ఈ మధ్య వాట్సప్ గ్రూపుల్లో వీడియోలు ఎక్కువైపోయేయి.
లాక్‌డౌన్ పెట్టిన కొత్తల్లో వయోభేదం లేకుండా ఇంట్లో ఆడవాళ్లందరూ చిన్నాపెద్దా తొక్కుడుబిళ్ళ దగ్గర్నించి జడకోలాటం వరకూ వీడియోలు తీసి పెట్టేసేవారు. పరవాలేదు.. కాస్త కాలక్షేపం అయ్యేది.
తరవాత కొన్నాళ్ళకి సెలిబ్రటీస్ పంచిన వీడియోలు చూసి ఇంట్లో మగవాళ్ళందరూ పనివాళ్ళూ, వంటవాళ్ళ వేషాలతో ఆ పనుల్ని చేస్తూనో లేకపోతే చేస్తున్నట్టు నటిస్తూనో వీడియోలు తీసి పెట్టేవారు. కాసేపు కావల్సినవాళ్లతో చెప్పుకుని నవ్వుకుందుకు అవీ బాగానే వుండేవి.
అవన్నీ అయిపోయేయేమో ఈ మధ్య అందరూ ఏదో కాన్సెప్ట్ తీసుకుని షార్ట్ ఫిల్ములు తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం మొదలెట్టేరు. ఆహా.. అంతకన్నానందమేమీ.. మనవాళ్ళలో సృజనాత్మకత పొంగి పొర్లిపోతోందనుకుంటూ పొద్దున్నే వాట్సప్‌లో వచ్చిన వీడియోలని మధ్యాహ్నం తీరుబడిగా కూర్చుని చూడడం మొదలుపెట్టేను.
ఒక గ్రూప్‌లో వచ్చిన వీడియో కాప్షన్ నన్ను ఆకట్టుకుంది. “షార్ట్ ఫిల్మ్‌లో బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ గుప్పించి పండించిన ప్రేమ కథ..” అన్నది ఆ కాప్షన్. అమ్మో అమ్మో.. మనవాళ్ళు షార్ట్ ఫిల్ముల్లో కూడా గ్రాఫిక్స్ దంచేస్తున్నారన్న మాట అని సంబరపడిపోతూ వెంఠనే అది క్లిక్ చేసేను.
అదొక అందమైన పూలతోట. రంగురంగుల పుష్పాలు మెల్లగా వీచే గాలికి నెమ్మదిగా తలలూపుతూ తుమ్మెదలని రమ్మని పిలుస్తున్నాయి. ఝుంకారనాదంతో తుమ్మెదలు పువ్వులచుట్టూ భ్రమిస్తున్నాయి. ఎంతో అందంగా ఆహ్లాదంగా వున్న ఆ పూదోట అందాలను పెంచుతూ వెనకనుంచి తీయని సంగీతం వీనులకి విందవుతోంది. మనసు ఆనందపడే లోపే అక్కడ వరసగా పెద్ద పెద్దవి అంటే ఓ మనిషి పట్టేంత టీకప్పులూ, సాసర్లూ కనిపించేయి. అదేంటీ.. ఇంత అందమైన పూదోటలోకి ఈ కప్పులూ సాసర్లూ ఎందుకొచ్చేయీ అని నేను అనుకునేలోపే ఓ పదిమంది బలమైన మనుషులు ఆ కప్పుల్లో ఏదో ద్రవపదార్ధం నింపి, ట్యూన్‌కి తగ్గట్టు బలంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేరు. అంతలో అక్కడికి వచ్చేడు హీరో.. అదే ప్రేమికుడు. వట్టినేకాదు.. తన చేతుల మధ్య అందమైన ప్రియురాలిని ఎత్తుకుని మరీ తీసుకొచ్చేడు.
