[శ్రీ ఫణిహారం వల్లభాచార్య గారు రచించిన ‘విశ్వనాథ వారి రావణుడు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
విశ్వనాథవారు 1932 ప్రాంతంలో శ్రీమద్రామాయణ కల్పవృక్ష మహాకావ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వెంటనే “ఇది మహాకావ్య నిర్మాణానికి కాలం కాదు” అనే ఉద్యమస్థాయి ప్రచారం మొదలేశారు కొందరు. ఎందుకు? అటువంటి మహాకావ్య నిర్మాణాన్ని చేయగలిగిన దక్షత లేకపోవటం ఒక కారణం కాగా, విశ్వనాథ అనగానే పుట్టుకొచ్చే ద్వేషం మరొకటి కాగా, మళ్లీ రాముడు సాహిత్యంలో ప్రతిష్ఠితుడైతే సహించలేని అరుణవర్ణ దూషితమనస్కులు మరొక కారణం అనుకుంటాను. విశ్వనాథవారి శ్రీమద్రామాయణ కల్పవృక్ష రచన 1932 ప్రాంతంలో మొదలై 1962లో పూర్తి అయింది. ఈ మధ్య కాలంలో గడియారం వేంకట శేషశాస్త్రిగారి శివభారతం, దుబ్బాక రాజశేఖర శతావధాని గారి రాణా ప్రతాపసింహ చరిత్ర వంటి మహాకావ్యాలూ వచ్చాయి. కానీ వాటి గురించి వ్యతిరేక విమర్శలు లేవు. విమర్శలన్నీ శ్రీమద్రామాయణ కల్పవృక్షం మీదనే!
విశ్వనాథవారి జాతక మాహాత్మ్యం ఏమిటో కానీ శ్రీమద్రామాయణ కల్పవృక్ష మహాకావ్యాన్ని భరతుడు శ్రీరామపాదుకలను శిరసున వహించినట్టు మనస్సింహాసనం మీద ప్రతిష్ఠించుకొన్న వారు ఎంత మంది వున్నారో, వారి కన్నా అనేకగుణితంగా చీల్చి చెండాడేద్దామని సిద్ధమైపోయిన వారూ ఉన్నారు. ఆచార్య ఎస్.వి.జోగారావుగారు అన్నారు ఒకసారి.. “ప్రతిభ యన్నది నిత్య నూత్నము, మనిషి మనిషికి కలదు కావున, తారతమ్యము కాదు కావ్యము, సకల జనులకు సంత వస్తువు” అని. అందుకే ఆయన తన కావ్యాన్ని అధ్యయనం చేయడానికి మూడు షరతులు విధించారు. అవన్నీ ప్రక్కన పెడదాం.. ఆయన ఈ కావ్యాన్ని ఎందుకు వ్రాశారు? “మా నాన్న ఆజ్ఞ, నా జీవుని వేదన” కలిసి.. “తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి కాన” అన్నాక ఈ కావ్యం మీద ఎందుకింత రచ్చ? ఏదో ఆయన భక్తిరచన ఆయన చేసుకుంటున్నాడ్లే అని వదిలేయకకేవలం కవి మీద ద్వేషం, వస్తువు మీద అసహనం తప్ప? ఈ ఉపోద్ఘాతాన్ని ఇక్కడికి ఆపి అసలు విషయంలోకి వెడదాం..
రావణుడు అతి కాముకుడు వాల్మీకి రామాయణ కావ్యంలో. ఇది కాదనలేని సత్యం. విశ్వనాథవారి రామాయణంలో రావణుడు విముక్తిని కాంక్షించే సాధకుడు. ఇక్కడే కొందరికి తగువు. సీతారాముల జంట అంటే?
సీతయు రామచంద్రుడును జేతములందు యుగాలు కల్పముల్
నాతియు బూరుషుండుగ ననంతరదంపతిభావ యాపనా
వ్యాతత సంసృతి ప్రథములైనటు లాత్మ దలంచుచుందురా
సీతకు రామచంద్రునకు జేతము లందలి ప్రేమ యెట్టిదో!
