శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన పద్యకావ్య పోటీ ఫలితాలు ప్రకటిస్తున్నాము.
న్యాయనిర్ణేతగా వ్యవహరించిన శ్రీ డా. ఏల్చూరి మురళీధరరావు గారు కావ్యాలను పరిశీలించి తమ అభిప్రాయాన్ని ఈ క్రింది విధంగా తెలియజేశారు.
త్వరలో సంచిక పద్య కావ్య రచనపోటీ నిర్వహించబోతోంది. ఆ పోటీలో పద్య కవులందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రార్ధన.
***
ముమ్మొదటగా సంచిక – డా.అమృతలత సంయుక్తంగా నిర్వహించిన ఉగాది 2025 ఉత్తమ పద్యకావ్యరచన పోటీకి వచ్చిన కృతులను పరిశీలించే సదవకాశాన్ని నాకు కల్పించిన శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి, శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను విన్నవిస్తున్నాను.
పోటీకి మొత్తం పన్నెండు కృతులు వచ్చాయి. వస్తుస్వీకారంలో, భావాభివ్యక్తిలో, శబ్దసంఘటనలో, పాత్రనిర్మితిలో, సన్నివేశనిర్వహణలో ఈ విద్వత్కవుల నేర్పు బహుముఖీనమై తోచింది. పూర్వాపరాలోచనతో తత్తత్కావ్యావధీరితమైన అర్థాన్ని నిశ్చయించి, వీటి పరమార్హతను నిర్ణయింపగల శక్తితో గాక అతిసామాన్యమైన వివేకంతో నైయమికంగా నాకు తోచిన ఫలితార్థమిది:
- సగటు మనిషి:శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారి కృతి. అసలు ఈ పేరుతో సాంప్రదాయిక పద్యకావ్యానికి నామకరణ చేయటమే ఒక విశేషం. జీవితంలో లెక్కలేనన్ని ఉత్థానపతనాలకు లోనైనప్పటికీ తన ఆదర్శాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకొని, సర్వజనోపకారలక్ష్యంతో చరితార్థుడైన ఒక సామాన్యవ్యక్తి జీవితోదంతం ఇది. కావ్యంలో ఆద్యంతం పరచుకొని ఉన్న ప్రశాంతత పాఠకులకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. కొద్దిగా భాషావ్యతిక్రమాలను పరిష్కరించిన తర్వాత అవశ్యం ముద్రణీయమైన సత్కావ్యం.
- శ్రీరాముని అంతరంగం:శ్రీ ఎం. వి. ఎస్. రంగనాథం గారి రచన. అశ్వమేధయాగదీక్షలో ఉన్న శ్రీరాముని యెదుట వాల్మీకి శిష్యులైన లవకుశులు రామచరితను గానం చేయగా విని పరవశుడైన శ్రీరాముడు లక్ష్మణునితో తన మనోగతాన్ని పంచుకొనటం ఇందులోని ఇతివృత్తం. భవ్యమైన కల్పనతోడి మనోహరమైన అనుస్మృతికావ్యం ఇది. భాషావ్యతిక్రమాలను సంస్కరించిన తర్వాత తప్పక ప్రకాశితం కావలసిన కృతి.
- పల్లె పిలిచింది:టి.వి.ఎల్. గాయత్రి గారిచే ప్రణీతమైన కావ్యం. పల్లీజీవనసౌందర్యాన్ని వినూత్నమైన కథాముఖంగా ఆవిష్కరిస్తున్న రమణీయమైన కూర్పు. ఇంత చిన్ని కావ్యంలో ఇంతటి వృత్తవైవిధ్యంతో ఇతివృత్తాన్ని నిర్వహింపగలగటం ప్రశంసనీయం. మిక్కుటంగా ఉన్న భాషావ్యతిక్రమాలను సవరింపజేసికొన్న తర్వాత తప్పక అచ్చుకావలసిన రమ్యసంవిధానం.
- గౌతమీ పరిణయ గాథ: శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులు గారి రచించిన రమణీయమైన కావ్యం. పురాణోదితమైన గౌతమీ గాథాక్రమాన్ని వర్ణిస్తూ ఆధునికకాలంలో కాటను దొర వంతెనను నిర్మించినంత దాకా అయిదు ఆశ్వాసాలలో ఆసక్తికరంగా సాగిపోయిన రచన. గౌతమీ తీరప్రాంతాల పుణ్యభూములను వర్ణించిన తీరు హృద్యం. భాషాదృష్ట్యా కావ్యాన్ని ఆసాంతం సంస్కరింపవలసి ఉన్నది. పదాల మధ్య స్పేసింగును ప్రసిద్ధపద్ధతిలో గాక గణవిభజనానుకూలంగా చేసినందువల్ల చదువుకోవటం శ్రమాపాదకంగా ఉన్నది. ముద్రణవేళ కవిగారు తప్పక గమనింపవలసిన అంశమిది.