అసలే నాకు సినిమాల్లో అలా హీరోయిన్లని ఎత్తేసుకునే హీరోలంటే ఒళ్ళుమంట. ఎందుకంటే ఆ హీరోయిన్‌కి కాళ్ళు లేవా లేకపోతే చంటిపిల్లలా ఇంకా నడవడం రాదా.. అలా ఎందుకు ఎత్తేసుకుంటారో నాకు అర్థం కాదు. ఇంకోసారి అలా అన్నానంటే నాకు రసహృదయం లేదనే మనుషు లుంటారని కూడా తెలుసు. అదంతా ప్రేమ చూపించడం అని కొందరు పెద్దమనుషులు అనగా విన్నాను. కానీ అలాంటి ప్రేమ ఏమిటో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది నాకైతే.. కానీ ఇక్కడ షార్ట్ ఫిల్ములో తర్వాతి సన్నివేశం చూసిన నాకు ఎబ్బెట్టు కాదు డోకొచ్చినంత పనైంది. అవునుమరి.. ఎందుకవదూ.. ఆ ప్రేమికుడు ఆ ప్రియురాలిని ఆ కప్పులో వున్న ద్రవపదార్ధంలో ముంచి తీస్తున్నాడు. పాపం ఆ ప్రేయసి మునగానాం తేలానాం అన్నట్టు మునుగుతూ తేలుతూ ఊపిరి అందక అవస్థ పడుతూ కూడా మొహం మీద నవ్వుని చెదరనివ్వకుండా కళ్ళల్లో ప్రేమని కురిపించేస్తూ అద్భుతంగా నటించేస్తోంది. అలా ముంచుతూ తీస్తూ వున్న హీరో ఒక్కసారిగా అమెని అలా కప్పులో నిలబెట్టేసేడు. పాపం కళ్ళమ్మట, ముక్కమ్మట ఆ ద్రవపదార్ధం అలా కారిపోతుంటే ఆ ప్రియురాలు ప్రియుడికేసి ఆరాధనగా చూస్తోంది. పాపం ఆ అమ్మాయికి ఇంటికెళ్ళేక కాస్త విక్స్ నీళ్ళలో వేసుకుని ఆవిరి పట్టమని ఎవరైనా చెపితే బాగుండును అని నేను అనుకుంటుంటే అప్పుడు.. అప్పటిదాకా వెనకాల మ్యూజిక్ వినిపించిన నాకు పాట వినిపించింది.
“నీ చాయ్‌లో నిలవనీ….” అంటూ..పాట నా చెవిన పడగానే ఓహో పాటలో చాయ్‌లో నిలబడ్తానని వుందని పాపం ఆ అమ్మాయిని టీకప్పులో ముంచి తీసేరా అనుకున్నాను. అయినా చాయ్‌లో నిలబడడవేవిటీ అర్థం లేకుండా ఏ కొలనో అనాలి లేకపోతే పన్నీటిస్నానం అనాలి అంతేకానీ చాయ్ కప్పులో అమ్మాయిని నిలబెట్టడవేవిటో అర్ధంకాలేదు..
అందుకే మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా పాట విన్నాను. నిజవే.. అలాగే వుంది.. “నీ చాయ్‌లో నిలబడనీ..” అంటూ. కాసేపు జుట్టు పీక్కున్నాక అప్పటికి తట్టింది నా పిచ్చిబుర్రకి.. ఓహో అది చాయ్ కాదూ.. “ఛాయ” అని. ఛాయంటే నీడ..ప్రియుని నీడలో నిలబడతానని ప్రేయసి భావమన్న మాట. మరి.. అది చాయ్ లా ఎలా మారిపోయిందీ అని చీమా చీమా కథలో లాగా ఒక్కొక్కర్నీ అడుగుతున్నట్టు అనుకుంటూ ఆలోచిస్తే బహుశా పాట రాసినాయన “చా” కి ఒత్తు పెట్టడం మర్చిపోయుండాలి.. లేదా ఒకవేళ ఆయన ఒత్తు పెట్టినా కూడా ఆ సాహిత్యం పాడినాయనకి ఒత్తు పలకడం రాకపోయుండాలి. అందుకని “ఛాయ”కి బదులు “చాయ” అని పాడుండాలి. అలా పాడుతున్నప్పుడు రిథం కోసం “చాయ” అని పూర్తిగా పలకకుండా వట్టి “చాయ్” అని పాడుండాలి. అలాగే రికార్డ్ అయిపోయిన ఆ పాట చిత్రీకరించాలనుకున్నప్పుడు “చాయ్” అన్నది స్క్రీన్ మీద కనపడాలిగా మరీ. అందుకని ఆ డైరెక్టరెవరో పాపం సిన్సియర్ గా చాయ్ అంటే టీ కప్పులు తెచ్చిపెట్టి వాటిలో ఆ అమ్మాయిని ముంచి తీసేరన్న మాట. ఓర్నాయనో.. భాషకి హెంత దౌర్భాగ్యం పట్టిందీ.. ఇంతోటి పాటకీ గ్రాఫిక్స్ కూడానూ..
ఇదంతా ఆలోచించుకునేటప్పటికి నా బుర్ర తిరిగిపోయింది. కనీసం ఓ గంటసేపైనా సరస్వతీ ప్రార్థన చెయ్యకపోతే ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన దోషం పోదనిపించింది.
