[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘ఆ ప్రమద, ఓ ప్రమిద’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


విధి వెక్కిరించింది
బాధల బతుకు చీకటిని
బాధ్యతగా అడుగులు వేస్తూ దాటేస్తున్న
వెలుగుల ఆ దివ్వెను ఆర్పేందుకు
వడివడిగా వీచింది, సుడిగాలిగా మారి
వెలుగులు ఆరలేదు ఆ దీపంలో
ఊపిరి పోసుకుంది మరోసారి
ఆ వొత్తి చివరన ఉన్న
ఓ మినుకుమంటున్న చిన్న నిప్పురవ్వ
తనే కాదు
తన చుట్టూ వెలుగులు వెల్లవయ్యేందుకు
తన కుడిఎడమలుగా ఓ దీపద్వయాన్నీ
తన ఆలోచనల అగ్నికణాలతో
అనంతమైన చిరుదివ్వెల సముదాయాన్ని
దేదీప్యమానంగా వెలిగేలా చేసింది
అవును
ఆత్మవిశ్వాసానికి
అనంతమైన జ్ఞానానికి
అలయై ఉరకలెత్తే ఉత్సాహానికి
చిరునామా కదా ఆ ప్రమద..!
ప్రమిదగా వెలుగులు పంచుతోన్న తనకు
జ్వాలగా జాజ్వల్యమానమౌతోన్న తనకు
ఈ తిమిరాన్ని జయించటంలో
ఇక తిరుగుంటుందా..?

చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.