1. ఏరా, నా మాయల మరాఠీ!
“బావగారూ… బావగారూ…” అంటూ ఫోన్ లోనే ఏడ్చేస్తున్నాడు రామారావు.
శేషయ్య ఏదో అడగబోయి, మళ్ళీ ఆగారు.
రామారావు రుద్ధకంఠంతో, “బావగారు, తక్షణం రండి… వాడు వేణు.. వేణు… ఇంత అఘాయిత్యం చేస్తాడని…” అంటూనే ఏడ్చేస్తున్నాడు.
“సరే, నేను వస్తున్నాను. ఎక్కడున్నారు?” అడిగి, శేషయ్య వెంటనే బయల్దేరారు.
హాస్పిటల్‌కి చేరేలోపల విషయం తెలుసుకున్నారు శేషయ్య. ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరాడు వేణుగోపాల్. తెలివైనవాడే. కాలేజీలో చాలా సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేవాడు. కొన్ని సబ్జక్టుల్లో కాలేజీలో ఫస్ట్ వచ్చాడు. కంపెనీ మంచిదే కాని, చాలా పెద్దదేమీ కాదు. ఈ మధ్యనే పెళ్ళి కూడా కుదిరింది. కరోనా వచ్చి వుండకపోతే, ఈ పాటికి పెళ్ళి అయిపోయివుండాల్సింది.
కాని అకస్మాత్తుగా చాలా కంపెనీల లాగానే ఈ కంపెనీ కూడా జూనియర్ ఉద్యోగులు చాలామందిని తీసేసింది. ఉద్యోగం పోయినదగ్గర్నుంచి, పెళ్ళి సంబంధం వాళ్ళు ఆ అమ్మాయి వీడితో ఎక్కువ మాట్లాడకుండా కట్టడి చేస్తూ వచ్చారు. పెళ్ళి సంబంధం ఇంచుమించు రద్దయిపోయినట్లే. ఈ సంఘటన ఒక్కసారిగా వేణుని క్రుంగదీసింది.
“అన్నయ్యగారూ, అయిపోయిందండీ, అంతా అయిపోయింది…” రామారావు భార్య రమణి వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోన్ చేసింది. “వస్తున్నానమ్మా. వచ్చేస్తున్నా..”
శేషయ్య వెళ్ళేసరికి, ఆ హాస్పిటల్ గదిలో- వేణు ఒక మంచం మీద నీరసంగా పడుకున్నాడు. ఈయన్ని చూడగానే, డాక్టర్ లేచి నమస్కారం చేశాడు. “ఇప్పుడే తెలివి వచ్చింది సర్. ఇక ప్రాణాపాయం లేదు. మీరు మాట్లాడొచ్చు” అంటూ తన గదికి వెళ్ళాడు. శేషయ్యకి విషయం పూర్తిగా అర్థమైపోయింది. భార్యాభర్తలిద్దరికీ నచ్చజెప్పి, బయటకు పంపించేశారు.
“ఏరా, నా మాయల మరాఠీ ఇలా పడుకున్నావేమిట్రా? ‘బాలనాగమ్మా, ఇక నువ్వు నా సొంతం’.. అంటూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన మాయల మరాఠీ ఏమిటిలా మంచం మీద?..” అంటూ వేణు హైస్కూల్లో వేసిన మాయల మరాఠీ ఏకపాత్రాభినయాన్ని గుర్తుచేసుకుంటున్నారు శేషయ్య.
వేణు అంత నీరసంలోనూ కొంచెం నవ్వాడు. అలా ఉత్సాహం కలిగించే మాటలు చెప్పాక, శేషయ్య ఒక ప్రశ్న వేశారు.
“నువ్వు చిన్నప్పుడు మీ నాన్నకి చెప్పకుండా సినిమాకి వెళ్ళావని, మీ నాన్న చింతబరిక పట్టుకొని వెంటబడితే, భయపడి పారిపోయి మా ఇంటికొచ్చేశావుగదా!”
