[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]


పరిచయం:
మనిషి ఓ బాటసారి
‘ఆద్మీ ముసాఫిర్ హై, ఆతా హై జాతా హై, ఆతే జాతే, రస్తే మే యాదేఁ ఛోడ్ జాతా హై’
– ‘అప్నాపన్’ చిత్రం నుండి
మా నాన్న స్వర్గీయ ఆనంద్ బక్షి జీవిత చరిత్ర రాయమని 2012లోనే – మొదట ఆయన అభిమానులు, నా కుటుంబం, సన్నిహితులు, నా మొదటి ప్రచురణకర్త శంతను రే చౌదరి నన్ను ప్రోత్సహించారు. 2002 నుండి నాన్న గురించి పుస్తకాన్ని తయారు చేస్తున్నానని, దానిలో సుమారు 150 పేజీలు ఉన్నాయని, నా పేరు మీద ఏదైనా పుస్తకం ప్రచురితమయ్యాకా లేదా ఏదైనా సినిమా వచ్చిన తర్వాతే నేను నాన్న జీవిత చరిత్ర అతనికి పంపగలనని శంతనుతో చెప్పాను. ఎందుకంటే నాన్న నాతో, “నేను వెళ్లిపోయిన తర్వాత, మొదట నీదంటూ ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా సాధించే వరకు – నా పేరు మీద ఏదీ చెయ్యకు” అని చెప్పారు. నా స్వంతంగా ఏదైనా సృష్టించడానికి నాకు యాభై సంవత్సరాలు పట్టింది. రచయితగా నా మొదటి పుస్తకం, ‘డైరెక్టర్స్ డైరీస్: ది రోడ్ టు దెయిర్ ఫస్ట్ ఫిల్మ్’, 2015లో ప్రచురించబడింది. ఆ తర్వాతే నేను ఈ జీవిత చరిత్ర కోసం ప్రచురణకర్తకై వెతకడం ప్రారంభించాను, ఎట్టకేలకు, నాన్న జీవిత చరిత్ర పెంగ్విన్ రాండమ్ హౌస్ వారి ద్వారా వెలుగు చూసింది.
2002 నుండి నేను వ్రాస్తున్న దానిని ఒక ‘పుస్తకం’గా రూపొందించాలని దాదాపు ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే ఆలోచించటం ప్రారంభించాను. దానికి ముందు, నాన్న మీద పుస్తకం రాయాలంటే, నేను నాన్నకి చాలా సన్నిహితుడిని కాబట్టి నేను రాయబోయే పుస్తకం తండ్రి-పూజలా ఉండచ్చనీ భావించాను. అయితే నా అభిప్రాయం తప్పు. ఈ పుస్తకం రాయడం వల్ల నాకు లభించిన అతిపెద్ద బహుమతి ఏమిటంటే నేను నా తోబుట్టువులకు దగ్గరవడం; వారిని తేలికగా తీసుకోవడం మానేశాను, ఎందుకంటే అమ్మానాన్నలకు – నాన్న పాటల కన్నా – మేం నలుగురం ఎంతో ముఖ్యమని గ్రహించాను, ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకున్నాను. నాన్న జీవించి ఉండగా, మాకన్నా ఆయనకి పాటలే ముఖ్యమని కొన్నిసార్లు అనుకునేవాడిని, ఈ దురభిప్రాయం – నేను బాల్యంలోనూ, టీనేజ్లోనూ నాన్న నుండి దూరం జరిగేలా చేసింది. కానీ ఈ పుస్తకం రాయడానికి మరింత పరిశోధన చేసినప్పుడు ఆ అభిప్రాయం తప్పని నిరూపితమైంది. ఈ పుస్తకం రాసిన గత దశాబ్దంలో, నేను మళ్ళీ నాన్నతో ప్రేమలో పడ్డాను.
నాన్న అభిమానులు చాలామంది నాకు అప్పుడప్పుడు గుర్తు చేసే ఆయన స్ఫూర్తిదాయక, వినోదాత్మక, ప్రాసంగిక గీతాలూ, ఆయన కీర్తి మాత్రమే మా కుటుంబపు నిజమైన వారసత్వం కాదనీ; 1947లో దేశ విభజన రాజకీయాల వల్ల ఆయనా, ఆయన కుటుంబం, ఇంకా లక్షలాది మంది ఇతరులు కోల్పోయినది కూడా మా వారసత్వమేనని ఈ పుస్తకంపై పని చేస్తున్నప్పుడు నేను గ్రహించాను, అంతేకాకుండా, మా నిజమైన వారసత్వం ఆయన సహిష్ణుత, దృఢత్వమని అర్థం చేసుకున్నాను. తన కోసం మాత్రమే కాకుండా తన కుటుంబం కోసం కూడా జీవితాన్ని నిర్మించడంలో నాన్న చేసిన కృషి గొప్పది. తన కలం మొనని, తన సాహిత్యాన్ని, తన పర్సనల్ డైరీలను చూసుకున్నంత జాగ్రత్తగా, నాన్న ఎల్లప్పుడూ మాపై దృష్టి నిలిపారు. ఈ పుస్తకంలోని మా వ్యక్తిగత, కుటుంబ సమాచారం చాలామటుకు ఆయన జాగ్రత్తగా వ్రాసుకున్న వ్యక్తిగత డైరీల నుంచే తీసుకున్నాను.
