[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘యుద్ధం వద్దు.. శాంతే ముద్దు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సంపన్న దేశాలు కొన్నే అయినా,
ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని చాటాలని తపిస్తున్నాయి.
పేద, వర్ధమాన దేశాల ప్రజలను
అనేక రూపాల్లో హింసించి లాభాలు పొందుతున్నాయి.
‘మనుషులంతా ఒక్కటే’ అనే మహా సత్యాన్ని మరచి,
మానవత్వానికి చోటు లేని ప్రపంచాన్ని సృష్టిస్తూ,
విధ్వంసానికి మార్గాలు వేస్తున్నాయి.
సామాన్య ప్రజల ధన, మాన, ప్రాణాలకు
విలువ ఇవ్వకుండా అకృత్యాలకు పాల్పడుతూ,
తమను ప్రశ్నించే వారే లేరనే అహంకారంతో,
‘మేమే గొప్పవాళ్ళం’ అనే మూర్ఖత్వంతో విర్రవీగుతున్నాయి.
ఏ దేశమైనా ఎదురెళ్లితే,
ఆ దేశాన్ని ప్రపంచానికి దూరం చేస్తూ,
అంతులేని యుద్ధాలకు నాంది పలుకుతూ,
తమ శక్తిసామర్థ్యాలన్నీ వినియోగించి,
దేశాధినేతలను సైతం లక్ష్యంగా
చేసుకుంటూ ప్రాణాలు తీస్తున్నాయి
ప్రపంచాన్నంతా భయానక
వాతావరణంలోకి నెడుతున్నాయి.
కానీ..
ఈ ధోరణి మారకపోతే,
దేశాలన్నీ ఏకమయ్యే రోజు తప్పక వస్తుంది.
‘పెద్దన్నలం’ అని విర్రవీగే వారి అహంకారానికి
చరమగీతం పాడే సమయం ఆసన్నమవుతుంది.
శాంతి కపోతాలు స్వేచ్ఛగా
ఆకాశంలో విహరించే ప్రపంచాన్ని నిర్మించగలిగితే,
అదే నిజమైన గొప్పతనం.. అదే శాశ్వత నాయకత్వం.
దెబ్బతీయడం కాదు గొప్ప..
పడిపోతున్న వారికి చేయూతనిస్తూ నిలబెట్టడం గొప్ప
ఆశ్రయం ఇచ్చి,
ఆపన్నహస్తం అందించి
కాపాడడం మహోన్నతుల లక్షణం.
యుద్ధం వినాశనానికి నాంది..
శాంతి మానవాళి ప్రగతికి పునాది.
ప్రేమ, కరుణ, సహజీవనమే ఈ భూమికి శాశ్వత శోభ!!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
