(శ్రీ పాణ్యం దత్తశర్మగారు వెల్లడించిన వివరాలతో, అందించిన పద్యాలతో కూర్చిన నివేదికని పాఠకులకు అందిస్తున్నాము.)
27 మే 2023 న బెంగుళూరు నగరం, మల్లేశ్వరంలో (వయాలి కావల్) శ్రీకృష్ణదేవరాయ కళామందిరం (తెలుగు విజ్ఞాన సమితి ప్రాంగణం) వేదికగా పద్మశ్రీ, విశ్వవిఖ్యత నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాలలో కృషి చేసిన లబ్ధప్రతిష్ఠులకు ఎన్.టి.ఆర్. స్మారక పురస్కారాలు ప్రదానం చేయబడినాయి. సి.పి. బ్రౌన్ సేవా సమితి, ఇడమకంటి బ్రహ్మారెడ్డి ధార్మిక మండలి ఆధ్వర్యంలో శ్రీ ఇడమకంటి లక్ష్మీరెడ్డి గారి అధ్యక్షతన ఈ మహోత్సవం జరిగింది.
బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి కుమారులు శ్రీ వేటూరి ఆనందమూర్తి, హాస్యనటి రమాప్రభ, పద్మశ్రీ ఖాదర్ వలీ, హెచ్.ఎ.ఎల్ చీఫ్ సువర్ణరాజు గారు మున్నగు ప్రముఖులకు ఎన్.టి.ఆర్. స్మారక పురస్కారాలు ఇవ్వబడినవి. దాదాపు ఐదు వందల మంది ఎన్.టి.ఆర్. అభిమానులు హాజరై సభను సుసంపన్నం చేశారు.
***
పాణ్యం దత్తశర్మ గారు సభలో ప్రసంగించి, తాను రచించిన శతకములోని కొన్ని పద్యాలను రాగయుక్తముగా ఆలపించి సభికుల మన్ననను పొందారు. అదిగాక, శ్రీకృష్ణతులాభారము చిత్రంలోని, ఘంటసాల వారు పాడి, ఎన్.టి.ఆర్. అద్భుతంగా అభినయించిన ‘అన్నుల మిన్న! ఓ అన్నుల మిన్న!’ అన్న పద్యాన్ని పాడి సభికులను అలరించారు.
దత్తశర్మగారు ఈక్రింది పద్యాలను వేదికపై గానం చేశారు.
సీ:
దుష్యంత మహరాజు తోచె ‘శాకుంతల’
చిత్రమందున, ఠీవి చెలగ మెరిసె
‘పల్నాటి యుద్ధాన’ బ్రహ్మనాయుని పాత్ర
కులరహిత సుసమాజ జ్వలితమయ్యె.
వీరంబు శౌర్యబు విచ్చుకత్తుల తోడ
కార్యశూరత జూపె కంచుకోట
పాంచజన్యము పూని పరమాత్మ రూపమై
‘కృష్ణావతరామ్ము’ కురిసె యశము
తే.గీ:
భక్తి మాత్రమె భగవంతు బడయ నంచు
సత్యభామకు కనువిప్పు; సత్యపథము
పారమార్థము ‘శ్రీకృష్ణతులాభారమునను’
మహిత రీతిని నటియించె మాధవునిగ
~
పంచచామరము:
కళాతపస్వి విశ్వనాథ గారవించె మెండుగా
కళాప్రపూర్ణు నందమూరి గర్వహీనతన్, సదా
భళాయటంచు, ‘దర్శకాళి బాగు సూచనల్ వినున్
కళా వియత్తలాన సూర్యకాంతి జిమ్ము పుంజమే!’
~
సీ:
దాసరి స్తుతియించె దార్శనికుడనుచును
వందేళ్లపాటు కు వరనటుండు
నిత్యమై సత్యమై నిండిన తేజస్సు
మూర్తిమంతమనియె ముళ్లపూడి
తెలుగుతనముకు నిలువెత్తు వెలుగనె
వెంకయ్యనాయుడు విశ్వహితుని
మహిత గంభీరుడౌ మాన్య ఘనుడటంచు
ప్రియతముండని పల్కె పీ.వి. యతని
తే.గీ:
నందమూరిక లేడని డెందములను
మిగుల క్షోభిల్లి జనసంద్రమేగు దెంచె
చివరి చూపుకు; వేచుచున్ చేరి నిలిచె
అమిత జనహృది వెలుగొందు నమరజీవి
~
ఉ:
భారతరత్నమా ఘనుడు పావన శ్రీ సుగుణాభిరాముడున్
లేరటువంటి నాయకులు రీతిగ నాతని గారవించినన్
‘భారతరత్న’తో; నిలుచు బారతదేశ ప్రతిష్ఠ; కాకయున్
మారదు నందమూరి యశమాలిక; ధన్యత జెందు దేశమే!
~
సుగంధి:
విగ్రహంబు పార్లమెంటు వేడ్క తోడ నిల్పగా
ఆగ్రహంబు లన్ని తగ్గి అందరున్ నుతించగా
వ్యగ్రతన్ మహాత్ము నిల్పి, వాసి గూర్ప, దేశమే
అగ్రనాయకున్ స్తుతించె అంజలిన్ ఘటించుచున్
~
కం:
అనితర సాధ్యుడు సదయుడు
వినయాత్ముడు విశ్వనరుడు, విఖ్యాతుడు, జీ
వన సాఫల్యత నొందెను
జనహృది నిరతంబు నిలుచు చైతన్యముగా
~
మంగళ మహశ్రీ:
భాసుర మహానట! యాపారమన!
సర్వజన ప్రాణహిత! దివ్యవర మూర్తీ!
మీ సరి జగంబున నమేయయశ
సిద్ధిగను మేటి ఘన నాయకులు లేరే!
వ్రాసితి సమంచిత వరంబగు సుకావ్యమును
రమ్యగుణ శోభిత సుశీలా!
మా సుకృతి నీవె కద! మానిత విశేష గుణ!
మాన్యతమ! మంగళ మహశ్రీ!!!
~
ఈ శతకమును ముద్రించిన సి.పి. బ్రౌన్ సేవా సమితి బెంగుళూరు వారికి, పద్య రచనలో ఎంతో సహకరించి, ముందుమాట ‘సుకృతి’ని రాసి యిచ్చిన తమ ఆత్మీయ సాహితీమిత్రులు డా. జెట్టి యెల్లమంద (విశ్రాంతి ఆంధ్రోపన్యాసకులు, ఉన్నత విద్యా శాఖ) గారికి, పద్యములకు రాగములను కూర్చుటలో సహకరించిన తన సోదరుడు పాణ్యం శంకర కుమార శర్మ గారికి దత్తశర్మగారు కృతజ్ఞతలు తెలిపారు.