ఏపున మంటి నుండి యుదయించిన మైథిలి, మింటి నుండి యా
వాపము గన్న రాఘవుడు, వచ్చి ఋగధ్వములందు నుండి ద్యా
వాపృథువుల్ సమాహరణభావము పొందిన రీతి సంగమ
వ్యాపృతి బండు వెన్నెలమయంబుగ జేయుదు రాత్మరోదసిన్!
ఈ రెండు పద్యాలలో సీతారాముల దివ్యత్వాన్ని నిర్వచించారు విశ్వనాథవారు. ఇంకా విచిత్రమైన పద్యం ఒకటుంది సీతాదర్శనంలో..
తనలో శ్రీరఘురామచంద్రునకు మార్తాండాభమౌ జ్యోతి తో
డన ధారాహిమపాత సన్నిభము వ్రీడామూర్తి సీతా సనా
తన సౌందర్యగతాభిలాష యుగపత్‌సంస్థానముల్ తోచె న
య్యినవంశ్యుండొకనాటి ప్రొద్దున గనెన్ హేమంతసంపాతముల్!
ఇక్కడ మనం గమనించవలసిన ప్రయోగం “సీతా సనాతన సౌందర్యం” అనేది. సీత వర్తమానంలో రామచంద్రుని ఎదురుగానే వుందే? “సనాతన సౌందర్యం” ఏమిటి? సనాతనం అనే ఒక మాటతో సీతను సృష్ట్యాది నుండి సాగివస్తున్న “ప్రకృతి”గా స్థాపించారు విశ్వనాథ. సీతాప్రథమదర్శన వేళ శ్రీరామచంద్రునిలో కలిగిన భావనకు వెడదాం ఒకసారి..
ఇతమిత్థమని నిర్ణయింపగారాని దేకోర్కియో రూపు గైకొన్నయట్లు
జన్మజన్మాంతర సంగతమ్మైన యాశాబలం బవధికి సాగినట్లు
ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకారమెనయించి దర్శనమిచ్చినట్లు
తన సృష్టిలోని యుత్తమభావ మానందముగ బొంగి బింబమై పొడిచినట్లు
లల యరుంధతియును నహల్యయును గోస
లాత్మజాతయు మువ్వురి యాననముల
కన్నను బవిత్రమగుచు శృంగారభావ
మొడిసి పట్టిన ముఖచంద్రుడొకడు దోచె.
సీతాదర్శన వేళ విశ్వనాథవారి శ్రీరామచంద్రునికి కలిగిన ప్రథమసంస్పందం ఇది. పైకి చాలా సాధారణంగా వుంటుంది. కానీ శ్రీరామచంద్రమహాప్రభువు అవతార రహస్యాన్ని అంతరాంతరాల్లో ఆయనకు రూపు కట్టిస్తున్న సన్నివేశం. అదేమిటో నిర్ణయించుకోలేని ఏ కోరికకో రూపం వస్తోంది. జన్మజన్మల వెంబడి సాగి వస్తున్న ఆశ పరాకాష్ఠకు చేరుకుంటోంది. తన ప్రాణాలే బయటకు వచ్చి ముగ్ధాకారం దాల్చి తన ఎదుట నిలబడినట్లుంది. తన సృష్టిలో వున్నఉత్తమ భావం అంతా ఆనందంగా పొంగి రూపుకట్టినట్లుంది. సీతాదర్శనంతోనే రామచంద్రునిలో తన అవతారలక్ష్యం స్పష్టాస్పష్టంగా రూపుదిద్దుకొంది. ఇదే “సనాతన సౌందర్యం” శ్రీరామచంద్రుని క్రియాశీలుని చేయాలి భవిష్యత్తులో! అందుకే సీతాసౌందర్యాన్ని అటు శూర్పణఖ కానీ, అకంపనుడు కానీ వర్ణించేటప్పుడు వారికి తెలియకుండానే ఆ “సనాతన” సౌందర్యమూలాన్ని స్పృశించారు.
