Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుద్ధము – శాంతి మూడు అనువాద కవితలు

[యుద్ధము, శాంతికి సంబంధించి మూడు అనువాద కవితలని అందిస్తున్నారు డా. తుర్లపాటి రాజేశ్వరి.]

1. మండి మసైన నక్షత్రాన్ని

(మూలం: ఇరాన్ రచయిత్రి పార్నియా అబ్బేసి. ఆంగ్లానువాదం ‘The Extinguished Star’ కి స్వేచ్ఛానువాదం)

~

మన ఇరువుర కోసమూ
నేను రోదించాను.
నువ్వు నక్షత్రాలని గురి చూసి కొట్టావ్
నీ లోకంలో నాకన్నీటి వరద
స్వాతంత్య్రపు కాంతులు
నాలో వెన్నాడే నీడలు
ఎక్కడో ఒక చోట
నువ్వూ – నేనూ అంతమౌతాం
విశ్వంలో అందమైన పాట
మూగపోతుంది.
నువ్వెక్కడో మళ్లీ
జీవితాన్ని శ్వాసిస్తావ్..
కానీ నేను
మండిపోతాను
అంతమౌతాను
నీ ఆకాశంలో
పొగలాగ కమ్మేసిన
మండి మసైన నక్షత్రాన్నే నేను.

~

(పార్నియా అబ్బాసి క్వాలిన్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిగ్రీ చదివారు. అధ్యాపకురాలిగా, బేంక్ క్లర్క్‌గా పని చేశారు. ఆమె ఇరాన్ Gen-Z- Poetic Voice గుర్తింపు పొందారు. పార్నియా అబ్బాసి Vazn-e-Donya అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనకి స్పందించి కవితలల్లుతానని చెప్పారు. దానివల్ల తనకి శాంతిగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కాని దురదృష్టం ఏమంటే ఇజ్రాయిల్ దాడులలో టెహ్రాన్‌లో సత్తర్‌ఖాన్ అనే చోట ఈ ఆమె తన తల్లీతండ్రి తమ్ముడితో సహా ప్రాణాలు కోల్పోయారు. అబ్బాసి వయసు 23 ఏళ్లు.)

2. శాంతి.. కానరాదే ఎక్కడా

(మూలం అసాద్ చిష్టి. ఆంగ్ల కవిత ‘పీస్ ఈజ్ లాస్ట్’కు స్వేచ్ఛానువాదం)

~

కన్నూ మిన్నూ కానరాని ప్రతిహింసా పర్వంలో
శాంతి అన్నదే కానరాకుండా పోయింది
అదే మానవ జాతికి శాపం.
అస్త్రాలు ఎగురుతున్న చోట
నీడలు గాఢంగా కమ్మేశాయి.
అమాయక ఆత్మలు నిందలు మోస్తుంటే
ఆకసం కింద రెండు దేశాలు విలపిస్తున్నాయి
పూర్వ విద్వేషాలు కొత్త మంటలతో
ప్రజ్వరిల్లుతున్నాయి.

~

(అసాద్ చిష్టి CBC – Canadian Broadcasting Corporation లో waterloo లో Reporter గా ఉన్నారు. ఈయన అంతకుముందు కూడా Queen’s Journal photo desk, CBC లోనే పని చేసారు.)

3. ఇతరులను గుర్తుకు తెచ్చుకో

(మూలం: గాజా కవి యాహ్యా అల్ హమర్నా. ఆంగ్లానువాదం ‘రిమెంబర్ అదర్స్’కు స్వేచ్ఛానువాదం.)

~

నువ్వు నీ సాధారణమైన దినచర్య గూర్చి
ఆలోచిస్తున్నపుడు
ఆశ – ఆశంకల ఊగిసలాటలో
బతుకు బండి లాగిస్తున్నవారూ ఉన్నారని
గుర్తుకి తెచ్చుకో
పాలస్తీనా, లెబనాన్, సూడాన్, ఇరాన్ లలో
వరుస అమానవీయ ఘటనలు
మానవ జాతికి గుదిబండగా మారాయి
ఇతరులను గురించి ఆలోచించు
నీ ఆలోచన బహుశ అప్పుడు
మానవ జాతి చరిత్రలో
ఒక కొత్త అధ్యాయానికి
నాందీ వాక్యం కావొచ్చు.

~

(యహ్యా అల్ హమర్నా గాజా స్ట్రిప్‌కు చెందిన పాలస్తీనా రచయిత, పరిశోధకుడు మరియు శరణార్థి. నవంబర్ 2023లో జరిగిన బాంబు దాడుల్లో ధ్వంసమైన అల్-అజ్హర్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు మరియు దౌత్య శాస్త్రాన్ని అభ్యసించారు.)

Exit mobile version