- భారతీయం:శ్రీ ఐలేని యాదగిరి గారి రచన. భారతీయ సంస్కృతివైభవాన్ని వేనోళ్ల కీర్తిస్తున్న కావ్యం. రైతు జీవనం, స్త్రీవాదం, మతము, భాష, ఆర్థిక క్రమశిక్షణ, లోకాభిరామాయణం వంటి విభిన్నాంశాలను ఒక్క కావ్యచ్ఛత్త్రం క్రిందికి తెచ్చినప్పటికీ ఎక్కడికక్కడ లంకెలతో వస్త్వైక్యాన్ని సాధించే ప్రయత్నం చేశారు. కొంత సరిచూచి ముద్రింపవలసిన రచన.
- కింపురుష:శ్రీ డా. చింతలపాటి మోహనమురళీకృష్ణ గారి నవీనేతివృత్తచిత్రణకావ్యం. కవిగారి ధార ధారాళమైనది. వైదుష్యసంపద అపారం. ఒక కింపురుషుడు తన లోకం నుంచి దిగివచ్చి మూడాశ్వాసాలలో లోకవృత్తాన్ని పరిశీలించిన తీరు ప్రశంసనీయం. స్వార్థప్రవృత్తి మానవజాతిని ఎంతటి దుర్దశకు లోనుచేస్తున్నదో కన్నులకు కడుతున్న కావ్యం. కావ్యనామకరణం భావగర్భితమైనది. అడుగడుగున నీత్యవినీతివివేకసంధాయకమైన కావ్యసందేశం అవశ్యాచరణీయం. సవరింపవలసిన భాషావ్యతిక్రమాలను సవరించిన తర్వాత తప్పక ముద్రణకు రావలసిన భవ్యకృతి.
- స్వేచ్ఛాసారథి మహాత్మా గాంధీ:శ్రీ రాయప్రోలు జగదీశ చంద్రశర్మ గారి కృతి. “నా జీవితమే నా సందేశం” అని పలికిన గాంధీ మహాత్ముని జీవితగాథను స్వాతంత్ర్యోద్యమ నైపథ్యానుసంజనతో వర్ణిస్తున్న 59 పద్యాల కావ్యరూప లఘుప్రస్తావిక యిది. భాషావ్యతిక్రమాలను సవరించి ముద్రిస్తే బాగుంటుంది. కవిగారికి మహాత్ముని యెడ గల గౌరవాతిశయం మనోజ్ఞంగా అభివ్యక్తమైంది.
- గురుమహిమ:విద్వదుపాధ్యాయి మధు అపర్ణ గారి కృతి. ‘సూర్యదీప్తి’ అని వీరి కలం పేరు. 131 పద్యాలలో పునరుక్తులు సంధిల్లని భావపౌష్కల్యంతో ఆదర్శ సద్గురువు వర్తనను ప్రశంసిస్తున్న లఘురచన. వీరి హృదయసౌకుమార్యానికి, పవిత్రవర్తనకు అన్వర్థమైన వస్తువు లభించింది. పద్యలక్షణాలను మరింత నేర్చి యతిప్రాసల వాడుకను జాగ్రత్తగా అభ్యసింపవలసి ఉన్నది. భావికాలంలో సమర్థ కవయిత్రిగా రూపుదిద్దుకొనగలరని ఈ రచన ప్రకటీకరిస్తున్నది.
- తెలుగు వెలుగు:శ్రీ మల్లాది నరసింహమూర్తి గారి కృతి. గణితశాస్త్రాచార్యులై పద్యవిద్యపై పట్టు సాధించి కృతిరచనకు ఉపక్రమించారు. సంస్కృతాంధ్రకవులు,తత్తత్కవితారీతులు, వివిధ కవితాప్రక్రియల ప్రశంసతోపాటు పరభాషావ్యామోహ పరసంస్కృతివ్యామోహ తిరస్కరణం, ఆదర్శ జీవనవిధానం పాఠకులకు నేర్పుతున్న ప్రబోధకావ్యం. నిర్దుష్టమైన శైలి, సుసంస్కృతమైన రచన. వీరికి మనఃపూర్వకాభినందనలు.