ఇక రావణుని దగ్గరుకు వద్దాం. రావణుడు సీతాసౌందర్యం గురించి విన్నాడు. మారీచుని ఎఱ వేసి రామలక్ష్మణులను తప్పించి యోగి వేషంలో పర్ణశాలకు చేరాడు. సీతను చూశాడు, సంభాషించాడు. ఆ సంభాషణ ఎలా వుంది?
ఓహౌ! నీ సౌందర్యము
బాహిరమగు సృష్టిలోన బ్రథమమొ సంక
ల్పోహము కదలని పూర్వపు
దేహేతరమౌ నమూర్తదీప్తియొ తెలియన్!
అక్కడ శ్రీరామచంద్రప్రభువుకు “తన సృష్టిలోని ఉత్తమభావం అంతా ఆనందంగా పొంగి బింబాకృతి” పొందినట్టు కనిపించింది సీతా సౌందర్యం. ఇక్కడ రావణునికి ఎలా కనిపించింది? ప్రకటమైన సృష్టిలో మొట్ట మొదటిదా? లేక అసలు సృష్టిసంకల్పానికి ముందే ఉన్న రూపుగట్టని దేహేతరమైన వెలుగా? కేవల కాముకుడైన వాడికి ఈ ప్రశ్న, ఈ ఆలోచన వస్తాయా? సీతాసౌందర్యం రావణునిలోని సాధనాపథాన్ని జాగృతం చేస్తే వచ్చిన మాట కదూ ఇది?
సీతను అపహరించాడు. లంకకు చేర్చాడు. ఆమెకు చేయవలసిన సేవలన్నీ వివరించి, రాక్షసస్త్రీలకు ఆమెను ఒప్పజెబుతూ ఒక మాటంటాడు.
“అనుచును జెప్పి వారి కధికాదరమొప్పగ నిట్లు చెప్పె, నీ
యనితరదృశ్యమాన జగదాభరణాకృతి, వెండికొండ యె
త్తిన సమయంబునన్ గినుక తేరిన యెఱ్ఱని కెంపుకన్నులం
దనరిన దేవి వచ్చె, సముదారత భక్తి భజింపగావలెన్.”
తాను కైలాసపర్వతాన్ని ఎత్తినప్పుడు కోపంతో ఎర్రబడిన కన్నులు కల దేవి వచ్చిందట! ఆమెను భక్తితో కొలవాలట! రావణునికి స్పష్టాస్పష్టంగా ఆమె ఎవరో ఒక “తెలివిడి” వుంది! కానీ దానిలో “చ్యుతి” కూడా కలిసివుంది. తనలో దేహస్పృహ స్పష్టం. ఆమె దివ్యత్వం అస్పష్టం ఆ మనసుకు! కానీ అది తన నోట అసంకల్పితంగానే పలుకుతూ ఉంటుంది! అక్కడ వీరిద్దరి లక్ష్యాలూ స్పష్టంగా గోచరించే రచన చేశారు విశ్వనాథ. ఒక సాధకుడు సాధనలో ఒకానొక స్థితిని చేరిన తరువాత అతనిలో గొప్ప సంఘర్షణ చెలరేగుతుంది. తనలో పాదుకొంటున్న దైవీభావాన్ని శరీరనిష్ఠం చేయాలనే దురూహ కలుగుతుంది. నిజానికి అది వానికి పరీక్ష! కానీ వాని సాధనాలక్ష్యమైన దైవీచేతన వానిలో శరీరనిష్ఠను పోగొట్టి దైవీభూమికలలోకి చేర్చాలనే చూస్తుంది.
జనకజాత శరీరనిష్ఠం బొనర్ప
కడక వ్యవసాయి యగు బంక్తికంధరుండు
రావణుని బోధ దైవభావాకృతునిగ
జేతకు గడంగు బూత ధాత్రీతనూజ!
