Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యువతా మేలుకో..

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘యువతా మేలుకో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

సంద్రాన్ని దాటగల
యువకెరటాల శ్రమశక్తి అనంతం!
యువ చైతన్యమే దేశాభ్యున్నతికి కారణం!
రేపటి నవ్య భారతావని వికాసానికి
మార్గదర్శకులు నేటి యువత!
తమ కర్తవ్యాన్ని మరచి యువత
అమూల్యమైన సమయాన్ని
వాట్సాప్ చాటింగ్‌ల కోసం
ఫేస్‌బుక్ వీక్షణల కోసం
ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల లైక్‌ల కోసం
రీల్స్ చూస్తూ వృథా చేస్తుంటే..
అది ఎంతో బాధాకరం!

ఓ యువతా!
ఇకనైనా మేలుకోండి!!
సెల్‌ఫోన్‌లను పరిమితంగా ఉపయోగిస్తూ
కాలం విలువను గుర్తిస్తూ
అమూల్యమైన సమయాన్ని
సద్వినియోగం చేసుకుంటూ
ప్రగతి పథంలో పయనించండి!
చిన్న చిన్న అపజయాలకే
నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా
విజయ సాధన కోసం
అవిశ్రాంతంగా శ్రమించండి!

ఆర్థికం, సామాజికం, రాజకీయం, క్రీడలు..
రంగమేదైనా సరే
అడుగుపెట్టిన ప్రతి చోట
ఘనంగా పోరాడండి!
అంతిమ విజయం మీదే!

రేపటి భారతావని విఖ్యాతిని
నేడు కలలు కంటూ,
దేశ శ్రేయస్సే ధ్యేయంగా
దేశ ఔన్నత్యమే ఆశయంగా,
దేశ ఉన్నతే లక్ష్యంగా..
ధీమాగా, ధైర్యంగా
బతుకుపోరులో ముందుకు సాగండి!
ఓ యువతా.. మేలుకో!
నవ్య భారత నిర్మాణానికి
మీరే నాంది!

Exit mobile version