13 నవంబరు 2022, ఆదివారం, హైదరాబాదు సోమాజిగూడా ప్రెస్ క్లబ్లో సాయంత్రం ఆరు గంటలకు – మహమ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు పెద్ద కథలు’ సంకలనం ఆవిష్కరణ జరిగింది. సభకు ప్రయోక్తగా శ్రీ ఖదీర్ బాబు వ్యవహరించారు. సభాధ్యక్షులు అంటూ ఎవరూ లేరు. శ్రీ ఖాజా మొహియుద్దీన్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రసంగంలో కథానికకు, పెద్ద కథకు, నవలకు ఉన్న భేదాలను వివరించారు. ప్రక్రియ విస్తృతి క్రమంలో, రచయితలు సెక్యులర్ స్ఫూర్తి వైపు మళ్ళారన్నారు.
![](http://sanchika.com/wp-content/uploads/2022/11/Photo3-768x1024.jpg)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
ఈ పుస్తకంలో పెద్ద కథలు 16 ఉన్నాయి, 130 ఎంట్రీల నుండి, ఒక యువ రచయితల టీమ్ వీటిని కాచి వడబోసి తేల్చారు. మొత్తం నలుగురు సమీక్షకులు ప్రసంగించారు. వారు కథలను ఎక్కువగా ప్రస్తావించకుండా, పెద్ద కథ అనే కాన్సెప్ట్‌ను గురించి చెప్పుకొచ్చారు. పెద్ద కథ రాయడానికి అవకాశం వచ్చిందని రాశారే తప్ప, రచయితలు మరింత కృష్టి చేసి ఉంటే బాగుండేదని ఒక సమీక్షకుడు అభిప్రాయపడ్డారు. కథల్లో సింహభాగం గ్రామీణ జీవన చిత్రణమే ఉంది, పట్టణీకరణపై ఫోకస్ తక్కువగా ఉందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ఆంగ్లంలో వచ్చిన అనువాద పెద్ద కథల సంకలనంతో పోలుస్తూ, దాన్ని ప్రశంసించారు మరో యువ సమీక్షకుడు. మొత్తం మీద కథలన్నీ బాగున్నాయని అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక సమీక్షకుడు ఎక్కువ కథలు రాయలసీమ నేపథ్యంలో ఉన్నాయని, రాయలసీమ మాండలికం క్లిష్టమైనదని, దాన్ని అర్థం చేసుకోవటం సమయాన్ని తీసుకుంటుందని ఉటంకించారు.
16 మంది రచయితలకు, 16 లబ్ధప్రతిష్ఠులైన సాహితీవేత్తలు వ్యాఖ్యలు వ్రాశారు. అవి కూడా ప్రతి కథ తర్వాత పొందుపరచడం విశేషం. కొంతమంది రచయితలు సభకు హాజరు కాలేదు. వచ్చిన రచయితలందరికీ, సంకలనం ప్రతిని బహుకరించారు. ఆ క్రమంలో ఖదీర్ బాబు ఆయా కథలను గురించి అతి క్లుప్తంగా ప్రస్తావించి, వాటి విశిష్టతను సభికుల దృష్టికి తెచ్చారు.
![](http://sanchika.com/wp-content/uploads/2022/11/Photo1-769x1024.jpg)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
సంచిక రచయితలలో డా. చిత్తర్వు మధు గారి ‘పద్మగంధిని’, పాణ్యం దత్తశర్మ గారి ‘కర్మయోగ కమనీయం’ కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. దత్తశర్మకు ప్రముఖ రచయిత శ్రీ వి. రాజారామ్మోహనరావు గారు; చిత్తర్వు మధు గారికి శ్రీ గణేశ్వరరావు గారు పుస్తకాలను బహుకరించారు.
![](http://sanchika.com/wp-content/uploads/2022/11/Photo2-769x1024.jpg)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనం, శాలువాలు, వందన సమర్పణ లాంటి అంశాలు ఏమీ లేకుండా, విభిన్నంగా సభ సాగింది. శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్ది నవీన్ లాంటి ప్రముఖులు సభకు హాజరైనారు.
కథల నిడివికి పరిమితి అనేది లేకుండా, రచయితలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పెద్ద కథలు వ్రాయించడం ఆహ్వానించదగ్గ పరిమాణం. సంచిక ఎప్పటి నుంచో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తూ ఉంది.
సంచిక రచయితలు శ్రీ చిత్తర్వు మధు, శ్రీ పాణ్యం దత్తశర్మ గార్లకు సంచిక టీమ్ అభినందనలు తెలియచేస్తోంది.
![](http://sanchika.com/wp-content/uploads/2023/06/DattaSarmaPanyam2.jpg)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.