దైత్యభూమికకు దింపిన దైవీచేతనను ఆ భూమికలో స్థిరపరచాలని ఇతగాడి ప్రయత్నం. ఆ దైత్య భూమికను పెకలించివేసి అయినా దైవీగుణాన్ని ప్రతిష్ఠించాలని ఆమె లక్ష్యం. ఇది ఒక సాధకుని అంతశ్చేతనలో సాధనా భూమికలలో నిరంతరం సాగే సంఘర్షణ!
దైత్యధాత్రికి వచ్చిన ధరణిజాత
దైత్యభావము కనునని దైత్యరాజు
దైత్యధారణి పెకలించి దైవగుణము
తా సముద్భిన్నమగునని ధరణిజాత
ఆమెకు లంకావైభవాన్ని చూపిస్తూ ప్రలోభపరచాలని అతని ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనూ అతడి పలుకులో ఆమె పరాత్పరత్వమే భాసిస్తుంది.
నిజముగ జూడు రామతరుణీ! శివునిం గికురించినాడ గం
ఠజ నవరక్త వారి విలుఠత్ఫలమూర్ధములే యొసంగి, యం
బుజసదృశంబు నీ చరణ మోహనపీఠమునందు నాదు స
ర్వజనిఫలంబు నర్పణము పట్టితి, ముట్టితి శ్రీరహస్యమున్!
సరేనయ్యా! రావణుడు కాముకుడే.. సందేహం లేదు. సీతను వాంఛించాడు. అదీ సరే! “నీ చరణమోహన పీఠమునందు నా అన్ని జన్మలఫలాన్ని అర్పిస్తున్నాను” అన్నాడు. కాముకుడు ఆ మాట అనటంలో వింతేమీ లేదు. అదీ సరే! కానీ చివరలో “ముట్టితి శ్రీరహస్యమున్” అని ఎందుకన్నాడు?
శ్రీవిద్యలోని శ్రీచక్రార్చనలో సృష్టిక్రమం, సంహారక్రమం అని వుంటాయి. నిజానికి వీటిలో సంహారక్రమమే వుండేది. అంటే నవావరణలలో మొట్టమొదటిదైన భూపురత్రయం నుంచి బిందువు వరకూ ప్రతి ఆవరణలో వున్న దేవతలను అర్చిస్తూ వెళ్లటం. కానీ విశ్వనాథవారు “సాక్షాత్ బ్రహ్మ”గా భావించిన శ్రీకల్యాణానందభారతీ మాంతాచార్యుల వారు “అసలు సృష్టి అంటూ వుంటే కదా సంహారం?” అని సృష్టిక్రమాన్ని రూపొందించారు. అంటే బిందువు నుంచి భూపురత్రయం వరకూ ముందుగా అర్చించి, ఆ పిమ్మట భూపురత్రయం నుంచి బిందువు వరకూ పైకి ప్రతి ఆవరణలోని దేవతలనూ అర్చించటం. ఇక్కడే సాధనలో రావణుని స్థాయి తెలుస్తుంది మనకి. భూపురత్రయాన్నే “త్రైలోక్యమోహనచక్రం” అంటారు. అది నవావరణలలో మొదటిది. దీనిలో పది సిద్ధులు వుంటాయి. అలాగే అష్టదిక్కులను పాలించే అష్టమాతృకలు వుంటారు. అంతేకాక సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణ, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ అనే పది ముద్రలు వుంటాయి. ఈ పేర్లన్నీ ఖడ్గమాలా స్తోత్రం ఎఱిగినవారికి తెలిసినవే. ఇవన్నీ కలిపి భూపురత్రయం అనే త్రైలోక్యమోహచక్రం. ఇక్కడి నుంచి బిందువు వరకూ వెళ్లటం సంహారక్రమం. దీనినే “లయాంగకల్పనం” అని కూడా అంటారు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాలి? విశ్వనాథవారు రావణుని నోట పలికించిన “ముట్టితి శ్రీరహస్యమున్” అనే దాని వల్ల ఈ ప్రస్తావనలన్నీ వస్తాయి. ఈ త్రైలోక్యమోహన చక్రం మీద రావణుడు అధికారాన్ని అంటే సిద్ధిని సాధించాడు. అది అతగాని జీవితంలో ద్యోతకం అవుతూనే వుంటుంది.
