“మరి నేను ఇంటికి వెళ్తానురా!” అన్నాడు అరవై ఐదేళ్ల మూర్తి, తన మిత్రుడు రాజారావుతో.
ఐదు సంవత్సరాలుగా, ప్రతీరోజూ సాయంత్రం ఆ పార్కుకి వచ్చి, కాసేపు నడవడం ఆ మిత్రుల దినచర్యలో ఒక భాగం.
“ఒరే, నాకైతే ఇంట్లో ఎదురుచూసే మా ఆవిడ ఉంది. నీకు అటువంటి బాదరబందీ ఏమీ లేదు కదా? ఎందుకు అంత హడావుడి?” అడిగాడు రాజారావు, పక్కనే ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చొని.
“అబ్బే ఏం లేదురా! మూడు రోజుల్లో ఓ కథ రాసి పోటీకి పంపించాలి. ఈ రోజే మొదలెడదామని” మిత్రునికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు, తరచుగా పత్రికలలో కథలు రాసే మూర్తి.
ఐదు సంవత్సరాల క్రితం తన మిత్రుడు రాజారావును కలిసిన ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ నడుస్తున్నాడు మూర్తి.
***
ఆ రోజు, తమ పక్క వీధిలో ఉన్న గుడిలో జరుగుతున్న ప్రవచనాలు వినడానికి బయలుదేరాడు మూర్తి. కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరుతూంటే,
“నువ్వు లక్ష్మణమూర్తివి కదూ? జగన్నాధగిరిలో మనం పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. నేను జ్ఞాపకం ఉన్నానా?” అడిగాడు ఓ అపరిచిత వ్యక్తి.
కాసేపు అతడిని పరకాయించి చూసి, “ఔను, గుర్తు వచ్చింది నువ్వు వీర్రాజు గారి అబ్బాయి రాజారావువి కదూ? నలభై ఏళ్లు అయ్యిందేమో మనం కలిసి” అంటూ అతడిని గుర్తుపట్టేడు మూర్తి.
“ఔనురా, రాజారావునే. నలభై కాదు ఇంకా పైమాటే. సరే ఇప్పుడు చెప్పు. ఎక్కడ ఉంటున్నావు? పిల్లలు ఏం చేస్తున్నారు?” ప్రశ్నల వర్షం కురిపించాడు.
“ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడే స్థిరపడ్డాను. ఈ గుడి వెనకాల వీధిలోనే నివాసం. ఒక్కడే కొడుకు. కానీ, ఐదేళ్ల వయసులోనే తప్పిపోయాడు, ఒక పెళ్లి వేడుకలో. వాడి మీద బెంగతో ఓ పదేళ్ల తరువాత మా ఆవిడ కూడా కన్నుమూసింది. ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఒంటరి జీవితమే. సరే మరి నీ విషయాలు చెప్పు?” ఆసక్తిగా అడిగాడు మూర్తి.
“నేనూ అంతేరా! రిటైర్ అయ్యాను. ఇక్కడే స్థిరపడ్డాను. అదిగో ఆ ముందు వీధిలో ఉన్న అపార్ట్మెంట్లో నివాసం. ఒక్కడే కొడుకు. చదువులు కోసం అమెరికా వెళ్లి, అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉండిపోయాడు. మా మధ్య చాలా ఏళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు లాంటివి ఏమీ లేవు. మా ఆవిడకేమో వాడి మీద బెంగ. మీ వాడు తప్పిపోయాడు. మా వాడు కట్టుతప్పిపోయాడు, అంతే తేడా” బాధపడుతూ చెప్పాడు రాజారావు.
ఐదేళ్ల క్రితం అలా మళ్ళీ మొదలైన వారి స్నేహబంధం ఇద్దరి అభిప్రాయాలూ ఒకేలా ఉండడంతో ఎటువంటి ఆటంకం లేకుండా హాయిగా కొనసాగుతోంది.
గత స్మృతులను మననం చేసుకుంటూ ఇంటికి చేరాడు మూర్తి.
రాత్రి భోజనం తర్వాత కథ రాద్దామని కూర్చున్న మూర్తికి మనసు బాగాలేక, ఆ ప్రయత్నం విరమించి నిద్రకు ఉపక్రమించాడు.
మర్నాడు ఉదయం పాల కోసం, బయటకు వచ్చిన మూర్తికి, “సార్, నేను బిచ్చగాడిని కాను. ట్రైన్లో వస్తూంటే ఎవరో నా డబ్బులు కొట్టెసారు. రెండు రోజుల నుండి తిండి లేదు” అని దీనంగా వేడుకుంటున్న సుమారు ఓ నలభై ఏళ్ల అంధ వ్యక్తి ఎదురు పడ్డాడు. ఎందుకో అతడిని చూడగానే ఒక్క సారి పేగుబంధం లాగినట్టయ్యింది మూర్తికి. వెంటనే అతడిని తన ఇంటికి తీసుకుని వచ్చి, సపర్యలు చేసి, టిఫిన్ పెట్టి,
“బాబూ! నువ్వు చూస్తే బతికి చెడ్డవాడిలా ఉన్నావు. ఇంతకీ ఎవరు నువ్వు?” కళావిహీనంగా ఉండి శూన్యంలోకి చూస్తున్నట్టున్న అతని కళ్లు వైపు చూస్తూ అడిగాడు మూర్తి.
“మీరన్నది నిజమే సార్. కానీ ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను. శారీరకంగా, మానసికంగా కూడా బాగా అలసిపోయాను సార్. మీరెవరో పుణ్యాత్ముల్లా ఉన్నారు, కొంచెం అనుమతిస్తే ఇలా పడుకుంటాను” అంటూ నేలమీద పడుకోబోయేడు.
“అయ్యో అయ్యో, నువ్వు నా బిడ్డలాంటి వాడివి. ఇలా పడుకో” అంటూ అతడిని పట్టుకుని నెమ్మదిగా మంచం మీదకి చేర్చాడు మూర్తి.
“ఏరా! కవీ, ఈవినింగ్ వాక్ కి ఇంకా రెడీ కాలేదా?” అంటూ వచ్చాడు రాజారావు.
“ఈ రోజు రాలేనురా! ఇలా కూర్చో. నీతో మాట్లాడేది ఉంది” అంటూ పొద్దుట నుంచి జరిగిన అన్ని విషయాలు పక్క గదిలోకి వినబడకుండా నెమ్మదిగా చెప్పాడు మూర్తి.
“అయితే ఆ వ్యక్తి చిన్నతనంలో తప్పిపోయిన మీ అబ్బాయంటావ్! అంతేనా?” అనుమానంగా అన్నాడు రాజారావు.
“లేదురా! ఇతను మా అబ్బాయి కాదు. అసలు ఏ మాత్రం పోలికలు లేవు. అంతే కాదు ఈ అబ్బాయి ఇంతవరకూ తన విషయాలు కూడా ఏమీ చెప్పలేదు. పాపం పొద్దుటినుంచీ అలా పడుకునే ఉన్నాడు” బాధపడుతూ చెప్పాడు మూర్తి.
“అయ్యో, అలాగా! సరే అతడు లేచిన తరువాత అడిగి అప్పుడు ఆలోచిద్దాంలే” అంటూ ఇతర విషయాలు చెప్పడం మొదలెట్టాడు రాజారావు.
ఓ అరగంట తరువాత, “సార్! నేనింక బయలుదేరుతా! మీ సహాయం మరవలేను” అంటూ కర్ర సాయంతో గదిలోంచి వస్తున్న అతడిని చూసి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు ఆ మిత్రులిద్దరూ.
“ఎక్కడికి వెళ్తావు బాబూ! నీకు ఉదయం చెప్పానుగా, నాకు ఎవరూ లేరని. నీలో నా తప్పిపోయిన కొడుకును చూసుకుంటా. నా మాట విను” అంటూ అతడిని సముదాయించి, కుర్చీలో కూర్చోపెట్టాడు మూర్తి.
“సరే కానీ ఇంతకీ నువ్వు ఎవరు? నీ పేరు ఏమిటి ? ఎక్కడ నుంచి వచ్చావు?” ఆతృతగా అడిగాడు రాజారావు.
“సార్. నన్ను బాబు అని పిలవండి చాలు. నా గురించి చెప్పడానికి నాదేమీ గొప్ప చరిత్ర కాదు. వింటే మీరే అసహ్యించుకుంటారు. మీరు మంచివాళ్లలా ఉన్నారు. అన్ని సార్లు అడుగుతున్నారు కాబట్టి, అంతే కాక చేసిన పాపం చెబితే పోతుందని చెబుతున్నాను” అంటూ చెప్పసాగాడు బాబు.
“తల్లిదండ్రులకు ఒక్కడినే కుమారుడు కావడంతో నన్ను చాలా గారాబంగా పెంచారు. అయితే నేను దానిని సద్వినియోగం చేసుకోలేక పెడదోవ పట్టి, చెడు స్నేహాలు మరిగి అన్ని వ్యసనాలకు బానిస అయ్యాను. ఆ రోజుల్లోనే మా ఊర్లో అల్లరి చిల్లరిగా తిరిగి చెడ్డవాడిలా పేరుబడ్డాను. అందరితోనూ తగాదాలు పెట్టుకుని కన్నవారికి తలనొప్పులు తెచ్చిపెట్టాను. తల్లి తండ్రులు మందలించినా నేను మారలేదు సరికదా, నాకు డబ్బులు అందకుండా చేయడంతో, వారిపై కక్ష కట్టి, ఓ రోజు…” అంటూ కళ్లవెంట కారుతున్న కన్నీటిని తుడుచుకోసాగాడు బాబు.
“బాధపడకు బాబూ! ఆ రోజు ఏం జరిగిందో చెప్పు” అతడిని సముదాయించాడు మూర్తి.
“ఆ రోజు, ఓ ప్రైవేటు కంపెనీలో ఎంతో నమ్మకంగా కేషియర్గా పనిచేస్తున్న నాన్నగారు, సిబ్బంది జీతాల కోసం ఐదు లక్షల రూపాయల నగదు బేంక్ నుంచి తీసుకుని, భోజనం చేయడం కోసం ఇంటికి వచ్చారు. అంతే ఆ డబ్బు తీసుకుని నేను బొంబాయి పారిపోయాను. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక పెద్ద దాదా వద్ద సహాయకునిగా చేరి, తర్వాత స్వయంగా ఓ చిన్న గ్రూపు ఏర్పరుచుకుని రహస్యంగా చిన్న చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేయడం మొదలెట్టాను. అదృష్టం కొద్దీ నా మీద ఒక్క కేసు కూడా లేదు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు తెలిసింది. నాన్నగారికి జైలు శిక్ష పడిందనీ, అమ్మ ఆరోగ్యం క్షీణించిందని” కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు బాబు.
“మరి, ఆ కళ్ళకు ఏమయ్యింది? ఎలా పోయాయి?” అడిగాడు రాజారావు, ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృతలో.
“మీకు తెలియంది ఏముంది అంకుల్, కిరాయి గూండాల మద్య ఆధిపత్య వార్ గురించి. ఓ ఇరవై రోజుల క్రితం మేమంటే కక్షగా ఉన్న వేరే ఓ ముఠా మా మీద మెరుపు దాడి చేసింది. మా బృందం అంతా చెల్లాచెదరైపోయారు. వాళ్ళు కొట్టిన తీవ్రమైన దెబ్బలకు నేను స్పృహ కోల్పోయాను. నాకు నమ్మకమైన అనుచరుడు ఒకడు నన్ను ఆ దాడి నుంచి రక్షించి ఓ సురక్షిత ప్రాంతానికి తరలించాడు.
పది రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన నాకు తెలిసింది ఏమిటంటే ఆ దెబ్బలకు నా కంటి చూపు పోయిందనీ, ఇంక నేను అలాంటి వృత్తికి పనికిరానని. మొన్న రాత్రి పాపం అతనే నన్ను రహస్యంగా, హైదరాబాద్ వచ్చే ఓ ట్రైనులో కూర్చోపెట్టి వెళ్లి పోయాడు.
నిన్న రాత్రంతా ఇక్కడ స్టేషన్లో గడిపి, ఈ ఉదయం ఇలా ఊర్లోకి వచ్చేను. ఈ మహానుభావుడు దయతలచి ఈ ఇంటికి తీసుకొచ్చాడు” కన్నీటితో చెప్పాడు బాబు.
“ఇంతకీ మీది ఏ ఊరో, మీ తల్లితండ్రులు ఎవరో చెప్పావు కాదు?” ఆశక్తిగా అడిగాడు రాజారావు.
“వాళ్ల విషయాలేమీ నాకు తెలియవు సార్. వారికి తీరని ద్రోహం చేసిన నాకు, వారి పేర్లు ఉచ్ఛరించే అర్హత కూడా లేదు. అందుకే నాకు దేవుడు సరైన శిక్ష వేసాడు. నన్ను ఏదైనా అంధుల ఆశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండి చాలు” అని లేవబోతున్న బాబును ఆపి,
“బాబూ! నా మాట కాదనకు. మనిద్దరం కలసి ఉందాం. ఈ పశ్చాత్తాపంతో నువ్వు చేసిన పాపానికి విముక్తి కలిగింది. ఎప్పడో పొద్దున్న తిన్నావు. ఇదిగో ఈ భోజనం చేస్తూ ఉండు. అంకుల్ని పంపి వస్తాను” అంటూ బాబును గదిలోకి తీసుకుని వెళ్లి కంచం చేతికి అందించాడు మూర్తి.
“ఔను, మా మూర్తి చెప్పింది నిజం. అలా చేయడం మీ ఇద్దరికీ మంచిది. ఈ స్థితిలో ఉన్న నీకూ ఓ ఆసరా దొరుకుతుంది. అలాగే మా వాడికీ కొడుకుతో ఉన్నానన్న పుత్రోత్సాహం మిగులుతుంది. నా మాట కాదనకు” అంటూ అతనికి నచ్చచెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు రాజారావు.
“ఏరా రాజా! నేను చేసింది కరెక్టేనా? నీకు తెలుసుగా? నాకు కన్న కొడుకును పెంచే అదృష్టం ఆ భగవంతుడు ఇవ్వలేదని? అందుకే ఆ లోటు వీడితో తీర్చుకుందామని! ఎందుకంటే ప్రస్తుతం వీడిని చిన్న పిల్లాడిలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కాదు నాకు ఈ వయసులో ఓ తోడు కూడా దొరికినట్టయ్యింది” అంటూ చెప్పాడు మూర్తి ఆనందంగా.
“నీ ఆనందాన్ని నేను ఎందుకు కాదనాలి? ఈ విధంగా అయినా నీ పుత్రోత్సాహం తీరుతుంది. ఎందుకైనా మంచిది ఆ కుర్రాడి మీద ఓ కన్నేసి ఉంచు. గుడ్డివాడు కదా అని గుడ్డిగా నమ్మేయకు” సలహా ఇచ్చాడు రాజారావు.
“ఆ విషయంలో మటుకు నాకు ఎటువంటి సందేహం లేదురా! వాడు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి” కొత్త కొడుకును వెనకేసుకొచ్చాడు మూర్తి.
తన మిత్రుడు మూర్తి కళ్లలో చూసిన పుత్రోత్సాహంతో,
“ఆ బాబు చెప్పింది అక్షర సత్యమనీ, వాడి పూర్తి పేరు రఘుబాబు అనీ, జైలు కెళ్లిన ఆ తండ్రి తనేనని, అమెరికాలో ఉన్నాడని అబద్ధం చెప్పిన తన కొడుకే ఈ బాబు అని మూర్తికి చెప్పకపోవడం మంచిది అయ్యింది” అని మనసులో అనుకుంటూ, సంతోషంగా ఇంటి దారి పట్టేడు రాజారావు,
కన్నకొడుకు తనని చూడకపోయినా, తను మాత్రం పశ్చాత్తాపంతో బాధపడుతున్న కొడుకును తనివితీరా చూసేనన్న ఆనందంతో, పెంచినప్రేమను త్యాగం చేసి, ఎదురుగా గోడకి ఉన్న తన ఏకైక కుమారుడు రఘుబాబు చిన్ననాటి ఫొటో నవ్వుతూ ఆహ్వానిస్తుండగా, ఆనందంగా తన ఇంటిలోకి ప్రవేశించాడు రాజారావు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తాపత్రయం
‘నది ప్రయాణం’ సంపాదకురాలు శీలా సుభద్రాదేవి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ ప్రత్యేక ఇంటర్వ్యూ
నాదొక ఆకాశం-8
ప్రాణవాయువు నిండిన శరీరం
యువభారతి వారి ‘విశ్వనాధ సాహితీ సమాలోచనం’ – పరిచయం
సాఫల్యం-7
జేజేలు భవ్యాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర
నాన్న లేని కొడుకు-10
చిరుజల్లు-82
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®