాలి అటు విమర్శకుడు, ఇటు పాఠకుడూ కూడా. విశ్వనాథవారు తన సాహిత్యజీవితాన్ని సనాతనధర్మ వ్యాఖ్యానానికి అంకితం చేశారు. అలా అని ఆయనేమీ ఛాందసుడు కాదు. ఆయన తన రచనలలో తన నాటి సమాజాన్ని, దానిలోని తప్పొప్పులను చూపించక మానలేదు. సనాతనధర్మ వైభవాన్ని వివరిస్తూనే తన నాటి సమాజంలో రావలసిన సంస్కరణలనూ సూచించారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, విధానాలు మనుష్యులను ఎంతెంత దూరం చేస్తున్నాయో, పేదసాదల బ్రతుకులు ఎంతెంత దుర్భరమవుతున్నాయో విస్పష్టంగా నిర్మొహమాటంగా చెప్పారు.. చూసే కన్ను, చదువున్న బుద్ధి వుండాలే కానీ విశ్వనాథవారిలో ఎన్నో కనిపిస్తాయి. సరే అదలావుంచి, విశ్వనాథవారి రావణుని గురించి మళ్లీ మరొకసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం!

(ఇంకా ఉంది)

Exit mobile version