[శ్రీ ఫణిహారం వల్లభాచార్య గారు రచించిన ‘విశ్వనాథ వారి రావణుడు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
సీతామహాదేవి తత్త్వాన్ని అర్థం చేసుకోకుండా రావణుడు అర్థం కాడనుకున్నాం. అలాగే ఆమె ఎవరో తెలియకపోతే శ్రీరామతత్త్వాన్ని కూడా అర్థం చేసుకోలేమంటాడు విశ్వనాథవారి హనుమ! శ్రీరామచంద్ర మహా ప్రభువు విష్ణ్వవతారం అనటంలో వాల్మీకిని అనుసరించేవారికీ సందేహం అక్కరలేదు కదా? సీతోపనిషత్తులో ఆ మహాదేవి శ్రీరాముని ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులని చెప్పనే చెప్పారు. ఆ మహాదేవి.. శ్రీమహాలక్ష్మి.. ముఖకవళికలకు అనుగుణంగా శ్రీహరి సమస్తమునూ చేస్తాడని శ్రీరంగేశపురోహితులు, శ్రీవిష్ణుసహస్రనామ వ్యాఖ్యాత పరాశరభట్టర్ స్వామి అంటారు..
“స్వస్తిశ్రీర్దిశతాదశేషజగతాం స్వర్గాపవర్వస్థితీః స్వర్గం దుర్గతిమాపవర్గికపదం సర్వం చ కుర్వన్హరిః
యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయం ఖలు నాన్యథాస్య రసదాస్యాదైకరస్యాత్తయా”
స్వామి ఏమీ చేయడు. సమస్త జీవుల కర్మఫలాలను అనుభవింపజేస్తాడు తప్ప వాటిలో జోక్యం చేసుకోడు. ఆ విషయాన్ని స్పష్టంగానే భగవద్గీతలో చెప్పాడు..
“ఇతి తే జ్ఞాన మాఖ్యాతం గుహ్యాద్గుహ్యరతం మయా।
విమృశ్యైదశేషేణ యథేచ్ఛసి తథా కురు॥”
“..ఒరే అబ్బాయ్! నీకు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని చెప్పాను. దీన్ని బాగా విచారించుకొని నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్!..” అన్నాడు. ఇక్కడ భగవంతుడు సమస్త విజ్ఞానాన్ని జీవునికి అందించి, వాని ప్రవర్తన విషయంలో ‘ఫ్రీ విల్’కు అవకాశం ఇచ్చాడు. ఎందుకు? “దీనిని పాటించు” అని ఎందుకు ఆదేశించలేదు? జీవుడు తన కర్మఫలాన్ని అనుభవించాలి కదా? విమర్శించే బుద్ధి కర్మానుసారిణి కదా?
కానీ తల్లి అలా కాదు.. ఏపాటి కొద్ది భక్తిభావమో, ఆరాధనాభావమో కనిపిస్తే దానిని వృద్ధి చెందించి పరమాత్మయైన స్వామి సన్నిధికి చేరుస్తుంది. ఇక్కడ జరిగిందీ అదే.. తనను అపహరించి అశోకవనంలో ఉంచిన రావణునికి హితబోధ చేస్తూ సీతామహాదేవి ఇలా అంటోంది..
“ప్రేష్యుడు వోలె నీవు రఘువీరుని సన్నిధి కేగి జానకీ
శిష్యుడ నంచు జెప్పి యిదె సీత ధరాసుత లోకమాత నీ
శిష్యుడ నంచు పాదసరసీరుహ యుగ్మమునందు వ్రాలుమీ
ప్రేష్యుడుగా గ్రహించు రఘువీరుడు సద్గతి నీకు గల్గెడున్”
కోరికలతో కానీ, కోరికలు లేకుండా కానీ తనను ఎవరు ఏ విధంగా అర్చించినా వారికి మోక్షమార్గాన్ని దర్శింపజేస్తుంది ఆమె. యుగాలపాటు తమ క్షీరసాగరవాసభూమికి ద్వారపాలకులుగా మెలగిన జయవిజయులను గాలికి వదలివేస్తుందా? వారు కోరినదే స్వామితో వైరం ద్వారా మూడుజన్మలలో శాపవిమోచనం. ముందుగా ఆ వైరాన్ని కల్పించాలి కదా? అదే ఇక్కడ జరిగింది! పైగా చాలా స్పష్టంగా తాను ‘లోకమాత’ను అని చెప్పింది. స్పష్టాస్పాష్టంగా రావణునికి సీతారాముల దివ్యత్వం తెలుస్తూనే వుంటుంది విశ్వనాథవారి కావ్యంలో.
“ఘనుడీతండె త్రివిక్రముండయినచో గానిమ్మ యిందాక తె
చ్చినదే చాలును మానవుండగుచు వచ్చెన్ శ్రీవికుంఠంబునం
దున కాలూదగ లేక జానకియు తోడ్తో లక్ష్మియైనన్ తనం
తన యేతెంచి యిటన్ వసించె..”
ఇదే సాధకునిలోని దయనీయ పార్శ్వం. తెలుస్తూనే వుంటుంది.. అంతలోనే మాయపొర క్రమ్మేస్తూ వుంటుంది. అహంకారం తలెత్తి కర్మఫలం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఆ బాటను సవరించి సుపథంలో ప్రవేశ పెట్టడానికి తల్లి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే స్వామిని ప్రేరేపిస్తుంది. తమకు సేవకులైన జయవిజయులు వైరంతో మూడు జన్మలలో మోక్షం కావాలని కోరుకున్నారు కదా? వారికి ఆ అవకాశాన్ని కల్పించాలి. స్వామిని క్రియాశీలిని చేయాలి. అక్కడెక్కడో రాఘవుడు, ఇక్కడెక్కడో రావణుడు.. ఎలా? రాఘవుడు ఎవరు ఎటువంటి అపకారం చేసినా “స్వామీ! నేను నీవాడను!” అంటే క్షమించేస్తాడు. క్షమాపణకు అవకాశం లేని అపరాధం వల్ల మాత్రమే రావణునికి విముక్తి. శ్రీరామచంద్ర మహాప్రభువు దేనినైనా క్షమిస్తాడేమో కానీ సీతామాతకు హాని కలిగితే క్షమించడు. కాకాసురుని వృత్తాంతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఏకంగా బ్రహ్మాస్త్రప్రయోగమే చేశాడు స్వామి!
సీతారామలక్ష్మణులు అనే త్రిపుటి రహస్యాన్ని విశ్వనాథవారి రాముడు ఒకచోట ఇలా చెబుతాడు..
“నీవును మా సౌమిత్రియు
నా వెంబడినుండ చూచినావో లేదో
ఈ విశ్వ సర్వవైభవ
మావిష్కృతమైనయట్లె యతివా! నాకున్”
పైకి చూస్తే భార్య, తమ్ముడితో కలిసి జీవించటంలోని ఆనందాన్ని చెబుతున్నట్టే ఉంటుంది. కానీ ఇంకొంత లోతుగా వెడితే రాముడనే పురుషుడు, సీత అనే ప్రకృతి, లక్ష్మణుడనే శేషుడు. ఈ త్రిపుటియే ఈ విశ్వ సర్వవైభవం! ఒక్కసారి మళ్లీ సీతోపనిషత్ చూస్తే దానిలో ఒకమాట ఉంటుంది, దానిలోని ఒక భాగాన్ని మనం ఇంతకుముందు చూశాం, ఇప్పుడు మరికొంత చూద్దాం..
“భగవత్సహచారిణీ అనవరత సహాయాశ్రయణీ”.. భగవంతునితో కలిసి చరించేది, ఎన్నడూ భగవంతుని విడువక ఉండేది, “సహాయాశ్రయిణీ”.. భగవంతునికి సహాయంగా, ఆశ్రయంగా ఉండేది. ఇంతవరకూ చూశాం.. ఇప్పుడు ఆ వాక్యాలకు పొడిగింపు చూద్దాం..”నిమేషోన్మేష సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహాది సర్వశక్తి సామర్థ్యా త్సాక్షాచ్ఛక్తిరితి గీయతే”.. ఏమి గుర్తుకొస్తోంది?
“ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనాళిః”
“పంచ కృత్య పరాయణా”
ఇప్పుడు స్పష్టమైంది కదా సీత అంటే ఏమిటో?
రానున్న భాగంలో మరికొన్ని విశేషాలతో కలుద్దాం..
(ఇంకా ఉంది)
శ్రీ ఫణిహారం వల్లభాచార్య ప్రింట్ మీడియా జర్నలిస్ట్, భక్తి టీవీ మాజీ చీఫ్ కాపీ ఎడిటర్, ఎస్విబిసి (టిటిడి ఛానల్) మాజీ కంటెంట్ మానిటర్ హెడ్, సివిఆర్ ఓం ఛానల్స్ మాజీ కన్సల్టెంట్.
కవి, కథా రచయిత, కాలమిస్ట్, సాహిత్య విమర్శకులు, ప్రవాహ వాణి సాహిత్య మాసపత్రిక సంపాదకులు.
మంత్ర – తంత్ర శాస్త్రాలు – జ్యోతిష్య శాస్త్రంలో పండితులు.
‘శ్రీవల్లభ స్పిరిచువల్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా, వివిధ సాధనలలో సాధకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
మెరీనా.. ఓ మెరీనా (కథా సంపుటి), గడ్డిపూలు (కవిత్వం) వీరి ఇటీవలి పుస్తకాలు.