అయితే, మనం కాలంలోకి వెనక్కి వెళ్ళే ముందు, నంద్ అని ముద్దుగా పిలవబడిన ఆనంద్ బక్షి పుట్టుకకు వెళ్లే ముందు – ఓ విషయం స్పష్టం చేస్తున్నాను – నేను హిందీ సినిమా పాటలపై లేదా ఆనంద్ బక్షి గీతాలపై నిపుణుడిని కాదు. తన తండ్రి జీవనయానం గురించి పుస్తకం రాస్తున్న కొడుకుని నేను. ఆయన జీవిత పథం గురించి నాకు తెలిసిన అతి తక్కువ వివరాలు కూడా ఆయన సాహిత్యం ద్వారా గ్రహించినవే. ఈ పుస్తకంలో ప్రస్తావించిన అన్ని సంఘటనలు నాకు ప్రత్యక్షంగా తెలియవు, నేను కొన్నేళ్ళుగా కలిసిన వందలాది మంది నాన్న అభిమానుల నుండి వీటిలో కొన్నింటిని సేకరించాను. నేను నాలుగు దశాబ్దాలుగా నాన్న నుండి, మా కుటుంబం నుంచి, బంధువుల నుండి విన్నవి కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఉత్తమ పురుషలో చెప్పిన చాలా వివరాలు నాన్న జర్నల్స్/డైరీల నుండి నేను తీసుకున్న నోట్స్ నుండి వచ్చినవే, ఎందుకంటే నేను ఈ జ్ఞాపకాలకు ప్రామాణికత కల్పించాలనుకుంటున్నాను. వీలైనంత వరకూ, ఆయన కథని ఆయనే స్వయంగా చెప్తున్నట్లుగా – వినిపించాలనుకుంటున్నాను.
కాబట్టి మీ నుంచి, అంటే – పాఠకులు, అభిమానులు, నాన్న గురించి రాసిన/చూపిన విలేఖరులు, లేదా నాన్న పాటలు తెలిసినవారి నుంచి, వాళ్ళకి తెలిసి – నాకు తెలియకపోవడం వల్ల ఈ పుస్తకంలో చేర్చలేని ఏవైనా వృత్తాంతాల కోసం, సూచనల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ ఎడిషన్ను మెరుగుపరచడానికి మీరిచ్చే సూచనలను ఆధారం చేసుకుని, పుస్తకం తదుపరి ముద్రణలో మీ విలువైన సూచనలను పంచుకుంటాము. ఆనంద్ బక్షికి న్యాయం చేయడానికి ఇది మా మొదటి ప్రయత్నం.
ఈ పుస్తకం రాయడం ద్వారా నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠాలలో ఒకటి, నా కుటుంబాన్ని అన్నిటికన్నా విలువైనదిగా భావించడం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో మిమ్మల్ని నమ్మే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నా – ఆ వ్యక్తి మీరే అయినా – మీరు మీ కలను, మీ లక్ష్యాన్ని, మీ ఆశయాన్ని సాధించగలరని గ్రహించడం.
చిన్నప్పుడు అన్నయ్య గోగి, నేనూ – నాన్న నుండి నేర్చుకున్న పెద్ద పాఠం ఏమిటంటే, పరిస్థితి లేదా పరిణామం ఏదైనా సరే, మనం ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి, ఎవరినీ మోసం చేయకూడదనేది. అవును, మీ కలలు ముఖ్యమైనవి, జీవనోపాధి కోసం మీరు చేసేది చేయడం ముఖ్యం. మీరు దానిలో విజయం సాధించవచ్చు లేదా విజయవంతం కాకపోవచ్చు. అయితే, ముఖ్యంగా మీరు మీ జీవితపు రజత యుగం లేదా స్వర్ణ యుగానికి దగ్గరగా వచ్చినప్పుడు, మీరు ఎలాంటి మనిషిగా మారారన్నది అత్యంత కీలకం. విజయం సాధించనప్పుడో లేదా వైఫల్యాలను అనుభవిస్తున్నప్పుడో మీరెలా నడుచుకున్నారన్నదే ముఖ్యం!
స్టే ఇన్స్పైర్డ్. షుక్రియా, ఖుషామదీద్, హ్యాపీ రీడింగ్.
(మళ్ళీ కలుద్దాం)

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.