వేణు అయోమయంగా చూస్తూ, గుర్తుచేసుకుంటూ అన్నాడు “అవును.”
“మరి ఇప్పుడేదిరా ఆ భయం?”
నీరసంగానే నోరు విప్పాడు వేణు.”అది చాలా కాలమయిపోయింది కదా… తాతగారు! మీరు చెబితేనే గుర్తొచ్చింది.”
“నీ కొత్త బొమ్మల రామాయణం పుస్తకం స్కూల్లో ఎవరో కొట్టేశారని – ఎనిమిదేళ్ళప్పుడు – అలిగేసి, రెండు రోజులపాటు ఆపకుండా ఏడ్చావు, తిండి మానేశావు. ఆ బాధ ఇప్పుడేమైందిరా?”
వేణు కొంచెం శక్తి పుంజుకున్నాడు.
“నాకది గుర్తే లేదు. అయినా…. అప్పటి బాధ.. ఇప్పుడెందుకుంటుంది తాతగారు, చాలా కాలం అయిపోతే…!”
“ఇదీ అంతేరా. రేపు గుర్తుండదు…. తెలివైన వాడివి, నీకు ఉద్యోగం ఇవ్వాళ పోయినా రేపు వస్తుంది. పెళ్ళి సంబంధమూ ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది…. కొన్నేళ్ళు గడిచాక ఇవ్వాల్టి విషయాలు చాలా గుర్తుండవు. సాధారణ బాధ కలిగించేవి అసలు గుర్తుండవు. రేపు గుర్తుండని సంఘటనల గురించి మనసు విరిచేసుకొని ఆత్మహత్యకి ప్రయత్నించటం నీలాంటి తెలివైన వాడు చేయాల్సిన పని కాదు… చిన్నప్పుడు నిన్న భయపెట్టిన, బాధపెట్టిన సంఘటనలూ ఏవీ ఇవ్వాళ నిన్ను ఎలా ప్రభావితం చేయలేవో, ఇవ్వాల్టిదీ రేపు అంతే. ..”
వేణులో ఏదో కొత్త ఆలోచన మొలకెత్తుతోంది.
“నీలో ఎంత శక్తి లేకపోతే నువ్వు కాలేజీలో అప్పుడు ఫస్ట్ వచ్చావు! మొదటి ఇంటర్వ్యూలోనే ఎంపికైపోయి ఉద్యోగం సంపాదించావు! సివిల్స్ పరీక్షలకి పనికొచ్చే రత్నంరా నువ్వు….” వేణులో నిబిడీకృతమైన గుణాల్ని శేషయ్య చెబుతూంటే, వేణులో నీరసం మాయమై, ఏదో కొత్త ఉత్సాహం పొంగుకొస్తోంది.
రామారావు, రమణి వుండబట్టలేక లోపలికి వచ్చారు.
“వాడు బాగున్నాడు. మీరు వేణుని ఇంకేమీ ప్రశ్నలు అడక్కండి…” అంటూ శేషయ్య లేచారు.
వేణు కూడా ఉత్సాహంగా లేవబోయాడు. శక్తి చాల్లేదు.
“లేవద్దు. కానీ నీ మనసులో వివేకాన్ని లేపు. ప్రతి బాధకీ పరిష్కారం ఆత్మహత్యే అయితే, ఈ దేశంలో 120 కోట్ల మంది ప్రజలూ ఈపాటికి చాలాసార్లు ఆత్మహత్యలు చేసుకుని వుండాలి… ఆలోచించు.”
వేణు మంచం మీదనుంచే శేషయ్య తాతగారికి నమస్కారం పెట్టేశాడు.
2. రామరాజ్యం చప్పట్లు!
“సార్, ఇక్కడ స్టేడియం దగ్గర మా సర్కారుది ‘ఆదర్శ పాలనా దినోత్సవం’ ఇయ్యాల. ఒక్క పదినిమిషాలు చూసుకుని పోదాం రండి, సార్.” అధికార పార్టీలో కీలకమైన శంకర్ అభ్యర్ధనని శేషయ్య కాదనలేకపోయారు.
కారులో ఎక్కుతూ అడిగారు. “నీకు ఒక బుగ్గ కారు వుండాలి కదా శంకర్!”
“అవును సారు, అది ఓ కార్పొరేషన్ చైర్మన్‌గా వున్నప్పుడిచ్చిన్రు. నాలుగు నెల్లయింది ఆ పోస్టు టరం అయిపోయి…”
“మరి ఆ బంగ్లా ఖాళీ చేసేశావా?”
“ఆర్నెల్ల దాకా వుండొచ్చు సారు. ఈ నడిమధ్యలో పోస్టు ఇంకోటేదన్నా సూద్దామని సి.ఎం చెప్పిండు… మన సర్కారే కద సారూ. ఎవడూ ఖాళీ చేయమని అడగరు.”
స్టేడియంకి వచ్చేశారు.
సభ చాలాసేపట్నుంచి జరిగిపోతోంది. మంత్రిగారు మాట్లాడుతున్నారు. శంకర్‌ని వేదికమీదకి పిల్చారు. శంకర్, శేషయ్యగారిని మొహమాటపెట్టి తనతోపాటు వేదికపైకి తీసుకువెళ్ళాడు.
“…అలాంటి రామ రాజ్యం తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రిగారు తపిస్తున్నారు. కాబట్టి మన పాలనకు ఆదర్శం రామరాజ్యం…” అంటూ మంత్రిగారు ముగించారు.
శంకర్ గారిని ప్రసంగించమన్నారు.
“….గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం శానా గొప్పది. రామరాజ్యం అసుమంటి మాట ఇంటేనే మనసు పొంగిపోతంది… ఆకలి సావులు వుండని పాలన రామరాజ్యం. బిమార్ అయితే మంచి దవాఖానా అందుబాటులో వుండాల. అది రామరాజ్యం… లేడీస్‌కి మస్తు గౌరవం వుంటే అది రామరాజ్యం…” ఇలా ఆవేశ పూరితంగా సాగింది శంకర్ ప్రసంగం. కరతాళధ్వనులు బాగా మోగాయి.
శంకర్ తన ప్రసంగం ముగించేముందు, అధ్యక్షుడి అనుమతితో ఒక ప్రకటన చేశాడు.
“నాకు గురువుగారి లెక్క ఈ శేషయ్య సారు. గొప్ప గ్నాని. వారిని వారి సందేశం ఇనిపించవల్సిందిగా కోరతన్నా.”
శేషయ్యగారిని బాగా మొహమాటపెట్టాడు శంకర్. శేషయ్య లేచారు.
“నాకు చాలా సంతోషంగా వుంది – ఈ ప్రభుత్వం రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలనుకోవటం. (చప్పట్లు) ఒక లెక్క ప్రకారం రామాయణం జరిగి రెండున్నర లక్షల సంవత్సరాలైంది. ఇప్పటికీ రాముణ్ణి తలుచుకునే పాలకులు వున్నారంటే మనం అభినందించి తీరాలి (చప్పట్లు)… మా శంకర్ ఇంతకు ముందు రామరాజ్య పాలన అంటే ఏమిటో చెప్పాడు. (చప్పట్లు. శంకర్ మొహం వెలిగిపోయింది. జనానికి నమస్కారాలు పెట్టేశాడు.) ఈ రోజుల్లో కూడా ఇలా అలోచించేవాళ్ళు వుండటం ఎంత గొప్ప విషయం! (చప్పట్లు మార్మోగిపోతున్నాయి)… అయితే, రాముడు పాటించిన కొన్ని చిన్న చిన్న విషయాలు మనం పాటించలేం..”
శంకర్, మంత్రిగారు అభ్యంతరపెట్టారు.
“ఎంత చిన్న విషయమైనా పాటించగలం సార్…అవేమిటో చెప్పండి..”
శేషయ్య కొంచెం సంకోచించారు. మంత్రిగారి ఊపు చూసి జనం కూడా అరిచారు. “చెప్పాలి, చెప్పాలి..”
శేషయ్య చెప్పేశారు.
“సరే, ఇంత గట్టిగా అడిగారు కాబట్టి చెబుతున్నాను… రాముడు తండ్రి కోరికని కైకేయి ద్వారా విన్న వెంటనే, ‘సరే, ఇప్పుడే వనవాసానికి వెళ్తాను’ అన్నాడు. లక్ష్మణుడ్ని పిలిచి ఇలా అన్నాడు: (శ్లోకం) ‘ఏభిరైవ ఘటైః సర్వైః అభిషేచన సంభృతైః, మమ లక్ష్మణ! తాపస్యే వ్రతస్నానం భవిష్యతి… నా యువరాజ పట్టాభిషేకం కోసం ఎక్కడెక్కడ్నుంచో కలశాలతో పుణ్య తీర్థాల జలాలు తెప్పించారు కదా! వనాల్లో తపస్సుకి వెళ్తున్నాను కనుక ఆ జలాలు నా తపోదీక్ష స్నానానికి ఉపయోగపడతాయి. వాటితో పవిత్ర స్నానం చేసి బయల్దేరతాను.’ … వెంటనే మళ్లీ లక్ష్మణుణ్ణి వారించాడు. ‘వద్దు, వద్దు లక్ష్మణా…. (శ్లోకం) అధవా కిం మమైతేన రాజ్యద్రవ్యమయేన తు, ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి… అన్నట్లు, ఎక్కడెక్కడి పుణ్యతీర్థాలనుంచో ఈ కలశాల్లో జలాలు తెప్పించటం కోసం రాజద్రవ్యాన్ని (ప్రభుత్వ ధనాన్ని) ఖర్చుపెట్టారు కదా! ఆ నీళ్లు వద్దులే. నేనే మన బావుల్లోంచి స్వయంగా తోడి పోసుకుంటా!’ … రాజ్యాధికారాన్ని కోల్పోతే, రాముడు అలా అన్నాడు. పదవులు పోయినా మనం బంగ్లాలు పట్టుకొని వ్రేళ్ళాడుతున్నాం. మరి రాముడు పాటించినలాంటి ‘చిన్న’ విషయాల్ని మనం పాటించగలమా! పాటిస్తే, అది కదా నిజమైన రామరాజ్యం …”
చప్పట్లు మోత మోగిపోయాయి. శంకర్, మంత్రిగారు, ఇంకా ఇతర అతిథులు కూడా చప్పట్లు కొట్టక తప్పలేదు!
వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు.
‘జుగల్బందీ ‘ (అద్వానీ-వాజపేయిల బంధం), ‘నిప్పులాంటి నిజం’ (రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు), ‘నరసింహుడు’ (పి.వి. నరసింహారావు సమగ్ర జీవిత కథ), ‘రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల…’ (ప్రజా జీవితాలపై ఆర్.బి.ఐ ప్రభావం) వీరి అనువాద రచనలు.
శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి – ‘నాహం కర్తా, హరిః కర్తా’; ‘తిరుమల లీలామృతం’, ‘తిరుమల చరితామృతం’, ‘అసలేం జరిగిందంటే …!’ – పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు.
‘ఇదీ యదార్థ మహాభారతం’ (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు) లిఖితరూపం ఇచ్చారు.
‘అయినా నేను ఓడిపోలేదు ‘ (జ్యోతిరెడ్డి ఆత్మకథ), ‘వైఎస్సార్ ఛాయలో … (సి.ఎం మీడియా సలహాదారుగా స్వీయ అనుభవాలు), ‘వాల్మీకి రామాయణం ‘ (పిల్లల కోసం 108 తైల వర్ణ చిత్రాలతో ఎమెస్కో ప్రచురణ) వీరి ఇతర రచనలు.