- శ్రీ వీరబ్రహ్మేంద్ర వైభవము: శ్రీ పాణ్యం దత్తశర్మ గారి మేలికృతి. సుప్రసిద్ధమైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవితచరిత్రను లోకహితోద్యముడై మహామహిమోపేతుడైన సద్గురువు లీలాకథనంగా తీర్చిదిద్దిన మహాప్రబంధం. అక్కడక్కడ చిన్నిచిన్ని నెరసు లున్నప్పటికీ సరసులను మైమరపింపజేసే కథాకథనం మరీమరీ అభివర్ణనీయం. పూర్వప్రబంధాలను తలపింపజేసే కవిత్వధోరణి ఆకర్షణీయంగా అమరింది. వీరికి మనఃపూర్వకాభినందనలు.
- ఏకశిల:శ్రీ సి.హెచ్. వి. బృందావనరావు గారి చారిత్రిక వైభవోద్ఘాటన మహాకావ్యం. ‘పుష్ప’నామకములైన మూడు ఆశ్వాసాలలో ఏకశిలా నగర నిర్మాణోదంతాన్ని అపురూపమైన శబ్దఘటనతో, సాలంకారము, సర్వాంగసుందరము అయిన కథనరీతితో కర్ణామృతంగా అభివర్ణిస్తున్న రచన. ఎక్కడా పాఠకుల ఆసక్తిని సడలనీయని రౌచికతతో నానాపాత్రప్రవేశనిష్క్రామకంగా ప్రఖ్యాతోదంతాన్ని మిశ్రబంధంగా మలిచిన తీరు హృదయావర్జకంగా ఉన్నది. వీరికి మనఃపూర్వకాభినందనలు.
- హృదయావి:శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి కృతి. ఇదొక అపూర్వమైన రచన. ఇందులోని కథనఫణితి, శిల్పసంవిధానం రాయప్రోలు వారి రమ్యాలోకాన్ని, మాధురీ దర్శనాన్ని అనుక్షణం తలపింపజేస్తుంటాయి. ఇందులోని ఇతివృత్తం ఇంతకు పూర్వం ఎవ్వరూ ఊహింపనిది. కవితాద్రవ్యాలన్నీ సరికొత్తవి. పదబంధాలు అన్నింటికి అన్నీ నవీనతమాలు. తెలుగులో ఇంతటి గాఢమైన శైలిలో సంఘటితములైన కావ్యాలు ఎంతో అరుదుగా కాని కనుపింపవు. ఒక విధంగా ఇది కవిత్వాన్ని అధికరించిన కవిత్వకావ్యమని చెప్పాలి.
ఏమోలే! మృదులాంతరంగము మృషాహేవాకలోకమ్ములో
నామోదమ్మయి శాంతివల్లరుల నాశాంతమ్ములం దాఁక సు
శ్రీమార్గమ్ములఁ బ్రాఁకఁజేసి తగు వాసిం గాంచునేమో, సుమ
స్తేమమ్ముల్ విలువైననాఁడు పునరుజ్జీవింతురేమో కవుల్.
అన్న శ్రీసూక్తితో పరిపూర్ణమైన ఈ కృతికి పరమార్హతా నిర్ణయపూర్వకంగా ప్రథమ బహుమతిని ప్రకటించాలని డా. అమృతలత – సంచిక కావ్యరచన పోటీ నిర్వాహకులను కోరుతూ, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖావతీర్ణమైన సరస్వతీ వివిధభంగిమలకు సగౌరవంగా ప్రణమిల్లుతున్నాను.
***
ఈ పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన డా. ఏల్చూరి మురళీధరరావు గారికి బహు కృతజ్ఞతలు ధన్యవాదాలు.
బహుమతి విజేత శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారికి పారితోషికం పదివేల రూపాయలు పంపడమైనది.
బహుమతికి ఎంపికైన ‘హృదయావి’ కావ్యాన్ని త్వరలో సంచికలో ప్రచురిస్తాము.
పోటీలో పాల్గొని విజయవంతం చేసిన కవులకు ధన్యవాదాలు, అభినందనలు.
త్వరలో మరొక పోటీని ప్రకటించనున్నాము. కవులు పాల్గొని దానినీ విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాము.
1 Comments
manasa.chamarthi
మిత్రులు రామనాథ్ గారికి హృదయపూర్వక అభినందనలు.
వారు ఈ కావ్యాన్ని ప్రకటించేందుకు అవకాశం ఇచ్చిన ఈ పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు.