[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]


సర్వ కారణ కారణమ్
ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానందవిగ్రహః।
అనాదిరాదిర్గోవిందః సర్వకారణకారణమ్॥
(బ్రహ్మ సంహిత)
గోవిందుడు అని భక్తులచే ఆర్తిగా పిలువబడే శ్రీకృష్ణుడు సాక్షాత్ ఈశ్వరుడు. పరమాత్మ. అందరికీ మూలకారణమైన వాడు. ఆయన సత్ చిత్ ఆనంద విగ్రహుడు. ఆయనకు వేరే మూలం లేదు. ఆయన అన్ని కారణాలకు ప్రధాన కారణమైనవాడు. అన్ని హేతువుల వెనుక ఉన్న హేతువు కూడా ఆయనే. ఆయనకు హేతువన్నది లేదు.
మనకు సగుణ సాక్షాత్కారంగా నిలిచి ఆనందం కలిగించేవాడు ఆయనే. నిర్గుణ నిరాకార పరబ్రహ్మము కూడా ఆయనే.
ద్వైత వ్యాఖ్యానంలో సత్యసంధ తీర్థుల వారు ఇలా చెప్తారు.
॥ఈశేభ్యో – బ్రహ్మాదిభ్యో, వరః – ఈశ్వరః॥ – బ్రహ్మరుద్రుల కంటే శ్రేష్ఠుడు.
॥అస్య స్త్రీ ఈ – లక్ష్మీః, శ్వా- వాయుః। ఈశ్వభ్యాం రాజత ఇతి వా॥ – ఈ + శ్వ + రః – ఈ అంటే లక్ష్మీదేవి. గతంలో చెప్పుకున్నాము. ఈ(0/మ్) అనేది శక్తి బీజం. శ్రీమహావిష్ణువు శక్తి క్షేత్రం లక్ష్మీదేవి అని తెలుసుకున్నాము. కనుక ఈ అంటే లక్ష్మీదేవి. శ్వా అనగా వాయువు. ఋగ్వేదం ప్రకారం. లక్ష్మీదేవితోను, వాయువుతోను ప్రకాశించివాడు.
పవిత్రమైనవాటిలో నేను వాయువును అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో తెలిపాడు. అంటే విష్ణువు – లక్ష్మీవాన్, పవిత్రుడు.
అంటే సమస్త ఐశ్వర్యమునకు అధిపతి కావటమే కాకుండా అత్యంత పవిత్రమైన వాడు కూడా.
॥పవనః పవతామస్మి॥ – పవిత్రమైన వాటిలో, పవిత్రమొనర్చు వాటిలో నేను వాయువును.
పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది.
- ఏనుగు యొక్క కుంభస్థలం,
- గోపృష్ఠం,
- తామరపువ్వు (కారణాలు విస్తారంగా చూశాము)
- బిల్వదళం,
- స్త్రీయొక్క సీమంతము (నుదుటి భాగము)
ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును (గజముఖుని), గో పృష్ఠమును పూజించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.
లక్ష్మీ సర్వ సంపదలకీ అధిష్ఠాతృ దేవత.
- ఇంద్రియ నిగ్రహం
- శాంతం
- సుశీలత్వం
వంటి సుగుణాలకు ఆధారమైన సర్వ మంగళ రూపం లక్ష్మీదేవిది. కనుక మనం ఈ లక్షణాలను కలిగి ఉంటే ఈశ్వరుడు మనతో ఉంటాడు. ఈ అయిన లక్ష్మి కూడా మనతో ఉంటుంది. పైగా అమ్మ నిత్యానపాయని.
- లోభం
- మోహం
- రోషం
- మదం
- అహంకారం
వంటి గుణములు లేని చల్లని చల్లని తల్లి ఆమె. సర్వ సస్యాలు ఆమె రూపాలే. అందుకే మనం కూడా ఆ లక్షణాలను వీలైనంత దూరంలో పెట్టాలి.
వైకుంఠంలో మహాలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, రాజ్యంలో రాజ్యలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి అంటూ సర్వ ప్రాణులలో, ద్రవ్యాలలో మనోహరమైన శోభ లక్ష్మీ రూపమే. లక్ష్మీదేవి అన్నిచోట్ల ఉండే దయారూపిణి.
కొందరు పెద్దలు చెప్పగా విన్నవి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మనం పాటించవలసినవి. కాలానుగుణమైన మార్పులు అవసరమని భగవద్రామానుజులు చెప్పిన మాటలను గ్రహించి, ఈ నియమాలను మనం అన్వయించుకోవాలి.
- ఇంట్లో ఎప్పుడూ పసుపు, ఉప్పు అయిపోవడమనే ప్రసక్తి ఉండకూడదు. అయిపోయేంతవరకూ వాటిని వినియోగిస్తూ ఉండవద్దు. పసుపు, ఉప్పు ఇక అయిపోతున్నాయనుకుంటే.. కొత్త సరుకు తీసుకొచ్చి వాటికి జోడించాలి. అలాగే, ప్రతీ ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం కొలిచే కొలపాత్ర ఉంటుంది. దాన్ని ఎప్పుడూ బోర్లించి ఉండకూడదు.
- విడిచిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది. విడిచిన దుస్తులను తలుపులకు తగిలించరాదు. అలాగే తువ్వాళ్ళను తలుపుల మీద, నట్టింట ఉంచకూడదు.
- సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసం ముట్టుకోవద్దు. పాలు తీసుకోవాలి. ఇంట్లో వండుకున్న ఆహారము అని అన్వయించుకోవాలి. కేవల శాకాహారము అని కాదు.
- సూర్యోదయం కన్నా ముందే ఇంటిని శుభ్రపరిచి, తలస్నానం చేసి ఇంట్లోని పూజ గదిలో దీపాలు వెలిగించాలి. సూర్యోదయాత్ పూర్వం లేవటమన్నది ఆరోగ్యానికి కూడా చాలామంచిది.
- రాత్రి వేళ భోజనం తర్వాత గిన్నెలను ఖాళీగా ఉంచకూడదు. అన్న పాత్రల్లో కాస్తయినా అన్నాన్ని ఉంచాలి. అలా ఉంచడం ద్వారా పితృ దేవతల అనుగ్రహం లభిస్తుంది. పితృ దేవతల అనుగ్రహం ఉన్న కుటుంబాలు సౌభాగ్యంతో అలరారుతాయి.
- తప్పనిసరిగా నుదుట కుంకుమ ధరించాలి. మిగతావారాల్లో కుంకుమ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కనీసం శుక్రవారం నాడు అయినా ఇది తప్పనిసరి. కుంకమ ధరించడం ద్వారా వివాహిత స్త్రీలకు కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది.
- కుంకమకు బదులు ఇతరములు పెట్టుకోవద్దు. కుంకమ మాత్రమే ధరించాలి. తద్వారా రజోగుణమైన శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. పరిస్థితిని బట్టీ అని అన్వయించుకోవాలి.
- శుక్రుడికి తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి. అలాగే లక్ష్మీదేవికి కూడా తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి. కాబట్టి తెల్లని దుస్తులు ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు. తెల్లని అంటే స్వచ్ఛమైన అని కూడా అన్వయం. శుచి, శుభ్రత ప్రధానం.
- వీలైతే తామరలు, పద్మములతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. అలాగే, అన్నదానం, వస్త్రదానం, పుష్ప దానం చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి.
- వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించడం మంచిది. ఆ సమయంలో ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దు. తద్వారా ఆ ఇంట్లో ధన సమృద్ధి కలిగే అవకాశం ఉంటుంది.
ఇక్కడ ప్రత్యేకించి ఈశ్వరః అనే నామము ఆయన ఈశత్వాన్ని మాత్రమే కాకుండా, పవిత్రతను కూడా తెలియజేస్తుంది. సకల జీవరాశులను పవిత్రమొనరించగలవాడు. పుండరీకాక్షుడు.
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోஉపివా।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః॥
పుండరీకాక్ష। పుండరీకాక్ష। పుండరీకాక్షాయ నమః।
ఈ మంత్రం తెలుసు కదా. కేవలం ఈశ్వరుడు మాత్రమే అన్నిటినీ పవిత్రమొనరించగలడు. ఆయన అనుగ్రహం ఉన్నచోట లక్ష్మి కొలువై ఉంటుంది.
ఇక శంకర భాష్యాన్ని చూద్దాము.
సర్వశక్తి సంపన్నుడైనందున భగవానుడు ఈశ్వరః అని పిలువబడుతున్నాడు. ఆయన అపారశక్తివంతుడు. మానవుని దేహచేష్టల ద్వారా వ్యక్తమైన క్రియాశక్తి, ఇచ్ఛామాత్రముచే మనోసంకల్పాల ద్వారా వెలువడు ఇచ్ఛాశక్తి, విజ్ఞానముచే బుద్ధిలో నిర్ణయాల ద్వారా తొంగి చూడు జ్ఞానశక్తి.
అంతా భగవానుని శక్తిసాగరము నుంచీ కదలిన తరంగములేయని గుర్తించాలి. క్షీరసాగరం. స్వచ్ఛమైన శక్తి తరంగములు. అత్యంత పవిత్రమైనవి.
అందుచేతనే జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు ఈశ్వరః అని పిలువబడినాడు.
ఇది 74వ నామము. గడచిన 73 నామములలో శివునికి ప్రధానంగా, లేదా శివునికి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న నామములు నాలుగు వచ్చాయి (ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పింది శ్రీ సుందర చైతన్యానంద. నాలుగు నామములు వచ్చాయి అన్న విషయం).
ఈశ్వరః అనేది శ్రీహరికి మాత్రమే ఒప్పు నామమని బ్రహ్మ సంహిత ద్వారా తెలుస్తున్నా, జనబాహుళ్యంలో శంకరునికి కూడా ప్రాచుర్యంలో ఉన్నది. విచిత్రంగా చూడండి.
ఇది 74వ నామము (శంకర భాష్యము/పరాశర భట్టర్ భాష్యము ప్రకారం).
7+4 = 11.
శివ సంబంధంగా ప్రాచుర్యంలో ఉన్న నామములు ఇప్పటికి ఐదు అయ్యాయి.
పంచాక్షరీ.
ఓంకారము జతకూడని పంచాక్షరి.
అష్టాక్షరి ఓంకారము కలిసే ఉన్నది.
అందుకే ప్రణవ సమానమైన రామనామమును నిరంతరము శివుడు జపించేది.
విచిత్రంగా పక్కనే ధన్వంతరి అనే శ్రీరాముని సూచించు నామము, ఆయన విక్రమమును సూచించు విక్రమ్ అనే నామములు కూడా అమరాయి.
శివకేశవ అభేదము. భేదము. ఇవన్నీ మానవులు కల్పించుకున్నవి.
ఉన్నది ఒకే పరమాత్మ. ఆయన నిరాకార విష్ణువు. సాకార శ్రీమహావిష్ణువు.
ఆయన నుండి జనించి సృష్టి చేయువాడు బ్రహ్మ. అదే.. పితామహుడు. ఆయన నుంచీ ఉద్భవించి భూమిపై వశించు భగవత్ స్వరూపము శివుడు/శంకరుడు.
ఆ పరమాత్మను శివుడనుకునే వారు శైవులు. విష్ణువు అనుకునేవారు వైష్ణవులు.
అన్నానా, అంతటా ఆ శక్తే అనుకుంటే ఎవరైనా ఒకటే.
ఏదైనా, ఇక్కడ ఈశ్వరః అనే నామము సూచించేది అత్యంత పవిత్రమైన భగవచ్ఛక్తి. వేరొక అధిపతి లేని వాడు.
ఈ ఈశ్వరః అను నామమును గురించి పరాశర భట్టర్ ఎలా వ్యాఖ్యానించారో, ఏక్నాథ్ ఈశ్వరన్ ఏమని చెప్పారో, మరిన్ని వివరాలు చూద్దాము.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ?
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య