“రామతరుణీ!” అనే సంబోధనలో తరుణి శబ్దానికి నిజానికి స్త్రీ అనే అర్థం కదా? కానీ ఇక్కడ విశేషార్థాన్ని అన్వయించుకోవలసిన అవసరం ఏర్పడింది! ఎందుకు? “ముట్టితి శ్రీరహస్యమున్” అన్నందువల్ల. సరే.. తరుణి అంటే స్త్రీ. ఏ స్త్రీ? సీత. సీత ఎవరు? ఈ వ్యాసపరంపరలో మొదటి భాగంలోనే ఆమె దివ్యత్వ, అలౌకికత్వాలు వ్యాఖ్యాతమైనాయి. ఈ వెలుగులో “తరుణి”ని దర్శించాలి. ఆధారం? శ్రీలలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కరరాయల వారు రచించిన “సౌభాగ్యభాస్కర వ్యాఖ్య”. తరుణి అంటే తారుణ్యమున్నది. ఎల్లప్పుడూ పదహారేళ్ల వయసులో కనిపించేది. నిత్యయౌవని. షోడశ కళలతో, షోడశ వర్షప్రాయంలో వుంటూ, ఎల్లప్పుడూ భక్తులను, ఉపాసకులను ఆకర్షిస్తూవుండేది అని ఇక్కడ “తరుణి”కి అన్వయం. అలాగే ఈ మాటలోనే “తాపసారాధ్యా” కూడా వుంది. తపస్వుల చేత ఆరాధింపబడేది. రావణుడు తపస్వి. ఆమెను ఆరాధిస్తున్నాడు కనుకనే “నీ చరణ మోహన పీఠము నందు నాదు సర్వజనిఫలంబు నర్పణము పట్టితి” అన్నాడు. రావణుడికి అంత “సీన్” లేదు.. వాల్మీకి రావణుడు నేరుగా “మయి లల లలనే” అంటూ తన లౌల్యాన్ని ప్రకటించాడు. అది వాల్మీకి రావణుడు.. విశ్వనాథ రావణుడు కాదు. “లలిత” అనే శబ్దానికే “లల” అనే ధాతువు మూలం. దానికి క్రీడ అని స్థూలార్థం. సృష్టి, స్థితి, లయలను ఒక క్రీడగా నిర్వహించేది కనుక లలన. భక్తులలో దైవచింతను కలిగించి, వారిలో శుభచింతనను కలిగించేది లలన. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే విశ్వనాథవారు తన కావ్యంలో “బహుళశాస్త్ర రహస్యములు” వున్నాయని ప్రకటించటం వల్లనూ, రావణుని చేత “ముట్టితి శ్రీరహస్యమున్” అనిపించటం వల్లనూను.
మరొకసారి కలిసినప్పుడు మరికొన్ని విశేషాలు చెప్పుకొందాం.
(ఇంకా ఉంది)
శ్రీ ఫణిహారం వల్లభాచార్య ప్రింట్ మీడియా జర్నలిస్ట్, భక్తి టీవీ మాజీ చీఫ్ కాపీ ఎడిటర్, ఎస్విబిసి (టిటిడి ఛానల్) మాజీ కంటెంట్ మానిటర్ హెడ్, సివిఆర్ ఓం ఛానల్స్ మాజీ కన్సల్టెంట్.
కవి, కథా రచయిత, కాలమిస్ట్, సాహిత్య విమర్శకులు, ప్రవాహ వాణి సాహిత్య మాసపత్రిక సంపాదకులు.
మంత్ర – తంత్ర శాస్త్రాలు – జ్యోతిష్య శాస్త్రంలో పండితులు.
‘శ్రీవల్లభ స్పిరిచువల్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా, వివిధ సాధనలలో సాధకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
మెరీనా.. ఓ మెరీనా (కథా సంపుటి), గడ్డిపూలు (కవిత్వం) వీరి ఇటీవలి పుస్తకాలు.