అందుకే తిరిగి వాట్సప్‌లో ఒక ఆధ్యాత్మిక గ్రూప్ వైపు చూపు సారించేను. అందులో జగదంబగారు పురాణాల్లోనూ, శాస్త్రాల్లోనూ వున్న శ్లోకాలకి అర్థం చెపుతూ వీడియోలు తీసుకుని పెడుతుంటుంది. ఆ గ్రూప్‌లో ఆవిడంటే అందరికీ ఆరాధనాభావం. ఎందుకంటే ఎక్కడెక్కడి కథలూ, శ్లోకాల గురించి చెప్పడమే కాకుండా వాటిని ప్రస్తుత కాలానికి అన్వయించి మరీ గుణదోషాలను చెపుతూంటుంది. హమ్మయ్య… ఈవిడ చెప్పింది వింటే ముందు చూసిన వీడియో ప్రభావం కాస్త తగ్గుతుందనుకుంటూ చూస్తూ వినడం మొదలెట్టేను.
అమ్మవారిని వర్ణిస్తూ ఏదో పురాణంలో వున్న శ్లోకానికి అర్థం చెపుతోంది జగదంబగారు తన్మయత్వంతో. ఎంత భక్తిభావం.. ఆవిడ ఏం చెపుతున్నాసరే అందులో లీనమైపోయి చెపుతారు. అలాగే అమ్మవారు ఒక తటాకం గట్టున కూర్చుంటే ఆ తటాకంలో పడిన వెలుగులకి ఆ అమ్మవారి కపోలాలు కెంపులయ్యాయిట. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. తటాకంలో పడ్ద వెలుగులా అంటే యేమిటీ అనుకుంటుంటే ఆవిడ మళ్ళీ శ్లోకం చదివింది.
అందులో అమ్మవారి తాటంకములోని మెరుపులకి ఆమె కపోలాలు కెంపుల్లా కనిపిస్తున్నాయి అని అర్థమొచ్చే శ్లోకమది. తాటంకములంటే అమ్మవారు ధరించే కర్ణాభరణాలు కదా అనుకున్న నేను మళ్ళీ ఈ జగదాంబ చెప్పే అర్థం విన్నాను. మళ్ళీ అదే.. నేను విన్నది కరెక్టే.. తాటంకములంటే తటాకమనే అర్ధం చెపుతూ తటాకము ఒడ్డున వున్న అమ్మవారి చెంపలు ఆ తటాకములోని వెలుగులకి కెంపులుగా మెరుస్తున్నాయీ..అంటోందావిడ.
ఓరి నాయనోయ్.. అది తటాకము కాదు.. తాటంకము అంటే కర్ణాభరణము అని కామెంటులో పెట్టబోయిన నేను ఆగిపోయేను.. ఒకవేళ కర్ణాభరణాలంటే మళ్ళీ కర్ణుడు ధరించే ఆభరణాలని అర్ధం చెపుతుందేమో జగదంబ అనుకుంటూ అమ్మవారు చెవులకి పెట్టుకునే నగ అని కామెంటు టైపు చేద్దామని కామెంట్సు కింద దాకా వెళ్ళేను.
అప్పటికే అక్కడ ఎన్ని కామెంట్లో.. జగదంబగారు ఇంత అద్భుతంగా ఇలాంటి శ్లోకాలకి అర్థాలు చెప్పి అజ్ఞానంలో వున్న మనుషులను జ్ఞానమార్గం వైపు మళ్ళిస్తున్నందుకు అందరూ ఎంత పొంగిపోతున్నారో. ఒకరేమో అద్భుతం అని కామెంటితే, ఇంకొకరు మీవల్ల మాకీనాడు ఈ అర్థం తెలుసుకునే అదృష్టం పట్టింది అంటున్నారు. ఇంకోరేమో ఆ జగదంబ ఈ లోకానికి చేస్తున్న ఆధ్యాత్మిక సేవని వేనోళ్ళ కొనియాడారు.
ఇంకా అలాంటి చాలా కామెంట్లు చూసిన నేను తాటంకములు అంటే అర్థం ఇది కాదమ్మా అని పెడితే ఇంకేమైనా వుందా…నన్ను గ్రూప్ లోంచి వెలి వెయ్యరూ అనుకుంటూ నేను కూడా కామెంట్ బాక్స్ లో ఓ నమస్కారం పడేసి వాట్సప్ లోంచి బైట పడి ఊపిరి పీల్చుకున్నాను.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.